సీఓపీ27: అభివృద్ధి చెందిన దేశాలు రూ.106 లక్షల కోట్ల పరిహారం చెల్లించాలని పేద దేశాల డిమాండ్.. ఎందుకు?

ఫొటో సోర్స్, PA Media
కాప్-27 వాతావరణ మార్పుల సదస్సులో చర్చలకు ‘‘నిధులు’’ కేంద్రమయ్యే అవకాశముంది. అజెండాలో నిధుల చుట్టూ జరిగే చర్చలు ప్రధాన పాత్ర పోషించొచ్చు.
గత 12నెలల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా వాతావరణ సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. పాకిస్తాన్‌లో వరదలతో మొదలుపెట్టి తూర్పు ఆఫ్రికాలో కరవు వరకు చాలా ప్రాంతాలను సంక్షోభాలు పీడిస్తున్నాయి.
తాము చవిచూస్తున్న సంక్షోభాలకు అమెరికా, బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి పరిహారం అందాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుతున్నాయి.
మరోవైపు హరిత ఇంధనం, సుస్థిర మౌలిక సదుపాయాల కల్పనలోనూ అభివృద్ధి చెందిన దేశాలు సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇంతకీ అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుతున్న నిధులు వారికి అందుతున్నాయా?

ఫొటో సోర్స్, Jonas Gratzer
నిధులు దేని కోసం?
వాతావరణ మార్పుల కట్టడికి కోసం అందిస్తున్న నిధులను మూడు భాగాలు వర్గీకరించొచ్చు.
దీనిలో మొదటిది మార్పుల తీవ్రతను తగ్గించడం కోసం. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు శిలాజ ఇంధనాలతోపాటు ఇతర కాలుష్యకారక చర్యలకు దూరంగా ఉండేందుకు అందించే నిధులు.
ఇప్పటికీ చాలా దేశాల్లో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటి నుంచి హరిత ఇంధనం దిశగా అడుగులు వేసేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు అవసరం. అంటే బొగ్గు స్థానంలో సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిధులు కావాలి.
ఇక రెండోది మార్పులకు తట్టుకొని నిలబడటం కోసం. వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను రక్షించడం కోసం ఈ నిధులు ఉపయోగపడతాయి.

వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు ఒక్కో దేశంపై ఒక్కోలా ప్రభావం చూపిస్తున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో కొన్ని ఇవీ..
- వరదలను అడ్డుకునేలా నదీ పరిహావక ప్రాంతాల వెంబడి పటిష్ఠమైన నిర్మాణాలు
- ముప్పు పొంచివున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం
- తుపానులకు దెబ్బతినకుండా ఇళ్లను నిర్మించడం
- నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడగలిగే మొక్కల పంపిణీ
వాతావరణ మార్పుల తీవ్రతను తగ్గించడం, మార్పులను తట్టుకొని నిలబడటం లాంటి చర్యల కోసం ఇచ్చే నిధులపై అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉంది.

అయితే, మూడో రకం నిధులు కాస్త వివాదాస్పదమైనవి. వీటినే ‘‘లాస్ అండ్ డ్యామేజ్ ఫైనాన్స్’’గా పిలుస్తున్నారు.
ఇప్పటికే సంక్షోభాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారంగా ఈ నిధులు అందిస్తారు.
అయితే, ఈ దేశాలకు ఇప్పటికే మానవతా సాయం కింద నిధులు ఇస్తున్నారు. కానీ, ఇవి ఏ ఏడాదికి ఆ ఏడాది మారుతూ వస్తున్నాయి.
తమకు స్థిరంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి సాయం అందాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుతున్నాయి. ఇలా డబ్బులు ఇవ్వడం అభివృద్ధి చెందిన దేశాల బాధ్యత అని, ఎందుకంటే వాతావరణ మార్పులకు వారి గత చర్యలే కారణమని చెబుతున్నాయి. అంటే గతంలో అభివృద్ధి చెందిన దేశాల అనుసరించిన విధానాల వల్ల ఇప్పుడు తాము దుష్ప్రభావాలు ఎదుర్కొంటున్నామని వివరిస్తున్నాయి.
కానీ, ఈ వాదనకు అభివృద్ధి చెందిన దేశాలు ఏకీభవించడం లేదు. ఎందుకంటే దీనికి అంగీకరిస్తే, ప్రస్తుత విపత్తులకు తామే బాధ్యులమని అంగీకరించినట్లు అవుతుందనేది వారి వాదన.
డబ్బులు ఎలా ఖర్చు చేస్తున్నారు?
2009లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2020నాటికి ఏటా 100 బిలియన్ డాలర్లు(రూ. 8,19,160 కోట్లు) చొప్పున నిధులు అందిస్తామని అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి. అయితే, 2020నాటికి ఆ వార్షిక మొత్తం 83.3 బిలియన్ డాలర్లు(రూ.6,82,360 కోట్లు)కు మాత్రమే చేరింది. 2023నాటికి ఆ లక్ష్యం నెరవేరే అవకాశముంది.
ఈ నిధుల్లో 82 శాతం నేరుగా ప్రభుత్వాలకు వెళ్తోందని, మిగతాది ప్రైవేటు రంగం చేతికి అందుతోందని ఓఈసీడీ వెల్లడించింది.
అయితే, వాతావరణ మార్పుల కట్టడికి అవసరమైన నిధుల్లో 70 శాతం ప్రైవేటు రంగం సేకరించగలదని ఐక్యరాజ్యసమితి ఇటీవల ఒక నివేదికలో వెల్లడించింది.
గత ఏడాది గ్లాస్గో ఫైనాన్షియల్ అలయన్స్ ఫర్ నెట్ జీరో (జీఎఫ్ఏఎన్‌జెడ్)ను ఆవిష్కరించారు. దీని కోసం 550 ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. వాతావరణ మార్పుల కోసం 130 ట్రిలియన్ డాలర్లు (రూ. 10,649 లక్షల కోట్లు) సమీకరించడమే వీటి లక్ష్యం.

