కామికాజి డ్రోన్లు: 5 నిమిషాల్లో శత్రువును గుర్తించి, మట్టుపెట్టే ఈ ఇరాన్ డ్రోన్లను రష్యా, యుక్రెయిన్ వాడుతున్నాయా?

డ్రోన్

ఫొటో సోర్స్, Reuters

కీయెవ్‌లో పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా 'కామికాజి' రకం డ్రోన్లు ఉపయోగిస్తోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.

పేలుడు పదార్థాలను మోసుకెళ్లే ఈ డ్రోన్లు వాటిని పేల్చడంతో పాటు అవి కూడా ధ్వంసమవుతాయి.

ఇరాన్ తయారు చేసిన ఇలాంటి రకం 'షహీద్-136' డ్రోన్లను రష్యా సెప్టెంబర్ నుంచి వాడుతున్నట్లు అనుమానిస్తున్నారు.

ఈ రకం డ్రోన్లనే రష్యా 'జెరేనియం-2'గా పిలుస్తోంది. ఈ డ్రోన్లకు పేలుడు పదార్థాలున్న వార్ హెడ్లు అమర్చుతారు. లక్షిత ప్రాంతంపై ఇవి తిరుగుతూ దాడులకు కమాండ్స్ వచ్చేవరకు వేచిచూస్తాయి.

షహీద్-136 డ్రోన్ వెడల్పు రెండు రెక్కలతో కలిపి 8.2 అడుగులు ఉంటుంది. ఇవి రాడార్‌కు చిక్కడం చాలా కష్టం.

ఇలాంటి డ్రోన్లు రష్యా దగ్గర ఎన్ని ఉన్నాయనేది స్పష్టత లేనప్పటికీ వందల కొద్దీ డ్రోన్లను పంపించాలని ఇరాన్ అనుకుందని అమెరికా ఆరోపించింది.

కాగా ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.

డ్రోన్

యుక్రెయిన్‌‌కు ఎంత నష్టం కలిగించాయి

షహీద్-136 డ్రోన్‌ను రష్యా తొలిసారి సెప్టెంబర్ 13న ఉపయోగించిందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. ఖార్కీవ్ ప్రాంతంలోని కుపియాంస్క్‌ సమీపంలోని ఒక టార్గెట్‌పై ఇది దాడి చేసినట్లు చెబుతున్నారు.

ఆ తరువాత అక్టోబరులో యుక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో ఈ డ్రోన్లతో దాడులకు దిగినట్లు ఆరోపణలున్నాయి.

ఒడెసా, మికోలేవ్ ప్రాంతంలో వీటి శిథిలాలు కనిపించాయి.

అక్టోబరులో బిలా షెర్క్‌వా నగరంలో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలలో ఈ డ్రోన్లు దిగాయి.

క్రూయిజ్ మిసైళ్లకు బదులుగా రష్యా వీటిని ఉపయోగించడానికి కారణం ధర తక్కువగా ఉండడమేనని భావిస్తున్నారు.

వీటి ధర సుమారు 20 వేల డాలర్లు (సుమారు రూ. 16 లక్షలు) ఉంటుంది.

వీడియో క్యాప్షన్, తిరుమలలో డ్రోన్ ఎగరేయవచ్చా? శ్రీశైలంలో డ్రోన్లు ఎగరేసిందెవరు?

యుక్రెయిన్ ఎదుర్కోగలుగుతోందా

యుక్రెయిన్ సాయుధ బలగాలు 'యాంటీ ఎయిర్ మిసైల్స్', ఎలక్ట్రానిక్ జామింగ్ డివైస్‌'లను ఉపయోగించి ఈ డ్రోన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

యుక్రెయిన్‌లో చొరబడిన షహీద్-136 డ్రోన్లలో 60 శాతం డ్రోన్లను అడ్డుకున్నట్లు అక్టోబర్ ప్రారంభంలో ఆ దేశ సాయుధ బలగాలు ప్రకటించాయి.

అయితే, వాటిని కూల్చడం అంత సులభమేమీ కాదు.

'ఇవి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో వీటిని అడ్డుకోవడం సాధ్యం కాదు' అని మిలటరీ ఎక్స్‌పర్ట్ జస్టిన్ క్రంప్ 'బీబీసీ'తో చెప్పారు.

కామికాజి డ్రోన్లను యుక్రెయిన్ కూడా ప్రయోగిస్తోందా?

యుక్రెయిన్ ఇలాంటివి వినియోగిస్తున్నదీ లేనిదీ ఇంతవరకు స్పష్టత లేదు.

అయితే, పశ్చిమ క్రిమియాలో రష్యా మిలటరీ స్థావరాలపై ఇటీవల యుక్రెయిన్ జరిపిన దాడులలో, సెవాస్టపోల్ హార్బర్‌లో రష్యా నౌకలపై యుక్రెయిన్ చేసిన దాడులలో ఇలాంటి డ్రోన్లను ఉపయోగించి ఉంటారని నిపుణులు అనుమానిస్తున్నారు.

