లులా డ సిల్వా: కార్ల ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి దేశాధ్యక్షుడిగా, ఆపై కరప్షన్ ఖైదీగా, మళ్లీ దేశాధినేతగా మారిన నాయకుడు

లులా డ సిల్వా

ఫొటో సోర్స్, Getty Images/Rueters

సరిగ్గా 20 ఏళ్ల కిందట తొలిసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డి సిల్వా.. అధికారం కోల్పోయిన తర్వాత అవినీతి ముద్రతో జైలుకు వెళ్లి, బయటకు వచ్చి రాజకీయ పోరాటంలో మళ్లీ అధ్యక్షుడిగా గెలిచారు.

ఆదివారం (అక్టోబర్ 30వ తేదీ) జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ నేత లులా డ సిల్వా.. లేబర్ పార్టీ నేత జెయిర్ బొల్సొనారాను ఓడించారు.

లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా.. 1945లో ఈశాన్య బ్రెజిల్‌లో ఓ పేద కుటుంబంలో పుట్టారు. ఆయన ఏడేళ్ల వయసులో ఉండగా.. చాలా బ్రెజిల్ పేద కుటుంబాల లాగానే వారి కుటుంబం పని వెదుక్కుంటూ సావో పౌలోకు వలస వచ్చింది.

పదేళ్ల వయసు వచ్చే వరకూ లులా చదువుకోలేదు. ఆయన 14 ఏళ్ల వయసులో సావో పౌలో శివార్లలో ఓ కార్ల కర్మాగారంలో లోహ కార్మికుడిగా పనికి కుదిరాడు. 1960లలో ఫ్యాక్టరీలో జరిగిన ఒక ప్రమాదంలో ఆయన తన చేతి చిటికెన వేలును పోగొట్టుకున్నారు.

ఆయన మొదటి భార్య 1969లో హెపటైటిస్‌తో చనిపోయారు. అప్పటివరకూ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని లులా, ఆ మరుసటి ఏడాది కార్మిక రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1975లో లక్ష మంది సభ్యులున్న మెటల్ వర్కర్స్ యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు.

లులా డ సిల్వా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లులా తొలిసారి 2002లో బ్రెజిల్ అధ్యక్షుడిగా గెలవటానికి ముందు మూడుసార్లు ఆ పదవికి పోటీపడి ఓడిపోయారు

అప్పటివరకూ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న కార్మిక సంఘాలను బలమైన స్వతంత్ర్య ఉద్యమంగా మలిచారు. 1970లలో బ్రెజిల్ సైనిక పాలకులను ధిక్కరిస్తూ వేతనాల పెంపు కోసం కార్మికులు చేపట్టిన సమ్మెల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.

సమ్మెల్లో ఆయన పాత్రకు గాను 1980 ఏప్రిల్‌లో లులాను అరెస్ట్ చేసి నెల రోజులు జైలులో పెట్టారు. జైలు నుంచి విడుదలైన తర్వాత.. బ్రెజిల్‌ చరిత్రలో మొట్టమొదటి ప్రధాన సోషలిస్ట్ పార్టీ అయిన వర్కర్స్ పార్టీ వ్యవస్థాపనలో కీలక పాత్ర పోషించారు.

బ్రెజిల్‌లో అధికార వ్యవస్థను మార్చటానికి పనిచేస్తున్న కార్మిక సంఘాల నేతలు, మేధావులు, కార్యకర్తలను ఆ పార్టీ ఏకం చేసింది. వర్కర్స్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసిన లులా డ సిల్వా మూడు సార్లు విఫలమయ్యాక.. నాలుగోసారి 2002లో అధ్యక్షుడిగా గెలిచారు. బ్రెజిల్‌ మొట్టమొదటి కార్మిక వర్గ అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.

2003 జనవరి నుంచి 2010 డిసెంబర్ వరకూ ఎనిమిదేళ్ల పాటు వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు.

లులా డ సిల్వా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లులా డ సిల్వా 2003 నుంచి 2010 వరకూ వరుసగా రెండు సార్లు బ్రెజిల్ అధ్యక్షుడయ్యారు

దేశంలో సామాజిక అసమానతలను తగ్గించటానికి కృషి చేశారు. తన హయాంలో ఎగుమతుల ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని ఉన్నత విద్య, సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు చేశారు. కనీస వేతనాన్ని ద్రవ్యోల్బణం రేటు కన్నా ఎక్కువకు పెంచారు. నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ సాయాన్ని విస్తరించారు. దేశంలో 4.4 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి గట్టెక్కించి, పేదల్లో తన మద్దతును పటిష్టం చేసుకున్నారు.

బ్రెజిల్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టగలరు. అలా వరుసగా రెండు సార్లు అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి మళ్లీ ఆ పదవికి పోటీ చేయాలంటే.. కనీసం ఒక పర్యాయం (నాలుగేళ్లు) ఆగాలి. ఈ నేపథ్యంలో 2011 జనవరి 1వ తేదీన లులా పదవి నుంచి తప్పుకున్నారు.

''భూమి మీద అత్యంత ప్రజాదరణ గల రాజకీయ నాయకుడు'' అని లులా డి సిల్వాను నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభివర్ణించారు. లులా పదవి నుంచి దిగిపోయేటప్పటికి ఆయనకు 80 శాతం పైగా ప్రజా మద్దతు ఉండింది.

