యుక్రెయిన్, రష్యా యుద్ధం: రష్యా సైన్యాన్ని నిత్యం విమర్శిస్తున్న పుతిన్ 'ఇద్దరు మిత్రులు' ఎవరు?

Yevgeny Prigozhin and Ramzan Kadyrov

ఫొటో సోర్స్, Getty Images/Reuters

ఫొటో క్యాప్షన్, ప్రిగోజిన్, కదిరోవ్
    • రచయిత, ఇలియా అబిసేవ్, కేథరినా ఖింకులోవా
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

యుక్రెయిన్‌లో దాడుల నిలిపివేతపై రష్యా మిలటరీ కమాండ్‌ విమర్శలు ఎదుర్కొంటోంది.

ముఖ్యంగా చెచెన్ నేత రమ్జాన్ కదిరోవ్, వాగ్నర్ అనే కిరాయి సైనికుల గ్రూప్ స్థాపకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ నుంచి విమర్శల తీవ్రత అధికంగా ఉంది.

ఈ ఇద్దరు గతంలో ఎన్నడూ రష్యా మిలటరీలో కానీ, భద్రత వ్యవస్థలలో కానీ నాయకత్వం వహించలేదు. కానీ, రష్యా మిలటరీ కమాండర్లను విమర్శించడంలో మాత్రం వీరికి అడ్డేలేదు. అంతేకాదు... తాము వ్యక్తం చేసే అభిప్రాయాల విషయంలో ఒకరినొకరు ప్రశంసించుకుంటారు.

యుక్రెయిన్‌తో యుద్ధం తరువాత రష్యా సైన్యంపై అంతవరకు ఉన్న ఇమేజ్ పోయింది. రష్యా సైన్యం చాలా సమర్థమైనదే అభిప్రాయం పోయింది. యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ను మూడు రోజుల్లో స్వాధీనం చేసుకుంటామని రష్యా అధికారిక టీవీ చానల్‌లో వచ్చిన ప్రకటనలకు అనుగుణంగా వెళ్లడంలో కానీ, తాము స్వాధీనం చేసుకున్న భూభాగాలను మళ్లీ యుక్రెయిన్‌ చేజిక్కించుకోకుండా నిలువరించడంలో కానీ విఫలమైంది.

యుక్రెయిన్‌లో రష్యా దళాలకు కొత్త చీఫ్ జనరల్‌గా నియమితుడైన సెర్గీ సురోవికిన్ ఇప్పటివరకు సాధించిన విజయం యుక్రెయిన్ పవర్ స్టేషన్లను పేల్చడమే.

ఇలాంటి పరిస్థితులలో రమ్జాన్ కదిరోవ్, యెవ్జెనీ ప్రిగోజిన్‌లు రష్యా సైన్యంపై విమర్శలు చేయగలుగుతున్నారంటే దానర్థం వారిద్దరి అభిప్రాయాలను పుతిన్ పరిగణనలోకి తీసుకుంటారనే.

Gen Lapin

ఫొటో సోర్స్, Russian defence ministry

ఫొటో క్యాప్షన్, జనరల్ లాపిన్

యుక్రెయిన్‌లో రష్యా దళాల ముఖ్య కమాండర్లలో ఒకరైన కల్నల్ జనరల్ అలెగ్జాండర్ లాపిన్‌ను గత వారం తొలగించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఆయనపై వేటు పడడానికి రెండు రోజుల ముందు రమ్జాన్ కదిరోవ్ ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అలెగ్జాండర్ ఏమాత్రం సత్తా లేనివారని కదిరోవ్ ఆరోపించారు. అక్టోబరు ప్రారంభంలో యుక్రెయిన్ తూర్పు పట్టణం లీమాన్‌ను యుక్రెయిన్ దళాలు తిరిగి తమ వశం చేసుకోవడం సహా రష్యా ఎదుర్కొన్న అనేక ఓటములకు అలెగ్జాండరే బాధ్యుడని కదిరోవ్ నిందించారు.

జనరల్ అలెగ్జాండర్‌ను నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించి ప్రైవేటుగా ఫ్రంట్‌లైన్‌కు పంపించాలి అని కదిరోవ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు.

అంతేకాదు.. అలెగ్జాండర్ ఈ అవమానాలను రక్తంతో కడుక్కోవాలని కూడా కదిరోవ్ అన్నారు.

యెవ్జెనీ ప్రిగోజిన్‌ కూడా కదిరోవ్‌కు తోడయ్యారు. రష్యా జైళ్ల వ్యవస్థ చుట్టూ తిరిగిన ఆయన రష్యాతో పోరాటానికి ఖైదీలనూ కలిశారు.

రష్యాలో పైస్థాయిలో పలుకుబడి లేకుండా ఇలాంటిది సాధ్యం కాదు.

Banquet attended by Vladimir Putin, 11 Nov 2011

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 2011లో పుతిన్ వద్ద ప్రిగోజిన్

ప్రిగోజిన్, కదిరోవ్ ఎవరు?

