ఆంధ్రా యూనివర్సిటీలో చెట్లు ఎందుకు నరికేశారు, ఏమిటీ వివాదం?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్ కాలేజీలో ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ సభ జరగాల్సిన మైదానం పరిసరాల్లోని చెట్లను తొలగించడం విమర్శలకు దారితీస్తోంది.
సభ ప్రాంగణం చుట్టు పక్కల, అలాగే అక్కడికి చేరుకునే రహదారికి రెండు వైపులా ఉన్న చెట్లను ప్రధాని సెక్యూరిటీ పేరుతో నరికేశారు.
మరోవైపు ప్రధాని పర్యటన కోసం పార్కింగ్ స్థలాలు సిద్ధం చేస్తున్న ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను అర్థరాత్రి సమయంలో తొలగించడం వివాదస్పదమైంది.

ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్‌లో ఏయూకి చెందిన కార్యక్రమాలతో పాటు రాజకీయ సభలు, సమావేశాలు కూడా జరుగుతుంటాయి.
ఈ గ్రౌండ్‌కు ఒకేసారి లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
అలాగే గ్రౌండ్ వెలుపల మరో లక్ష మంది చేరేందుకు సరిపడా స్థలం ఉంటుందని, మొత్తం ఒకే సారి రెండు లక్షల మంది ఈ సభా ప్రాంగణం వెలుపల, లోపల ఉండే అవకాశముందని ఏయూ అధికారులు చెప్పారు.
ఈ గ్రౌండ్‌లో జరిగే ప్రధాని సభకు కూడా రెండు లక్షల మంది వచ్చే అవకాశముందనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రౌండ్ లోపల, వెలుపల చదును చేసే కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా అక్కడున్న చెట్లను నరికేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న చెట్లను ప్రధాని పర్యటన పేరుతో నరికేయడం దారుణమని పర్యావరణ వేత్తలు అందోళన చెందుతున్నారు.
పైగా ఏయూ పరిధిలో చెట్లు కొట్టరాదనే హైకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఇలా చెట్లను నరికేయడం సరైన చర్య కాదంటున్నారు.
గత మూడు రోజులుగా జరుగుతున్న ప్రధాని సభ ఏర్పాట్లతో ఈ ప్రాంతమంతా పోలీసుల కనుసన్నల్లోకి వెళ్లిపోయింది.
ఏయూ ఉద్యోగులను సైతం అనుమతితో మాత్రమే లోపలికి పంపిస్తున్నారు.
అంతటి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసి లోపల పచ్చదనాన్ని నరికేస్తున్నారని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు.
ఈ సభ ప్రాంగణం ఈ వార్డులోకే వస్తుంది. ఆయనే ఏయూ పరిధిలో చెట్లను తొలగించవద్దంటూ గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జనసేన పార్టీ తరపున కార్పొరేటర్‌గా గెలిచారు.

హైకోర్టు తీర్పును పట్టించుకోని ఏయూ
“విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం చుట్టూ ఉన్నప్రాంతం నీటి నిల్వలు ఉండేందుకు భౌగోళికంగా అనుకూలమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి పైనున్న వాల్తేరు, సీతమ్మధార వంటి ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరంతా ఇక్కడికే చేరుతుంది.
సహజంగా వచ్చే వర్షపు నీటితో ఈ భూభాగమంతటా నీటి నిల్వలు అధికంగా ఉంటాయి. దాంతో, ఇక్కడ చెట్లు విస్తారంగా పెరుగుతాయి.
ఏయూ వాటిని సంరక్షిస్తూ...మరిన్ని చెట్లు పెంచుతూ పచ్చదనం పెరిగేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, వైసీపీ ప్రభుత్వం తమ కమర్షియల్ అవసరాల దృష్టిలో పెట్టుకుని ఏదో సొంత అజెండాను అమలు చేస్తోంది” అని పీతల మూర్తి యాదవ్ అన్నారు.
“వాల్టా (ANDHRA PRADESH WATER, LAND AND TREES ACT–2002) చట్టాన్ని వైకాపా ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ప్రధానమంత్రి పర్యటన పేరుతో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న పెద్దపెద్ద వృక్షాలను నేలమట్టం చేసి సభకు ఏర్పాట్లు చేయడం సమంజసం కాదు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తూ, ఏయూలో చెట్లను కొటివేస్తున్నారని హైకోర్టులో పిల్ దాఖలు చేశాను. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ... ఏయూలో చెట్లను పరిరక్షించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. దానిని అధికారులు పట్టించుకోకుండా చెట్లను నేలమట్టం చేస్తున్నారు. వాల్టా చట్టం ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి” మూర్తి యాదవ్ బీబీసీతో చెప్పారు.

