క్యాన్సర్ సహా పలు వ్యాధులకు కారణమయ్యే కర్బన ఉద్గారాల వివరాలను దాస్తున్న చమురు కంపెనీలు- బీబీసీ పరిశోధన

అలీ హుస్సేన్

ఫొటో సోర్స్, Hussein Faleh/BBC News

ఫొటో క్యాప్షన్, అలీ హుస్సేన్
    • రచయిత, ఎస్మే స్టాలార్డ్, ఒవీన్ పినెల్, జెస్ కెలీ
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రధాన చమురు కంపెనీలు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల మూలాలను ప్రకటించడం లేదని బీబీసీ న్యూస్ న్యూస్ పరిశోధనలో వెల్లడైంది.

బీపీ, ఈఎన్ఐ, ఎక్సాన్‌మోబిల్, చెవ్రాన్, షెల్ కంపెనీల చమురు క్షేత్రాల్లో గ్యాస్ ఫ్లేరింగ్ వల్ల లక్షలాది టన్నుల ఉద్గారాలు వెలువడుతున్నాయని, వీటి గురించి ఆయా కంపెనీలు అధికారిక ప్రకటన చేయట్లేదని బీబీసీ గుర్తించింది.

చమురు ఉత్పత్తి చేసే సమయంలో విడుదలయ్యే అదనపు గ్యాస్‌ను మండించడాన్ని 'గ్యాస్ ఫ్లేరింగ్'గా పిలుస్తారు.

వీటి గురించి తాము నివేదించే పద్ధతిని 'స్టాండర్డ్ ఇండస్ట్రీ ప్రాక్టీస్' అని ఆ కంపెనీలు చెప్పాయి.

'గ్యాస్ ఫ్లేరింగ్' వల్ల కార్బన్ డయాక్సైడ్, మీథేన్, మసి కలిసిపోయిన శక్తిమంతమైన మిశ్రమం ఉద్గారంగా బయటకు వస్తుంది. దీని వల్ల గాలి కాలుష్యంతో పాటు గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది.

గ్యాస్ ఫ్లేరింగ్ జరిగే చమురు క్షేత్రాలకు సమీపంలోని ఇరాకీ కమ్యూనిటీలలో క్యాన్సర్‌ను కలిగించే రసాయనాలు అధిక స్థాయిలో ఉన్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.

ఈ ప్రాంతాల గురించి ఐక్యరాజ్యసమితి మానవహక్కులు, పర్యావరణ ప్రత్యేక ప్రతినిధి డేవిడ్ బాయ్డ్ స్పందించారు.

''ఇవి ఆధునిక త్యాగ కేంద్రాలు. ఇక్కడ మానవ ఆరోగ్యం, మానవ హక్కులు, పర్యావరణం కంటే లాభాలు, ప్రైవేట్ ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత'' అని ఆయన అన్నారు.

ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం ఉందని కంపెనీలు చాలా కాలం క్రితమే గుర్తించాయి.

నహ్రాన్ ఒమర్ నది వద్ద ఫ్లేరింగ్
ఫొటో క్యాప్షన్, నహ్రాన్ ఒమర్ నది సమీపంలో ఫ్లేరింగ్

'రొటీన్ ఫ్లేరింగ్'ను 2030 నాటికి ముగిస్తామని 2015లో ప్రపంచ బ్యాంక్‌కు బీపీ, ఈఎన్‌ఐ, ఎక్సాన్‌మోబిల్, చెవ్రాన్, షెల్ కంపెనీలు హామీ ఇచ్చాయి.

రోజూవారీ కార్యాకలాపాలను నిర్వహించడానికి తాము, వేరే కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని... ఇలాంటి నేపథ్యంలో 'ఫ్లేరింగ్' ఉద్గారాలను ప్రకటించడం ఆయా కంపెనీల బాధ్యత అని ఈ సంస్థలు చెబుతున్నాయి.