ప్రిగోజిన్:

యెవ్జెనీ ప్రిగోజిన్‌ను మొదట్లో 'పుతిన్ వంటమనిషి' అనేవారు అందరూ. క్రెమ్లిన్‌లో అధికారిక కార్యక్రమాలకు ఆహారం, పానీయాలు ఆయన సరఫరా చేసేవారు.

రష్యాలో రెండో అతిపెద్ద నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి ప్రిగోజిన్ ప్రస్థానం మొదలైంది. అక్కడ ఆయన రెస్టారెంట్ల వ్యాపారం చేసేవారు.

1990లలో పుతిన్ అక్కడి మేయర్ కార్యాలయంలో పనిచేస్తున్న కాలం నుంచి ఇద్దరి మధ్య పరిచయం ఉందని చెప్తుంటారు. ఆ కాలంలో పుతిన్ తరచుగా ప్రిగోజిన్ రెస్టారెంటుకు వెళ్లేవారంటారు.

2010 నాటికి అనేక మీడియా ఇన్వెస్టిగేషన్ కథనాలలో ఆయన పేరు వినిపించేది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని 'ట్రోల్ ఫ్యాక్టరీ'గా పిలిచే వ్యవస్థతో ఆయనకు ఉన్న సంబంధాలున్నాయంటూ కథనాలు వచ్చేవి.

క్రెమ్లిన్ పాలన వ్యవస్థను సానుకూలంగా చూపించడం, రష్యా ప్రతిపక్షాల విశ్వసనీయత దెబ్బతీసే కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉంచడం ఈ వ్యవస్థ లక్ష్యం.

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. అందులో ఈ ట్రోల్ ఫ్యాక్టరీ పాత్ర కూడా ఉందని అమెరికా న్యాయవాది రాబర్ట్ మ్యూలర్ దర్యాప్తులో వెల్లడైంది. అయేత, ప్రిగోజిన్ మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తూ వచ్చారు. తనకు, ట్రోల్ ఫ్యాక్టరీకి ఎలాంటి సంబంధం లేదందటారాయన.

వాగ్నర్ గ్రూపుతో తనకున్న సంబంధాలనూ ఆయన ఖండిస్తూ వచ్చారు. 2014లో తూర్పు యుక్రెయిన్ కేంద్రంగా మొదలైన ఈ కిరాయి గ్రూప్ వాగ్నర్‌కు చెందిన ఫైటర్లు ఆ తరువాత సిరియా, వివిధ ఆప్రికా దేశాలలో కనిపించారు.

ఇటీవలే ఆయన వాగ్నర్ గ్రూపుతో తనకున్న సంబంధాలను అంగీకరించారు. యుక్రెయిన్ యుద్ధంలో అత్యంత ప్రభావవంతమైన యూనిట్లలో వాగ్నర్ గ్రూప్ కూడా ఒకటి.

సెయింట్ పీటర్స్‌బర్గ్ గవర్నర్ అలెగ్జాండర్ బెగ్లోవ్‌తో ప్రిగోజిన్‌కు చాలాకాలంగా వైరం ఉంది. అలెగ్జాండర్ బెగ్లోవ్ యుక్రెయిన్ సైన్యానికి సహకరిస్తున్నారంటూ ప్రిగోజిన్ ఆరోపణలు చేశారు.

కదిరోవ్:

పుతిన్ సన్నిహితులు కొందరు ఆయనకు అత్యంత విధేయులుగా ఉంటారు. అలాంటివారిలో చెచెన్ అధ్యక్షుడు రమ్జాన్ కదిరోవ్ ఒకరు.

1990లలో చెచెన్యా స్వాతంత్ర్యం కోసం పోరాడి విఫలమైంది. కదిరోవ్ పాలనలో చెచెన్ స్వాతంత్ర్య పోరాట ప్రయత్నాలన్నీ ఆగిపోయాయి. అక్కడ మానవ హక్కులన్నవే లేకుండాపోయాయి. కదిరోవ్ ప్రైవేట్ మిలీషియా కదిరోవ్‌త్సీ అకృత్యాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి.

కదిరోవ్ మొదటి నుంచి యుక్రెయిన్‌పై రష్యా దండయాత్రను పూర్తిగా సమర్థిస్తున్నారు. అంతేకాదు... యుక్రెయిన్‌పైకి తన కదిరోవ్‌త్సీ దళాలనూ పంపించారు. అత్యుత్తమ శిక్షణ పొందిన, అత్యంత ధైర్యవంతమైన, అత్యంత క్రూరమైన దళాలుగా వీటికి పేరుంది.

నిర్దాక్షిణమైనవిగా చెప్పే ఈ దళాలను 'టిక్ టాక్ ట్రూప్స్' అని కూడా అంటుంటారు. వీరు చేసే పోరాటం కంటే కూడా తాము చేసే దోపిడీలు, అరాచకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో ముందుంటారని చెప్తారు.

