ప్రతి వరల్డ్ కప్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టును ఓడిస్తున్న ఆ ‘అదృశ్య శక్తి’ ఏంటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డేనియల్ గలాన్
- హోదా, క్రికెట్ రచయిత, బీబీసీ కోసం
'టాప్ ఆర్డర్ కాస్త మెరుగు పడితే చాలు... ఈ సారి టీ20 వరల్డ్‌కప్‌ను దక్షిణాఫ్రికా ఇంటికి తీసుకెళ్లొచ్చు.'
కొద్ది రోజుల కిందట దక్షిణాఫ్రికా క్రికెట్ టీం గురించి కామెంటేటర్ హర్ష భోగ్లే అన్న మాటలు ఇవి. భారత్‌ను దక్షిణాఫ్రికా ఓడించిన సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
చివరకు నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి సెమీఫైనల్‌కు కూడా చేరలేక పోయింది దక్షిణాఫ్రికా.
ఇలా జరగడం దక్షిణాఫ్రికాకు కొత్త కాదు. ఎంతో ప్రతిభావంతులైన ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ టీం వరల్డ్ కప్ గెలవలేదు. గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ అనేక సార్లు మ్యాచుల్లో ఓడిపోయింది దక్షిణాఫ్రికా.
మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ అయిన జెరేమీ స్నేప్ ప్రస్తుతం స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు ముందు రోజు మేం వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాం.
'ర్యాంకుల్లో కింద ఉన్న నెదర్లాండ్స్ మీద విజయం వల్ల దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్స్‌కు వెళ్లే మార్గం సుగమమం అవుతుంది.
కానీ ఓటమి... నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోతుందా?'
ఇలా మా సంభాషణ సాగింది. 'గెలిచే స్థితిలో ఉండి కూడా ఓడిపోవడం' గురించి మేం మాట్లాడుకున్నాం. 'అంచనాలు ఎక్కువగా ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి పెరిగి గెలవాల్సిన మ్యాచులను సైతం ఓడిపోతుంటారు' అని జెరేమీ స్నేప్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తలపడినట్లు... చివర 15 బంతుల్లో దక్షిణాఫ్రికా 20 పరుగులు చేయాల్సి వచ్చినట్లు మేం ఊహించుకున్నాం.
సరే, దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్ జరిగింది. 13 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఆ జట్టును ఓడించిన నెదర్లాండ్స్ టీంలో నలుగురు దక్షిణాఫ్రికా సంతతి ప్లేయర్స్ ఉండటం విశేషం.
ఐసీసీ టోర్నమెంట్స్‌లో దక్షిణాఫ్రికాకు ఇది మరొక విషాదకరమైన ముగింపు.
'అరె, వీళ్లేంటి గెలిచే మ్యాచ్‌లో కూడా ఓడిపోయారు' అని అభిమానులు అనుకోవచ్చు. కానీ ఇది మరీ ఊహించని ఓటమి అయితే కాదు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు చరిత్రను చూసిన వారు దీన్ని అంచనా వేయగలరు.
1999 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ టై అయింది. విజయానికి అవసరమైన ఒక్క పరుగును దక్షిణాఫ్రికా సాధించలేక పోయింది. దీంతో నెట్ రన్ రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్స్‌కు వెళ్లి పోయింది.
నాటి నుంచి దక్షిణాఫ్రికా కీలకమైన మ్యాచుల్లో ఓడిపోతూ వస్తూనే ఉంది. గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా మ్యాచులను కాపాడుకోలేక పోతోంది.
2007, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌తోపాటు 2009, 2014 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోయింది. 1999 నుంచి చూస్తే నాలుగు వరల్డ్ కప్ ట్రోఫీల్లో సెమీ ఫైనల్స్‌లో ఓడి పోయింది ఆ జట్టు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సారి సెమీ ఫైనల్స్‌కు కూడా చేరలేదు.
'ప్రతి ఓటమి మానసికంగా కుంగదీస్తుందా?' అని స్నేప్‌ను అడిగాను. 2008-2011 మధ్య దక్షిణాఫ్రికా జట్టుకు ఆయన పని చేశారు. ఆ జట్టును మానసిక ఒత్తిడి నుంచి బయట పడేసేందుకు ప్రయత్నించారు.
'అది అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బాగా ఆడిన జట్టు గెలుస్తుంది. మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్లుగా బాగా ఆడినా గెలుస్తారనే నమ్మకం అయితే ఉండదు.
కానీ ఆ పర్సెప్షన్, ట్రైట్స్ ఇంకా జట్టును పట్టుకునే ఉన్నాయి. గతంలో జరిగిన తప్పులతో సంబంధం లేని నేటి ఆటగాళ్లను కూడా అవి వదలి పెట్టడం లేదు.
తరతరాలుగా అనుభవిస్తున్న వేదన వంటిది ఇది. పాత తరాలు ట్రామాకు లోనైతే అది ఆ తరువాత తరాల మీద కూడా ప్రభావం చూపుతుంది' అని స్నేప్ అన్నారు.
ఆదివారం నెదర్లాండ్స్ మీద మ్యాచ్‌కు సిద్ధమయ్యేటప్పుడు క్వింటన్ డీ కాక్ ఏం ఆలోచిస్తూ ఉండి ఉండొచ్చు?
23 ఏళ్ల కిందట జరిగిన1999 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో బ్యాట్‌ను జార విడిచిన అలన్ డోనల్డ్, ఇప్పుడు క్వింటన్ డీ కాక్ మదిలో మెదిలి ఉంటాడా?