ఈ అయిదు కంపెనీలే చమురు ఉత్పత్తిలో సగటున 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

అయితే, నెలల తరబడి బీబీసీ చేసిన విశ్లేషణలో డజన్ల కొద్దీ చమురు క్షేత్రాల కోసం పనిచేసే ఆపరేటర్లు, ఉద్గారాలను ప్రకటించడం లేదని తెలిసింది.

ప్రపంచ బ్యాంక్ ఫ్లేర్ ట్రాకింగ్ శాటిలైట్ డేటా ఆధారంగా, మేం ఈ సంస్థలకు చెందిన ప్రతీ చమురు క్షేత్రంలోని ఉద్గారాలను గుర్తించగలిగారు.

2021లో ఈ ఫ్లేరింగ్ వల్ల వెలువడిన దాదాపు 20 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గురించి ఎవరూ నివేదించలేదని మేం అంచనా వేస్తున్నాం. 4.4 మిలియన్ల కార్లు ఒక ఏడాదిలో విడుదల చేసే గ్రీన్ హౌస్ ఉద్గారాలకు ఇది సమానం.

దీని గురించి స్పందిస్తూ, తాము నేరుగా నిర్వహించే క్షేత్రాల్లోని ఉద్గారాల నివేదించడానికి 'స్టాండర్డ్ ఇండస్ట్రీ ప్రాక్టీస్' విధానాన్ని అనుసరిస్తామని ఈ అయిదు సంస్థలు తెలిపాయి.

తాము నాన్ ఆపరేటెడ్ సైట్లలోని ఫ్లేరింగ్‌తో కలిపి ఓవరాల్‌గా ఉద్గారాల వివరాలను అందిస్తున్నామని షెల్, ఈఎన్‌ఐ సంస్థలు చెప్పాయి. అయితే, దీని గురించి ప్రపంచ బ్యాంక్ ప్రతిజ్ఞలో లేదని ఆ సంస్థలు అన్నాయి.

ఇరాక్‌లోని చమురు క్షేత్రాల సమీపంలో నివసించే ప్రజలకు ఈ ఫ్లేరింగ్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు పెరుగుతుందని బీబీసీ న్యూస్ అరబిక్ చేసిన పరిశోధన సూచిస్తుంది.

ప్రపంచంలోని అతిపెద్ద చమురు క్షేత్రాలైన బస్రా, ఆగ్నేయ ఇరాక్, రుమాలియా, పశ్చిమ ఖుర్నా, జుబైర్, నహ్రాన్ ఒమర్ ప్రాంతాల్లో, ప్రజల్లో లుకేమియా సమస్య పెరుగుతున్నట్లు, ఇది వారికి చిన్నతనం నుంచి ఎదురువుతున్నట్లు తేలింది. దీనికి ఫ్లేరింగే కారణమని అనుమానిస్తున్నారు.

గ్యాస్ ఫ్లేరింగ్ వల్ల చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు

ఫొటో సోర్స్, Hussein Faleh/BBC

ఫొటో క్యాప్షన్, గ్యాస్ ఫ్లేరింగ్ వల్ల చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు

బస్రా రీజియన్‌లో 2015-2018 మధ్య అన్ని రకాల క్యాన్సర్లలో కొత్త కేసుల సంఖ్య 20 శాతం పెరిగినట్లు ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి లీక్ అయిన నివేదిక చూపిస్తోంది. ఈ నివేదికను బీబీసీ న్యూస్ అరబిక్ పరిశీలించింది. వాయు కాలుష్యం దీనికి కారణమని నివేదిక ద్వారా తెలిసింది.

రుమాలియా, జుబైర్ చమురు క్షేత్రాల్లో వరుసగా బీపీ, ఈఎన్‌ఐ సంస్థలు లీడ్ కాంట్రాక్టర్లు. కానీ, వారు ఆపరేటర్లు కాకపోవడం వల్ల ఆ సంస్థలు ఉద్గారాల వివరాలను ప్రకటించవు. ఆ సైట్ నిర్వాహకులు కూడా వీటి ప్రకటన చేయరు.

