Munugodu: కోమటిరెడ్డి రూ. 18,000 కోట్ల కాంట్రాక్టు కోసమే బీజేపీలో చేరారా, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఆరోపణలేంటి, కోమటిరెడ్డి జవాబేంటి?

ఆపరేషన్ బొగ్గు పేరుతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ విడుదల చేసిన పోస్టర్

ఫొటో సోర్స్, Congress Party

ఫొటో క్యాప్షన్, ఆపరేషన్ బొగ్గు పేరుతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ విడుదల చేసిన పోస్టర్
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కుటుంబ సభ్యులకు దక్కిన భారీ బొగ్గు గని కాంట్రాక్టుకూ, ఆయన బీజేపీలో చేరడానికి ప్రత్యక్ష సంబంధం ఉందని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఆ మేరకు అనేక పత్రాలను, రాజగోపాల రెడ్డి కుమారుడి కంపెనీ కోల్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందాలను బయటపెట్టింది.

కాంగ్రెస్ నాయకులు మధు యాష్కీ గౌడ్ 'ఆపరేషన్ బొగ్గు' పేరుతో పలు పత్రాలు బయట పెట్టారు. అయితే, అటు కాంగ్రెస్ నుంచి, ఇటు టీఆర్ఎస్ నుంచి వస్తున్న ఆరోపణలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొడుకు సంకీర్త్ రెడ్డి తప్పుబట్టారు. తమ కంపెనీ దశాబ్దాలుగా వ్యాపారంలో ఉందని, తమకు దక్కిన టెండర్లన్నీ పారదర్శకంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ విడుదల చేసిన పత్రాల ప్రకారం, 2021 డిసెంబరు 20వ తేదీన ఝార్ఖండ్ రాష్ట్రంలోని చంద్రగుప్త ఓసీపీ బొగ్గు గనిని సుషీ ఇన్ఫ్రా & ఎంఆర్కేఆర్ కన్సార్టియంకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కోల్ ఇండియాకు చెందిన సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ లేఖ పంపించింది.

చంద్రగుప్త గని నిర్వహణ, అభివృద్ధికి టన్ను బొగ్గుకు రూ. 538.29 చొప్పున కేటాయించింది. మొత్తం 18 వేల 264 కోట్ల 17 లక్షల 97 వేల రూపాయలు విలువైన బొగ్గును జీఎస్టీ లేకుండా కేటాయించింది. 2022 ఫిబ్రవరి 24న దీనికి ఒప్పందం జరిగింది. కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి సమక్షంలో అడ్ల జైపాల్ రెడ్డి దీనిపై సంతకం చేశారు. ఝూర్ఖండ్ రాష్ట్రంలోని హజీరాబాగ్ జిల్లాలో ఉత్తర కరణ్ పురా కోల్ ఫీల్డ్స్‌లో ఈ గని ఉంది.

కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి

ఫొటో సోర్స్, CHANDRAGUPTA COAL MINE

ఈ కాంట్రాక్టు దక్కించుకున్న కన్సార్టియంలో కంపెనీలు, వాటి వాటాదార్లు

1. సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ - ఈ కంపెనీ టెండర్ దక్కించుకునే నాటికి అందులో కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి, కుమారుడు సంకీర్త్ రెడ్డిలకు 99.99 శాతం వాటా ఉండగా, మరో ఐదుగురు డైరెక్టర్లకు 00.01 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ కన్సార్టియంలో ప్రధాన మెంబర్.

2. సుషీ చంద్రగుప్త కోల్‌మైన్ ప్రైవేట్ లిమిటెడ్ - ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి తో పాటూ, మేడా మధుసూదన రెడ్డి, అడ్ల జైపాల్ రెడ్డి అనే ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. ఇది 2022 ఫిబ్రవరిలోనే ప్రారంభం అయిన కంపెనీ.

3. ఎంఆర్కేఆర్ కనస్ట్రక్షన్ అండ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో ఇతరులు ఉన్నారు.

