Tirupati: నవంబర్ 1 నుంచి శ్రీవారి టైంస్లాట్ సర్వ దర్శనం టోకెన్ల జారీ మళ్లీ ప్రారంభం

- రచయిత, ఎన్. తులసీప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టైంస్లాట్ సర్వ దర్శనం(ఎస్ఎస్‌డీ) టోకెన్లు మళ్లీ జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
నవంబర్ 1 నుంచి ఈ సర్వ దర్శనం టోకన్ల జారీని పునఃప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
‘టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు భక్తుల సౌకర్యార్థం నవంబరు 1 నుంచి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తాం. ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశాం. భక్తుల విజ్ఞప్తి మేరకు వీటిని తిరిగి ప్రారంభిస్తున్నాం. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గల రెండో సత్రంలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తాం’’ అన్నారు ధర్మారెడ్డి.

ఏ రోజు ఎన్ని టోకెన్లు ఇస్తారంటే..
ఏ రోజు దర్శనానికి ఆ రోజే టోకెన్లు జారీ చేస్తారు. కోటా పూర్తయ్యాక కౌంటర్లు మూసివేస్తారు.
మంగళ, గురు, శుక్రవారాలలో రోజుకు 15 వేల టోకెన్ల చొప్పున భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
శని, ఆది, సోమ, బుధవారాల్లో 20 వేల నుండి 25 వేల టోకెన్లు అందుబాటులో ఉంచనున్నట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
టోకెన్లు జారీ చేసే కౌంటర్లలో కంప్యూటర్లు, కెమెరాలు, ఆధార్ నమోదు వ్యవస్థ, తాగునీరు, క్యూలైన్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్లు ఈవో చెప్పారు.
టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చని ఆయన అన్నారు.
కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిన తర్వాత టోకన్ కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరగడంతో ఎలాంటి టోకెన్లూ లేకుండానే భక్తులను సర్వదర్శనానికి అనుమతించడం ప్రారంభించింది టీటీడీ.
ఆ తర్వాత ఈ ఎస్ఎస్డీ టోకెన్ సిస్టమ్ పూర్తిగా ఆపివేసింది. ఇప్పుడు మళ్లీ టైంస్లాట్ బుకింగ్ ప్రారంబిస్తామని చెప్పడంతో తిరుమలకు వచ్చే భక్తులకు ఉపశమనం కలిగినట్లయింది.

‘పిల్లలతో పాటు 32 గంటలు ఇబ్బందిపడ్డాం’
చిన్న పిల్లలతో కలిసి గంటలు గంటలు క్యూ కాంప్లెక్స్‌లలో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉందని, ఎస్ఎస్డీ ఆన్లైన్ ఉంటే టికెట్ బుక్ చేసుకుని నేరుగా దర్శనం చేసుకునేవాళ్లమని ధర్మవరానికి చెందిన జగదీష్ బీబీసీతో చెప్పారు.
జగదీష్ తన కుటుంబంతో కలిసి అక్టోబర్ 29న తిరుమల వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు.
''మాకు దర్శనానికి 32 గంటలు పట్టింది. చిన్న పిల్లలు అల్లాడిపోయారు. పిల్లలకు ఎమర్జెన్సీ అని చెప్పినా బయటకు పంపలేదు. ఆహారం ఇచ్చారు కానీ పిల్లలకు కావాల్సిన పాలు, మందులు సరిగా లేవు. కూర్చోవడానికి కూడా లేక నిలబడే ఉన్నాం. అదే స్లాట్ సర్వ దర్శనం ఉండుంటే నేరుగా వచ్చి దర్శనం చేసుకునేవాళ్లం. అది లేక చాలా ఇబ్బందులు పడ్డాం''అన్నారు.
తిరుమలలో భక్తుల ఇక్కట్లు

తమకు దర్శనానికి 31 గంటలు పట్టిందని, క్యూలైన్లో ఇబ్బందులు పడ్డామని కర్ణాటక, రాయచూరుకు చెందిన భక్తుడు ప్రవీణ్ కుమార్ బీబీసీతో చెప్పాడు. ప్రవీణ్ అక్టోబర్ 28వ తేదీ తిరుమలలో దర్శనం చేసుకున్నారు.
''తిరుపతి రావాలంటే భయమేస్తుంది. స్వామివారి దర్శనం చేసుకోవాలంటే రెండు రోజులు పడుతుంది. రాను, పోను మరో రెండు రోజులు అవుతుంది. ఇలా అయితే చాలా కష్టం. మరోసారి తిరుపతికి రావాలనే ఆసక్తి పోయింది. మెన్న తెల్లవారు జామున నాలుగు గంటలకు దర్శనానికి వెళ్తే, నిన్న ఉదయం 11 గంటలకు భయటకు వచ్చాం. క్యూ లైన్లలో గంటలతరబడి ఉన్నాం. కాసేపు షెడ్‌లో పెట్టారు. రాత్రంతా మేలుకునే ఉన్నాం. ఇక తిరిగి వెళ్లే ఓపిక లేక కసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దామని ఆగాం. ఆన్ లైన్ టికెట్స్ ఉంటే మేం ఇంటి దగ్గరే బుక్ చేసుకుని వచ్చే వాళ్లం. 300 టికెట్ అయినా బుక్ చేసుకుని వెళ్తామంటే అవి కూడా దొరకలేదు'' అని ప్రవీణ్ చెప్పారు.

