COP27: వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఏం చెప్పింది, ఏం చేసింది?

COP27

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, జాహ్నవి మూలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వడగాడ్పులు, తుపాన్లు, అస్తవ్యస్తంగా వచ్చే రుతుపవనాలు, వరదలు, కరవు... భారతదేశంలో ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ తరచూ సంభవిస్తున్నాయి. ఇవన్నీ కూడా వాతావరణ మార్పుల ప్రభావమేనని నిపుణులు అంటున్నారు. అయితే, ప్రభుత్వం దీని గురించి ఏం చేస్తోంది?

భారత్ మాత్రమే కాదు, ప్రపంచమంతా వాతావరణ మార్పుల కారణంగా ఏడాది పొడవునా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటోంది.

దీని గురించి అడపాదడపా చర్చలు జరిగినా, ఐక్యరాజ్య సమితి నిర్వహించే వార్షిక పర్యావరణ సదస్సు దగ్గర పడుతున్నప్పుడు వాతావరణ మార్పులపై చర్చలు ఊపందుకుంటాయి.

ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సును ప్రతి ఏడాది నిర్వహిస్తారు. వీటిని COP (కాప్) సదస్సులు అంటారు. COP అంటే 'కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ఆఫ్ ద యూఎన్ఎఫ్‌సీసీసీ'. ఇక్కడ పార్టీలు అంటే ఈ సదస్సుకు హాజరయ్యే దేశాలు. ఇవన్నీ కూడా 1992లో 'యునైటెడ్ నేషన్స్ ఫ్రేంవర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్' (యూఎన్ఎఫ్‌సీసీ)పై సంతకం చేసిన దేశాలు.

ఈ ఏడాది ఈజిప్ట్‌లో 27వ కాప్ వార్షిక సదస్సు జరగనుంది. ఇది నవంబర్ 6 నుంచి 18 వరకు షర్మ్ ఎల్-షేక్‌లో జరుగుతుంది.

COP27లో నష్టం, హాని (లాస్ అండ్ డ్యామేజ్) అంశాన్ని హైలైట్ చేయనున్నారు. లాస్ అండ్ డ్యామేజ్ అంటే వాతావరణ మార్పులను ఎదుర్కునే దిశగా పేద దేశాలకు ఆర్థిక సహకారం అందించడం.

దీనితో పాటు, ఈ సదస్సుకు హాజరయ్యే దేశాలు వాతావరణ మార్పులపై వాగ్దానాలకు ఎంతవరకు కట్టుబడి ఉన్నాయి, వేటిని నిర్వర్తించాయి, ఏవి పెండింగ్‌లో ఉన్నాయి, తదుపరి లక్ష్యాలేమిటి మొదలైన విషయాలను కూడా చర్చిస్తారు.

COP27

ఫొటో సోర్స్, Getty Images

భారత్ చేసిన వాగ్దానాలేమిటి?

భారత్ సహా 194 దేశాలు 2015లో పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రపంచ ఉష్ణోగ్రత 1.5C మించి పెరగకుండా చర్యలు తీసుకోవడమే దీని లక్ష్యం.

ప్రధానంగా, గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గించడంపై దృష్టి పెడతామని దేశాలు వాగ్దానం చేశాయి.

ఆ దిశగా ప్రతి దేశం జాతీయ స్థాయిలో నిర్ణయించిన లక్ష్యాలను (ఎన్‌డీసీ) రూపొందించి, సమర్పించాల్సి ఉంటుంది.

దేశాలు తమ తమ ఎన్‌డీసీలలో కర్బన ఉద్గారాలను ఎంత తగ్గిస్తాయి, ఎలా తగ్గిస్తాయి అనే అంశాలను హైలైట్ చేయాలి.

ఈ ఏడాది ఆగస్టులో భారతదేశం తన ఫైనల్ ఎన్‌డీసీ లక్ష్యాలను అప్‌డేట్ చేసింది.

భారత్ మూడు ముఖ్యమైన వాగ్దానాలు చేసింది.

1. భారతదేశం తన జీడీపీ ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయి నుంచి 2030 నాటికి 45 శాతం తగ్గిస్తుంది.

2. 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల నుంచి 50 శాతం విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంది.

3. చెట్లు నాటడం, అడవులు పెంచడం ద్వారా 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల CO2ను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది.

