Amazon: అత్యంత భయానక ప్రాంతంలో ఆ ఇద్దరూ ఎలా కనిపించకుండా పోయారు?

అమెజాన్

జావెరీ లోయలో నదులే రోడ్డులు. పెద్దపెద్ద ఉప నదులే ప్రధాన రహదారులు. వర్షాకాలంలో కనిపించే చిన్నచిన్న నీటి ప్రవాహాలే షార్ట్‌కట్‌లు.

ప్రయాణీకుల్లో ఎక్కువమంది చేపలు పట్టుకునే వారే ఉంటారు. చెక్కలతో తయారుచేసిన బోట్లపై వీరు తిరుగుతుంటారు. ఇక్కడి నదుల్లో అమూల్యమైన జీవజాతులు ఉంటాయి.

అమెజాన్‌లో అత్యంత భయానక ప్రాంతం ఇదేనని చెబుతుంటారు. అక్రమంగా చేపల వేట, జంతువులను వేటాడం ఇక్కడ సాధారణం. పెరూ, కొలంబియాలకు సరిహద్దుల్లో ఉండే ఈ ప్రాంతం మీదుగా దొంగచాటుగా కొకైన్‌ను సరఫరా చేస్తుంటారు.

ఈ కొకైన్ అక్రమ రవాణాపై డామ్ ఫిలిప్స్, బ్రూనో పెరీరా ఓ డాక్యుమెంట్ తీస్తున్నారు.

అమెజాన్ పరిరక్షణపై డామ్ ఫిలిప్స్ ఒక పుస్తకం రాస్తున్నారు. ఇక్కడి దట్టమైన అడవుల్లో ఉండే గిరిజనులపై బ్రూనో పెరీరా అధ్యయం చేపడుతున్నారు. స్థానిక గిరిజనులను డామ్‌కు బ్రూనో పరిచయం చేస్తున్నారు. వీరిద్దరికీ స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. అయితే, వీరు జూన్ 5న ఎలా కనిపించకుండా పోయారో అసలు అంతుచిక్కడం లేదు.

అమెజాన్

అసలు ఏం జరిగింది?

రాష్ట్ర రాజధాని మనాస్‌కు ఇది దాదాపు వెయ్యి కి.మీ.ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. తమను ఎవరూ పట్టించుకోవడంలేదని ఇక్కడి గిరిజనులు భావిస్తుంటారు.

కొన్నేళ్లుగా మూలవాసుల పరిరక్షణ బడ్జెట్‌ను క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బొల్సోనారో హయాంలో ఆదివాసీల పరిక్షణ సంస్థ ఎఫ్‌యూఎన్ఏఐ మరింత నీరుగారింది. చట్టాలను ఉల్లంఘించే వారికి శిక్షలు విధించడమూ తగ్గిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక మూలవాసుల కోసం బ్రూనో పెరీరా పనిచేయడం మొదలుపెట్టారు. ఇక్కడ నేరాల రేటును తగ్గించేందుకు డ్రోన్లు, జీపీఎస్‌లు ఎలా ఉపయోగించాలో గిరిజనులకు ఆయన నేర్పించేవారు.

‘‘ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం మానేసింది. జావెరీ లోయలో మాత్రమే కాదు. ఎక్కడా మూలవాసులను పట్టించుకోవడం లేదు’’అని ఒక మూలవాసుల నాయకుడు చెప్పారు. ఆయన తన పేరును చెప్పడానికి ఇష్టపడలేదు.

‘‘అమాయక ప్రజలకు తగిన రక్షణ కల్పించకపోవడం, వారి ప్రాణాలను కాపాడలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే’’అని ఆయన అన్నారు.

డామ్ ఫిలిప్స్, బ్రూనో పెరీరా

ఫొటో సోర్స్, GUARDIAN NEWS AND MEDIA

ఫొటో క్యాప్షన్, బ్రూనో పెరీరా (ఎడమ), డామ్ ఫిలిప్స్ (కుడి)

ఈ నదికి కొంచెం కిందకు వస్తే సవో రఫేల్ తెగ జీవిస్తారు. ఇక్కడ కొన్ని కర్ర ఇళ్లు కనిపిస్తున్నాయి. తాము కనిపించకుండా పోయే ముందు చివరగా ఈ గ్రామాన్నే డామ్, బ్రూనో సందర్శించారు. వీరు కనిపించకుండా పోవడంపై అనుమానితిడుగా భావిస్తున్న ‘‘అమరిల్డో డా కోస్టా’’ ఇక్కడే ఉండేవాడు.

