అవతార్-2: ఈ చిత్రంలో ఏముంది... జేమ్స్ కామెరాన్ మరో అద్భుతాన్ని సృష్టించారా?

ఫొటో సోర్స్, 20TH CENTURY STUDIOS
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అవతార్ సినిమా 2009లో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ డిసెంబర్‌లో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అవతార్-2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
దర్శకుడు జేమ్స్ కామెరాన్ తొలి చిత్రం నుంచే తన ప్రత్యేకత చాటుకుంటూ వచ్చారు. అవతార్ తరువాత ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. కామెరాన్ దర్శకత్వంలో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ హీరోగా 1984లో విడుదలైన 'ది టర్మినేటర్' భారీ సంచలనాన్ని సృష్టించింది. 80వ దశకంలో ఇలాంటి సినిమాను ఎవరూ ఊహించలేదు.
ఆ తరువాత ఆయన తీసిన 'ఏలియన్స్', 'ది అబిస్' సినిమాలు అభిమానులను విస్మయానికి గురిచేశాయి. ముఖ్యంగా, ది అబిస్‌లో ఆయన టేకింగ్ ప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేసింది. ఆ తరువాత వచ్చిన 'టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే', 'ట్రూ లైస్' కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్స్ అయ్యాయి.
అనంతరం, 'టైటానిక్' సినిమా ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రపంచం నలుమూలలా కథనాలు ప్రసారమయ్యాయి. ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. అనేక దేశాల్లో టైటానిక్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

ఫొటో సోర్స్, AVATAR/TWITTER
అవతార్-3, 4 కూడా...
సాధారణంగా జేమ్స్ కామెరాన్ ఒక చిత్రానికి, మరొక చిత్రానికి మధ్య చాలా గ్యాప్ తీసుకుంటారు. కానీ, టైటానిక్ సినిమాకు, తదుపరి చిత్రానికి మధ్య ఏకంగా 12 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారు.
టైటానిక్ సినిమా 1997లో విడుదలైతే, తదుపరి చిత్రం 2009లో విడుదలైంది. ఆ సినిమా చూసిన వారికి ఇంత విరామం తీసుకోవడానికి కారణం ఏమిటో తెలిసిపోయింది.
అదే 'అవతార్' సినిమా. ప్రకృతికి, మానవుని ఆక్రమణకు మధ్య జరిగే పోరాటాన్ని కథాంశంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం 2009 డిసెంబర్ 16, 18 తేదీల మధ్య ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,600 థియేటర్లలో విడుదలైంది. వీటిలో 3,670 థియేటర్లలో సినిమాను 3డిలో ప్రదర్శించారు. ఐమాక్స్ టెక్నాలజీలో 260 థియేటర్లలో సినిమా విడుదలైంది.
అవతార్ ప్రపంచవ్యాప్తంగా 2.92 బిలియన్ డాలర్లు వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది. 'గాన్ విత్ ది విండ్' తరువాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇదే.
ఈ చిత్రం విజయం తరువాత, 'అవతార్: ది వే ఆఫ్ వాటర్', 'అవతార్ 3'గా మరో రెండు భాగాలను తీస్తానని కామెరాన్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు మొత్తం నాలుగు భాగాలను విడుదల చేయనున్నట్టు తెలిపారు.
రెండవ భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ 16న, మూడవ భాగాన్ని 2024 డిసెంబర్ 20న, నాల్గవ భాగాన్ని 2026 డిసెంబర్ 18న విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిర్మాణానికి 13 ఏళ్ళు
'అవతార్: ది వే ఆఫ్ వాటర్' చిత్రం 2014లో విడుదల కావాల్సి ఉండగా, ఎనిమిదేళ్లు వాయిదా పడింది. అండర్‌వాటర్ ఫెర్మార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించడం వలన పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చిందని చిత్రం యూనిట్ తెలిపింది. దాదాపు 250 మిలియన్ డాలర్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు.
మొదటి సినిమా లాగే, ఈ చిత్రంలో కూడా జేక్ సల్లీ, నేత్రి తమ ప్రపంచమైన పండోరాను కాపాడుకునే పోరాటం చేస్తారని తెలుస్తోంది. అయితే ఇది నీటి అడుగున జరిగే కథ. ఈ చిత్రం నిడివి మూడు గంటల కన్నా ఎక్కువే. ఇది మొదటి భాగం కన్నా మరో అరగంట ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు.
ప్రారంభం నుంచి జేమ్స్ కామెరాన్ చిత్రాల్లో ప్రకృతి, ఆధునిక మానవుల మధ్య సంబంధం, సంఘర్షణ ప్రస్పుటంగా కనిపిస్తూనే ఉంది. దానికి పరాకాష్టగా అవతార్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండవ భాగంలో, ప్రకృతిలో భాగమైన సముద్రమే ప్రధానంగా కనిపిస్తుంది.
సామ్ వర్దింగ్టన్, జో సల్దానా, కేట్ విన్‌స్లెట్ ఈ చిత్రంలో నటించారు. తొలి భాగానికి సంగీతం అందించిన జేమ్స్ హార్నర్ ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని సమకూరుస్తున్నట్లు అంతకుముందు తెలిపారు. కానీ, హార్నర్ 2015లో విమాన ప్రమాదంలో మరణించడంతో, సిమోన్ ఫ్రాంగ్లిన్ సంగీత సారథ్యం వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
పార్ట్-1లో ఏముంది...
అవతార్ మొదటి భాగం విడుదలై 15 ఏళ్ళు అవుతోంది. కాబట్టి, ఆ చిత్రం కథాంశం ఏమిటో ఓసారి గుర్తు చేసుకుందాం. అది భవిష్యత్తులో జరిగే కథ. మానవులు అంతరిక్షంలో ఒక కొత్త చంద్రుని మీదకు వెళ్తారు. దాని పేరు పండోరా.
అక్కడ విలువైన ఖనిజాలు ఉన్నాయని మానవులు గుర్తిస్తారు. వాటిని మైనింగ్ చేయాలని ప్లాన్ వేస్తారు. కానీ, పండోరాలోని నావీ అనే జాతి ప్రజలు వారి ప్రయత్నాలను అడ్డుకుంటారు. వారు చాలా పొడుగ్గా, నీలంరంగులో ఉంటారు.
భూగ్రహం మీది మనుషులు నావీ అవతార్‌లోకి పరకాయ ప్రవేశం చేసి వారిలో కలిసిపోతారు. నావీ రూపంలో ఉన్న మనిషి మెదళ్ళను భూమి నుంచే నియంత్రిస్తుంటారు. అవతార్‌గా మారిన జేక్ సల్లీ, నావీ అమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి ఆమె కోసం, వారి ప్రపంచాన్ని కాపాడేందుకు పోరాడతాడు.