బీబీసీ న్యూస్ అరబిక్ 2021లో పర్యావరణ, ఆరోగ్య నిపుణులతో రెండు వారాల పాటు పనిచేసింది. ఈ నాలుగు సైట్లకు సమీపంలో 'ఫ్లేరింగ్' వల్ల క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలను పరీక్షించే పనిలో బీబీసీ పాల్గొంది.

గాలిని పరీక్షించగా లుకేమియా, ఇతర రక్త సంబంధిత వ్యాధులకు కారణమయ్యే బెంజీన్ స్థాయిలు కనీసం నాలుగు ప్రాంతాల్లో ఇరాక్ జాతీయ పరిమితికి మించిపోయామని తేలింది.

52 మంది చిన్నారుల నుంచి మూత్ర నమూనాలు సేకరించి పరీక్షించగా 70 శాతం నమూనాల్లో 2-నాఫ్తాల్ రసాయనం ఉన్నట్లు తేలింది. 2-నాఫ్తాల్ అనేది క్యాన్సర్ కారక నాఫ్తలీన్‌ పదార్థం.

''పిల్లల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. వారి ఆరోగ్యం పట్ల ఇది ఆందోళన చెందాల్సిన విషయం. కాబట్టి వారిని నిశితంగా పరిశీలించాలి'' అని కొలంబియా యూనివర్సిటీలోని చైల్డ్‌హుడ్ క్యాన్సర్ ప్రొఫెసర్ డాక్టర్ మాన్యులా ఓర్జులా గ్రిమ్ అన్నారు.

పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ షుక్రి

ఫొటో సోర్స్, Hussein Faleh/BBC News

ఫొటో క్యాప్షన్, పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ షుక్రి

11 ఏళ్ల వయస్సులో ఫాతిమా ఫలా నజెమ్‌కు అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమిమా అనే ఒక రకమైన రక్త, ఎముక క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఒంట్లో బెంజీన్‌ అధికంగా చేరడం వల్ల ఈ రకమైన క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది.

జుబైర్ చమురు క్షేత్రాల సమీపంలో ఫాతిమా కుటుంబం నివసిస్తుంది. ఈఎన్‌ఐ కంపెనీ ఇక్కడ లీడ్ కాంట్రాక్టర్. ఫాతిమాకు తల్లిదండ్రులతో పాటు ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు.

ఇక్కడి 'ఫ్లేరింగ్ ఉద్గారాల గురించి ఈఎన్‌ఐ బహిర్గతపరచలేదు. ఆ సైట్ నిర్వాహకులు కూడా ప్రకటించలేదు.

ఆరోగ్య కారణాల రీత్యా ప్రజల నివాసాలకు 10 కి.మీ దూరంలో ఫ్లేరింగ్ జరుపకూడదని ఇరాకీ చట్టం చెబుతుంది.

కానీ, ఫాతిమా ఇంటికి 1.6 మైళ్ల దూరంలోనే జుబైర్ కంపెనీ నిరంతరం ఫ్లేరింగ్ నిర్వహిస్తుంది.

గత నవంబర్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పటికీ ఫాతిమా మరణించారు. అప్పుడు ఆమె వయస్సు 13 ఏళ్లు.

ఫాతిమా

ఫొటో సోర్స్, Jess Kelly/BBC News

ఫొటో క్యాప్షన్, ఫాతిమా

దీనిపై స్పందించాల్సిందిగా ఈఎన్‌ఐని కోరగా తమ కార్యాకలాపాల వల్ల ఇరాక్ ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందనే ప్రతీ ఆరోపణను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు.

జుబైర్‌లో ఫ్లేరింగ్‌కు సంబంధించి కాంట్రాక్టు ప్రకారం తమకు ఎలాంటి బాధ్యత లేదని ఈఎన్‌ఐ సంస్థ వ్యాఖ్యానించింది.