అమరిల్డోతోపాటు ఇక్కడ ఉండేవారంతా నదిలో చేపలు పట్టుకునే జీవిస్తారు. వీటిపై వచ్చే డబ్బులే వీరి జీవనాధారం. అయితే, జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చేపల వేట మరీ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది చేపలు పట్టుకునేవారు మూలవాసుల ప్రాంతాల్లోకి కూడా వచ్చి వేట జరుపుతుంటారు. ఇక్కడి నుంచి 20 నిమిషాలు బోటులో వెళ్తే మూలవాసుల ప్రాంతం వస్తుంది.

‘‘మేం పిరరుకు చేపలు పడతాం. అదృష్టం కలిసివస్తే, మాకు రెండు, మూడు చేపలు దొరుకుతాయి. ఇక్కడ చాలా మంది చేపలుపట్టుకునే వారుంటారు. మాకు చేపల వేటే జీవనాధారం’’అని సవో రఫేల్‌లో ఉండే జూలియావో చెప్పారు.

పిరరుకు అంతరించిపోయే దశలో ఉన్న చేప. దీన్ని వేటాడటంపై ఆంక్షలు అమలులోనున్నాయి.

వీడియో క్యాప్షన్, ఆదివాసీ అమ్మాయిలకు భరత నాట్యం నేర్పిస్తూ ఆనందాన్ని పంచుతా అంటున్న కౌసల్య శ్రీనివాసన్

ఈ గ్రామానికి చివర్లో మొరేనో ఉంటారు. ఈ చుట్టుపక్కల అక్రమ చేపల వేట జరుగుతుందనే వాదనను ఆయన ఖండించారు. డామ్, బ్రూనోల అదృశ్యం గురించి ఆయన మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు.

‘‘నాకు ఏమీ తెలియదు. నేనేమీ చూడలేదు. నా దగ్గర ఎలాంటి సమాచారమూ లేదు’’అంటూ ఆయన వెంటనే సంభాషణను ముగించారు. ‘‘దీనితో ఎవరికీ ఎలాంటి సంబంధమూ లేదు’’అని చెప్పి ఆయన వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.

అమరిల్డో డా కోస్టా గురించి ఏమైనా తెలుసా? అని ప్రశ్నిస్తే.. ‘‘నాకు ఏమీ తెలియదు’’అని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు.

అయితే, అలా జరగడం దాదాపు అసాధ్యం. ఇక్కడ దాదాపు అందరికీ అంతా తెలుసు. కానీ, బయటివ్యక్తులకు ఏదైనా చెబితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు భయపడుతున్నట్లు అనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, ఆదివాసీ మహిళ ఆయుర్వేద హెయిర్ ఆయిల్.. అమెరికాకు ఎగుమతి

మా రివర్ గైడ్ పేరు రుబెనీ డీ క్యాస్టో ఆల్వ్స్. ఆయన, ఆయన కుమారుడు జావెరీ ఎక్స్‌పిడీషన్స్ పేరుతో ఫిషింగ్ టూరిజం బిజినెస్ నడుపుతున్నారు. అటలియా డో నార్టేతోపాటు మరో ఇద్దరు ఇక్కడ పనిచేయడానికి వచ్చినప్పుడు రెబెనీ హోటల్‌లోనే ఉన్నారు.

‘‘ఇక్కడి మూలవాసులను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కూడా వారికి సాయం చేయడంలేదని వారు భావిస్తున్నారు’’అని రుబేనీ చెప్పారు.

ఎవరూ వీరిని పట్టించుకోకపోవడంతో వీరు డ్రగ్స్ సరఫరాచేసేవారికి ఎరలుగా చిక్కుతున్నారు. ఎవరైనా ఇక్కడ శాంతి భద్రతలు పరిరక్షించాలని చూస్తే, వారు.. డ్రగ్స్ ముఠాలకు శత్రువులుగా మారిపోతారు.

ప్రస్తుత పరిస్థితులపై ఇక్కడున్న కొందరు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. మరికొందరు మాత్రం దీనిలో కొత్తేమీ లేదని అంటున్నారు.

‘‘ఇలాంటి బెదిరింపులు మాకు కొత్తమీ కాదు. ఇలాంటిదేదో జరుగుతుందని మేం ముందే ఊహించాం’’అని మరుబో మూలవాసీల నాయకుడు మనోయిల్ చోరింపా వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)