పాకిస్తాన్: ‘ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేస్తే ఇస్లామాబాద్‌ను స్వాధీనం చేసుకుంటాం’ - మద్దతుదారుల హెచ్చరిక

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోలీసులను, న్యాయవ్యవస్థను బెదిరించారనే ఆరోపణలపై విచారణ మొదలైంది. ఆయన శనివారం చేసిన రాజకీయ ప్రసంగంలో ప్రభుత్వాధికారులను బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ వార్త బయటకు రాగానే ఇమ్రాన్ ఖాన్ ఇంటి దగ్గరకు భారీ సంఖ్యలో మద్దతుదారులు చేరుకున్నారు. దీంతో, ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేస్తే రాజధాని నగరాన్ని స్వాధీనం చేసుకుంటామని ఆయన మద్దతుదారులు హెచ్చరించారు.

ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్‌లో పదవీచ్యుతులైన తరువాత ప్రభుత్వాన్ని, సైన్యాన్ని బహిరంగంగా విమర్శిస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్‌పై పోలీసుల విచారణ మొదలయింది.

తన సన్నహితుడిని ఒకరిని దేశ ద్రోహం కేసులో అరెస్ట్ చేసి పోలీసులు వేధించారని ఇమ్రాన్ ఆరోపించారు.

ఆయన సన్నిహితున్ని బంధించడానికి ఇస్లామాబాద్ పోలీస్ చీఫ్, ఒక మహిళా జడ్జ్ కారణమని ఆయన శనివారం నాటి బహిరంగ సభలో ఆరోపించారు. తన పార్టీ కార్యకర్తతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారనీ ఆరోపించారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

"మేం మీపై తీసుకోబోయే చర్యలకు మీరు కూడా సిద్ధమవ్వండి" అని ఆయన పోలీసు చీఫ్, జడ్జిని ఉద్దేశిస్తూ హెచ్చరించారు.

మరోవైపు ప్రభుత్వ అధికారులను బెదిరించి ఇమ్రాన్ ఖాన్ తీవ్రవాద వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘించారని పోలీసులు చెబుతున్నారు.

పోలీసు విచారణ వార్త బయటకు వచ్చిన వెంటనే, కొన్ని వందల మంది మద్దతుదారులు ఇమ్రాన్ ఇంటి దగ్గరకు చేరారు.

పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లయితే రాజధాని నగరాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

అయితే, అక్కడున్న పోలీసులు మాత్రం ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు తాము రాలేదని చెబుతున్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకే వచ్చినట్లు చెబుతున్నారు.

పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఇమ్రాన్ ఖాన్‌కు మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఈ విచారణ మొదలైంది.

ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతులయ్యారు.

అప్పటి నుంచి ఆయన దేశమంతా తిరుగుతూ ఆవేశంపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. దేశంలో తాజాగా ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిస్తూ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని విమర్శిస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ సంస్థలపై విద్వేష ప్రచారం చేస్తున్నారని పాకిస్తాన్ మీడియా నియంత్రణ సంస్థ ఆరోపించింది. ఆయన ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేసే టీవీ చానెళ్లను నిషేధిస్తామని శనివారం ప్రకటించింది.

కాగా, ప్రభుత్వం తనను నియంత్రించాలని చూస్తోందని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. తన ప్రసంగాలపై నిషేధం విధించడాన్ని ఆయన తప్పుపడుతూ రావల్‌పిండిలో జరిగిన ర్యాలీలో విమర్శించారు.

"ఇమ్రాన్ ఖాన్ చేసిన నేరం ఏంటి? ఈ దొంగల ముఠాను నేనెప్పటికీ ఆమోదించను" అని ఆయన అన్నారు.

ఆయన ప్రసంగాన్ని ప్రజలు వినకుండా చేసేందుకు ప్రభుత్వం ఒక యూట్యూబ్ చానెల్ ప్రత్యక్ష ప్రసారాలను మధ్యలోనే నిలిపేసిందని ఆరోపించారు.

పదవి లేనప్పటికీ తనకున్న మద్దతు పట్ల ఆయన ధీమాతో ఉన్నారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తానీ పంజాబ్‌ రాష్ట్రంలో కోల్పోయిన అధికారాన్ని మళ్లీ పొందిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ

గత నెలలో జరిగిన ఉప ఎన్నికలో పీఎంఎల్ - ఎన్‌కు కంచుకోట లాంటి పంజాబ్ అసెంబ్లీ స్థానాన్ని పీటీఐ గెలుచుకుని ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచింది.

జులైలో జరిగిన ఈ ఉపఎన్నికలో సాధించిన విజయం ఓటర్లలో ఖాన్ కున్న ప్రాముఖ్యాన్ని తెలియచేస్తోంది.

ఆయన కోరుకున్నట్లుగా పాకిస్తాన్‌లో ముందస్తు ఎన్నికలు వస్తే జరిగే పరిణామాలను ఈ ఉప ఎన్నిక ఫలితం చెప్పిందని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

ఇమ్రాన్ ఖాన్ 2018లో పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. కానీ, ఆయన పదవీ కాలం ముగియక ముందే పార్లమెంటులో మెజారిటీని కోల్పోవడంతో పదవీచ్యుతులయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)