‘చెట్లను తరలిస్తున్నాం’: విజయసాయి రెడ్డి
ప్రధాని పర్యటన పేరుతో చెట్లను నరికివేయడంపై ప్రధాని మోదీ సభ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. పర్యావరణానికి హాని కలిగించే చర్యలు చేపట్టడం లేదని చెప్పారు.
ఇక్కడున్న ప్రాంగణంలో చాలా చెట్లు ఉన్నాయని, వాటిలో కొన్నింటిని ప్రధాని పర్యటన సందర్భంగా భద్రత కారణాల వల్ల తొలగించాల్సి వస్తే తప్ప, అసలు చెట్ల జోలికే వెళ్లడం లేదని తెలిపారు. గతంలో ఏయూ ఇంజనీరింగ్ హాస్టల్స్, గ్రౌండ్స్ పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అవాసాలుగా మారాయని 20 ఎకరాల్లో ఉన్న పొదలు, కొన్ని చెట్లు ఏయూ అధికారులు తొలగించారు.
“ప్రధాని సభ జరుగుతున్న ప్రాంతం చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కలిపి దాదాపు 30 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. వాటిలో ఏదైనా ప్రధాని సెక్యూరిటీ రీజన్స్ కారణంగా తొలగించాల్సి వస్తే, ాటిని నరికివేయకుండా, జాగ్రత్తగా అక్కడ నుంచి మరో చోటుకు తరలిస్తాం. దాని వలన పర్యావరణపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదే విషయాన్ని ఏయూ వీసీ కూడా చెప్పారు” అని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు.

“భూకంపం వచ్చిందనుకున్నా”
మరోవైపు ఏయూలో ప్రధాని సభ జరిగే ప్రాంగణానికి కిలోమీటరు దూరంలో మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు సమీపంలో రహదారికి ఇరువైపులా కొన్ని చిరు వ్యాపారాల దుకాణాలున్నాయి. వీటిలో కొన్ని ఏయూకి చెందిన హాస్టల్స్ సమీపంలోనే ఉంటాయి. ఇవి ఏయూకి చెందిన స్థలాలని, వాటిని కొందరు అక్రమించుకున్నారంటూ చాలా కాలంగా ఏయూ అధికారులు చెబుతూ వస్తున్నారు. కానీ, వీటిపై కోర్టుకు వెళ్లి స్థల యాజమాన్య హక్కులు సంపాదించామని అక్కడున్న వారు చెబుతున్నారు. సోమవారం 12 గంటలు దాటిన తర్వాత ఎవరూ లేని సమయంలో వచ్చి ఆ దుకాణాలను జీవీఎంసీ అధికారులు పడగొట్టారు. ఉదయం యథాావిధిగా వచ్చేసరికి అవి కూలిపోయి ఉండడం చూసి ఆందోళనకు గురయ్యామని షాపుల యాజమానులు, వర్కర్లు బీబీసీకి చెప్పారు.
“మా షాపుతో పాటు చుట్టు పక్కల షాపులన్ని కూడా పడిపోయి ఉన్నాయి. భూకంపం ఏమైనా వచ్చిదేమోనని భయమేసింది. కానీ, మిగతా కొన్ని దుకాణాలు, పక్కనే ఉన్న పెట్రోల్ బంకు అన్నీ బాగానే ఉన్నాయి. దాంతో, ఏమైందోనని మా ఓనరుకి ఫోన్ చేస్తే ఆయన కంగారుగా వచ్చారు. ఆయన ఎవరికో ఫోన్ చేసి కనుక్కుంటే రాత్రి పన్నెండు దాటిన తర్వాత జీవీఎంసీ వాళ్లు వచ్చి కూల్చేశారని చెప్పారు” అని మెకానిక్ షాపులో పని చేస్తున్న అనుదీప్ చెప్పారు.

“నాకు అరవై ఏళ్లు వచ్చాయి. రాత్రి మా షాపులు కూల్చేస్తున్నారని ఎవరో ఫోన్ చేశారు. అందోళన కలిగింది. ఎటువంటి సమాచారం లేకుండా ఇలా చేయడం దారుణం. ప్రధాని మోడీ సభను సాకుగా చూపించి మా దుకాణాలు పడగొట్టడం అన్యాయం.” అని మరో బాధిత మహిళ అన్నారు.

