ట్విటర్‌లో సగం ఉద్యోగాల కోత - 'మరో దారి లేదు'.. ఎలాన్ మస్క్ సమర్థన

ఫొటో సోర్స్, Getty Images
ట్విటర్‌ను కొనుగోలు చేసిన కొత్త యజమాని ఎలాన్ మస్క్.. ఆ సంస్థలో దాదాపు సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు.
ట్విటర్‌కు రోజుకు 40 లక్షల డాలర్ల నష్టం వస్తోందని, కాబట్టి ఉద్యోగాల కోత తప్ప వేరే దారి లేదని ఎలాన్ మస్క్ సమర్థించుకున్నారు.
సంస్థలో ''దాదాపు 50 శాతం కోత'' జరిగిందని ట్విటర్ భద్రత, నిబద్ధత విభాగాధిపతి యోల్ రాత్ ఒక ట్వీట్‌లో ప్రస్తావించారు.
అయితే.. సోషల్ మీడియా దిగ్గజమైన ట్విటర్‌లో కంటెంట్ పర్యవేక్షణ విషయం 'ఏమాత్రం మారలేద'ని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.
ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్.. ట్విటర్‌ను 4,400 కోట్ల డాలర్ల ఒప్పందంతో కొనుగోలు చేశారు.
సంస్థలో ఉద్యోగాలు కోల్పోతున్న వారందరికీ మూడు నెలల జీతాన్ని 'వేర్పాటు వేతనం'గా చెల్లిస్తున్నట్లు మస్క్ తన సొంత ట్వీట్‌లో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ట్విటర్ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారన్న వార్తలు శుక్రవారం బయటకు రాగానే.. ట్విటర్‌లో హానికరమైన అంశాలను తొలగించే ఉద్యోగుల భవిష్యత్తు గురించి ప్రశ్నలు వచ్చాయి.
ట్విటర్ పర్యవేక్షణ విధానాలను ఎలాన్ మస్క్ సడలించవచ్చునని, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సహా వివాదాస్పద వ్యక్తులపై విధించిన నిషేధాన్ని తొలగించవచ్చునని ఆన్‌లైన్ సేఫ్టీ బృందాలు, ఉద్యమకారులు అంచనా వేశారు.
ఈ ఆందోళనలకు ఎలాన్ మస్క్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. అమెరికాలో వాక్‌స్వాతంత్ర్యాన్ని ధ్వంసం చేయటానికి ప్రయత్నిస్తున్న ఉద్యమ బృందాల వల్లే ట్విటర్ ఆదాయం భారీగా పడిపోయిందని ఆయన ఆరోపించారు.
అయితే.. 'ముందువరుస సమీక్ష'లో పనిచేస్తున్న 2000 మందికి పైగా కంటెంట్ మోడరేటర్లలో చాలా మందిపై ఉద్యోగాల కోత ప్రభావం లేదని అనంతరం ఆయన ట్వీట్ చేశారు.
మొత్తం కంపెనీ ఉద్యోగాల్లో 50 శాతం ఉద్యోగలను తగ్గించగా.. ట్విటర్ విశ్వసనీయత, భద్రత విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 15 శాతం మంది మాత్రమే దీని ప్రభావం ఉందని వివరించారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారంపై పోరాడటం 'అత్యున్నత ప్రాధాన్యం'గానే కొనసాగుతోందని రాత్ పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అమెరికా ప్రజలు చాలా మంది మంగళవారం నాడు జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికలు అధ్యక్షుడు జో బైడెన్‌కు కీలక పరీక్ష కానున్నాయి.
ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయటం పట్ల బైడెన్ శుక్రవారం నాడు తన ఆందోళనలు వ్యక్తపరిచారు. ''ప్రపంచమంతా అబద్ధాలను వ్యాపించే, వెదజిమ్మే ఒక సంస్థను ఎలాన్ మస్క్ వెళ్లి కొన్నాడు. ఇప్పుడు పణంగా ఉన్నదేమిటనేది పిల్లలు అర్థం చేసుకోగలరని మనం ఎలా భావిస్తాం?'' అని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఒక్క చోటనే 983 మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు.. ఆ రాష్ట్రంలో ట్విటర్ అధికారులకు అందిన నోటీసుల ద్వారా తెలుస్తోంది. శాన్ ఫ్రాన్‌సిస్కోలో 784 మంది, శాన్ జోస్‌లో 106 మంది, లాస్ ఏంజెలెస్‌లో 93 మంది ఉద్యోగులను ఇది ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ భారీ ఉద్యోగాల కోత.. కంపెనీ ముందుకు సాగి విజయం సాధించటానికి 'దురదృష్టవశాత్తూ అవసరమైంద'ని శుక్రవారం ఉదయం ట్విటర్ సిబ్బందికి పంపిన అంతర్గత ఈమెయిల్‌లో పేర్కొన్నారు.