తాను సరిగ్గా ఆడలేకపోతున్నప్పుడు, 2011 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో న్యూజీలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయిన తీరును రబడ గుర్తు చేసుకుని ఉండి ఉంటాడా?
ఇలా చేసి ఉంటే అది నిజంగా వారికి ఉపయోగపడి ఉండేది.

ఫొటో సోర్స్, Getty Images
'మైదానంలో ప్రత్యర్థిని ఓడించే వ్యూహాల గురించి ఆలోచిస్తూ మనం వేల గంటలు గడుపుతాం. కానీ మన మనసులోనే ఉండే అతి పెద్ద శత్రువు గురించి పెద్దగా మాట్లాడం. మానసికమైన అంశాలే నా దృష్టిలో అతి పెద్ద అవరోధాలు.
అన్నింటి కంటే ముందు చేయాల్సింది అంచనాలు, ఒత్తిడుల గురించి మాట్లాడటం. ఆడేటప్పుడు ప్రతి ఒక్కరి మదిలో ఈ రెండు అంశాలు తప్పకుండా మెదులుతాయి.
కాబట్టి మన మనసును ఖాళీగా ఉంచకూడదు. పాజిటివ్ ఆలోచనలతో దాన్ని నింపాలి. ఇలా చేయలేని ఏ ప్లేయర్ అయినా పోరాటంలో తడబడతారు.
ఇన్‌స్వింగింగ్ యార్కర్ అనేది క్రూర మృగమేమీ కాదు. ఒకనాటి మన పూర్వీకుల మాదిరిగా ప్లేయర్లు కూడా కూల్ మైండ్‌తో ఉంటే పడిపోకుండా నిలబడగలుగుతారు.
'వేరే ఆలోచనలు లేకుండా సహజంగా ఆడుతున్నప్పుడు మనలోని బెస్ట్ ప్లేయర్ బయటకు వస్తాడు. కానీ మనం ఒత్తిడికి లోనైనప్పుడు మానసికంగా బలహీనపడినప్పుడు అనేక ప్రతికూల ఆలోచనలు మెదడును చుట్టుముడతాయి.
బౌలర్ తరువాత డెలివరీని ఎలా వేసే అవకాశం ఉంది అనేది ఆలోచించడం మానేసి... మేం ఓడిపోతే రేపు జట్టు గురించి, నా గురించి అందరూ ఏమనుకుంటారో? పత్రికల్లో ఏమి రాస్తారో? అనేది ఆలోచించడం మొదలు పెడతారు.
ఆ మానసిక ఒత్తిడి కాస్త శారీరక కదలికలను దెబ్బతీస్తుంది. మోకాళ్లు బలహీనపడిపోతుంటాయి. ఒకే పనిని మళ్లీమళ్లీ చేస్తుంటారు. అనవసరమైన షాట్లను ఆడుతుంటారు.
చేతులు బలహీనపడుతుంటాయి. ప్లేయర్స్‌లోని నేర్పు, తెలివి అన్ని మసకబారి పోతాయి. ఈ సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చు. కాకపోతే కొన్నిసార్లు ఇది చాలా క్లిష్టంగా మారిపోతుంది' అని స్నేప్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కెప్టెన్ తెంబా బవుమా బృందం మరొకసారి అవమాన భారంతో ఇంటి దారి పట్టింది.
ఈ ఓటమి తరువాత దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ ఓటమికి మ్యాచ్ జరిగిన సమయం కూడా కారణమని బౌచర్ అన్నాడు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్ ఉదయం 10.30 గంటలకు మొదలైంది.
ఆ సమయంలో తమ దక్షిణాఫ్రికా ప్లేయర్ల 'ఎనర్జీ లెవల్స్' తక్కువ స్థాయిలో ఉన్నాయని బౌచర్ చెప్పుకొచ్చాడు. ఇది ఒక సాకే అయినప్పటికీ బౌచర్ వివరణలోనూ కొంత వాస్తవం ఉంది.
మ్యాచ్ జరిగిన సమయం వల్లే దక్షిణాఫ్రికా ఓడిపోలేదు. సీనియర్ ప్లేయర్లు ఎవరూ బాగా ఆడలేదు. టాస్ గెలిచిన తరువాత బౌలింగ్ ఎంచుకోవడం దగ్గర నుంచి దక్షిణాఫ్రికా తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక కంటికి కనిపించని ఒక భయం లేదా ఒత్తిడి దాగి ఉంది.
ఆ భయమే ఆ జట్టు ప్లేయర్ల గొంతులను గట్టిగా నొక్కేస్తోంది. ప్రపంచకప్ గెలుపు మాత్రమే ఆ భయాన్ని దూరం చేయగలదు.
ఇవి కూడా చదవండి:
- ఏలియన్స్ ఎదురైతే మీరేం చేస్తారు?
- టీ20 ప్రపంచ కప్ 2022: భారత్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడాలంటే ఏం జరగాలి?
- జాన్వీ కపూర్: ‘నేను వేసుకునే బట్టలు నా ఇష్టం.. మా నాన్నకే సమస్య లేనపుడు, అడగడానికి మీరెవరు?’
- డ్రోన్లు: భారతదేశం 2030 నాటికి ప్రపంచ డ్రోన్ హబ్‌గా అవతరిస్తుందా... అవకాశాలు, అవరోధాలు ఏమిటి?
- COP27: వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఏం చెప్పింది, ఏం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