"కోల్ ఇండియా టెండర్ పత్రాల్లో ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా విలువ రూ. 3,437 కోట్లుగా పేర్కొన్నారు. కానీ కేటాయించిన బొగ్గు విలువ 18 వేల 264 కోట్ల రూపాయిలు. అంటే 520 శాతం రాబడి గ్యారెంటీ ఇచ్చారు. అంతేకాదు, 2020 జూన్ 30వ తేదీన మొదటి టెండర్ విడుదల అయినప్పుడు ఇది ఆదానీ గ్రూపుకు దక్కింది. తరువాత దాన్ని రద్దు చేసి కోమటిరెడ్డి కంపెనీకి అప్పగించారు. టెండర్ ప్రక్రియ రాజగోపాల్ కంపెనీకి అనుకూగలంగా మారడం, ఆయన బీజేపీ వైపు మొగ్గడం దాదాపు ఒకేసారి జరిగాయి" అని కాంగ్రెస్ నాయకుడే మధు యాష్కీ విడుదల చేసిన పత్రాల్లో ఆరోపించారు.

కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి

ఫొటో సోర్స్, CONGRESS

"2018-19, 2019-20 ఆర్థిక సంసత్సరాల్లో సుషీ ఇన్‌ఫ్రా నష్టాల్లో ఉన్నట్టు రికార్డులు ఉన్నాయి. ఆ సంస్థ రూ.33 కోట్ల డిఫాల్టర్‌గా ఉన్నట్టు కోల్‌కతా హైకోర్టులో కేసు ఉంది. నష్టాల్లో ఉన్న కంపెనీకి అంత భారీ కాంట్రాక్టు ఎలా వస్తుంది?" అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

మొత్తానికి 2022 మార్చి 19న బొగ్గు గనుల కేటాయింపులపై రాజగోపాల రెడ్డి కంపెనీ కోల్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. అది జరిగిన 3 రోజులకు తాను పార్టీ మారతానని రాజగోపాల రెడ్డి ప్రకటించారని మధుయాష్కి పేర్కొన్నారు.

"2021 జనవరి నుంచి డిసెంబరు వరకూ చర్చలు జరుపుకున్నారు. 2022 జనవరి నుంచి 2022 జూలై వరకూ రాజకీయ దోబూచులాట జరిగింది. చివరగా ఆగస్టులో ఆయన పార్టీ మారారు" అంటూ కాంగ్రెస్ ఆరోపించింది.

కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి

ఫొటో సోర్స్, Sankeerth Reddy/Twitter

అయితే ఈ అంశంపై సుషీ ఇన్‌ఫ్రా ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. "చంద్రగుప్త కోల్ మైన్ కోసం 2020 జూన్‌లో మొదటి గ్లోబల్ టెండర్ విడుదల అయింది. అప్పుడు తక్కువ కోట్ చేసిన సంస్థ ఆదానీ గ్రూపు. కానీ ఆ ధరలు ఎక్కువగా ఉన్నాయని భావించిన కోల్ ఇండియా ఆ టెండర్ రద్దు చేసింది. తిరిగి 2021 ఫిబ్రవరిలో మరోసారి టెండర్లు పిలిచింది. అందులో ఆదానీ, మోంటెకార్టో సంస్థల కంటే సుషీ కన్సార్టియం తక్కువ ధరకు కోట్ చేసింది" అని ఆ ప్రకటనలో వివరణ ఇచ్చారు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి.

"పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఇచ్చే గ్లోబల్ టెండర్లు చాలా పారదర్శకంగా జరుగుతాయి. ఇందులో బయటి, పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ కు తావులేదు. కొందరు చిల్లర రాజకీయాల కోసం మా కంపెనీ మీద, కోల్ ఇండియా మీద ఆరోపణలు చేస్తున్నారు. వారిపై పరువు నష్టం దావా వేస్తాం. మాకు ఈ వర్క్ పారదర్శకమైన పద్ధతిలో మా సామర్థ్యాలను బట్టి వచ్చింది. దయచేసి రాజకీయ పార్టీల ప్రచారాన్ని నమ్మవద్దని మునుగోడు ఓటర్లను కోరుతున్నాం" అని ప్రకటనలో పేర్కొన్నారు సంకీర్త్ రెడ్డి.

తమ కంపెనీ పాతికేళ్లుగా మైనింగ్ లో ఉందని, కోల్ ఇండియా కాంట్రాక్టులు నామినేషన్ పద్ధతిలో ఇవ్వరని, మరో సందర్భంలో కేటీఆర్‌ను ట్యాగ్ చేసి ట్విట్టర్లో ప్రకటించారు సంకీర్త్ రెడ్డి.

