క్యూబా జనాభా 25 ఏళ్లుగా ఎందుకు పెరగడం లేదు... కారణాలేంటి, పరిణామాలు ఎలా ఉంటాయి

ఫొటో సోర్స్, NURPHOTO
- రచయిత, అతహువల్పా అమెరిసే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచ జనాభా మరి కొద్ది రోజుల్లో 800 కోట్లకు చేరనుందని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. 700 కోట్ల నుంచి 800 కోట్లకు చేరడానికి 12 ఏళ్లు పట్టింది.
చివరి 25 సంవత్సరాలలో ప్రపంచ జనాభా సగటున 1.2 శాతం చొప్పున పెరిగింది. 2011 నుంచి 2020 మధ్య భారత దేశ జనాభా సుమారు 1శాతం పెరిగిందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది.
లాటిన్ అమెరికాలో ఇదే ధోరణి కొనసాగుతోంది. అక్కడ జనాభా ఇప్పటికే 60 కోట్లు దాటింది. కానీ క్యూబాలో మాత్రం జనభా పెరగలేదు.
యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఒక దేశ జనాభాలో పెరుగుదల లేకపోవడం లేదా తరిగిపోవడం అనేది సాధారణంగా జరగదు.
1984లో క్యూబా జానాభా ఒక కోటి దాటింది. 1997లో 1.1 కోట్లకు చేరుకుంది. కొన్ని హెచ్చు, తగ్గుల తరువాత, తాజాగా 2021లో 1.11 కోట్లకు చేరుకుంది. గత పాతికేళ్లలో కేవలం లక్ష పెరిగింది.
క్యూబాలో జనాభా ఎందుకు పెరగట్లేదు?

ఫొటో సోర్స్, Getty Images
చరిత్రలోకి వెళితే..
"క్యూబాలో ఎవరినైనా మీకెంతమంది పిల్లలు కావాలి? అని అడిగితే ఇద్దరు అని ఠక్కువ చెబుతారు. మొదట బాబు, తరువాత పాప అని ఆర్డరు కూడా చెబుతారు. అది మా స్పానిష్ పూర్వీకుల నుంచి మాకు అందిన ఆదర్శం" అని జువాన్ కార్లోస్ అల్బిజు-కాంపోస్ బీబీసీతో చెప్పారు. హవానా యూనివర్సిటీలోని క్యూబా ఆర్థిక వ్యవస్థ అధ్యయన కేంద్రంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు అల్బిజు-కాంపోస్.
20వ శతాబ్దపు ప్రారంభం నుంచే క్యూబా జనాభా సరళి, లాటిన్ అమెరికాలోని ఇతర దేశాల కన్నా భిన్నంగా ఉన్నదని అల్బిజు-కాంపోస్ వివరించారు.
"1900లలోనే క్యూబా సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉండేది. సగటున ఒక తల్లికి ఆరుగురు పిల్లలు ఉండేవారు. అదే మెక్సికోలో ఒక తల్లికి ఏడుగురు పిల్లలు, మిగతా లాటిన్ అమెరికా దేశాల్లో అంతకంటే ఎక్కువే ఉండేవారు. క్యూబాలో చిన్న కుటుంబం పథకాన్ని అలవరచుకున్నారు" అని అల్బిజు-కాంపోస్ చెప్పారు.
గత శతాబ్దపు మొదటి సగంలోనే, ఆ ప్రాంతంలో ఇతర దేశాలు సాధించలేని ప్రగతిని క్యూబా సాధించింది. దాంతో, యూరప్ నుంచి ముఖ్యంగా స్పెయిన్ నుంచి భారీ సంఖ్యలో వలసదారులు క్యూబాకు తరలివచ్చారు.
ఈ రెండు అంశాలూ క్యుబాలో జనాభా పెరుగుదల సరళి భిన్నంగా ఉండడానికి కారణాలని చెప్పుకోవచ్చు.
1960 మొదలు శిశు మరణాల రేటు తగ్గడం, ఎక్కువమందికి వైద్య, ప్రసూతి సదుపాయాలు అందుబాటులోకి రావడం, మరికొన్ని ఇతర కారణాలు క్యూబాలో "బేబీ బూమ్"కు దారి తీశాయి.
అయితే, ఈ ప్రగతి ఒక దశాబ్దానికి మించి ముందుకు సాగలేదు. జనరేషనల్ రీప్లేస్‌మెంట్ (తరాల భర్తీ) జరగాలంటే సగటున ఒక మహిళకు 2.1 మంది పిల్లలు పుట్టాలన్నది లెక్క. 1970లలో క్యూబాలో ఈ రేటు మొదటిసారిగా క్షీణించింది.
1985 చివరికి, క్యూబాలో సంతానోత్పత్తి, ఆయుర్దాయం జోడీ అప్పటికే "యూరోపియన్ సగటుకు సమానంగా ఉంది. లాటిన్ అమెరికన్ సగటుకు దూరంగా ఉండేది" అని అల్బిజు-కాంపోస్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
జననాలు, మరణాలు, పేదరికం
గత ఆరు దశాబ్దాలలో క్యూబా చూడని అత్యల్ప జననాలు, అత్యధిక మరణాలు 2021లో నమోదయ్యాయి.