ఫొటో సోర్స్, ANADOLU AGENCY
అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరిపడా డబ్బులు అందుతున్నాయా?
ప్రస్తుతం ఇస్తామన్న నిధులు సరిగా అందడం లేదని అభివృద్ధి చెందుతున్న దేశాలు చెబుతున్నాయి. అంతేకాదు అసలు ఇస్తామని హామీ ఇచ్చిన ఆ నిధులు కూడా చాలా తక్కువని వివరిస్తున్నాయి.
గత ఏడాది గ్లాస్గోలో జరిగిన వాతావరణ మార్పుల సదస్సులో.. అభివృద్ధి చెందుతున్న జీ77 ప్లస్ చైనా కూటమి తమకు 2030నాటికి 1.3 ట్రిలియన్ డాలర్లు (రూ.106 లక్షల కోట్లు) ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
ఉద్గారాల కట్టడితోపాటు వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు రెండు సమాన భాగాలుగా ఈ నిధులు ఇవ్వాలని ఆ దేశాలు కోరుతున్నాయి.
ప్రస్తుతం వాతావరణ మార్పుల నిధుల్లో 34 శాతం.. మార్పులను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇస్తున్నట్లు ఓఈసీడీ చెబుతోంది.
మరోవైపు ఈ నిధుల్లో 71 శాతాన్ని సాయంగా ఇవ్వకుండా రుణాల రూపంలో ఇస్తున్నారు. దీని వల్ల పేద దేశాల అప్పులు మరింత పెరుగుతున్నాయి.
ఇది చాలా అన్యాయమని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ క్లైమేట్ పాలసీ లీడ్ నాఫ్‌కోట్ డాబి అన్నారు.
‘‘దారుణమైన కరవులు, తుపానులు, వరదలను ఎదుర్కొంటున్న పేద దేశాలకు సాయం చేయకుండా వారిని మరింత అప్పుల ఊబిలోకి తోస్తున్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏకాభిప్రాయం కుదురుతుందా?
గత ఏడాది గ్లాస్గో సదస్సులో ‘‘లాస్ అండ్ డ్యామేజ్ ఫైనాన్స్’’పై చర్చ జరగలేదు.
అయితే, ఈ ఏడాది వరుసగా మళ్లీ చర్చలు మొదలయ్యాయి. దీంతో ఈజిప్టులో జరుగుతున్న కాప్-27 సదస్సులో దీనిపై చర్చించే అవకాశముంది.
అయితే, ఈ విషయంలో ఒప్పందం కుదిరే అవకాశం తక్కువే. అయితే, అసలు ఈ నిధులను ఎలా ఇస్తారు? లాంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశముంది.
ఇవి కూడా చదవండి:
- 140 ఏళ్ల కిందట అదృశ్యమైన బ్రిటిష్ నౌక.. ఇంగ్లిష్ చానల్ సముద్రంలో దొరికింది
- భూమిలో 650 అడుగుల లోతున 9 రోజులు కాఫీ పొడి తిని బతికారు - ప్రాణలతో ఎలా బయటకు వచ్చారంటే..
- COP27: వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఏం చెప్పింది, ఏం చేసింది?
- రష్యా సైన్యాన్ని నిత్యం విమర్శిస్తున్న ఈ పుతిన్ 'ఇద్దరు మిత్రులు' ఎవరు?
- ట్విటర్‌లో సగం ఉద్యోగాల కోత - 'మరో దారి లేదు'.. ఎలాన్ మస్క్ సమర్థన
- డ్రోన్లు: భారతదేశం 2030 నాటికి ప్రపంచ డ్రోన్ హబ్‌గా అవతరిస్తుందా... అవకాశాలు, అవరోధాలు ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













