జాన్వీ కపూర్ ఇంటర్వ్యూ: ‘నేను వేసుకునే బట్టలు నా ఇష్టం.. మా నాన్నకే సమస్య లేనపుడు, అడగడానికి మీరెవరు?’

జాన్వీ కపూర్

‘‘బోనీకపూర్, శ్రీదేవి కూతురు కదా. జీవితంలో అన్నీ సులభంగా అందుతాయి. అనుకుంటుంటారు. కానీ, కష్టపడటం, నిజాయితీగా పనిచేయడం, కళ కోసం, సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేయడం కూడా నా రక్తంలోనే ఉంది’’ అన్నారు జాన్వీ కపూర్.

బీబీసీ కోసం నయన్ దీప్ రక్షిత్ జాన్వీ కపూర్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన సినిమాల గురించి, తనపై ట్రోలింగ్ గురించి వివరంగా మాట్లాడారు.

సినిమాల్లోకి ఎందుకొచ్చింది అని మిమ్మల్ని అన్నవాళ్లే. ఇప్పుడు చాలా బాగా చేశారు అని కామెంట్స్ పెడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది.

జాన్వీ కపూర్: జనం నన్ను జడ్జ్ చేస్తున్నారని నాకు బాధగా అనిపించలేదు. నేను నా మొదటి సినిమాతో వాళ్ల అంచనాలను అందుకోలేకపోయానే అనే నాకు బాధేసింది. బహుశా అది ఒత్తిడి వల్ల కావచ్చు. నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది అర్థం చేసుకోలేకపోవడం వల్ల కావచ్చు. డే వన్ నుంచి ఇప్పటివరకూ నేను కష్టపడుతూనే ఉన్నా. మొత్తానికి అది ప్రేక్షకులకు కనిపిస్తోంది. వారికి నా నటన నచ్చుతోంది. అంటే నేను ఏది చేస్తున్నా వాళ్ల ప్రేమ కోసమే చేస్తున్నా. ఆ ప్రేమనానుభూతి పొందడం బెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్

చిన్నప్పట్నుంచీ యాక్టింగ్ అంటే ఇష్టమా.

జాన్వీ కపూర్: చిన్నప్పట్నుంచీ యాక్టింగ్ అంటే ఇష్టం ఉంది. కానీ మధ్యలో ఎవరినైనా కలిసినప్పుడు ఎప్పుడు యాక్టర్ అవుతున్నావు, ఎలా అవుతున్నావు అన్నప్పుడు అది డిసైడ్ చేయడానికి వీళ్లెవరు అనిపించేది. అంటే నేను నిర్ణయించుకోకముందే వాళ్లు నిర్ణయించేశారు. అలా ఒక రెబెల్ ఆలోచనలూ వచ్చేవి. నేను డాక్టరవుతా, ఆర్కియాలజిస్ట్ అవుతా అన్నాను. తర్వాత నేను అంత స్మార్ట్ కాదని రియలైజ్ అయ్యాను.

సినిమా నా రక్తంలోనే ఉందని నేనర్థం చేసుకున్నాను. బోనీ కపూర్, శ్రీదేవి కపూర్ కూతురు కాబట్టి జీవితంలో అన్నీ సులభంగా దొరుకుతాయని జనం అనుకుంటారు. కష్టపడ్డం, నిజాయితీగా పనిచేయడం, కళ, సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేయడం కూడా నా రక్తంలో ఉందనేది వారు తెలుసుకోవాలి. జనం నా గురించి మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నారు అంటే...అదే నాకు అతిపెద్ద బహుమతి.

Janhvi Kapoor

ఫొటో సోర్స్, Janhvi Kapoor

కానీ, మీరు పరిశ్రమల్లోని మొదటి సినీ ఫ్యామిలీలో ఒకరు కాబట్టి మీకు ఎక్కడో ఒక చోట సులభంగా అనిపించిందా, ప్రివిలేజ్ లభించిందా..

