Rahul Gandhi: 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 16 రోజులు, 375 కిలోమీటర్లు.. తెలంగాణలో ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభం

వీడియో క్యాప్షన్, తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీని కలిసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
    • రచయిత, సతీశ్ బళ్ల
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ (ఆదివారం) తెలంగాణాలో ప్రవేశించింది.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగుతున్న ఈ యాత్రలో ఐదో రాష్ట్రం తెలంగాణ కాగా, తెలంగాణలోనే యాత్ర 1500 కిలోమీటర్ల మార్కును దాటనుంది.

ఆదివారం ఉదయం కర్ణాటకలోని రాయచూర్ నుంచి ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గంటలకు యాత్ర ప్రారంభమైంది.

రాయచూర్ నుంచి కొన్ని గంటల్లోనే యాత్ర తెలంగాణ సరిహద్దుల్లోకి ప్రవేశించింది.

కృష్ణా నది కర్ణాటక - తెలంగాణ సరిహద్దు కావడంతో, కృష్ణా వంతెన మీద నుంచే తెలంగాణ రాష్ట్రంలోకి రాహుల్ కి ఘన స్వాగతం చెప్పడానికి భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ కాంగ్రెస్.

సరిహద్దుల్లోని గూడబెల్లూరు అనే గ్రామంలో యాత్రకు అల్పాహార విరామం ఉంటుంది.

bharat jodo yatra

ఫొటో సోర్స్, congress

దీపావళి సందర్భంగా విరామం

అల్పాహారం తరువాత, యాత్ర గూడబెల్లూరులో మూడు రోజులు ఆగుతుంది. తిరిగి 27 తేది గురువారం ఉదయం గూడబెల్లూరు నుంచే యాత్ర ప్రారంభం అవుతుంది.

దీపావళి పెద్ద పండుగ కావడంతో మొదటి నుంచీ యాత్రలో పాల్గొనే వారికి సెలవు, విశ్రాంతి కోసం, స్థానికంగా ఏర్పాట్లకు ఇబ్బంది లేకుండా చూడడం కోసం, తెలంగాణలో యాత్రలో పాల్గొనాలనుకునే వారికి ఆటంకం లేకుండా - ఈ కారణాలతో యాత్రకు దీపావళి బ్రేక్ ఇచ్చారు.

Rahul Gandhi

ఫొటో సోర్స్, Telangana Congress

16 రోజులు - 19 నియోజకవర్గాలు

16 రోజుల పాటూ తెలంగాణలో ఉండే రాహుల్, 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా మొత్తం 375 కిలోమీటర్లు నడుస్తారు.

నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశిస్తారు. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒకరోజు సాదారణ బ్రేక్ ఉంటుంది.

12 రోజులు యాత్ర ఉంటుంది. పాదయాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో మీటింగులు ఏర్పాటు చేసింది కాంగ్రెస్.

రోజుకు సగటున 20 నుండి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర ఉంటుంది.

రాహుల్ యాత్ర హైదరాబాద్ మీదుగా వెళుతుంది. బోయినపల్లిలో నైట్ హాల్ట్ ఉంటారు. నెక్లెస్ రోడ్ లో సభ ఏర్పాటు చేశారు.

rahul gandhi, revanth reddy

ఫొటో సోర్స్, Revanthreddy

యాత్ర సాగే నియోజకవర్గాలు (నడిచే క్రమంలో):

అసెంబ్లీ నియోజకవర్గాలు

1. మక్తల్

2. నారాయణ్ పేట్

3. దేవరకద్ర

4. మహబూబ్ నగర్

5. జడ్చర్ల

6. షాద్ నగర్

7. రాజేంద్ర నగర్

8. బహుదూర్ పుర

9. చార్మినార్

10. గోషా మహల్

11. నాంపల్లి

12. ఖైతరాబాద్

13. కూకట్ పల్లి

14. శేరిలింగపల్లి

15. పఠాన్ చెఱువు

16. సంగారెడ్డి

17. ఆందోల్

18. నారాయణ్ ఖేడ్

19. జుక్కల్

పార్లమెంటు నియోజకవర్గాలు:

1. మహబూబ్ నగర్

2. చేవెళ్ల

3. హైదరాబాద్

4. సికింద్రాబాద్

5. మల్కాజిగిరి

6. మెదక్

7. జహీరాబాద్

Rahul Gandhi

ఫొటో సోర్స్, Telangana congress

హైదరాబాద్‌లో

రాహుల్ పాదయాత్రలో పెద్ద నగరం హైదరాబాదే. హైదరాబాద్లో ఆరాంఘర్, చార్మినార్, మోజాంజాహి మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరువు మీదుగా సాగుతుంది.

యాత్రలో తెలంగాణలో విద్యావంతులు, వివిధ సంఘాల నాయకులు, వివిధ వర్గాలు, మత - కుల పెద్దలు, రాజకీయ, క్రీడా, వ్యాపార, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు.

యాత్ర కోసం అనేక కమిటీలు నియమించి, విస్తృత ఏర్పాట్లు చేసింది తెలంగాణ కాంగ్రెస్. సమావేశాలకూ, యాత్రకూ భారీ జన సమీకరణ చేపట్టింది.

bharat jodo yatra

కీలక సమయం

తెలంగాణలో కాంగ్రెస్ కి ఇది కీలక సమయం. తెలంగాణలో రాహుల్ యాత్ర సాగినంత కాలమూ, అక్కడ మునుగోడు చర్చ ఉంటూనే ఉంటుంది.

మునుగోడు ఫలితం వచ్చిన తరువాతే తెలంగాణలో రాహుల్ యాత్ర పూర్తవుతుంది. మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. కానీ ఆ సీటును కాంగ్రెస్ ఎంత వరకూ నిలబెట్టుకుటుంది అనే విషయంలో అనేక ఊహాగానాలు ఉన్నాయి.

2014 తరువాత కూడా కాంగ్రెస్ కు అత్యంత బలం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కానీ క్రమంగా బీజేపీ ఆ బలాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.

కాంగ్రెస్ నాయకుల మధ్య ఉండే గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి పెద్ద గుదిబండగా మారాయి.

దక్షిణాదిన కేరళ, కర్ణాటక, తెలంగాణ - మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమైన పార్టీగా, ప్రస్తుతానికి ప్రతిపక్ష పార్టీగా ఉంది కాంగ్రెస్. కానీ కేరళ, కర్ణాటకతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి తక్కువ ఆశాజనకంగా ఉంది.

రాహుల్ తన యాత్ర జాతీయ సమైక్యత, మతాల మధ్య కొట్లాటలు లేకుండా చూడడం, కులాల మధ్య వివక్ష లేకుండా చూడడం - అన్నిటికీ మించి బీజేపీ విద్వేష, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా అని చెబుతున్నారు.

ఎన్నికల రాజకీయాల గురించి కాకుండా, ఇతర అంశాల గురించి మాట్లాడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

కానీ తెలంగాణ రాహుల్ యాత్ర వెళ్తున్నంత కాలం, ఆయన చెప్పిన అంశాల కంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు - అనే అంశంపైనే ఎక్కువ చర్చ జరుగుతుంది.

ఈ యాత్ర పార్టీకి కొత్త ఉత్సాహం ఇస్తుందేమో కానీ, ఆ పార్టీని పట్టి వెనక్కు లాగుతున్న గ్రూపు రాజకీయాల తీవ్రతను తగ్గిస్తుందా అనేది ప్రశ్న.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)