మహా సముద్రాల్లో ప్లాస్టిక్ కుప్పల భారీ సుడిగుండాలు.. ఏటేటా పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించటం ఎలా?

మహా సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలతో కూడిన చెత్త కుప్పలు

ఫొటో సోర్స్, AFP/Getty Images

    • రచయిత, హోప్ గో
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

ప్రపంచంలోనే అతి పెద్ద సముద్రంలో గ్రేట్ పసిఫిక్ ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయింది. కానీ, ఇలా వ్యర్ధాలతో నిండిన సముద్రగర్భం ఇదొక్కటే కాదు. వీటిని శుభ్రపరిచే విధానాలను కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

రీచ్ పెనాఫ్లోర్ ఒక ఆశయం కోసం పని చేసే మనిషి. ఆయన 2009 నుంచి పాసిగ్ నదిలో కలిసే నీటి పాయలను శుభ్రం చేసేందుకు పని చేస్తున్న రివర్ వారియర్స్ అనే గ్రూపుతో కలిసి పని చేస్తున్నారు. ఈ నీటి పాయ మనీలా నగరం మీదుగా ప్రవహిస్తోంది. ఈ నీటి నుంచి వెలువడే విపరీతమైన దుర్గంధానికి ఈ నదికి పేరు పడింది. సముద్ర జలాల పర్యావరణాన్ని కలుషితం చేయడంలో ఈ నది పాత్ర ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

"ఈ నదిని మొదట శుభ్రం చేయడం మొదలుపెట్టినప్పుడు, నీటి పై తేలిన మురికి పదార్ధాలను చేతులతో తొలగించాల్సి వచ్చింది. మహిళా వాలంటీర్లు ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా నీటిలోకి దిగి వ్యర్ధాలను వెలికి తీశారు. వాళ్ళు చేతులకు గ్లోవ్స్ మాత్రమే ధరించి వీటిని వెలికితీశేవారు" అని పెనాఫ్లోర్ గుర్తు చేసుకున్నారు.

"నేను వాళ్ళతో కలిసి పని చేయాలని అనుకున్నాను కానీ, ఒక పూటకు పైగా పని చేయలేకపోయాను. నాకు దురదలు మొదలయ్యాయి. ఆ వాసన భరించలేకపోయాను" అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, సముద్ర తీరాల్లో పెరిగిపోతున్న నాచును కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తల కొత్త అన్వేషణ...

ఈ నదిలో పరిస్థితులను మార్చాలని అనుకునేవారికి ఇక్కడ నెలకొన్న పరిస్థితుల పట్ల అవగాహన ఉంది. ఆసియాలో మిగిలిన ప్రదేశాల కంటే ఫిలిప్పీన్స్ సముద్ర కాలుష్యాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యర్ధాలన్నీ తీరానికి దగ్గర్లోనే పేరుకుపోయి ఉంటాయి.

సముద్రంలో మనం చూసే వ్యర్ధాల గురించి చాలా తప్పుడు అభిప్రాయాలున్నాయని ఆస్ట్రేలియా జాతీయ అధ్యయన సంస్థ కామన్ వెల్త్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో సీనియర్ శాస్త్రవేత్త బ్రిటా డెనీస్ హార్డెస్టీ చెప్పారు.

కొన్ని ప్రదేశాల్లో మనకు కనిపించే దూరంలో వ్యర్ధాలు తేలుతుండటం చూస్తే, కొన్ని చోట్ల ఇవి సముద్ర కెరటాల తాకిడికి బయటకు కొట్టుకుని వచ్చి తీరంలో ప్లాస్టిక్ వ్యర్ధాల కుప్పగా మారుతాయి. హవాయి, యూఎస్ పశ్చిమ తీరం మధ్యలో ఉన్న "గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్" ఇలా ఏర్పడిందే.

ఈ పసిఫిక్ వ్యర్ధాల కుప్ప గురించి చాలా ప్రచారం జరిగింది. ఈ వ్యర్ధాల కుప్ప (గైర్) సుడిగుండంలా ప్రపంచంలో ఉన్న సముద్రాల చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. సముద్ర ప్రవాహం సవ్య దిశలో ఉత్తరానికి, అపసవ్య దిశలో దక్షిణానికి ప్రవహించినప్పుడు వాటిని గైర్స్ అని అంటారు. ఈ ప్రవాహాలు వ్యర్ధాలను సముద్రం మధ్యలోకి నెట్టేస్తూ అవి అక్కడ పేరుకుపోయేలా చేస్తాయి.

