‘అఫ్గాన్ మాజీ సైనికులను రష్యా కిరాయికి వాడుకుంటోంది’- అఫ్గాన్ మాజీ జనరల్

రష్యా-యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

అఫ్గాన్ సైన్యం కోసం శిక్షణ పొందిన కమాండోలను యుక్రెయిన్, సిరియా యుద్ధాల్లో ఉపయోగిస్తున్నారని అఫ్గానిస్తాన్ మాజీ జనరల్ ఫరీద్ అహ్మదీ వెల్లడించారు.

గత ఏడాది అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు వశం చేసుకున్నారు. దీనికంటే ముందు అఫ్గాన్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ ఇన్‌చార్జిగా జనరల్ ఫరీద్ అహ్మదీ పని చేశారు. ఆయన పర్యవేక్షణలో ఆర్మీకి చెందిన వేలాదిమంది జవాన్లు పనిచేశారు.

బీబీసీ అఫ్గాన్ సర్వీస్‌కు చెందిన ఖలీల్ నూరీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. గతంలో అఫ్గాన్ సైన్యంలో పనిచేసిన సైనికులను బ్రోకర్లు సంప్రదిస్తున్నారని ఆయన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రష్యా తరఫున యుక్రెయిన్‌లో, ఇరాన్ తరఫున సిరియాలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్న మాజీ సైనికులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ అంశంపై రష్యా అధికారులు గానీ, యుక్రెయిన్ అధికారులు గానీ ఇప్పటివరకు స్పందించలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

''ఇది దురదృష్టకరం. కానీ, ఇది నిజం. అఫ్గానిస్తాన్‌ మాజీ కమాండోలు ప్రపంచంలోని కనీసం ఆరు ప్రదేశాల్లోని యద్ధాల్లో పాల్గొంటున్నారు. ఇరాన్, సిరియా, నాగొర్నో-కరాబాఖ్, యుక్రెయిన్-రష్యా వంటి ప్రదేశాల్లో వారు పనిచేస్తున్నారు'' అని జనరల్ ఫరీద్ అహ్మదీ చెప్పారు.

కొన్ని చోట్ల యుద్ధ క్షేత్రాల్లో అఫ్గాన్ మాజీ సైనికులే ఫ్రంట్ లైన్‌లో పనిచేస్తున్నారని తెలిపారు.

''అఫ్గాన్ మాజీ సైనికులు ఎంతమంది యుద్ధాల్లో పాల్గొంటున్నారనే కచ్చితమైన సంఖ్య అందుబాటులో లేదు. ఎందుకంటే ఈ విషయాన్ని వారు దాచిపెడుతున్నారు. కానీ అందులో చేరాలంటే పేర్లు రాయాల్సి ఉంటుంది. తాలిబాన్ జైళ్లలో శిక్షను అనుభవించిన తక్కువ ర్యాంకు సైనికులు, జనరల్స్ ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు. లేదా పొరుగు దేశాలకు వెళ్లిపోతున్నారు. వారికి మంచి జీవితం, డబ్బు, వీసాలు అందిస్తున్నారు'' అని ఆయన తెలిపారు.

ఎలాంటి ప్రలోభాలకు గురి కావొద్దని, యుద్ధాల్లో పాల్గొనవద్దని ఆయన మాజీ సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

''ఎట్టి పరిస్థితుల్లోనూ మాజీ సైనికులు ఇలాంటి పనులు చేయకూడదనేది నా అభిప్రాయం. అది వన్‌ వే ప్రయాణం లాంటిది. వారు వెళ్తున్న చోటు నుంచి వారే కాదు కనీసం వారి శవపేటిక కూడా తిరిగి రాలేదు'' అని ఫరీద్ హెచ్చరించారు.

అయితే, యుద్ధంలో చేరాలంటూ మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా అని అడగగా, తన వద్దకు ఎటువంటి ఆఫర్ రాలేదని ఆయన చెప్పారు.

రెబెక్కా కోఫ్లర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెబెక్కా కోఫ్లర్

అమెరికా స్పందన

యుక్రెయిన్ యుద్ధంలో రష్యా, అఫ్గాన్ మాజీ సైనికులను ఉపయోగించుకునే ప్రయత్నం గురించి వస్తోన్న నివేదికలను తాను చూస్తున్నానని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పినట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది.

ఈ అంశం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని అధికార ప్రతినిధి అన్నారు.

