Italy elections: ఇటలీలో పెరిగిపోతున్న ఖర్చులు.. రష్యాపై ఆంక్షలు ఎత్తివేయాలంటున్న ప్రజలు

వీడియో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి. అయితే, ఇటలీలో మరో వారంలో ఎన్నికలు జరుగనుండటంతో ఇదే ప్రధానాంశంగా మారింది. ఈ ఎన్నికలలో రైట్ వింగ్ కూటమి విజయం సాధించే అవకాశముందని పోల్స్ చెబుతున్నాయి. కొందరు రైట్ వింగ్ నేతలు ఇటలీలో పెరిగిన జీవనవ్యయాన్ని తగ్గించడానికి రష్యాపై ఆంక్షలు ఎత్తివేయాలంటున్నారు.

బీబీసీ ఇటలీ కరస్పాండెంట్ మార్క్ లోవెన్ అందిస్తున్న కథనం.

ఇది టార్విజియో పట్టణం. ఈ అందమైన ఇటాలియన్ ప్రాంతం ఆల్ప్స్ పర్వతాల మధ్య ఉన్నది... యూరప్‌లో రష్యన్ పలుకుబడికి ఇది నిదర్శనం.

చాలా కాలంగా ఇక్కడికి గ్యాస్ సరఫరా అవుతూ ఉంది. ఇటలీ వినియోగించే నలభై శాతం గ్యాస్ ఇక్కడికే చేరుతుంది.

కానీ ఇప్పుడు యుక్రెయిన్‌ యుద్ధం విషయంలో పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు పెట్టడంతో అది గ్యాస్ సప్లై తగ్గించింది.

60 శాతం గ్యాస్ సప్లై తగ్గించి, ఒత్తిడి పెంచారు వ్లాదిమిర్ పుతిన్.

రష్యన్ గ్యాస్ ఎంట్రీ పాయింట్ ఇదే.

సరఫరా తగ్గిపోయాక, రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లోకి ఆలస్యంగా దిగింది యూరప్.

''మాకు ఈ శీతాకాలానికి సరిపడా గ్యాస్ దొరుకుతుందో లేదో అంచనా వేయడం కూడా కష్టమే. ఈ అత్యవసర సమస్యను పరిష్కరించేందుకు, గ్యాస్ రేషనింగ్‌ను నివారించడానికి మేం ప్రభుత్వంతో కలిసి శ్రమిస్తున్నాం. ఇప్పటివరకు మాకు రష్యా చాలా నమ్మకమైన సరఫరాదారుగా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో కూడా రష్యా మాకు గ్యాస్ సరఫరా ఆపలేదు'' అని స్నామ్ ఎనర్జీ ఇన్‌ఫ్రా కంపెనీకి చెందిన సైమోన్ తెలిపారు.

ఇటలీ ఇప్పుడు సముద్ర తీరం నుంచి మరింత ద్రవరూప సహజ వాయువును భారీగా దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఇప్పడు రష్యా స్థానాన్ని భర్తీ చేస్తూ అల్జీరియా అతి పెద్ద సరఫరాదారుగా మారింది.

త్రియస్తే పోర్ట్ దగ్గర యుక్రెయిన్ మరో పార్శ్వాన్ని చూడొచ్చు. యుద్ధంతో బ్లాక్ సీ పోర్టులు నిలిచిపోవడంతో ఇక్కడికి వస్తున్న కంటైనర్ల ట్రాఫిక్ 17 శాతం పెరిగింది.

యుక్రెయిన్ యుద్ధం కారణంగా జంక్షన్‌లా ఉండే త్రియస్తేలో పరిస్థితి సంక్లిష్టంగా ఉంటుంది. పోర్టుల్లో తాకిడి ఎక్కువవడం, రష్యన్ గ్యాస్ తగ్గిపోతుండటం... రష్యాకు మిత్రుడైన ఓలిగార్క్‌కు చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద ఓడను కూడా సీజ్ చేశారు. కానీ ఇటలీ సామాన్యులకు దీని ప్రభావం ఏంటో తెలుసు. యుద్ధంతో ధరలు మరింత పెరిగిపోతున్నాయి. దాంతో అసలు ఇది అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

పిపోలో
ఫొటో క్యాప్షన్, పిపోలో

నోరూరించే ఐస్ క్రీంలు అమ్మే పిపోలోను పెరిగిన కరెంటు బిల్లులు కష్టాల్లో పడవేశాయి.

కరెంటు చార్జీలు మూడింతలు కాగా, వ్యాపారం ఏ మాత్రం లాభసాటిగా లేదంటున్న ఈ ఐస్‌క్రీమ్ షాపు యజమాని.. నేను ఓటు వేయను అంటున్నారు.

''కొన్ని రోజులలో మేం కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి వస్తుంది. దాంతో వాళ్లు మా కరెంటు కట్ చేస్తారు. మా వ్యాపారం మూత పడుతుంది. దీనిని 1929లో మా తాతగారు ప్రారంభించారు. 2వ ప్రపంచ యుద్ధ కాలాన్ని కూడా మేం అధిగమించాం. కానీ ఈ విద్యుత్ సంక్షోభం కారణంగా మా షాపును మూసేయవలసి వస్తే మేం చాలా నష్టపోతాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. దేశ ప్రజలు ఎలా ఆకలితో అల్లాడుతున్నారో చూడాలి. యుక్రెయిన్‌కు సాయం చేయడం అవసరమా అని ఆలోచించుకోవాలి'' అని పిపోలో చెప్పారు.

ఇదే అభిప్రాయాన్ని బలపరుస్తున్న రైట్ వింగ్ నేత మేటియో సల్వినీ.... మాస్కోపై ఆంక్షలను ఎత్తివేయాలంటున్నారు.

తన మిత్రుడైన సిల్వియో బెర్లుస్కోనీ లాగానే ఈయనకు కూడా పుతిన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి.

ఇటలీలో అత్యధికులు యుక్రెయిన్‌కు ఆయుధ సరఫరాను వ్యతిరేకిస్తున్నారు. రష్యాకు ఇది కలిసొచ్చే అంశం.

యుద్ధ వ్యతిరేక కార్యకర్త అలెజాండ్రా రిచెటీ
ఫొటో క్యాప్షన్, యుద్ధ వ్యతిరేక కార్యకర్త అలెజాండ్రా రిచెటీ

''యుద్ధాలలో పాలుపంచుకోవడాన్ని మా రాజ్యాంగం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మానవ హక్కుల హననంలో ఘోరమైన రికార్డున్న ఖతర్, అల్జీరియాలను చూసుకొని, మనం రష్యన్ గ్యాస్‌ను వ్యతిరేకిస్తున్నాం. కానీ ఈ యుద్ధం యురోపియన్లను ఎలా దెబ్బ తీసిందో మనం చర్చించడం లేదు'' అని యుద్ధ వ్యతిరేక కార్యకర్త అలెజాండ్రా రిచెటీ అన్నారు.

యూరప్‌ అంతటినీ యుక్రెయిన్ యుద్ధం ఓ పీడకలలా వేధిస్తోంది. ఈ దేశం ఎన్నికల ముంగిట్లో ఉంది. ఇటలీ కూడా కీయెవ్ విజయాన్ని కోరుకుంటుంది. మరి దానికి చెల్లిస్తున్న మూల్యం ఎంత?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)