వీఐపీ బ్రేక్ దర్శనంలోనూ మార్పులు
కాగా వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నామని, డిసెంబర్ 1 నుంచి దీనిని ప్రయోగత్మకంగా అమలు చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
పీఠాధిపతులు, మఠాధిపతులు వచ్చినప్పుడు వీఐపీ బ్రేక్ సమయాల్లో మార్పులు ఉంటాయని, శుక్రవారం ఒక్కరోజు వీఐపీ బ్రేక్ ముగిశాక సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పారు.
''వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తాం. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం అమలు చేస్తాం. భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచితిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉంది, దానివల్ల తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గుతుంది. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో గదులు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఆఫ్‌లైన్ టికెట్లు కూడా మాధవంలోనే మంజూరు చేస్తాం'' అని ఈఓ చెప్పారు.

టైంస్లాట్ సర్వ దర్శనం టోకెన్ అంటే?
ఈ టైంస్లాట్ సర్వదర్శనం పథకం పాతదే. భక్తులు ఆధార్ కార్డు లాంటి తగిన గుర్తింపు కార్డు తీసుకుని, ఎస్ఎస్డీ కౌంటర్ దగ్గరికి చేరుకుని ఈ టోకెన్ తీసుకోవచ్చు.
ఈ విధానం ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం కోసం టైంస్లాట్ బుక్ చేసుకోవచ్చు, తమకు కేటాయించిన సమయానికి దర్శనం కోసం నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికే వెళ్లవచ్చు.
ఎస్ఎస్డీ టోకెన్ కౌంటర్ల దగ్గర సిబ్బంది భక్తుల గుర్తింపు కార్డు నమోదు చేసుకుని, ఫొటో ఎంట్రీ పాస్ ఇస్తారు. కేటాయించిన సమయానికి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు.
ఏఏ ధ్రువపత్రాలు చూపించొచ్చు..
ఈ ఎస్ఎస్డీ సర్వదర్శనం టోకెన్ కోసం వోటర్ ఐడీ, ఆధార్ కార్డును చూపించవచ్చు. 18 ఏళ్ల లోపు పిల్లలు ఐరిస్ ఇవ్వాల్సి ఉంటుంది.
తాము ఏ వివరాలు ఇచ్చామో, ఆ గుర్తింపు కార్డు తీసుకుని భక్తుల దర్శనం కోసం ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్లాలి. ఈ టోకెన్లను ఉచితంగా ఇస్తారు. దీనికి ఏమాత్రం వేచిచూడాల్సిన అవసరం ఉండదు.
టీటీడీ ఏర్పాటు చేసిన టైంస్లాట్ సర్వ దర్శనం కౌంటర్లకు వెళ్లి భక్తులు ఎక్కడైనా తమ ఎంట్రీ పాస్ పొందవచ్చు.
సామాన్య భక్తులు గంటలు గంటలు క్యూ కాంప్లెక్స్ లో వేచిచూడాల్సిన అవసరం లేకుండా, సులభంగా దర్శనం అందించేలా టీటీడీ ఈ పథకాన్ని 2016లో మొదటిసారి ప్రవేశపెట్టింది.
టైంస్లాట్ సర్వదర్శనం లేక భక్తులు గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
300 సర్వదర్శనం టోకెన్ లాగే టైంస్లాట్ సర్వదర్శనం కూడా ఆన్లైన్ లో ప్రవేశ పెట్టాలనే డిమాండ్ కూడా భక్తుల నుంచి వినిపిస్తోంది.

