ఇమ్రాన్ ఖాన్‌పై దైవ దూషణ కేసు... మదీనాలో షాబాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా నినాదాలు

ఫొటో సోర్స్, EPA
సౌదీ అరేబియాలోని మదీనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, అతని ప్రతినిధుల బృందానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటనలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై దైవదూషణ కేసును నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన పార్టీ పీటీఐకి చెందిన ముఖ్య నేతలు, మరో 100 మందిపై ఫైసలాబాద్ పోలీసులు ఈ చర్యను తీసుకున్నారు.
మదీనాలోని మసీద్-ఎ-నబ్వీ పవిత్రతను, ఖురాన్‌లో ప్రవచనాలను ఉల్లంఘించారని ఇమ్రాన్ ఖాన్, ఫవాద్ చౌధరీ, షేక్ రషీద్, షాబాజ్ గుల్, షేక్ రషీద్ షఫీక్, సాహిబ్‌జాదా జహంగీర్ చికో, అనిల్ ముస్రత్, నబీల్ నుస్రత్, ఉమర్ ఇలియాస్, రాణా అబ్దుల్ సత్తార్, బారిష్టర్ అమీర్ ఇలియాస్, గౌహర్ జిలానీ, కాసిమ్ సూరీలతో పాటు దాదాపు 100 మంది వ్యక్తులపై ఆరోపణలు వచ్చాయి.
నయీమ్ భట్టీ అనే ఒక స్థానికుని ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.
పాకిస్తాన్ చెందిన ఒక తీవ్రవాదుల బృందాన్ని సౌదీ అరేబియాకు పంపారని, బ్రిటన్ నుంచి ఆ బృందం సౌదీ అరేబియాకు చేరుకుందని, దీనికి సంబంధించిన సాక్ష్యాలను విచారణ సమయంలో అందజేస్తామని కేసులో పేర్కొన్నారు.
కేసు నమోదు అయిన సంగతిని ఫైసలాబాద్ పోలీసులు ధ్రువీకరించారు. దీనిపై దర్యాప్తు చేసిన తర్వాత కేసును కొట్టివేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.

ఫొటో సోర్స్, @PAKPMO
పాకిస్తానీ వ్యక్తులను అరెస్ట్ చేసిన సౌదీ పోలీసులు
మదీనాలోని మొహమ్మద్ ప్రవక్త మసీదులో గురువారం జరిగిన ఘటనకు సంబంధించి అయిదుగురు పాకిస్తానీయులను అరెస్టు చేసినట్లు అంతకుముందే పోలీసులు ధ్రువీకరించారు.
''భద్రత అధికారులు, అయిదుగురు పాకిస్తాన్ జాతీయుల్ని అరెస్టు చేశారు. న్యాయపరమైన ప్రక్రియలు ముగిసిన తర్వాత ఈ కేసును సంబంధిత అధికారులకు అప్పగిస్తామని'' మదీనా పోలీసు ప్రతినిధిని ఉటంకిస్తూ సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఏం జరిగింది?
ప్రధానమంత్రి అయ్యాక షాబాజ్ షరీఫ్, తన కేబినెట్‌లోని మంత్రులతో కలిసి మూడు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మదీనాలోని 'మసీద్-ఎ-నబ్వీ'ని సందర్శించారు. అక్కడ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు వారిని ముట్టడించి వ్యతిరేక నినాదాలు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. షాబాజ్ బృందానికి వ్యతిరేకంగా ప్రజలు దొంగ-దొంగ అంటూ నినాదాలు చేయడం ఆ వీడియోల్లో వినబడుతోంది. నార్కోటిక్స్ మంత్రి నవాబ్ షాజైన్ బుగ్, మరియమ్ నవాజ్‌లకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడం వీడియోలో రికార్డు అయింది.
చాలామంది ఈ ఘటనను ఖండించగా, పెద్ద సంఖ్యలో పీటీఐ నాయకులు, మద్దతుదారులు సోషల్ మీడియాలో ఈ ఘటనను సమర్థించారు. పాకిస్తాన్ సోషల్ మీడియాలో రాజకీయాలపై ప్రజల్లో పెరుగుతోన్న విభేదాల గురించి పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, PRIME MINISTER OFFICE/PAKISTAN
పాకిస్తాన్‌లో గతంలో ఇలాగే జరిగింది
ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. దీనికంటే ముందు ఏప్రిల్‌లో ఒక రోజు సాయంత్రం పెషావర్‌లో ఇలాంటి ఒక ఘటనను అవామీ నేషనల్ పార్టీ మద్దతుదారుడు, బ్యాంకర్ జియావుల్లా షా ప్రత్యక్షంగా చూశారు.
తన కారును మరమ్మతు చేస్తోన్న సమయంలో ఆయన... కరాచీలో పీటీఐ ర్యాలీని ప్రత్యక్ష ప్రసారం చేయడం కోసం చుట్టూ పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయడాన్ని గమనించారు. రాత్రి వరకు ఈ స్క్రీన్ల దగ్గర పెద్దసంఖ్యలో జనాలు పోగయ్యారు. వారు డీజల్-డీజల్ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, డీజల్ అనే పదాన్ని తన ప్రత్యర్థి మౌలానా ఫజ్లుర్ రెహమాన్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
''కాసేపటికి ఫజ్లూర్ రెహమాన్ మద్దతుదారులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా 'యూదుల ఏజెంట్' అని నినాదాలు చేయడం ప్రారంభించారు. పరిస్థితిని చూస్తుంటే అక్కడ ఏ క్షణానైనా హింస చెలరేగుతుందేమో అని భయంగా అనిపించింది'' అని జియావుల్లా షా తెలిపారు.
దేశంలోని అత్యున్నత మిలిటరీ, ఇంటెలిజెన్స్ నాయకత్వం, ఈ ఘటలో ''విదేశీ కుట్ర''కు సంబంధించి ఎలాంటి ఆధారాలు కనుగొనలేదని వెల్లడించింది.
ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రత కమిటీ సమావేశం అనంతరం... ఈ ఘటన దర్యాప్తులో విదేశీ కుట్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రకటించారు.
జాతీయ భద్రతా ఏజెన్సీలు కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటించాయి. పాక్ భద్రతా ఏజెన్సీల ప్రకటనను అమెరికా స్వాగతించింది.
కానీ, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మాత్రం పదే పదే ఇవే ఆరోపణలు చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ కూడా దీనిపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ర్యాలీలలో, సోషల్ మీడియాలో ఆయన తాజా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలను షేర్ చేస్తోన్న ఘటనలు పెరిగిపోతున్నాయి. దీన్నిబట్టి చూస్తే రాజకీయాలకు సంబంధించి సమాజంలో విభేదాలు ముదురుతున్నాయని, సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు, విమర్శకులకు మధ్య చర్చలు జరుగుతున్నాయని అనిపిస్తోంది.
ఈ రోజుల్లో పాకిస్తాన్ రాజకీయాల గురించి మాట్లాడటం కష్టంగా మారిందని జియావుల్లా షా చెప్పారు. ''వీటి గురించి మాట్లాడితే మీ పరిచయస్థులు వాట్సాప్ గ్రూప్ నుంచి వెళ్లిపోతారు లేదా దూరంగా ఉంటారు లేదా తిట్టడం లాంటివి చేస్తుంటారు'' అని ఆయన తెలిపారు.
తమను అధికారం నుంచి దించడానికి ప్రత్యర్థులు తమపై విదేశీ కుట్రను పన్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఇలా ఆరోపిస్తూనే పొరపాటున ఇందులో అమెరికా హస్తమున్నట్లు కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడానికి ముందు నుంచే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