రెబెక్కా కోఫ్లర్, అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో స్ట్రాటజిక్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్నారు.

''అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా నిష్క్రమణతో వేలాదిమంది సైనికులు, ట్రాన్స్‌లేటర్లు, స్థానికులు దేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది. అందులో చాలామంది పొరుగు దేశాల్లో శరణార్థులుగా మారారు.

నిఘా వర్గాల సమాచారం ప్రకారం, రష్యా కోసం అఫ్గాన్ శరణార్థులు పోరాడేందుకు ఇరాన్ సహాయం చేస్తోంది' అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, రష్యా ఆక్రమణ నుంచి విముక్తి పొందిన యుక్రేనియన్ గ్రామాలు ఎలా ఉన్నాయంటే.. - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్..

కిరాయి సైనికులుగా అఫ్గాన్ మాజీ సైనికులు

మాజీ సైనికులకు ఇస్తున్న ఆఫర్లలో వారి కుటుంబాలను సురక్షిత స్థానాలకు తరలించడం కూడా ఉందని బీబీసీ దక్షిణాసియా వ్యవహారాల ప్రతినిధి అన్‌బరాసన్ ఎథిరాజన్ చెప్పారు.

ఈ అంశంపై రష్యా ఇప్పటివరకు స్పందించలేదు.

అఫ్గాన్ ప్రభుత్వం పతనానికి ముందు మాజీ జనరల్ ఫరీద్ అహ్మదీ ఒక బాంబు దాడిలో గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన అఫ్గాన్ బయటే నివసిస్తున్నారు.

కొంతమంది మాజీ సైనిక అధికారులు తనకు ఫోన్ చేసి డబ్బు కోసం వేరే దేశ సైన్యంలోకి వెళ్లాలా వద్దా అనే విషయంలో తన అభిప్రాయం అడిగారని ఆయన చెప్పారు.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం... సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అనుకూల గ్రూపులకు మద్దతుగా పోరాడుతూ సిరియాలో రెండు వేల మందికి పైగా అఫ్గాన్ పౌరులు మరణించారు.

హైబతుల్లా

అఫ్గాన్ సైనికులను రష్యా కిరాయి సైనికులుగా ఉపయోగిస్తోందని పేర్కొంటూ ఈ ఏడాది అక్టోబర్‌లో వార్ జోన్ అనే వెబ్‌సైట్ ఒక నివేదికను ప్రచురించింది.

స్పెషల్ ఆపరేషన్ బలగాలకు చెందిన 5000 మంది అఫ్గాన్ మాజీ సైనికులకు రష్యా చేర్చుకున్నట్లు హైబతుల్లా అలీజా చెప్పినట్లు ఈ నివేదిక పేర్కొంది. వీరంతా గత ఏడాది ఇరాన్ వెళ్లిపోయినట్లు తెలిపింది. తాలిబాన్లు అధికారంలోకి రాకముందు అఫ్గానిస్తాన్ మాజీ కమాండర్‌గా హైబతుల్లా పనిచేశారు.

ఈ నివేదిక ప్రకారం, ఇరాన్‌లో ఉన్న అఫ్గాన్ మాజీ సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. వీరిలో కొంతమంది ఇప్పటికే యుక్రెయిన్ చేరుకున్నారు.

అమెరికాతో పాటు మిత్రదేశాల బలగాలు అఫ్గానిస్తాన్‌ నుంచి వెళ్లిపోయిన తర్వాత వారి వద్ద శిక్షణ పొందిన దాదాపు 30 వేల మంది సైనికులు అక్కడే మిగిలిపోయారని అక్టోబర్‌లో ఫారిన్ పాలసీ వెబ్‌సైట్‌లో ఒక నివేదికను ప్రచురించారు.

ఈ సైనికుల్లో కొంతమందిని దేశం నుంచి వెళ్లగొట్టారని, చాలామంది పొరుగు దేశాలకు పారిపోయారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఇలాంటి సైనికులకు ఇప్పుడు ఎలాంటి ఉద్యోగం లేదు, మంచి జీవితం దొరుకుతుందనే ఆశ కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వీరిని రష్యా సులువుగా తమ సైన్యంలో చేర్చుకుంటోందని ఆ నివేదిక పేర్కొంది.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌పై యుద్ధాన్ని సమర్థించుకున్న పుతిన్ - ముందున్నది ప్రమాదకర దశాబ్దమంటూ హెచ్చరిక

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)