టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్: పాకిస్తాన్ 1992ను రిపీట్ చేస్తుందా, న్యూజీలాండ్ తొలి వరల్డ్ కప్ కల ఫలిస్తుందా?

సిడ్నీలో పాకిస్తాన్, న్యూజీలాండ్ సెమీఫైనల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిడ్నీలో పాకిస్తాన్, న్యూజీలాండ్ సెమీఫైనల్
    • రచయిత, విధాంశు కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ బుధవారం సిడ్నీలో పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతుంది.

గ్రూప్1 సెమీ-ఫైనల్‌లో న్యూజీలాండ్ ముందంజలో ఉండగా, గ్రూప్2 లో దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ముందుకొచ్చి సెమీ ఫైనల్ కు చేరింది.

పాకిస్తాన్‌లో హాట్ హాట్ రాజకీయాల నడుమ, ఆ దేశ జట్టు సెమీ ఫైనల్ కు చేరడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది.

ఆఖరికి పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ‘తప్పకుండా శుభవార్త వింటాం’ అంటూ ఈ మ్యాచ్ పట్ల ఆసక్తిని ప్రదర్శించారు.

పాకిస్తాన్‌లో అవినీతి నిరోధక చట్టంలో మార్పులు చేర్పులకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా క్రికెట్ ప్రస్తావన వచ్చింది.

పాకిస్తాన్ జట్టు సెమీ ఫైనల్‌కు చేరడం ఒక మిరాకిల్‌లా జరిగిందని గవర్నమెంట్ తరఫు న్యాయవాది వెల్లడించారు.

‘‘అలాగైతే, మీరందరూ మ్యాచ్ చూడటానికి సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయిస్తాను’’ అన్నట్లు డాన్ పత్రిక రాసింది.

ఇక పాకిస్తాన్ అభిమానులు మరో వరల్డ్ కప్ సాధించాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు 1992 నాటి వరల్డ్ కప్ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటున్నారు.

అప్పట్లో కూడా సెమీఫైనల్లో పాకిస్తాన్ ప్రత్యర్ధి న్యూజీలాండే. ఒకే ఒక్క లీగ్ మ్యాచ్‌లో ఓడిన న్యూజీలాండ్ పాయింట్ల పట్టికలలో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అప్పట్లో నాలుగో ర్యాంక్ ఆటగాడు మార్టిన్ క్రో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

ఈసారి కూడా న్యూజీలాండ్ నాలుగో నంబర్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు అద్భుతమైన ఆటతీరుతో అగ్రస్థానంలో ఉన్నాడు.

1992లో కూడా పాకిస్తాన్ జట్టు ఆరంభంలో పేలవంగా ఆడి, చివరి దశలో న్యూజీలాండ్‌పై సెమీ ఫైనల్, ఇంగ్లాండ్‌పై ఫైనల్‌లో గెలిచి కప్ సొంతం చేసుకుంది.

1992 వరల్డ్ కప్ విజేత పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1992 వరల్డ్ కప్ విజేత పాకిస్తాన్

న్యూజీలాండ్ పట్టు విడుస్తుందా?

కానీ ఇది 1992 కాదు, 2022. మూడు దశాబ్ధాలు గడిచింది. కానీ, ఈసారి అవకాశాన్ని వదులుకోవడానికి న్యూజీలాండ్ ఏ మాత్రం సిద్ధంగా లేదు.

2021లో ఆ జట్టు ఫైనల్ దాకా వచ్చి చివరకు ఆస్ట్రేలియకు కప్‌ను అప్పజెప్పింది. న్యూజిలాండ్‌ జట్టులో టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌‌లకు వరల్డ్ కప్‌కు ఆడిన అనుభవం ఉంది. కానీ, ఇంత వరకు వారి జట్టు ఫైనల్ గెల్చుకునే అవకాశం రాలేదు.

కానీ, ఈసారి దీనిని మార్చేయాలనుకుంటున్నారు. బౌలింగ్‌లో వీరిద్దరి పెర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం. స్లో బాల్‌ను ఆఫ్‌ పేస్‌లో విసిరి బౌలర్లు విజయాలు అందుకోవడం ఈ ప్రపంచ కప్‌లో చూశాం. బోల్ట్, సౌథీలు ఈ కళలో మాస్టర్స్. వీరే కాకుండా న్యూజిలాండ్‌లో లాకీ ఫెర్గూసన్, జిమ్మీ నీషమ్ వంటి ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు.

ఫెర్గూసన్ ఈ ప్రపంచకప్‌లో తన మార్క్‌ను ఇంకా ప్రదర్శించనప్పటికీ, పాకిస్తాన్‌పై అతనిరికార్డు చాలా బాగుంది.

టీ20లో పేసర్లతో పాటు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం కూడా చాలా ముఖ్యం. న్యూజిలాండ్‌లో మిషెల్ సాంట్నర్, ఇష్ సోధీ వంటి ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. వారు పరుగులు ఆపడమే కాకుండా ముఖ్యమైన వికెట్లు కూడా తీస్తున్నారు.

సెమీ-ఫైనల్ సిడ్నీలో జరుగుతుంది. ఈ పిచ్‌ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తోంది. కాబట్టి సాంట్నర్, సోధీ ఎలా బౌలింగ్ చేస్తారనేది మ్యాచ్‌పై ప్రభావం చూపించే అంశం.

టిమ్ సౌథీ పెర్ఫార్మెన్స్ కీలకం

ఫొటో సోర్స్, Getty Images

టాస్ కీలకం

ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. వాతావరణం విషయానికి వస్తే, తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. కానీ మ్యాచ్‌పై ప్రభావం పడే అవకాశాలు చాలా తక్కువ.

1992 మ్యాజిక్‌ను పునరావృతం చేయడానికి పాకిస్తాన్‌కు మరో విజయం అవసరం. బాబర్ అజామ్ పేలవమైన ఫామ్‌ను పక్కన పెట్టినా, అతను భారీగా పరుగులు చేస్తాడని పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్ మాథ్యూ హేడెన్ అన్నారు.

మరి సెమీ-ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్‌కు కివీస్ సింపుల్ ట్రీట్ ఇస్తుందా లేక, గతంలో జరిగిన అనుభవాలకు ప్రతీకారం తీర్చుకుంటుందా? మొత్తం మీద సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ మరో క్లాసిక్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)