గాంధీ పోలికలతో మహిషాసుర విగ్రహం.. హిందూ మహాసభ దుర్గాపూజలో వివాదం

ఫొటో సోర్స్, Sanjay Das
- రచయిత, ప్రభాకర్ మణి తివారీ
- హోదా, బీబీసీ కోసం

అసలేం జరిగింది?

- కోల్‌కతాలో హిందూ మహాసభ నిర్వహించిన దుర్గాపూజ వేడుకలో మహిషాసుర విగ్రహం మహాత్మా గాంధీ పోలికలతో కనిపించింది.
- టీటాగఢ్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు కూడా నమోదైంది.
- వివాదం పెద్దది కావడంతో రాత్రికిరాత్రే మహిషాసురుని మొహంలో మార్పులు చేశారు. బొమ్మకు పెట్టిన కళ్లజోడును తొలగించారు. కొత్తగా మీసం, జుట్టు కూడా పెట్టారు.

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం దేశంలోని భిన్న ప్రాంతాల్లో వేడుకలు నిర్వహిస్తున్న సమయంలో.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దుర్గా పూజ వేడుకతో హిందూ మహాసభ కొత్త వివాదం సృష్టించింది.
కోల్‌కతా కస్బా ప్రాంతంలోని రూబీ క్రాసింగ్ వద్ద హిందూ మహాసభ ఏర్పాటుచేసిన మహిషాసుర విగ్రహం మహాత్మా గాంధీ పోలికలతో కనిపించింది. ఈ వివాదం ముదరడంతోపాటు పోలీసులు కూడా జోక్యం చేసుకోవడంతో రాత్రికిరాత్రే విగ్రహం రూపురేఖలను నిర్వాహకులు మార్చారు.
‘‘మేం కావాలని చేయలేదు. అలా కనిపించింది అంతే’’ అని హిందూ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూడ్ గోస్వామి వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Sanjay Das
‘‘అయినా అంత గౌరవించే స్థాయిలో గాంధీ ఏమీ కృషిచేయలేదు. కానీ, మేం ఎవరి మనోభావాలూ గాయపరచాలని అనుకోలేదు. గుండు చేయించుకొని, టోపీ పెట్టుకున్నట్లు కనిపిస్తే, గాంధీలా ఉన్నారని అంటే ఎలా? ఆ అసురుడి చేతిలో ఈటె ఉంది. గాంధీ ఎప్పుడూ అవి పట్టుకోలేదు కదా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
హిందూ మహాసభ ఏర్పాటుచేసిన ఈ విగ్రహం చిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఇక్కడ దుర్గాదేవి కాలి దగ్గర కనిపిస్తున్న మహిషాసుర విగ్రహం స్పష్టంగా గాంధీ విగ్రహంలా కనిపించింది.
ఈ వివాదంపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు కౌస్తుభ్ బాగ్చి మొడట టీటాగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కస్బా పోలీస్ స్టేషన్‌లోనూ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు.
వివాదం బాగా ముదరడంతో రాత్రికిరాత్రే మహిషాసురుడి విగ్రహంలో మార్పులు చేశారు. కళ్లజోడుని తొలగించారు. కొత్తగా మీసం, జుత్తు పెట్టారు.

ఫొటో సోర్స్, Sanjay Das
‘‘అలా కనిపించింది అంతే..’’
తాము మహిషాసురుడి విగ్రహాన్ని గాంధీ పోలికలతో తయారు చేయలేదని విగ్రహాన్ని ఏర్పాటుచేసిన ఆర్గనైజర్ చంద్రచూడ్ గోస్వామి వ్యాఖ్యానించారు. ‘‘అలా కనిపించింది అంతే’’అని ఆయన అన్నారు. ఇక్కడ హిందూ మహాసభ విగ్రహాన్ని ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి.
‘‘నిజమే కొంచెం మహాత్మా గాంధీ పోలికలతో ఆ విగ్రహం కనిపించింది. గాంధీజీని మేం జాతిపితలానే చూడని మాట వాస్తవమే. కానీ, మేం ఆయనను మహాషాసురుడిగా చూపించాలని అసలు అనుకోలేదు. మేం నేతాజీని కాస్త ఎక్కువ గౌరవిస్తాం’’ అని ఆయన అన్నారు. పోలీసులతోపాటు అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో విగ్రహం మొహంలో మార్పులు చేశామని ఆయన వివరించారు.
మరోవైపు ఈ విషయంలో పూజ నిర్వాహకులను హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు సుందర్‌గిరి మహారాజ్ కూడా వెనకేసుకొచ్చారు. ‘‘హిందువులు మతపరమైన విషయాల కంటే ఆధ్యాత్మిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అసలు గాంధీ ఏ విధంగానూ మహాత్ముడు కాదు. అలాంటప్పుడు ఒకవేళ ఆ విగ్రహం గాంధీలా కనిపిస్తే తప్పేముంది?’’అని ఆయన ప్రశ్నించారు?