2021లో జననాల సంఖ్య అత్యల్పంగా 99,096 వద్ద నమోదు కాగా, మరణాల సంఖ్య అత్యధికంగా 1,67,645కు చేరుకుంది.
కోవిడ్ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరిగింది. జననాల సంఖ్య ఎన్నో ఏళ్లుగా తగ్గుతూ వస్తోంది. అదే ట్రెండ్ 2021లో కూడా కనిపించింది.
ప్రస్తుతం క్యూబాలో సంతానోత్పత్తి రేటు సగటున ప్రతి స్త్రీకి 1.45 పిల్లలు. ఇది భర్తీ రేటు కంటే చాలా తక్కువగా ఉంది. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం ఈ రేటు లాటిన్ అమెరికాలో సగటున 2.0గా ఉంది. దాని కన్నా కూడా క్యూబా రేటు తక్కువగా ఉంది.
క్యూబాలో ఆహారం, ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తులు, ఇతర ప్రాథమిక వస్తువుల కొరత తీవ్రంగా ఉన్న సమయంలో పైన చెప్పిన ట్రెండ్ కనిపిస్తోంది.
"మాల్తూసియనిజం ఆఫ్ పావర్టీ" అని పిలిచే పరిస్థితి క్యూబాలో దాపురించిందని అల్బిజు-కాంపోస్ అన్నారు.
బ్రిటిష్ ఆర్థికవేత్త థామస్ రాబర్ట్ మాల్థస్ (1766-1834) చరిత్రలో తొలి, అత్యంత ముఖ్యమైన జనాభా శాస్త్రవేత్తలో ఒకరు. వనరులు పరిమితంగా ఉన్నప్పుడు, జనాభా నియంత్రణ లేకుండా పెరిగితే జీవన ప్రమాణాలు తగ్గిపోతాయని, ఫలితంగా మరణాల రేటు పెరిగి జనాభా నియంత్రణలోకి వస్తుందన్నది ఆయన చెప్పిన సిద్ధాంతం.
"క్యూబాలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ. మూడు, నాలుగు తరాలు కలిసి ఒకే ఇంట్లో జీవిస్తాయి. ఆహర కొరత కూడా ఉండడంతో, పిల్లల్ని కనాలనుకునే ప్రతి జంటకు రెండు ప్రశ్నలు వస్తాయి. మొదటి ప్రశ్న.. ఇంట్లో పుట్టబోయే బిడ్డకు సరిపడా జాగా ఉందా? దీనికి సమాధానం దొరికాక, రెండో ప్రశ్న.. బిడ్డకు తిండి పెట్టగలమా? అని ఆలొచిస్తారు" అంటూ అల్బిజు-కాంపోస్ వివరించారు.
బిడ్డ పుడితే, అంటే కొత్తగా మరొక జీవి ఇంట్లోకి ప్రవేశిస్తే మిగతా కుటుంబ సభ్యులకు రిస్క్ అని నేడు క్యూబన్ మహిళలు భావిస్తున్నారు.
ఈ పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగినప్పుడు మహిళల సంతానోత్పత్తిలో క్షీణత కనిపిస్తుందని, పునరుత్పత్తి సరళి మారిపోతుందని 'ప్రత్యేక కాలం' దశకు చేరుతుందని అల్బిజు-కాంపోస్ అన్నారు.
ప్రత్యేక కాలం అంటే 1990లలో సోవియట్ యూనియన్ పతనం తరువాత క్యూబాలో సంభవించిన తీవ్ర సంక్షోభం, కొరత. కొందరు నిపుణులు ఆ సమయాన్ని నేటి కాలంతో పోల్చి చూస్తున్నారు.
"ప్రత్యేక కాలంలో ప్రతి మహిళ జన్మనిచ్చే బిడ్డల సంఖ్య 1.8 నుంచి 1.6కి పడిపోయింది. ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగింది. ఇది క్యూబా సమాజంలో పునరుత్పత్తి సరళిని మార్చివేసింది" అని అల్బిజు-కాంపోస్ వివరించారు.
క్యూబా జనాభా పిరమిడ్ యూరప్‌ను పోలి ఉందని, లాటిన్ అమెరికాలో మిగతా దేశాలతో పోలిస్తే క్యూబాలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉందని ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో అసోసియేట్ రిసెర్చర్, సోషియాలజీ డాక్టరేట్ ఎలైన్ అకోస్టా అన్నారు.
"యూరప్ సమాజాలతో పోల్చినా, క్యూబాలో 1970ల నుంచి ఇప్పటివరకు జనాభాలో వచ్చిన మార్పు చాలా పెద్దది. వృద్ధుల జనాభా 9 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది" అని అకోస్టా వివరించారు.
అయితే, అభివృద్ధి చెందిన దేశాలతో సమానమైన జనాభా పిరమిడ్ ఉండి, సంక్షేమం, మానవాభివృద్ధి క్రమంగా క్షీణించడం సమస్యాత్మకమని ఆమె అన్నారు.