దీనర్థం ఏమిటి?

క్లీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన వనరులు, తక్కువ ఉద్గారాలను విడుదల చేసే ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వాహనాలు మొదలైన వాటికి సంబంధించిన అనేక ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, సహాకారం అందిస్తుందని భారతదేశం వాగ్దానం చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఎన్‌డీసీని అప్డేట్ చేస్తున్నప్పుడే ఒక ప్రకటన చేసింది.

"భారతదేశం తన ఎన్‌డీసీలో నిర్దిష్టమైన రంగంలో మార్పులు, చేర్పులకు కట్టుబడి ఉంటామని చెప్పలేదు. మొత్తం ఉద్గార తీవ్రతను తగ్గించడం, క్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలోని బలహీనమైన రంగాలను, సమాజంలో వెనుకబడిన వర్గాలను రక్షించడం భారతదేశ లక్ష్యం" అని స్పష్టం చేసింది.

గత ఏడాది గ్లాస్గోలో జరిగిన కాప్26లో ప్రధాని నరేంద్ర మోదీ, 2070 నాటికి 'నెట్ జీరో' సాధించడమే లక్ష్యమని చెప్పారు.

ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం, 'నెట్ జీరో' అంటే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను సున్నాకి దగ్గరగా తగ్గించడం.

ఒక దేశం 'నెట్ జీరో' సాధించాలంటే, ఎంత మొత్తంలో గ్రీన్‌హౌస్ వాయులు విడుదల అవుతున్నాయో, అంతే మొత్తంలో వాటిని వాతావరణం నుంచి తొలగించగలగాలి.

ఈ లక్ష్యాన్ని సాధించడానికి, భారతీయ రైల్వే 2030 నాటికి 'నెట్ జీరో' సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా 6 కోట్ల టన్నుల ఉద్గారాలను తగ్గించాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.

అదేవిధంగా, భారతదేశంలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్న LED బల్బుల ప్రచారం సంవత్సరానికి 4 కోట్ల టన్నుల ఉద్గారాలను తగ్గిస్తుంది.

COP27

ఫొటో సోర్స్, GAUTUM DEY/AFP

ఇంధన రంగంలో సవాళ్లు

2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల నుంచి 50 శాతం విద్యుత్ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని సాధిస్తామని భారత్ చెప్పింది. హైడ్రో పవర్, సోలార్ పవర్, బయో ఎనర్జీ సహాయంతో వచ్చే 8 సంవత్సరాలలో ఈ లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది.

గత దశాబ్ద కాలంలో ఈ క్లీన్ ఎనర్జీ వనరుల వినియోగంలో పెరుగుదల కనిపించింది. అయితే దాని వేగం ఇప్పటికీ ఆశించిన స్థాయిలో లేదు.

నేటికీ, భారతదేశం ఎక్కువగా థెర్మల్ పవర్‌పై ఆధారపడి ఉంది. సుమారు 60 శాతం విద్యుత్ థెర్మల్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అవుతోంది. ఇటువంటి పవర్ స్టేషన్‌లు ప్రధానంగా శిలాజ ఇంధనాలపై నడుస్తాయి. బొగ్గును విస్తృతంగా ఉపయోగిస్తారు.

బొగ్గు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2022 సెప్టెంబర్‌లో భారతదేశంలో బొగ్గు ఉత్పత్తిలో 12% పెరుగుదల ఉంది.

ప్రపంచవ్యాప్తంగా బొగ్గు వినియోగం తగ్గడానికి బదులు పెరుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేసిన ఒక విలేఖరుల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

"పశ్చిమ దేశాలు బొగ్గు వైపుకు మరలుతున్నాయి. ఆస్ట్రియా ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పింది. గ్యాస్ కొనుగోలు చేసే స్థితిలో లేకపోవడం లేదా కావలసినంత అందుబాటులో లేకపోవడం కారణాలు కావచ్చు" అని ఆమె అన్నారు.

కాగా, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక ప్రకారం, సౌర శక్తిని, పవన శక్తిని వినియోగించేవారి సంఖ్య పెరిగింది. ఇది మరింత పెరగవచ్చని అంచనా.