చెచెన్ సైన్యంలో చాలామంది అయిష్టంగా ఆ వృత్తిలోకి వచ్చారని.. వారి కుటుంబసభ్యలను తీవ్రంగా హింసించడం, బెదిరించడం వల్ల విధిలేని పరిస్థితులలో వారు సైన్యంలో చేరుతారని అక్కడి మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

కదిరోవ్‌కు పుతిన్ చల్లనిచూపులు ఉన్నాయనడానికి సూచన ఆయన్ను బ్రిగేడియర్ జనరల్ నుంచి కల్నల్ జనరల్‌గా పదోన్నతి కల్పించడమే.

Chechen fighters in Ukraine are known as Kadyrovtsi

ఫొటో సోర్స్, Kadyrov_95/Telegram

ఫొటో క్యాప్షన్, కదిరోవ్ సైన్యం

ఈ ఇద్దరూ ఎందుకంత ముఖ్యం

కదిరోవ్, ప్రిగోజిన్‌లు గతంలో ఎన్నడూ కలిసి పనిచేసిన దాఖలాలు కానీ, వారి మధ్య మైత్రి ఉన్న దాఖలాలు కానీ లేవు.

కానీ, కొన్నాళ్లుగా ఇద్దరూ ఒకే స్వరం వినిపిస్తున్నారు.

ప్రిగోజిన్ జన్మతః యోధుడని, ఆయన వాగ్నర్ సైనికులు ఏమాత్రం భయంలేని అసలైన దేశభక్తులని కదిరోవ్ కీర్తిస్తున్నారు.

ఇక ప్రిగోజిన్ కూడా కదిరోవ్‌ను మెచ్చుకుంటున్నారు. 'కదిరోవ్! మీరు జోరు మీదున్నారు' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.

ఈ ఇద్దరూ కలిసికట్టుగా రష్యా సైనిక వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. యుక్రెయిన్‌తో యుద్ధంలో వైఫల్యాలకు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, రక్షణ శాఖ ఉప మంత్రి, చీఫ్ ఆఫ్ ద జనరల్ స్టాఫ్ జననరల్ వాలరీ జెరాసిమోమ్‌లే బాధ్యులంటూ ఆరోపణలు చేస్తుంటారు. వారిని అవమానిస్తూ రష్యా ప్రభుత్వంలోని పెద్దలను మరింతగా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు కదిరోవ్, ప్రిగోజిన్‌లు.

కదిరోవ్ కానీ, ప్రిగోజిన్ కానీ ఎవరికి వారు అంత ప్రభావవంతమైనవారేమీ కారని, ఇద్దరికీ చెడ్డపేరే ఉందని విమర్శకులు అంటుంటారు. అయితే, ఇద్దరూ కలిస్తే పుతిన్ ఆంతరంగిక సర్కిళ్లలోని ప్రముఖులను కూడా వీరు సవాల్ చేయగలగొచ్చని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.

వీడియో క్యాప్షన్, కరెంటు, నీరు లేక ఇబ్బందులు పడుతున్న యుక్రెయిన్ ప్రజలు

రష్యాకు చెందిన రాజకీయ విశ్లేషకులు అబ్బాస్ గలియమోవ్ మాట్లాడుతూ.. 'కదిరోవ్, ప్రిగోజిన్‌ల తీరు చాలా అసాధారణంగా ఉంది. యుద్ధం చేస్తున్న దేశంలో ఇలాంటి తీరు ఆమోదయోగ్యం కాదు' అన్నారు.

వేర్వేరు మిలటరీ యూనిట్లకు చెందిన ముఖ్యులు కలిసికట్టుగా పనిచేయడం మానేసి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం నష్టం చేస్తుందన్నారు గలియమోవ్.

మరోవైపు 'అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్'కు చెందిన నిపుణులు రష్యాలో ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించారు. పుతిన్ సన్నిహిత బృందంలో రెండు వర్గాలున్నాయంటున్నారు.

యుద్ధాన్ని ఆపాలనేవారు, యుద్ధాన్ని కొనసాగించాలనేవారు ఆయన బృందంలో ఉన్నారని చెబుతున్నారు.

కదిరోవ్, ప్రిగోజిన్‌లు యుద్ధాన్ని ఎలాగైనా కొనసాగించాలని కోరుకుంటున్నారని.. పుతిన్‌కు కూడా అదే నచ్చడం వల్ల వారిని ప్రోత్సహిస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు.

(అదనపు రిపోర్టింగ్: ఆండ్రీ జఖరోవ్, ఇలియా బరబనోవ్)

వీడియో క్యాప్షన్, రష్యా ఆక్రమణ నుంచి విముక్తి పొందిన యుక్రేనియన్ గ్రామాలు ఎలా ఉన్నాయంటే.. - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)