అసలు ఎందుకు ఆపేశారు?
అమలైనప్పటి నుంచీ ఎస్ఎస్డీ టోకెన్ దర్శనాలు బాగానే జరిగినా, 2022లో కోవిడ్ నిబంధనలను సడలించిన సమయంలో భక్తులు తిరుమలకు ఒక్కసారిగా పోటెత్తారు.
ఈ ఏడాది ఏప్రిల్ 12న తిరుపతిలోని ఎస్‌ఎస్‌డి కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరగడంతో టీటీడీ ఈ టోకెన్ల జారీ ఆపేసింది.
ఆ తర్వాత నుంచి ముందుగా వచ్చిన యాత్రికులనే దర్శనానికి అనుమతిస్తుండడంతో కొండపై రద్దీ అంతకంతకూ పెరిగిపోయింది.
ముఖ్యంగా శ్రీవారి భక్తులు పవిత్రంగా భావించే పెరటాశి నెలలాంటి సమయాల్లో, బ్రహ్మోత్సవాల సమయంలో యాత్రికులతో తిరుమల కిటకిటలాడుతుంది. కొన్ని రోజుల్లో శ్రీవారి దర్శనం కోసం 48 గంటలు కూడా వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వాలు మారినప్పుడు, అధికారులు మారినప్పుడల్లా విదానాలను మారుస్తూ టీటీడీని ఒక ప్రయోగశాలగా మార్చేశారని రాయలసీమ పోరాట సమితి కన్వినర్ నవీన్ కుమార్ రెడ్డి బీబీసీతో అన్నారు. సాధారణ భక్తులకంటే వీఐపీలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు.
''రద్దీ సమయాల్లో సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో ఉంటున్నారు. అదే ఎమ్మేల్యే, మంత్రులు వస్తే, వారి వెంట పదుల సంఖ్యలో వీఐపీలను, పారిశ్రామిక వేత్తలను తీసుకెళ్తున్నారు. సామాన్యులకు దర్శనం చేసుకున్న 3 నెలల తర్వాత మాత్రమే మళ్లీ దర్శనానికి వెళ్లగలరు. అదే ప్రజా ప్రతినిధులకు అలాంటి నిబంధనలు ఎందుకు వర్తించవు. వారానికి ఒకసారి ప్రజా ప్రతినిధులు తమకు కావాల్సిన వారిని తీసుకొచ్చే విధానాన్ని కట్టడి చేయాలి'' అన్నారాయన.

ఇప్పుడు మళ్లీ ఎందుకు ప్రవేశపెట్టారంటే..
గత కొంత కాలంగా తిరుమలలో శ్రీవారి భక్తుల కష్టాల గురించి వార్తా పత్రికల్లో కథనాలు రావడం. ఎస్ఎస్డీ టోకెన్లను జారీ చేయకపోవడం గురించి భక్తులు ప్రశ్నిస్తుండడంతో టీటీడీ ఈ దిశగా ఆలోచించినట్లు కొందరు చెబుతున్నారు.
మరోవైపు, టీటీడీ ఈ టోకెన్లు జారీ చేయడంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేసిందని, దానివల్ల శ్రీవారి భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
''గతంలో టికెట్ బుక్ చేసుకుని భక్తులు నేరుగా దర్శనానికి వచ్చేవారు. ఎస్ఎస్డీని అన్లైన్ చేస్తే తిరుపతి మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది. భక్తులు ఇచ్చిన డేట్, టైంకి అనుగుణంగా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని ఎక్కడెక్కడ తిరగాలో ప్లాన్ చేసుకుని వస్తారు. కరోనాకు ముందు కాలి నడకన వెళ్లే భక్తులకు మార్గమధ్యంలో దర్శనానికి టికెట్లు ఇచ్చేవారు. దాన్ని కూడా తీసేయడంతో నడిచి నడిచి అలిసిపోయిన భక్తులు మళ్లీ క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఆన్లైన్ బుకింగ్, కరెంట్ బుకింగ్, కాలినడక భక్తులకు టికెట్లు ఇవ్వడం వల్ల భక్తులకు కొతవరకు కష్టాలు తగ్గుతాయి. భక్తులు నేరుగా దర్శనం చేసుకుని వెళ్లిపోతారు. కాబట్టి కొండపై రద్దీకూడా తగ్గుతుంది. రూముల కోసం పడిగాపులు కాయాల్సిన పనికూడా ఉండదు. భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం ఉండదు''అని నవీన్ కుమార్ రెడ్డి చెప్పారు.
కాగా, భక్తులు ఇబ్బందులు పడుతుండడం, దీనికంటే మెరుగైన దర్శనం ఏదీ లేకపోవడంతో మళ్లీ ఎస్ఎస్డీ టోకన్లు ప్రవేశపెడుతున్నట్టు అధికారులు చెప్పారు.
ఈ టోకెన్ల ద్వారా ఒక భక్తుడికి దేవుడి దర్శనానికి హామీ లభించడంతోపాటూ, డబ్బులు చెల్లించి దర్శనం టిక్కెట్లు పొందిన మిగతా భక్తులతో సమానంగా ఆలయంలోకి అనుమతించడం జరుగుతుందని దర్మారెడ్డి అన్నారు.
దర్శనం చేయిస్తామనే దళారుల బెడద తప్పుతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- దక్షిణ కొరియాలో 151 మంది మృతి- 2,900 మంది మిస్సింగ్
- జగన్‌పై దాడి కేసు విచారణ ఏమైంది.. ఆ రోజు వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది
- ట్రాన్స్ జెండర్ పాత్రలను కూడా మామూలు నటులతోనే చేయించాలా ? ఈ అభ్యంతరాలు ఎందుకు వినిపిస్తున్నాయి
- ఇక్కడ 60 వేల మంది కోటీశ్వరులున్నారు
- మహిళను ‘ఐటెం’ అని పిలవడం నేరమేనా, కోర్టులు ఏం చెప్పాయి, నటి ఖుష్బూ వివాదమేంటి ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