ప్లాస్టిక్ వ్యర్ధాలు

ఫొటో సోర్స్, Alamy

ప్రపంచంలో ఇలాంటి ప్రధాన ప్రవాహాలు (గైర్స్) మొత్తం 5 ఉన్నాయని ఓషియన్ కంజెర్వన్సీ అనే పర్యావరణ స్వచ్చంద సంస్థకు చెందిన సీనియర్ మేనేజర్ బ్రిటా బీచ్లర్ చెప్పారు. వీటన్నిటిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోయి తేలుతూ ఉంటాయి.

కానీ, ఉత్తర పసిఫిక్ ప్రవాహం ( గైర్) గురించి ఎక్కువగా అధ్యయనాలు జరిగాయి. మిగిలిన నాలుగు ప్రవాహాల గురించి పెద్దగా అవగాహన లేదు" అని చెప్పారు.

మిగిలిన ప్రవాహాలు (గైర్) దక్షిణ పసిఫిక్, ఉత్తర, దక్షిణ అట్లాంటిక్, హిందూ మహా సముద్రంలో చోటు చేసుకుంటున్నాయి. ఇవి కాకుండా కొన్ని చిన్న చిన్న ప్రవాహాల్లో కూడా ఇలా వ్యర్ధాలు పేరుకుపోవడం ఉంది.

"పర్యావరణంలోకి విసిరేసిన ప్లాస్టిక్ లో అధిక శాతం ఈ సముద్రాల్లో పేరుకుపోయిన వ్యర్ధాల కుప్పల్లోకి వెళ్ళదని తెలుసుకోవడం ముఖ్యం" అని హార్డెస్టీ అన్నారు. ఈ వ్యర్ధాలు సముద్రం మధ్యలోకి వెళ్లవు. చాలా వరకు వ్యర్ధాలు తిరిగి భూమి పైకి వచ్చి పేరుకుపోతున్నాయి".

అంతర్జాతీయ జలాల్లోకి వచ్చి వెళ్లే ఫిషింగ్ ట్రాలర్లు చాలా వరకు వ్యర్ధాలను సముద్రంలో విడిచి పెడతాయి. ఇందులో విసిరేసిన వలలు, మత్స్యవేటకు సంబంధించిన పరికరాలు కూడా ఉంటాయి. సముద్ర ప్రమాదాల సమయంలో ధ్వంసమైన వాణిజ్య నౌకల్లో సరుకు కూడా సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. ప్రతి ఏటా ఈదురు గాలులు, లేదా తుఫానుల తాకిడికి సగటున 1382 సరుకు రవాణా చేసే కంటైనర్లు నష్టపోతూ ఉంటాయని వరల్డ్ షిప్పింగ్ కౌన్సిల్ అంచనా వేసింది.

సముద్రంలో మునిగిపోయిన స్టీల్ పెట్టెల్లో విధ్వంసకరమైన పదార్ధాలు ఉంటే తప్ప కంటైనర్ నష్టాలను నమోదు చేయకపోవడంతో, ఈ సంఖ్య మరింత ఎక్కువగా కూడా ఉండొచ్చు.

వీడియో క్యాప్షన్, తెలంగాణలో వాటర్ స్పౌట్: నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎందుకు వెళ్లాయి?

1992లో చైనా నుంచి అమెరికా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక నుంచి కింద 29,000కు పైగా ప్లాస్టిక్ బాతు, తాబేళ్లు, ఎలుక బొమ్మలు సముద్రంలోకి పడిపోయాయి. ఈ ఘటనను 20వ శతాబ్దంలో నమోదైన భారీ కంటైనర్ నష్టంగా చెబుతారు.

ఈ ప్లాస్టిక్ బాతులు తర్వాత అమెరికాలో అనేక సముద్ర తీరాల్లో తేలి కనిపించడం మొదలుపెట్టాయి. ఈ సంఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత కూడా ఇవి కనిపించేవని చెబుతారు. అయితే, ఇవి ఇలా నీటి పై తేలి కనిపించడం శుభవార్త కాదు.

"కొన్ని వందల టన్నుల వ్యర్ధాలు సముద్రంలోకి చేరుతుంటే, తీరం చుట్టూ ఉన్న ప్రదేశం నుంచి కూడా మరిన్ని వ్యర్ధాలు సముద్రంలోకి చేరే అవకాశముంది" అని హార్డెస్టీ అన్నారు. గాలులు, అలల తాకిడి ఈ వ్యర్ధాలను ముక్కలుగా చేసి వాటిని విసిరేసిన ప్రదేశం నుంచి కొన్ని వేల మైళ్ళ దూరానికి తీసుకుని వెళ్లగలవు.