కానీ, భారత్ మాత్రం వెనుకబడి ఉంది. డిసెంబర్ 2022 నాటికి ఇంధన సామర్థ్యాన్ని 175 గిగావాట్లకు పెంచాలని, క్లీన్ ఎనర్జీతో విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, దీన్ని చేరుకోవడంలో చాలా వెనుకబడి ఉంది. ప్రస్తుతం 116 గిగావట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ఇంధనానికి డిమాండ్ ప్రతి ఏడాదికీ పెరుగుతోంది. క్లీన్ ఎనర్జీ ద్వారా ఈ డిమాండ్‌ను చేరుకోవడం పెద్ద సవాలు.

అడవులను పెంచడం

భారీ సంఖ్యలో చెట్లను నాటి, అడవులను పెంచి, 2.5 నుంచి 3 టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను వాతావరణం నుంచి తొలగించే వ్యవస్థను రూపొంచాలన్నది భారత్ లక్ష్యం.

2019 నుంచి 2021 వరకు అటవీ విస్తీర్ణం 2,261 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొందని ఒక ఫారెస్ట్ సర్వే తెలిపింది.

అయితే, కాగితంపై ఉన్న దానికి, వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని పర్యావరణ నిపుణుడు అతుల్ డియోల్‌గావ్కర్ అభిప్రాయపడ్డారు.

పచ్చగా కనిపించేవన్నీ అడవులు కావు. భారతదేశంలో అటవీ విస్తీర్ణాన్ని కొలిచేటప్పుడు, వృక్షసంపద సాంద్రతను కొలుస్తారు. కొన్నిసార్లు పొదలు, తోటలను కూడా అడవులుగా పరిగణిస్తారని ఆయన అన్నారు.

అడవుల విస్తీర్ణం పెరిగిందని ఫారెస్ట్ సర్వే నివేదికలో చెబుతున్నారు. అయితే, అది సరిపోతుందా? అన్నది ప్రశ్న.

COP27

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?

ఎన్‌డీసీ లక్ష్యాలు సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వంతు కృషి చేయాలి.

2022 సెప్టెంబర్‌లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రెండు రోజుల సదస్సును నిర్వహించింది. ఇందులో దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి పర్యావరణ శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఈ సదస్సులో రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళికలపై చర్చించారు.

మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ లోక్ సభలో ధృవీకరించింది.

కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు సరే, అవి కార్యరూపం దాలుస్తున్నాయా?

పర్యావరణ లక్ష్యాలను చేరుకునేందుకు ఆర్థిక సహకారం అవసరం

వాతావరణ ఉద్గారాలను తగ్గించడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు, పేద దేశాలకు అంత సులువు కాదు. కాబట్టి, COP27లో ఆర్థిక సహాయం ప్రధానాంశంగా ఉంటుంది.

విద్యుత్‌కు పెరుగుతున్న డిమాండ్ అందుకోవాలంటే క్లీన్ ఎనర్జీ రంగంలో పెద్ద పెట్టుబడులు అవసరం.

భారత్‌కు కూడా ఇంధన నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ దిశలో భారతదేశానికి 401 బిలియన్ డాలర్లు అవసరమని బ్యాంక్ ఆఫ్ అమెరికా సర్వే తెలిపింది.

ఈ నేపథ్యంలో, కాప్27లో లాస్ అండ్ డ్యామేజ్ ప్రధానాంశం కానుంది.

2009లో, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉద్గారాలను తగ్గించడానికి, వాతావరణ మార్పులకు సిద్ధం కావడానికి 2020 నాటికి సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లు ఇస్తామని అభివృద్ధి చెందిన దేశాలు వాగ్దానం చేశాయి.

అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోలేదని ఐరాస రిపోర్ట్ తెలిపింది.

ఈ ఏడాది సాంకేతిక చర్చల్లో భాగంగా ఈ సమస్య గురించి చర్చిస్తారని అంచనా. అభివృద్ధి చెందుతున్న దేశాల తరపున భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తుందని, లాస్ అండ్ డ్యామేజ్ కవర్ కోసం భారతదేశం గట్టిగా వాదిస్తుందని భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, 70 ఎకరాల సొంత పొలాన్ని అడవిగా మార్చి పక్షులు, జంతువులకు విడిచిపెట్టిన ప్రకృతి ప్రేమికుడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)