ఈ కాంట్రాక్టు క్విడ్ ప్రో కో అని ట్విట్టర్లో కేటీఆర్ ఆరోపించగా, ఆ ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలని, లేదంటే పరువు నష్టానికి సిద్ధంగా ఉండాలని రాజగోపాల రెడ్డి బదులిచ్చారు.

కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి

ఫొటో సోర్స్, RAJGOPALREDDY/Twitter

అదే కంపెనీ టార్గెట్‌గా టీఎర్స్ ఫిర్యాదు

మరోవైపు ఇదే సుషీ ఇన్‌ఫ్రా కంపెనీపై టీఆర్ఎస్ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అక్టోబరు 29వ తేదీన టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదు ప్రకారం, సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ కంపెనీకి చెందిన వివిధ బ్యాంకు అకౌంట్ల నుంచి మొత్తం 5 కోట్ల 22 లక్షల రూపాయలు మునుగోడులోని పలువురు బీజేపీ కార్యకర్తలకు వెళ్లినట్లు టీఆర్ఎస్ ఆరోపించింది.

"ఓట్లు కొనడం కోసం మొత్తం 23 మందికి డబ్బు బదిలీ చేశారు" అని టీఆర్ఎస్ పార్టీ తన ఫిర్యాదులో ఆరోపించింది.

కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి

ఫొటో సోర్స్, CONGRESS

టీఆర్ఎస్ ఆరోపణలు ఇవి:

1. అక్టోబరు 29న సుషీ ఇన్‌ఫ్రాకు చెందిన పుత్లిబౌలి ఎస్‌బీఐ బ్రాంచిలోని 238 తో ఎండ్ అయ్యే అకౌంట్ నుంచి కోటి రూపాయలు కంపాస్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన బంజారాహిల్స్ ఐసీఐసీఐ బ్రాంచిలోని 323తో ఎండ్ అయ్యే అకౌంట్‌కు వెళ్లాయి. అక్కడి నుంచి మునుగోడు సెంట్రల్ బ్యాంకు అకౌంట్ ఉన్న ఇద్దరికి, కెనరా బ్యాంకు అకౌంట్‌కి 78 లక్షలు వెళ్లాయి.

2. అదే పుత్లిబౌలి బ్రాంచ్ నుంచి అక్టోబరు 18వ తేదీన మరో మూడు అకౌంట్లకు కోటిన్నర వెళ్లాయి.

3. అక్టోబరు 14న అదే బ్రాంచి నుంచి 17 మందికి డబ్బు వెళ్లాయి. టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదు ప్రకారం, ఈ డబ్బు వెళ్లిన వివిధ బ్యాంకుల బ్రాంచీలన్నీ చౌటుప్పల్, పంతంగిలలోనే ఉన్నాయి. ఇందులో 16 అకౌంట్లకు 16 లక్షల చొప్పున వెళ్లగా, చౌటుప్పల్ యూనియన్ బ్యాంకులోని ఒక అకౌంట్‌కు మాత్రం 40 లక్షలు వెళ్లాయి.

కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి

ఫొటో సోర్స్, TRS

కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి

ఫొటో సోర్స్, TRS

"సుషీ కంపెనీ నుంచి డబ్బు పొందిన వీరంతా ఏ రకంగానూ ఆ సంస్థతో వ్యాపార లావాదేవీలు ఉన్నవారు కాదు. వాళ్లంతా మునుగోడు నియోజకవర్గానికి చెందిన వారే. తక్షణం ఈ అకౌంట్లలో డబ్బు సీజ్ చేయాలి. ఇది ఓట్లు కొనడానికి ఉద్దేశించిన డబ్బే" అని తన లేఖలో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఆరోపించారు .

"అయితే ఈ ఆరోపణలు అవాస్తవాలు, అటువంటి లావాదేవీలు ఏవీ జరగలేదు" అని సంకీర్త్ రెడ్డి ట్విట్టర్లో ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదుపై బీజేపీ అభ్యర్థి రాజగోపాల రెడ్డికి ఇప్పటికే ఎన్నికల సంఘం నోటీసు పంపింది. సమాధానం కోరింది. దీనిపై బీబీసీ రాజగోపాల రెడ్డి కార్యాలయాన్ని సంప్రదించింది. సమాధానం రావాల్సి ఉంది.

వీడియో క్యాప్షన్, మునుగోడు: డబ్బు, మద్యం ఏరులుగా పారుతున్నాయి.. కానీ తాగు నీరు, సాగు నీరు మాత్రం లేవు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)