"ఉదాహరణకు 2011 లో జపాన్ లో సునామీ ఏర్పడిన తర్వాత ఒక ఏడాది లోపే మోటార్ సైకిల్ లాంటి కొన్ని వస్తువులు జపాన్ నుంచి అమెరికా పశ్చిమ తీరానికి కొట్టుకుని వెళ్లాయి. ఇవి పసిఫిక్ మహా సముద్రమంతా విస్తరించాయి" అని చెప్పారు.

"ఇవన్నీ గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్‌లో పేరుకుపోతాయి" అని సముద్రగర్భ పరిశోధకుడు కర్టిస్ ఎబిస్ మేయర్ 1997లో ప్రతిపాదించారు.

ఆయన సముద్ర వ్యర్ధాలను అధ్యయనం చేసి కొన్ని దశాబ్దాల పాటు వాటి గమనాన్ని పరిశీలించారు. ఈ ప్యాచ్ ను "భూమి పై ఉన్న అతి ముఖ్యమైన భౌగోళిక లక్షణం" అని పేర్కొన్నారు.

సూక్ష్మ ప్లాస్టిక్‌

ఫొటో సోర్స్, Alamy

సముద్ర కాలుష్యం వల్ల ఈ చెత్త కుప్పలు నీటి పై తేలుతూ, సూక్ష్మ ప్లాస్టిక్‌లుగా మారుతున్నాయి. ప్లాస్టిక్ సముద్రంలోకి చేరగానే విడిపోవడం మొదలవుతుంది. చెక్క, లోహాల లాంటివి క్రమంగా క్షీణించి సముద్ర గర్భంలోకి చేరితే, ప్లాస్టిక్ మాత్రం ఉపరితలం పైనే విడిపోవడం మొదలుపెడుతుంది.

దీని వల్ల సముద్ర జలాల్లో సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్ధాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ భాగాలు ఒక మిల్లీ మీటర్ లో మూడవ భాగం కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి ఉత్తర పసిఫిక్ ప్రవాహం (గైర్) పై తేలుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాల్లో 60% ఉంటాయి.

కానీ, ఈ ప్రవాహాల ( గైర్ల ) మధ్యలో ఎంత మొత్తంలో ప్లాస్టిక్ చేరుతుందనే విషయం పై స్పష్టత లేదు.

2016-2017 మధ్యలో అల్గాలిటా మెరైన్ రీసెర్చ్ ఫౌండేషన్ దక్షిణ పసిఫిక్ ప్రాంతం పై అధ్యయనం చేశారు. ఇక్కడ ప్లాస్టిక్ అధిక మొత్తంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. కానీ, ఇది ఎంత మొత్తంలో పేరుకుపోయిందో వివరించలేదు. ఈ వ్యర్ధాలు సాధారణ స్థాయికి మించి ఉన్నాయో లేదో అనే విషయం కూడా తెలియదు.

2014లో సముద్ర ప్రవాహాల్లో ( గైర్స్) లో ప్రతి చదరపు కిలోమీటర్ కు కేవలం 200 - 600 గ్రాముల ప్లాస్టిక్ మాత్రమే ఉందని ఒక అధ్యయనం తెలిపింది. ఉత్తర పసిఫిక్ ప్రవాహం ( గైర్) కంటే ఇతర ప్రవాహాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు తక్కువ శాతం ఉండొచ్చని బీచ్లర్ చెబుతున్నారు.

ఉదాహరణకు దక్షిణ పసిఫిక్ ప్రవాహంలో చదరపు కిలోమీటర్ కు 26,898 పదార్ధాలు ఉండగా, ఉత్తర అట్లాంటిక్ సబ్ ట్రాపికల్ ప్రవాహంలో చదరపు కిలోమీటర్‌కు సగటున 20,328 పదార్ధాలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది. ఉత్తర పసిఫిక్ ప్రవాహంలో ప్రతి చదరపు కిలోమీటర్ కు 700,000 పదార్ధాలు ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం బీచ్‌: సముద్రంలో స్వచ్ఛ భారత్ చేస్తున్న స్కూబా డైవర్లు

సముద్రంలో 7.5 కోట్ల నుంచి 20 కోట్ల టన్నుల వరకు ప్లాస్టిక్ ఉందని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం చెప్పింది. అయితే, ఇందులో ఎంత మొత్తం ఈ ప్రవాహాల్లోకి చేరుతుందనేది తెలియదు. ప్లాస్టిక్ వ్యర్ధాలు చాలా వరకు తీరానికి కొట్టుకొస్తాయి. సముద్రాల్లో కనిపించే ప్లాస్టిక్ ను చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతుందో తెలుస్తుందని హార్డెస్టీ అన్నారు.

