‘ఎమ్మెల్యేల కొనుగోలు’: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను కూల్చుతామని అంటున్నారు... కేసీఆర్ ఆరోపణ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

ఫొటో సోర్స్, Facebook/KCR

'టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు' వ్యవహారానికి సంబంధించిన ఫాం హౌస్ వీడియోను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు.

ఆ వీడియో నిడివి మొత్తం మూడు గంటలు కాగా దాన్ని మీడియా సౌలభ్యం కోసం గంటకు తగ్గించినట్లుగా కేసీఆర్ చెప్పారు.

ఈ వీడియోను దేశంలోని వివిధ కోర్టులకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించామని తెలిపారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ఏమన్నారంటే...

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

ఫొటో సోర్స్, UGC

'న్యాయవ్యవస్థే కాపాడాలి'

'ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి చేసిన కుట్ర' సవివరంగా ఈ వీడియోలో రికార్డు అయింది. ఆ వీడియో కాపీలను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా సంస్థలకు పంపించాం.

న్యాయవ్యవస్థతో పాటు రాజ్యాంగ సంస్థలకు కూడా పంపాం. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పార్టీల అధ్యక్షులకు కూడా పంపించాం.

చేతులు జోడించి వేడుకుంటున్నా

ఎప్పుడు ప్రమాదంలో పడినా ఈ దేశాన్ని కాపాడింది న్యాయవ్యవస్థ మాత్రమే.

కర్నాటకలో ప్రభుత్వాన్ని కూలగొట్టింది మేమే. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూలగొట్టింది మేమే. అంటూ ఎటువంటి భయం లేకుండా వారు చెబుతున్నారు.

సుప్రీం కోర్టుతో పాటు దేశంలోని హై కోర్టుల ప్రధాన న్యాయమూర్తుల అందరికీ ఆధారాలు పంపాం.

నేను న్యాయవ్యవస్థను చేతులు జోడించి వేడుకుంటున్నా. ఈ దేశాన్ని దయ చేసి కాపాడండి. దీని మీద న్యాయబద్ధమైన రీతిలో చర్చించండి.

దీన్ని కోర్టులు 'సింగిల్ కేసు'గా చూడకూడదని విన్నవించుకుంటున్నా’ అన్నారు కేసీఆర్

ఫాంహౌస్‌లో రామచంద్ర భారతి, సింహయాజీ, నరేంద్ర కుమార్

ఫొటో సోర్స్, UGC

‘దేశంలో ఇప్పటి వరకు 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టాం. ఆ తరువాత తెలంగాణ, ఆంధ్ర, దిల్లీ, రాజస్థాన్ ప్రభుత్వాలను కూలగొడతామని చెబుతున్నారు. ఈడీని చూపించి బెదిరిస్తున్నారు.

ఇది సరైన పద్ధతి కాదు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే పార్టీలకు అతీతంగా మనం పోరాడం.

దిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రంగం సిద్ధం చేశామని చెప్పారు. మేం వెంటనే అరవింద్ కేజ్రీవాల్‌ను హెచ్చరించాం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారని జాగ్రత్తగా ఉండని చెప్పాం.

వ్యక్తి ఒక్కరే కార్డులు ఎన్నో

ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చిన వారి వద్ద ఫేక్ గుర్తింపు కార్డులు ఉన్నాయి. వ్యక్తి ఒకరే ఆధార్ కార్డులు చాలా ఉంటాయి.

ఒక్కో వ్యక్తికి మూడు ఆధార్ కార్డులు, మూడు పాన్ కార్డులు, రెండు మూడు డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి’ అని కేసీఆర్ ఆరోపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అయితే బీజేపీ మొదటి నుంచి ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ ఈడీకి, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది.

బీజేపీ నేతలు బూర నర్సయ్య గౌడ్, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, బండి సంజయ్ కుమార్

ఫొటో సోర్స్, Facebook/Komatireddy Raj Gopal Reddy

‘కేసీఆర్ కొత్త నాటకం’

'మునుగోడు ఉపఎన్నికల్లో ఓడిపోతారని తెలిసి కేసీఆర్ కొత్త నాటకాలకు తెరతీశార'ని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి అన్నారు.

'ఎమ్మెల్యేల కొనుగోలు, స్వామిజీలు అంటూ కేసీఆర్ ఏదో చెబుతున్నారు. ఆ ఎమ్మెల్యేలకు డిపాజిట్‌లు కూడా రావు. వారు కాంగ్రెస్‌లో గెలిస్తే టీఆర్‌ఎస్ కండువా కప్పారు' అంటూ ఆయన విమర్శించారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరెస్ట్... ఇంతకీ ఏమిటీ కేసు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)