పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ vs ఆర్మీ.. ఈ పోరులో గెలిచేదెవరు?

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, @PTI

    • రచయిత, హరూన్ రషీద్
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్, ఇస్లామాబాద్

ఇమ్రాన్ ఖాన్ తన రాజకీయ జీవితంలో మరో లాంగ్ మార్చ్ ప్రారంభించారు. అందుకోసం అక్టోబర్ 28న లాహోర్ నుంచి బయలుదేరారు.

ఇమ్రాన్ ఖాన్ దీనిని 'హకీకీ ఆజాదీ మార్చ్' (నిజమైన స్వతంత్రం కోసం ర్యాలీ) అని పిలుస్తున్నారు. కానీ, దీని ఏకైక లక్ష్యం దేశంలో సార్వత్రిక ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించడం.

అయితే, ఇది పాకిస్తాన్ సైన్యం, ఇమ్రాన్ ఖాన్ మధ్య ప్రత్యక్ష ఘర్షణలా తయారైంది.

తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశంలో ఇమ్రాన్ ఖాన్ యాత్ర దీర్ఘకాల రాజకీయ ఘర్షణలను పెంచడానికే సహకరించేటట్లు కనిపిస్తోంది.

యాత్ర మొదటి సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ సంస్థలపై, ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ నదీమ్‌పై విరుచుకుపడ్డారు. అంతకు ముందు రోజు లెఫ్టినెంట్ జనరల్ నదీమ్‌ నిర్వహించిన విలేఖరుల సమావేశాన్ని ఎగతాళి చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"మేము (సైన్యం) రాజకీయాలు చేయమని మీరు చెప్పారు. కానీ, మీరు నిర్వహించిన రాజకీయ మీడియా సమావేశం లాంటిది షేక్ రషీద్ కూడా ఎప్పుడూ చేయలేదు" అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

సైన్యం గురించి మాట్లాడుతూ, "మీరు నిష్పక్షపాతంగా లేరని ఈ మీడియా సమావేశం రుజువు చేసింది. మొత్తం సమావేశంలో మీరు నా వ్యక్తిత్వంపైనే గురిపెట్టారు. 'ఆ దొంగల' గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు" అన్నారు.

"ఐఎస్ఐ డీజీ.. చెవులు తెరుచుకుని వినండి. నాకు చాలా తెలుసు. కానీ, నా దేశం, దాని సంస్థల కోసం నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే నేను నా దేశానికి హాని తలపెట్టలేను" అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

పాకిస్తాన్

ఇమ్రాన్ ఖాన్, సైన్యం మధ్య ఉత్కంఠమైన మ్యాచ్

సైన్యంపై ఇమ్రాన్ ఖాన్ పదునైన విమర్శల తరువాత, సైనిక పరిపాలన, ఇమ్రాన్ ఖాన్ మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠంగా, నాటకీయంగా మారింది.

ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం, ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మధ్య మొదలైన రాజకీయ పోరు ఇప్పుడు పీటీఐ vs సైన్యంగా మారింది.

పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేతృత్వంలోని 11 పార్టీల అధికార కూటమికి ప్రేక్షకపాత్రే మిగిలింది. ఆ పార్టీ మంత్రులు మీడియా సమావేశాలు, ప్రకటనల ద్వారా సైన్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఇప్పుడు వారికి రాజకీయంగా ఏ రకమైన ప్రాధాన్యం లేదు.

గతంలో నవాజ్ షరీఫ్ నాయకత్వంలో పీఎంఎల్-ఎన్ పార్టీ కూడా సైన్యంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ విషయంలో పీఎంఎల్-ఎన్, పీటీఐ మధ్య సారూప్యత కనిపిస్తోంది.

మరోపక్క, రాజకీయంగా చాలా నష్టపోయిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఓ ఒడ్డున నిల్చుని నిశ్శబ్దంగా చూస్తోంది.

ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ ప్రకటించడంతోనే, ఎన్నికలు త్వరగా రావాలని ఆయన కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.

ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆయన ఎలాంటి కథలైనా చెబుతారు. తన మార్గంలో ఎలాంటి అడ్డంకిని సహించరు. అది దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యవస్థ 'సైన్యం' అయినా సరే.

ఇమ్రాన్ ఖాన్

ఊహించని ఎత్తుగడ వేసిన ఐఎస్ఐ

పాకిస్తాన్‌లో తమ ప్రభుత్వం పడిపోవడం వెనుక అమెరికా హస్తం ఉందని ఇమ్రాన్ ఖాన్ చేసిన వాదనలను తప్పని పాకిస్తాన్ సైన్యం పదే పదే రుజువు చేసింది. అలాగే, ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బజ్వా 'దేశద్రోహి' అని, అత్యాశపరుడని, తన పదవీకాలాన్ని పొడిగించాలని కోరుకుంటున్నారని పీటీఐ చేసిన ఆరోపణలను కూడా తప్పని నిరూపించింది.

జనరల్ బజ్వా 'దేశద్రోహి' అయితే ఇమ్రాన్ ఖాన్ ఆయన పదవిని ఎందుకు పొడిగించారని ఐఎస్ఐ చీఫ్ మీడియా ముందు ప్రశ్నించారు. ఆర్మీ అధికార ప్రతినిధి, ఐఎస్‌ఐ చీఫ్‌ల సంయుక్త మీడియా సమావేశం పాకిస్తాన్ చరిత్రలో అత్యంత అసాధారణమైన విషయం.