జాన్వీ కపూర్: మొదట ఆడిషన్స్ కోసం పరుగులు తీయడం, బాంబేలో ఎలా సర్వైవ్ కావాలి, నాకు ఆశ్రయం ఎలా లభిస్తుంది, భోజనం ఎలా అనే బేసిక్ స్ట్రగుల్ లేవు. ఎక్కడికెళ్లాలి, ఎవరిని కలవాలి అనే కష్టాలు కూడా పడలేదు. ఆడిషన్స్ ఇవ్వాలంటే ఈ సినిమాలు తీస్తున్నారు. ఈ డైరెక్టర్లను కలవచ్చు..ఇక్కడకెళ్లి ఆడిషన్స్ ఇవ్వచ్చు అనే విషయాలు నాకు తెలుసు. నేను రైళ్లు పట్టుకుని దూర ప్రయాణాలేం చేయలేదు. నేను నా కార్లో మా ఇంటి నుంచి సీనియర్ నిర్మాతలు, దర్శకుల సలహాలు తీసుకుని వెళ్లేదాన్ని. అలాంటి ప్రివిలేజ్ ఉండేది. ఎందుకంటే మా అమ్మనాన్నలు ఈ పరిశ్రమలో ఉన్నవాళ్లే. వాళ్లకు వీరందరూ తెలుసు. దాంతో మీటింగ్స్ సులభంగా జరిగేవి. నేను చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాను. కరణ్ జోహార్‌కు అడిషన్స్ ఇచ్చాను. కానీ అవి కంఫర్టబుల్‌గా ఉండేవి. ఇంకా ఇలాంటివి చాలా ఆడిషన్స్ ఇచ్చాను. కానీ ధఢక్‌ కోసం మాత్రం సీరియస్‌గా ఆడిషన్ జరిగింది. ఫిల్మీ కిడ్స్‌కు చాలా సులభంగా చాలా లభించాయి. ఇప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా కూడా ఒక వర్గం ఉంది. దాన్ని కూడా మనం అంగీకరించాలి. ఒకప్పుడు ఫిల్మీ కిడ్స్ కావాలనుకునేవాళ్లు. ఇప్పుడు పక్కన పెడుతున్నారు. ప్రజల స్క్రూటినీని కూడా ఎదుర్కోవాలి. తప్పదు. అయితే, తల్లి దండ్రుల వల్లనే అవకాశాలు లభిస్తే.. అవి గుంజన్ సక్సేనా సినిమా తర్వాత ఆగిపోయేవి. కానీ, నాకు ఇంకా లభిస్తున్నాయి కదా.

ఇవన్నీ ఈమె వాళ్ల కూతురు కాబట్టే వచ్చింది అనేది ఎప్పుడైనా జరిగిందా

జాన్వీ కపూర్: చిన్నప్పట్నుంచే జరిగాయి. చిన్నతనంలో ఎగ్జామ్స్‌లో ఫుల్ మార్క్స్ వస్తే ఆ టీచర్ మీ అమ్మకు పెద్ద ఫ్యాన్ అందుకే వచ్చాయిలే అనేవాళ్లు. ఆ స్టిగ్మా ఎప్పుడూ ఉండిపోయింది. నాకా యోగ్యత లేదు అన్న భావన ఎల్లప్పుడూ ఉంది. చాలా కాలం తర్వాత నా నటన, నా పని వల్ల నేను విలువ లేని దానిని, యోగ్యత లేని దానిని కాదు. నా వల్ల వాల్యూ ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చింది. మిలీ చూసిన తర్వాత ఈ సినిమాలో బాగా చేసింది, వాళ్ల కూతురు కాబట్టి ఈమెకు ఇది రాలేదు అనుకుంటారు, అంటే నాకు నేను గొప్పలు చెప్పుకుంటున్నానని కాదు...వారికి నా నటన నచ్చుతుందనే అనుకుంటున్నా.