ఫొటో సోర్స్, DISNEY/PA
అవతార్-2లో ఏముంది?
మొదటి అవతార్ తరువాత పదేళ్ళకు ఏం జరిగిందన్నది 'ది వే ఆఫ్ వాటర్' కథ. ఇందులో కూడా జేక్ సల్లీ ఉంటాడు. కానీ, ఈసారి ఆయనకు ఓ కుటుంబం ఉంటుంది. జేక్, ఆయన భార్య నేట్రి, పిల్లలు.. వీరంతా ఒకరినొకరు కాపాడుకోవడానికి ఎన్నో సాహసాలు చేస్తారు.
పండోరా వాసులు స్వచ్ఛమైన నీళ్ళలోకి దూకుతున్న దృశ్యాలతో రెండో పార్ట్ ట్రైలర్ మొదలవుతుంది. అద్భుతమైన జీవరాశులు కనువిందు చేస్తుంటాయి. జేక్ ఇందులో తన కూతురుకు విలువిద్య నేర్పిస్తూ కనిపిస్తారు. పండోరాలోని మరిన్ని వింతలు, అద్భుతాలు, అక్కడి మనుషుల అమోఘమైన సాహసాలతో అవతార్-2 రూపొందింది. ఇది మరో చరిత్రాత్మక దృశ్య కావ్యంలా నిలిచిపోతుందనే అంచనాలున్నాయి.
అవతార్-2 ఈ అంచనాలను అందుకుంటుందా, వాటిని మించిపోతుందా అన్నది డిసెంబర్ 16న తెలిసిపోతుంది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను కూల్చుతామని అంటున్నారు... కేసీఆర్ ఆరోపణ
- అంతరిక్షంలో సోలార్ ప్యానెల్స్ భూమికి విద్యుత్తును అందించగలవా?
- ఇమ్రాన్ ఖాన్‌పై ‘హత్యాయత్నం’.. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే
- చిత్తూరు అడవిలో కరెంటు తీగల ఉచ్చులో చిక్కుకుని ఏనుగు మృతి
- మిస్ అర్జెంటీనా, మిస్ పుయెర్టోరీకో: 'ఔను... మేమిద్దరం పెళ్ళి చేసుకున్నాం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