ఫొటో సోర్స్, Sanjay das
రాజకీయ వివాదం..
ఈ విగ్రహం విషయంలో రాజకీయ దుమారం చెలరేగింది. తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. ‘‘అసలు ఇలాంటివి మనం కలలో కూడా ఊహించుకోం. ఇదే బీజేపీ నిజమైన రూపం. గాంధీ మన జాతిపిత. ఆయన సిద్ధాంతాలను ప్రపంచం మొత్తం గౌరవిస్తుంది. అలాంటి వ్యక్తిని ఇలా అవమానిస్తే ఎవరూ ఊరుకోరు’’అని ఆయన వ్యాఖ్యనించారు.
మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌధరి కూడా ఘటనను ఖండించారు. పూజ నిర్వాహకులపై రాజ్యద్రోహం కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కొందరు బీజేపీ నాయకులు కూడా ఘటనను ఖండించారు.
యునెస్కో జాబితాలో..
దుర్గాపూజ ఇక్కడ కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు. దసరాను పురస్కరించుకొని చాలా ఆర్థికంగా, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరోవైపు సాహిత్య కార్యక్రమాలూ ఉంటాయి. ప్రముఖ మీడియా సంస్థలన్నీ ప్రత్యేక ఎడిషన్లను తీసుకొస్తాయి.
కోల్‌కతా దుర్గాపూజను ‘‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’’ జాబితాలో యునెస్కో చేర్చింది. పారిస్‌లో గత ఏడాది డిసెంబరు 12 నుంచి 18 మధ్య జరిగిన యునెస్కో సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీని కోసం పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం.. యునెస్కోకు దరఖాస్తు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఆరు దేశాల్లోని ఇలాంటి వేడుకలకు మాత్రమే యునెస్కో గుర్తింపు దక్కింది.
‘‘మేం భారత్‌తోపాటు భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దుర్గా పూజను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో చేర్చడంతో స్థానిక ప్రజల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుందని భావిస్తున్నాం’’అని ఆనాడు యునెస్కో వ్యాఖ్యానించింది.
‘‘వారసత్వ సంస్కృతి అంటే కేవలం వస్తులు, గుర్తుల సమాహారం మాత్రమే కాదు. మన పూర్వికుల సంప్రదాయాలు, భావోద్వేగాలు కూడా దీనితో ముడిపడి ఉన్నాయి. ఇవి మన భవిష్యత్ తరాలకు అందాలి’’అని ఆనాడు యునెస్కో చెప్పింది.
‘‘దుర్గా పూజతో తరగతి, కుటం, మతం లాంటి విభేదాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మతం, కళలను ప్రజలకు చేర్చడానికి ఇదొక మంచి వేదిక. దీనితో కళాకారులకు మంచి అవకాశం దొరకుతుంది’’అని పేర్కొంది.
రాష్ట్రంలో దుర్గా పూజలతో రూ.32,377 కోట్ల వరకు ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. వీటిలో రీటెయిల్ రంగం విలువ రూ.27,634 కోట్లు. ముఖ్యంగా విగ్రహాల తయారీ, లైటింగ్, డెకరేషన్, ప్రకటనలు లాంటివి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
మరోవైపు కార్పొరేట్ సంస్థలు కూడా కోల్‌కతాలో దుర్గా పూజ సమయంలో మొత్తంగా రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు ఖర్చుపెడతాయని అంచనా. 2030 నాటికి దుర్గా పూజ టర్నోటవర్.. కుంభమేళా స్థాయిలో రూ. లక్ష కోట్లకు పెరుగుతుందని అంచనా.
ఇవి కూడా చదవండి:
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి ప్రత్యేకత ఏంటి?
- లాల్ బహదూర్ శాస్త్రి: ఆయన ఒక్క పిలుపుతో లక్షలాది భారతీయులు ఒక పూట భోజనం మానేశారు
- మొబైల్‌కు సిగ్నల్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే సరి
- పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ: మణిరత్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?
- యుక్రెయిన్: పెంపుడు పులి, జాగ్వర్ను వదిలి బ్రతుకు తెరువు కోసం పోలండ్ వెళ్లిన తెలుగు వైద్యుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