మానవాభివృద్ధి సూచికలు పడిపోవడం వలనే జననాల రేటు తగ్గిందని అన్నారు. జనాభా పెరుగుదల నిలిచిపోవడానికి కారకమైన మరొక అంశం 'వలస'. మానవాభివృద్ధి సూచికలు పడిపోవడం వలన వలసలు కూడా పెరిగాయని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
వలసలు పెరగడం
గత 25 ఏళ్లలో దాదాపు పది లక్షల మంది క్యూబన్లు తమ దేశాన్ని విడిచిపెట్టినట్లు అంచనా. వారిలో 8,00,000 మంది అమెరికాకు వలస వెళ్లారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
కరోనా మహమ్మారి రాక ముందు వరకు ఏడాదికి 30,000 నుంచి 70,000 మంది వలస వెళ్లేవారు. కానీ, ఆ తరువాత 2022 మొదటి తొమ్మిది నెలల్లోనే 2,00,000 మంది క్యూబన్లు నార్త్ అమెరికా దేశాలకు వలస వెళ్లారు. ఈ సంఖ్య చారిత్రాత్మకమని నిపుణులు అంటున్నారు. ప్రత్యేక కాలంలో వలస వెళ్లినవారి సంఖ్య కన్నా ఇది ఎక్కువ.
"ద్రవ్యోల్బణం నియంత్రించలేని విధంగా పెరిగిపోవడం, జీతాలు, పింఛన్ల వాస్తవ విలువలో తరుగుదల, ఆహార భద్రత లేకపోవడం, మందుల కొరత, నివాస ప్రాంతాలు తగ్గిపోవడం మొదలైనవన్నీ సంక్షేమం, మానవాభివృద్ధిని కనిష్ట స్థాయిలకు చేర్చాయని" అకోస్టా అన్నారు.
"ఇవన్నీ కూడా యువతపై బాగా ప్రభావం చూపించాయి. 2021లో విదేశీ ప్రయాణాలకు ద్వారాలు తెరుచుకోగానే యువతతో పాటు వృద్ధులు కూడా బయటి దేశాలకు వలస వెళ్లడానికే మొగ్గుచూపారు" అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
జనాభా ఒక కోటికి పడిపోతుందా?
25 ఏళ్ల పాటు జనాభా పెరుగదల నిలిచిపోయిన తరువాత, ఇప్పుడు వలసల కారణంగా తరుగుదల మొదలవుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా యువత తరలివెళ్లిపోతే, సంతానోత్పత్తి తగ్గిపోయి జనాభా క్షీణిస్తుందని అంచనా వేస్తున్నారు.
అయితే, 2030కి క్యూబన్ జనాభా కోటికి పడిపోతుందని అల్బిజు-కాంపోస్ అంచనా వేస్తున్నారు. అప్పటికి 1960లకు చెందిన బేబీ బూమ్ తరం వృద్ధ్యాప్యంలోకి వచ్చేస్తుంది.
"వలస వెళ్లిపోతున్న యువత, మరణాల రేటు పెరగడం.. జనాభా తరుగుదలకు దారి తీయవచ్చు" అని అల్బిజు-కాంపోస్ అన్నారు.
2050 నాటికి క్యూబా జనాభా పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం, 2050 నాటికి 1.1 కోట్ల జనాభాలో 37 లక్షల కంటే ఎక్కువ మంది 60 ఏళ్లు దాటినవారు, 13 లక్షల మంది 80 ఏళ్లు దాటిన వారు ఉంటారు.
క్యూబన్ జనాభాలో వృద్ధులు ఎక్కువ శాతం ఉన్నారు. వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోంది కూడా.
పై అంచనాలు ప్రస్తుత వలస సంక్షోభానికి ముందు తయారుచేసినవని, వాస్తవంలో జనాభా తరుగుదల మరింత ఎక్కువగా ఉండవచ్చని ఎలైన్ అకోస్టా అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- పరోటాకు, రోటీకి, వేర్వేరు జీఎస్టీ ఎందుకు, పార్లర్ ఐస్‌క్రీమ్‌కు, హోటల్ ఐస్‌క్రీమ్‌కు తేడా ఏంటి?
- కరెన్సీ నోట్ల మీద లక్ష్మీ దేవి, వినాయకుడి బొమ్మలు ముద్రించడం సాధ్యమేనా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఏమంటున్నారు
- ‘‘నేను గర్భవతిని, వానొస్తే గుడిసెలోకి నీళ్లొస్తాయి. పాములు తేళ్లు కూడా లోపలికి వస్తుంటాయి.''-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- 50 ఏళ్లుగా స్నానం చేయని మనిషి - స్నానం చేయించిన కొన్నాళ్లకే జబ్బు పడి మృతి
- అశ్లీల చాటింగ్‌ల వెనుక రహస్య సంధానకర్తలు..‘మీతో మాట్లాడేది మోడలా, మూడో మనిషా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