లండన్ కింగ్స్ కాలేజ్‌లొని డిఫెన్స్ స్టడీస్ రీసెర్చర్ డాక్టర్ మెరీనా మిరన్ దీనిపై మాట్లాడుతూ... ఈ దాడులను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ చిన్నచిన్న దాడులేనని అర్థమవుతుంది.. ఇవన్నీ యుక్రెయిన్ స్వదేశీ తయారీ డ్రోన్ల సహాయంతో చేసి ఉండొచ్చు అన్నారు.

డ్రోన్

యుక్రెయిన్, రష్యా దగ్గర ఉన్న మిగతా డ్రోన్లు ఎలాంటివి

యుక్రెయిన్ దగ్గర ఉన్న ప్రధానమైన మిలటరీ డ్రోన్ బయ్రాక్తార్ టీబీ-2. ఈ టర్కీ తయారీ డ్రోన్లు చిన్న సైజ్ విమానంలా ఉంటాయి. దీనికి ఆన్‌బోర్డ్ కెమేరాలుంటాయి. లేజర్ గైడెడ్ బాంబులు దీనికి అమర్చుకోవచ్చు.

యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి యుక్రెయిన్ వద్ద ఇలాంటివి 50 వరకు ఉండేవని 'రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్'కు చెందిన డాక్టర్ జాక్ వాట్లింగ్ చెప్పారు.

మరోవైపు యుక్రెయిన్‌కు 700 స్విచ్ బ్లేడ్ డ్రోన్లు పంపుతున్నట్లు అమెరికా చెప్పింది. ఇవి కూడా కామికాజి తరహా డ్రోన్లే.

రష్యా ఓర్లాన్-10 అనే చిన్నతరహా డ్రోన్లను వాడుతుంది. వీటికి కూడా కెమేరాలు ఉంటాయి. చిన్నమొత్తాల్లో పేలుడు పదార్థాలు, బాంబులను మోసుకెళ్లే సామర్థ్యం వీటికి ఉంటుంది.

డ్రోన్లు

ఫొటో సోర్స్, EPA

మిలటరీ డ్రోన్లను ఎలా వాడుతున్నారు

శత్రువుల లక్ష్యాలను గుర్తించి అక్కడకు పేలుడు పదార్థాలను పంపించేందుకు యుక్రెయిన్, రష్యా రెండు దేశాలు కూడా ఈ డ్రోన్లను విరివిగా వాడుతున్నాయి.

'రష్యా తన లక్ష్యాన్ని గుర్తించిన తరువాత 3 నుంచి 5 నిమిషాలలో ఓర్లాన్-10 డ్రోన్ సహాయంతో అక్కడికి తుపాకులను పంపించగలదు' అని డాక్టర్ వాట్లింగ్ చెప్పారు. డ్రోన్‌ సహాయం లేకుంటే దాడి చేయడానికి కీనసం 20 నుంచి 30 నిమిషాలు పడుతుందని వాట్లింగ్ చెబుతున్నారు.

పరిమిత బలగాలున్న యుక్రెయిన్ తన పోరాటాన్ని కొనసాగించడంలో డ్రోన్ల పాత్ర ఉందని డాక్టర్ మెరీనా మిరన్ అభిప్రాయపడ్డారు.

'ఇంతకుముందు శత్రు స్థావరాల గుట్టుమట్లు, బలగాల పొజిషన్ తెలుసుకోవాలంటే ప్రత్యేక బలగాలను పంపించాల్సి ఉండేది. అలాంటి సమయాలలో బలగాలకు నష్టం జరిగేది కూడా. కానీ, ఇప్పుడు డ్రోన్లతో పని పూర్తవుతోంది. మహా అయితే ఒక డ్రోన్‌ను నష్టపోతారు అంతే' అంటూ మారిన యుద్ధ రీతిని వివరించారు మిరన్.

గత కొద్దిరోజులుగా యుక్రెయిన్ బయ్రాక్తార్ డ్రోన్లను వినియోగిస్తోంది. అయితే, పరిమాణంలో పెద్దవిగా ఉంటూ నెమ్మదిగా సాగే ఈ డ్రోన్లను రష్యా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో ఎదుర్కోగలుగుతోంది.

డీజేఐ మావిక్-3

నాన్ మిలటరీ డ్రోన్లను ఎలా వినియోగిస్తున్నారు?

మిలటరీ డ్రోన్ల ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. ఒక బయ్రాక్తార్ టీబీ-2 ఖరీదు 20 లక్షల డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) వరకు ఉంటుంది.

కాబట్టి రెండు దేశాలూ ప్రత్యామ్నాయంగా చిన్నచిన్న డ్రోన్లను వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా యుక్రెయిన్ డీజేఐ మావిక్-3 వంటి చిన్నతరహా, వాణిజ్య డ్రోన్లను యుద్ధంలో వినియోగిస్తోంది. వీటి ధర 1700 పౌండ్లు (రూ. 1.5 లక్షలు) ఉంటుంది.

ఇలాంటి వాణిజ్య డ్రోన్లకు చిన్న బాంబులను అమర్చి శత్రు లక్ష్యాలకు గురిపెడుతున్నారు. అయితే, మిలటరీ డ్రోన్లతో పోల్చితే వాణిజ్య డ్రోన్ల సామర్థ్యం చాలా తక్కువ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)