సోషల్ మీడియాలో నిత్యం విమర్శలు ఎదురవడంతో సైన్యం ఈ చర్యలు తీసుకుంది. అయితే, దాని ప్రభావం పెద్దగా ఉన్నట్టు కనిపించలేదు. ఇమ్రాన్ ఖాన్ కూడా సైన్యంపై అదే విధంగా విరుచుకుపడుతున్నారు.

ఇప్పుడిక సైన్యం వద్ద చాలా తక్కువ అస్త్రాలు, కానీ చాలా ప్రమాదకరమైనవి మిగిలి ఉంటాయి.

ఇమ్రాన్ ఖాన్ ఆరు నెలల పాటు ఎదురుచూసి, హఠాత్తుగా ఈ లాంగ్ మార్చ్ ప్రకటించడానికి రెండు పెద్ద కారణాలు కనిపిస్తున్నాయి.

ఒకటి, అధికారిక బహుమతులను బహిర్గతం చేయనందుకు ఎన్నికల కమిషన్ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించడం. రెండు, ఆయనకు బలంగా మద్దతిచ్చే జర్నలిస్టులలో ఒకరైన అర్షద్ షరీఫ్‌ను కెన్యాలో హత్య చేయడం. అందుకే, ఆయన వీధుల్లోకి వచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కానీ, ఇమ్రాన్ ఖాన్ మనశ్శాంతిని పోగొట్టే అతిపెద్ద విషయం, ఈ నవంబర్‌లో చేపట్టబోయే కొత్త ఆర్మీ చీఫ్‌ నియామకం.

ఇంతటి ముఖ్యమైన పదవిని నిర్ణయించే హక్కు ఇప్పుడున్న 'దొంగలకు' లేదని, ఎన్నికల తరువాత ఈ నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వానికి వదిలేయాలని గతంలో ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు నచ్చినట్టు జరిగేలా కనిపించడం లేదు. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడకపోవచ్చు.

వీడియో క్యాప్షన్, పాకిస్తానీ పంజాబ్‌ రాష్ట్రంలో కోల్పోయిన అధికారాన్ని మళ్లీ పొందిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ

సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ టీమ్ ఆధిపత్యం

ఇమ్రాన్ ఖాన్ తన ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు, ఒక్కోసారి రోజుకు రెండుసార్లు, మూడుసార్లు కూడా బహిరంగ సభలు నిర్వహించారు. ప్రసంగాలు చేశారు.

ఇప్పుడు, యాత్ర ప్రకటించినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ తన ఓటర్లు, మద్దతుదారులతో మరింత దగ్గర సంబంధాలను నెరపేందుకు సన్నాహాలు చేసుకున్నారు.

ఎలక్ట్రానిక్ మీడియాను పర్యవేక్షించే సంస్థ 'పెమ్రా' పాకిస్తాన్‌లో ఆయన ప్రసంగాలను న్యూస్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిషేధించినప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ పార్టీ సోషల్ మీడియాను అత్యంత ప్రభావవంతంగా ఉపయోగించుకుంటోంది.

ఆయన ప్రతిరోజూ జీటీ రోడ్డులో ప్రసంగాలు చేస్తారు. అనుకున్న విధంగా యాత్ర ముందుకు సాగితే నవంబర్ 4కు ఇస్లామాబాద్ చేరుకుంటారు.

అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇస్లామాబాద్‌ను పూర్తిగా మూసివేసేందుకు ఏర్పాట్లు చేసింది. బహుశా ఏదో ఒక్క చోటే ధర్నా చేసేందుకు పీటీఐని అనుమతించవచ్చు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, EPA

బాధితులను ఆదుకునే వారెవరూ లేరు

ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి ఎంత మంది వీధుల్లోకి వస్తారు, ఎంత మంది ధర్నాకు కూర్చుంటారు అనేది యాత్ర ఇస్లామాబాద్ చేరుకున్న తరువాత తెలుస్తుంది. కానీ వారు శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తే ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందేం ఉండకూడదు.

అయితే, ఆయన ప్రసంగాలు ప్రభుత్వం, ప్రత్యేకించి వివిధ సంస్థలపై ఒత్తిడి తెస్తూనే ఉంటాయి. దీన్ని వారు ఎక్కువ కాలం సహించకపోవచ్చు.

ఈ రాజకీయ అనిశ్చితి పాకిస్తాన్ ప్రజలను మరింత కలవరపెడుతోంది.రాజకీయ అస్థిరత స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. గత శుక్రవారం షేర్లు పతనమయ్యాయి.

ఇప్పటికే ద్రవ్యోల్బణం, పెరుగుతున్న తీవ్రవాద దాడులతో పౌరులు ఇబ్బంది పడుతున్నారు.

ఇటీవల పాకిస్తాన్‌ను ముంచెత్తిన వరదలలో లక్షలాది మంది ఆవాసాలు కోల్పోయారు. వారి పరిస్థితిని పట్టించుకునేవారు ఎవరూ లేరు. ఈ సంక్షోభం సమీప భవిష్యత్తులో ముగిసేలా కనిపించడం లేదు.

వీడియో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్: మేటి క్రికెటర్ నుంచి పదవీచ్యుత ప్రధాని వరకు.. పదవీచ్యుత నేత ప్రస్థానం ఇది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)