దిల్మా రౌసెఫ్, లులా డ సిల్వా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లులా తర్వాత దిల్మా రౌసెఫ్ బ్రెజిల్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు

లులా తప్పుకున్న తర్వాత ఆయన వద్ద సన్నిహితంగా పనిచేసిన దిల్మా రౌసెఫ్ బ్రెజిల్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అయితే.. 2013లో బస్సు చార్జీల పెంపుపై నిరసనగా మొదలైన ఆందోళనలు.. దేశంలో అవినీతి మీద ఆగ్రహజ్వాలలుగా మారాయి. మరోవైపు బడ్జెట్ చట్టాలను ఉల్లంఘించారంటూ 2016 ఆగస్టులో అభిశంసన ద్వారా దిల్మాను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఉపాధ్యక్షుడు మైఖేల్ టేమర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

ఈ క్రమంలో మాజీ అధ్యకషుడు లులా డిసిల్వా కూడా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. బ్రెజిల్‌కు చెందిన ఒక నిర్మాణ సంస్థకు.. బ్రెజిల్ ప్రభుత్వ చమురు సంస్థ పెట్రోబ్రాస్ కాంట్రాక్టులు ఇచ్చినందుకు గాను.. బీచ్ వద్ద అపార్ట్‌మెంటును లంచంగా పుచ్చుకున్నారన్న కేసులో 2017 జూలైలో కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మరికొన్ని ఇతర అవినీతి కేసుల్లోనూ లులాను దోషిగా ప్రకటిస్తూ 2018లో ఆ శిక్షను 12 ఏళ్లకు పెంచారు.

జైలుకు వెళ్లకుండా ఉండటానికి లులా కొన్ని నెలల పాటు పోరాడారు. అయితే 2018 ఏప్రిల్‌లో ఆయన జైలు శిక్ష ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాను అవినీతికి పాల్పడలేదని, తాను అధికారానికి తిరిగి రాకుండా నిరోధించటానికి జరిగిన రాజకీయ కుట్రలో భాగంగా తనపై ఈ ఆరోపణలు మోపి జైలుకు పంపిస్తున్నారని లులా డ సిల్వా ఆరోపించారు.

2018 ఏప్రిల్ 7న లులా డ సిల్వా జైలుకు వెళ్లారు. ఆయన జైలులో ఉండగానే.. 2018 అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ తమ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది. అయితే అవినీతి కేసులో దోషిగా నిర్ధారితుడైనందున ఆయన ఎన్నికల్లో పోటీ చేయటానికి వీలు లేదని కోర్టు నిషేధించింది. ఆ ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ తరఫున ఫెర్నాండో హడ్డాడ్ పోటీ చేశారు. కానీ ప్రత్యర్థి జెయిర్ బొల్సొనారో చేతిలో ఓడిపోయారు.

లులా డ సిల్వా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అవినీతి ఆరోపణల కేసులో లులా డ సిల్వా 2018లో జైలుకు వెళ్లారు

దోషిగా నిర్ధారితులైన వారు తొలి అప్పీలు విఫలమైన తర్వాత తప్పనిసరిగా జైలులో ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఆదేశించటంతో.. 2019 నవంబర్ 8న లులా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన 580 రోజుల పాటు జైలులో ఉన్నారు. లులా డ సిల్వాను దోషిగా నిర్ధారించిన తీర్పును నాలుగేళ్ల తర్వాత 2021లో సుప్రీం ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఆయన మీద ఉన్న కేసులన్నిటినీ రద్దు చేసింది.

మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక...

దీంతో ప్రస్తుతం 76 ఏళ్ల వయసున్న లులా డ సిల్వా 2022 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ బ్రెజిల్ అధ్యక్షుడిగా గెలిచి ప్రపంచమంతటా సంచలనం సృష్టించారు.

బ్రెజిల్ రాజకీయాల్లో వామపక్షం వర్కర్స్ పార్టీకి, మితవాదపక్షం లేబర్ పార్టీకి మధ్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో వామపక్ష నేత లులా 50.9 శాతం ఓట్లు గెలుచుకున్నారు.

గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న మితవాద నేత జెయిర్ బొల్సొనారోను ఓడించటానికి ఈ ఓట్లు సరిపోతాయి. ఆయనకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి. ఆయన ఇంకా తన ఓటమి గురించి మాట్లాడలేదు.

లులా డ సిల్వా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, తాజా ఎన్నికల్లో లులా డ సిల్వా మూడోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికై సంచలనం సృష్టించారు

ఇద్దరు అభ్యర్థుల మధ్య కేవలం 21 లక్షల పైచిలుకు ఓట్లు మాత్రమే తేడా ఉండటం గమనార్హం.

అయితే.. ఈ ఎన్నికలతో బ్రెజిల్ సమాజంలో ఏర్పడిన చీలిక ఇప్పట్లో సమసిపోయేలా కనిపించటం లేదు.

''నన్ను సజీవంగా సమాధి చేయటానికి వాళ్లు ప్రయత్నించారు.. నేను ఇక్కడ నిలిచాను'' అని ఆయన తన విజయోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు.

లులా డ సిల్వా 2023 జనవరి 1వ తేదీన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అమెజాన్ అడవి నరికివేతకు ముగింపు పలుకుతానని ఆయన చెప్పారు. దేశంలో ఆకలిని నిర్మూలించటం తన తక్షణ లక్ష్యమని పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితర ప్రపంచ నేతలు లులా డ సిల్వాకు అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)