దీనికి 25 మైళ్ల దూరంలో ఉన్న రుమైలా చమురు క్షేత్రంలో ప్రపంచంలో ఏ ఇతర సైట్‌లలో జరగనంత ఫ్లేరింగ్ జరుగుతుందని బీబీసీ పరిశీలనలో తెలిసింది. ఇక్కడ జరిగే ఫ్లేరింగ్‌.. యూకేలో ఒక సంవత్సరం పాటు 30 లక్షల ఇళ్లకు సరిపడా గ్యాస్‌తో సమానం.

ఇక్కడ 'బీపీ' సంస్థ ప్రధాన కాంట్రాక్టర్. దీని పర్యవేక్షణలోనే రుమైలా ఆపరేటింగ్ ఆర్గనైజేషన్ (ఆర్‌ఓఓ) పనిచేస్తుంది. ఈ రెండు యాజమాన్యాలు ఇక్కడ ఉద్గారమయ్యే ఫ్లేరింగ్ గురించి ప్రకటించలేదు.

జాతీయ పరిమితులకు మించిన వాయు కాలుష్య స్థాయిల వల్ల ప్రభావితమైన వారు చట్టబద్ధంగా పరిహారం పొందేందుకు అర్హులు. ఈ నిబంధనపై బీపీ సంస్థ సంతకం కూడా చేసింది.

కానీ, లుకేమియా నుంచి బయటపడిన 19 ఏళ్ల అలీ హుస్సేన్ జులూద్ ఈ పరిహారాన్ని పొందలేకపోయారు. 2020, 2021లో పరిహారం కోసం బీపీ యాజమాన్యాన్ని సంప్రదించినప్పుడు వారి నుంచి మౌనమే సమాధానంగా వచ్చిందని అలీ చెప్పారు.

''బీబీసీ లేవనెత్తిన సమస్యల పట్ల మేం చాలా ఆందోళన చెందుతున్నాం. త్వరలోనే వీటిని సమీక్షిస్తాం'' అని బీపీ సంస్థ చెప్పింది.

పశ్చిమ ఖుర్నా చమురు క్షేత్రం

ఫొటో సోర్స్, Essam Abdullah Mohsin/BBC News

ఫొటో క్యాప్షన్, పశ్చిమ ఖుర్నా చమురు క్షేత్రం

అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని చమురు క్షేత్రాల్లో పనిచేస్తోన్న అన్ని కాంట్రాక్టు కంపెనీలను ఆదేశించాం'' అని ఇరాక్ చమురు మంత్రి ఎహ్‌సాన్ అబ్దుల్ జబ్బార్ అన్నారు

ఫ్లేరింగ్ పేరిట మండించే గ్యాస్‌ను సేకరించి వ్యాపార సంస్థలకు, వినియోగదారులకు విక్రయించాలని చమురు సంస్థలకు ప్రపంచ బ్యాంకు సూచిస్తోంది.

అయితే, గ్యాస్‌ను మొదటగా ప్రాసెసింగ్ చేసిన తర్వాత విక్రయించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిలో ప్రమాదకర రసాయనాలు ఉంటాయి.

ఇది కాస్త ఖరీదైన ప్రక్రియ. అందుకే కొన్ని చమురు సంస్థలు గ్యాస్ ఫ్లేరింగ్‌కే మొగ్గు చూపుతున్నాయి.

కానీ, పటిష్టమైన నియంత్రణ చర్యలతో ఫ్లేరింగ్‌ను తగ్గించవచ్చని నార్వే లాంటి దేశాలు చేసి చూపించాయని బీబీసీతో మార్క్ డేవిస్ అన్నారు. చమురు కంపెనీలక ఫ్లేర్డ్ గ్యాస్‌కు సంబంధించిన సలహాలు అందించే క్యాప్టేరియో కంపెనీకి డేవిస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్‌గా పని చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణలో ఆయిల్ పామ్‌: ప్రభుత్వ ప్రణాళికతో వంటింటి నూనె ఖర్చులు తగ్గుతాయా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)