ఉద్యోగులు తాము వర్క్ ల్యాప్‌టాప్‌ల నుంచి, మెసేజింగ్ వ్యవస్థ అయిన స్లాక్ నుంచి లాగవుట్ అయినట్లు సిబ్బంది ట్విటర్‌లో ధృవీకరించారు.
ట్విటర్‌లో తమ ఉద్యోగాల నుంచి తమపై వేటు వేశారని చాలా మంది సిబ్బంది వెల్లడించారు. ఈ ఉద్యోగాల కోత ప్రపంచమంతా ఎంత విస్తృతంగా ఉందో అవి చూపుతున్నాయి. సంస్థలో మార్కెటింగ్ మొదలుకుని, ఇంజనీరింగ్ వరకూ చాలా విభాగాలపై ఈ కోత ప్రభావం చూపింది.
కమ్యూనికేషన్లు, కంటెంట్ క్యురేషన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఉద్యోగులు కూడా ఈ కోత పరిధిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, CHRIS DELMAS/AFP
ట్విటర్ ఆల్గోరిథమ్‌లను ఎలా ఉపయోగిస్తుందనే అంశం ఎలాన్ మస్క్‌కు చాలా ముఖ్యమైన విషయం. దీనిపై పరిశోధన మీద దృష్టి కేంద్రీకరించిన ఒక టీమ్‌ను కూడా తొలగించినట్లు కంపెనీలో మాజీ సీనియర్ మేనేజర్ ఒకరు ట్వీట్ చేశారు. అయితే ఈ విషయాన్ని ఆ తర్వాత నిరాకరించారు.
ప్రస్తుతం ట్విటర్ ఆదాయం మొత్తం దాదాపుగా అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారానే వస్తోంది. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచీ ట్విటర్‌లో వాణిజ్య ప్రకటనలకు డబ్బులు ఖర్చుచేయటం నిలిపివేసిన సంస్థల్లో ఫోక్స్‌వాగన్ కూడా ఉంది.
యూరప్‌లో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ అయిన ఫోక్స్‌వాగన్.. ''పరిస్థితిని మేం నిశితంగా పరిశీలిస్తున్నాం. ఇది ఎలా మారుతందనే దానిని బట్టి మేం తర్వాతి చర్యలను నిర్ణయించుకుంటాం'' అని చెప్పింది.
చీరియోస్, లక్కీ చార్మ్స్ వంటి సొంత బ్రాండ్ల యజమాని జనరల్ మిల్స్ కూడా గురువారం నాడు అదే పని చేసింది.
ట్విటర్ 'కొత్త దిశ'ను తాము గమనిస్తున్నామని, తమ మార్కెటింగ్ వ్యయాన్ని సమీక్షించాలని భావిస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది.
ట్విటర్ వేదిక మీద చెల్లింపు కార్యకలాపాలను నిలిపివేసిన బ్రాండ్లలో.. కార్ల కంపెనీలు జనరల్ మోటార్స్, ఆడి, ఔషధ దిగ్గజం ఫైజర్ సంస్థలు కూడా ఉన్నాయి.
ట్విటర్ సంస్థ వ్యయాలను తగ్గించి, విభిన్న మార్గాల్లో లాభాలు పొందే అవకాశాలను ఎలాన్ మస్క్ అన్వేషిస్తున్నారు. ట్విటర్‌లో వెరిఫైడ్ యూజర్ల నుంచి నెల వారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయాలన్న ప్రణాళిక అందులో ఒకటి.
నెల వారీగా 8 డాలర్లు చెల్లించే యూజర్ల ట్వీట్లను రిప్లైలు, మెన్షన్లు, సెర్చ్‌లలో బూస్ట్ చేస్తామని కూడా ఆయన ప్రతిపాదించారు. దీనిపై ట్విటర్‌లో కొందరి నుంచి విమర్శలు వచ్చాయి.
ట్విటర్‌లో రెండు వర్గాల వ్యవస్థను తయారు చేయటానికి ప్రయత్నిస్తున్నారని, డబ్బులు చెల్లించటానికి సిద్ధంగా ఉన్నవారికి అది ప్రయోజనం కలిగిస్తుందని కొందరు ట్విటర్ యూజర్లు తప్పుపట్టారు.
ఇదిలావుంటే.. ట్విటర్ కంపెనీ 60 రోజుల నోటీసు ఇవ్వకుండా ఉద్యోగాల కోత విధిస్తోందని, ఇది అమెరికా ఫెడరల్ చట్టంతో పాటు కాలిఫోర్నియా చట్టాన్ని ఉల్లంఘించటమేనని ట్విటర్ ఉద్యోగులు గురువారం నాడు కేసు వేశారు.
ఇవి కూడా చదవండి:
- టీ20 ప్రపంచ కప్ 2022: భారత్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడాలంటే ఏం జరగాలి?
- టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?
- ‘జూ’లో మనుషులను ఉంచి ప్రదర్శించేవారు.. ఐరోపా దేశాల ‘అమానుషం’
- కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలు
- గ్రహణం సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు? నమ్మకాలేంటి, వాటి శాస్త్రీయత ఎంత?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