ఈ వ్యర్ధాలు ప్రతి ఏడాది 1.5 - 2 % పెరుగుతున్నాయి. "మేము సముద్రాల్లో చాలా ప్లాస్టిక్ చూస్తున్నాం. ఈ ప్రవాహాల్లో ప్లాస్టిక్ మరింత పేరుకుపోతోంది. దీంతో, ప్లాస్టిక్ తో నిండిన ప్రవాహాలను చూడాల్సి వస్తోంది" అని చెప్పారు.

ఈ వ్యర్ధాలతో కూడిన ప్రవాహాలు ఉపరితలంపై కనిపించకపోవచ్చు. కానీ, సముద్రగర్భంలో జరిగే మార్పులు పరిశోధనకారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

నార్త్ పసిఫిక్ ప్రవాహంపై పేరుకున్న వ్యర్ధాలను 1986-2008 వరకు, 22 ఏళ్ల పాటు ఒక అధ్యయనం సేకరించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి, వ్యర్ధాలు పెరుగుతున్నప్పటికీ, ఈ పసిఫిక్ ప్రవాహం పై ప్లాస్టిక్ వ్యర్ధాలు పెరగలేదని బీచ్లర్ చెప్పారు.

సముద్రంలో తేలే ప్లాస్టిక్ ఎప్పటికీ ఉపరితలంపై ఉండదు. ప్రవాహంపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలు కూడా సముద్ర గర్భంలోకి చేరుతాయి.

ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్ర జీవావరణాల్లోకి ప్రవేశిస్తున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సముద్ర జీవులైన కొన్ని రకాల పక్షులు, తాబేళ్లు, చేపలు ఈ వ్యర్ధాలను మింగడం, లేదా పీల్చడం చేస్తున్నాయి. మునిగిపోయే స్వభావం ఉన్న ప్లాస్టిక్ వస్తువులు ముక్కలవ్వవు. ఇవి నీటి పై బాతుల్లా తేలుతాయి. వీటి ద్వారా కొన్ని సూక్ష్మ జీవులు, ఇతర సముద్ర జీవులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకువెళ్లి ఆ ప్రాంతంలో ఆక్రమిత జీవాల్లా మారతాయి.

మత్స్యవేటకు వేసే వలలు కూడా మత్స్య సంపదకు ముప్పు కలిగించే అవకాశం ఉంది

ఫొటో సోర్స్, Inpho

ఇవి కాకుండా మత్స్యవేటకు వేసే వలలు కూడా మత్స్య సంపదకు ముప్పు కలిగించే అవకాశం ఉంది. "కొన్ని వస్తువులు సముద్ర జీవులకు హాని కలిగిస్తాయి. సముద్ర జీవులు మెత్తని ప్లాస్టిక్‌ను సులభంగా తినేయగలవు. ఇవి సముద్ర క్షీరదాలు, పక్షులు, తాబేళ్ల పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి" అని హార్డెస్టీ చెప్పారు.

"మత్స్యవేట కోసం వేసే వలలు, విచక్షణా రహితంగా చేసే వేట మత్స్య సంపదకు నష్టాన్ని చేకూరుస్తాయి. ఈ వలల్లోకి చిక్కుకుని చాలా సముద్ర జీవులు మరణిస్తాయి. ఈ వ్యర్ధాలకు సముద్ర జీవ జాలానికి ఒకదానితో ఒకటి సంబంధం ఉండటంతో వీటిని ప్రవాహాల నుంచి తొలగించడం కూడా కష్టమైన పనే".

"నార్త్ పసిఫిక్ ప్రవాహం నుంచి ప్లాస్టిక్ వ్యర్ధాలను నేరుగా శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. భూమి పై ఉత్పత్తయ్యే ప్లాస్టిక్ ను తొలగించి, వాటి వాడకాన్ని తగ్గించడమే ఉత్తమమైన మార్గం" అని బీచ్లర్ అన్నారు. అయితే, ఇది ఓషియన్ కన్సర్వేన్సీ, లాంటి పర్యావరణ సంస్థలు, పెనాఫ్లోర్ లాంటి ఉద్యమకారుల పనిని మరింత సంక్లిష్టం చేస్తుంది.

"భూమి పై మేం చేసే ప్రయత్నాలు సముద్ర గర్భంలోకి వెళ్లే ప్లాస్టిక్ పై ఎంత ప్రభావం చూపిస్తున్నాయో అంచనా వేయడం కష్టం. సముద్ర తీరాల్లో విసిరేసే ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడం ద్వారా నీటిలోకి కాలుష్యం చేరడాన్ని తగ్గించొచ్చు".

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)