Janhvi Kapoor

ఫొటో సోర్స్, Janhvi Kapoor

ఇంత జరిగిన తర్వాత ఎవరైనా నిజంగానే మీ నటనను పొగుడుతుంటే మీకు నమ్మకం కలుగుతుందా లేక ఇంకా అపనమ్మకంగానే ఉంటారా?

జాన్వీ కపూర్: కచ్చితంగా అపనమ్మకంగానే అనిపిస్తుంటుంది. ఎవరి నుంచి పొగడ్తలు విన్నా కూడా.. ఇది ఎవరైనా చేయించారా? వీళ్లు నాన్నకు తెలిసిన వాళ్లా? ఇలా.. నాకు నేనే ప్రశ్నలు వేసుకుంటూ ఆ పొగడ్తలను అనుమానిస్తుంటాను. బహుశా ఇదంతా ఒక భారం. ఇది నేను మోస్తూనే ఉండాలి. అయితే, గుడ్‌లక్ జెర్రీ సినిమాలో నటనకు నాకు లభించిన ఆదరణ తర్వాత ఎవరు అబద్ధం చెబుతున్నారో, ఎవరు నిజం చెబుతున్నారో నేను అర్థం చేసుకోగలను. అనుభవం ఉన్న, నిపుణులైన దర్శకులతో పనిచేస్తున్నాను. వాళ్లు కూడా నా గురించి కొన్ని సానుకూల విషయాలు చెబుతుంటారు. అలా చెప్పడం వల్ల వారికేం వస్తుంది. బహుశా నేను నిజంగానే మెరుగ్గా ఉన్నాను అనిపిస్తుంది. నెమ్మదిగా నామీద నాకు విశ్వాసం పెరుగుతోంది.

వీడియో క్యాప్షన్, జాన్వీ కపూర్ ఇంటర్వ్యూ: ‘...అలాంటి కామెంట్ల వల్ల సినిమాలే మానేద్దామనుకున్నా’

మిలీ ఒక సర్వైవల్ స్టోరీ, మీ నాన్నే నిర్మాత ఒక దక్షిణాది సినిమా రీమేక్. ప్రెజర్ ఉంటుంది. ఇంతకాలం ఆయన ఎందుకు మీతో సినిమాలు చేయలేదు? ఎందుకంటే అర్జున్ కపూర్‌తో కూడా ఆయన కొన్ని సినిమాలు చేశారు.

జాన్వీ కపూర్: ఈ విషయంలో ఆయన చాలా క్లియర్‌గా ఉన్నారు. నా మొదటి సినిమా ఆయన తీయరని నాకు తెలుసు. నేనే బయటకు వెళ్లి వెతుక్కోవాలి. అదృష్టవశాత్తూ నాకు ధఢక్ లభించింది. సొంత పిల్లల కోసం సినిమాలు తీయడం చాలా ఈజీ. కానీ, ఆయన చాలా గొప్ప మనిషి. నేను ఇప్పటి వరకూ వేరే నిర్మాతల సినిమాల్లో చేయడం పట్ల సంతోషంగా ఉన్నా.

సోషల్ మీడియాలో మీ గురించి పెట్టే కామెంట్స్ చూసి మీపై, మీ నాన్నపై ప్రభావం చూపాయా.