ప్రధాని సభ పేరుతో నాటకాలు: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి
ఏయూలోని వివిధ కళాశాలలు, రెండు క్రీడా మైదానాలు అన్నీ కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.
ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు ఉన్నారు. ప్రధాని కార్యక్రమం పార్టీలతో సంబంధం లేకుండా జరగాల్సిన కార్యక్రమం, దీనికి అందరం సహకరించాలి, కానీ, ప్రధాని పర్యటన పేరుతో వైసీపీ నాయకులు స్థలాలను కాజేసే కుట్ర చేస్తున్నారని రామకృష్ణబాబు విమర్శించారు.
“ప్రధాని సెక్యూరిటీ పేరుతో ఏయూలో ఎంతో వృక్ష సంపదను నాశనం చేశారు. అలాగే పార్కింగ్ కోసమని చెప్పి, ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారుల దుకాణాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి జీవీఎంసీ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం దారుణం. సభ ప్రాంగణానికి దూరంగా ఉన్న ఈ దుకాణాలే అడ్డు అయితే, మరి ఆ పక్కనే ఉన్న ఇంజనీరింగ్ కాలేజి, హాస్టల్స్ అడ్డు కాలేదా? మరి వాటిని కూల్చేస్తారా? ఇందతా ఒక డ్రామా, ప్రధానమంత్రి పేరుతో స్థలాలు కాజేసేందుకు ఏదో కుట్ర జరుగుతోంది” అని రామకృష్ణ బాబు అన్నారు.

ఏయూ వీసీ, జీవీఎంసీ కమిషనర్ ఏమన్నారంటే...
ఏయూలో చెట్లు తొలగింపు, ప్రధాని మోదీ సభ వచ్చే వాహనాల పార్కింగ్ పేరుతో దుకాణాలు తొలగించారని బాధితులు చెబుతున్న వాటిపై వివరణ కోరేందుకు ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిని, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబుని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది.
ఏయూ వీసీని సంప్రదించేందుకు పలు మార్లు ప్రయత్నించగా... ఆయన అందుబాటులోకి రాలేదు.
జీవీఎంసీ కమిషనర్‌ను దుకాణాల కూల్చివేతపై ప్రశ్నిస్తే, తాను సమావేశంలో ఉన్నానని ఇప్పుడేమీ చెప్పలేనని బదులిచ్చారు.

“ఏయూలో చెట్లకు కొదవలేదు, కానీ నరికేయడం దారుణం”
ఏయూలో చెట్లను తొలగిస్తున్నారనే విషయంపై పర్యావరణ వేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖలోని పరిశ్రమల కాలుష్య పరీక్షలు చేసే ల్యాబ్ నిర్వహిస్తున్న డాక్టర్ గౌతం, "ఏయూలో వందలాది చెట్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాల సందర్భంగా చెట్లు నాటుతూనే ఉన్నారు. నిర్మాణాల అవసరాల మేర కొన్ని చోట్ల చెట్లను తొలగిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప చెట్లను తొలగించకూడదు. అందులోనూ పెద్ద సంఖ్యలో అసలు తొలగించడం సరైన పని కాదు. నిత్యం పర్యావరణ పాఠాలు చెప్పే ఏయూలో చెట్లు నరికేశారనే విషయం వినడానికే బాగోలేదు” అని అన్నారు.
“ఏయూ పరిసరాల్లో వాల్టా చట్టం అమలు చేయాలి. దానికి విరుద్ధంగా చేపట్టే చర్యలు హర్షణీయం కాదు. ప్రధానంగా విద్యా సంస్థల్లోనే పర్యావరణానికి హాని చేసే చర్యలు చేపడితే అవి ఇంకెక్కడ అమలవుతాయని అనుకోవాలి” అని అటవీ, పర్యావరణ రంగ నిపుణులు గంజివరపు శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.
ప్రధాని పర్యటన వివరాలు ఇవి
ప్రధాని మోదీ ఈ నెల 11 సాయంత్రం 7.25 నిమిషాలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు.
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తూర్పు నౌకదళం చోళ గెస్ట్ హౌస్‌కు చేరుకుని ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు అంటే 12 వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఏయూ సభా స్థలికి చేరుకుంటారు.
10.30 నుంచి 11.45 నిమిషాల వరకు సభ జరుగుతుంది. ఈ సభ కార్యక్రమంలో భాగంగానే కొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్ మోడల్‌లో చేస్తారు.
అనంతరం విమనాశ్రయం చేరుకుని 12.05 నిమిషాలకు విశాఖ నుంచి బయలుదేరుతారు.
“ప్రధాని మోదీ రూ.10,472 కోట్ల విలువైన ప్రాజెక్ట్ పనులను ప్రారంభిస్తారు. వాటిలో రైల్వే ప్రాజెక్టులతో పాటు హైవేలు, ఫిషింగ్ ప్రాజెక్టులు ఉంటాయి. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 11వ తేదీన విశాఖ చేరుకుంటారు” అని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన చెంచులు, ఆదివాసీలను స్వాతంత్ర్య సమరయోధులుగా ఎందుకు గుర్తించలేదు?
- 'బిన్ లాడెన్ తల తీసుకురా': అల్ ఖైదా అధినేతను వేటాడటానికి అమెరికా పంపిన సీఐఏ గూఢచారి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