జాన్వీ కపూర్: రాసిన రాతలు ఆయనపై ఎఫెక్ట్ చూపవు. నేను వాటన్నింటినీ నమ్మడం మొదలైతే అవి ఆయనపై ప్రభావం చూపుతాయి. అంటే గుంజన్ రిలీజైనప్పుడు మంచి సినిమా అయినా నా నటనలో కొన్ని లోపాలున్నాయి. కానీ దాన్ని అబౌ యావరేజ్ పెర్ఫామెన్సుగా చూసుండాలి. అప్పట్లో యాంటీ నెపోటిజం వేవ్ తీవ్రంగా ఉంది. దాంతో కొన్ని కామెంట్లను నేను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. కొన్ని చాలా డార్క్ కామెంట్లు. అంటే 'థాంక్ గాడ్ ఈ సినిమా చూడక ముందే వీళ్లమ్మ చనిపోయింది' అనేలా ఘోరమైన కామెంట్లు పెట్టారు. వాటి ప్రభావం నాపై పడింది. నన్ను చూసి నాన్న అప్‌సెట్ అయ్యారు. అప్పుడే నాకో సినిమా అవకాశం వచ్చింది. నేను వద్దని చెప్పాను. 'నాకొద్దు నాన్నా. ప్రజలు నన్ను ఇష్టపడరు' అని చెప్పేశాను. ఆయన మాత్రం.. 'లేదు. నీ కళ్లకు అలా కనిపిస్తోంది. నీలో ప్రతిభ ఉంది' అన్నారు. ఆయన ఇచ్చిన ఆ భరోసా నాకు నిజంగా చాలా ఉపయోగపడింది. నేను తిరిగి మామూలు మనిషి అయ్యేలా చేసింది.

జాన్వీ కపూర్

మీ పర్సనాలిటీపై, మీ బట్టలపై, ట్రోలింగ్, అటాక్ లాంటివి ఉంటాయి. అంటే అలాంటి ప్రభావం నాపై లేదు అని చూపించుకునేలా ఉంటారా. లేదంటే వాటికి అలవాటుపడిపోయారా..

జాన్వీ కపూర్: నాపై ప్రభావం లేదు లేదు అని చెప్పుకుంటూ ఇప్పుడు నాపై ప్రభావం చూపడం లేదు. మీకు నా బట్టలు నచ్చకపోతే, నేనేమైనా వాటిని మీకు వేస్తున్నానా. నేనే వేసుకుంటున్నా. నాకది బాగానే ఉంటుంది. నాకోసం నేను డ్రెస్ వేసుకుంటున్నా. మా నాన్నకే సమస్య లేనపుడు, అడగడానికి మీరెవరు.

మీ అన్నయ్య అర్జున్ కపూర్ ఇప్పటికే సినిమాలు చేస్తున్నారు. మీరు సినిమాలు చేస్తున్నారు. అన్షులా కూడా సినిమాల్లోకి రాబోతోంది. మీరంతా ఒక పెద్ద జట్టు కాబోతున్నారా?

జాన్వీ కపూర్: పెద్ద జట్టు అని నేను అనుకోను. కానీ నాకు మద్దతు ఇచ్చే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. నాకు మరో ఇద్దరి నుంచి మద్దతు, ప్రేమ లభిస్తోంది.

ఖుషీ సినిమాల్లోకి రాబోతోంది. ఇవన్నీ ఎదుర్కునేలా ఆమెను మీరు ప్రిపేర్ చేస్తున్నారా.

జాన్వీ కపూర్: తనే నాకు చెబుతుంది. సలహాలిస్తుంది. తనకు నా సలహాలేవీ అవసరం లేదు. నాలా తను కూడా వేరే వాళ్ల అమోదం పొందాల్సిన అవసరం లేదనిపిస్తుంది. నేను చేసిన ఒక తప్పు ఏదనిపిస్తుందంటే.. నేను యాక్టర్ అయిన తర్వాత మా అమ్మ నుంచి పొందాల్సిన ప్రేమ, ఆదరణ, గుర్తింపును ఆమె చనిపోయినందువల్ల నేను ప్రేక్షకుల నుంచి ఆశించాను. కానీ, పొందలేకపోయాను. దీంతో నేను బాధపడాల్సిన దానికంటే ఎక్కువ బాధపడ్డాను.

వీడియో క్యాప్షన్, శ్రీదేవి మరణం: జీవిత విశేషాలు క్లుప్తంగా...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)