ఆంధ్రప్రదేశ్: సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్న 100 గ్రామాల ప్రజలు - ప్రెస్ రివ్యూ

రాయల చెరువు కట్ట

ఫొటో సోర్స్, UGC

భారీ వర్షాలకు తిరుపతిలోని రాయల చెరువు ప్రమాదంలో పడిందని, కట్ట తెగితే వంద గ్రామాలకు ముప్పు ఉంటుందని సాక్షి పత్రిక ప్రచురించింది.

‘‘ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయలసీమలో వానలు ఎన్నడూలేని విధంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.

తాజాగా భారీ వర్షాలతో తిరుపతి రామచంద్రాపురంలోని రాయల చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరద నీరు లీకవుతోంది.

చెరువు కట్ట నుంచి మట్టి కొద్దికొద్దిగా జారుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు సమీప ప్రజలు పరుగులు తీస్తున్నారు.

ఒకవేళ రాయల చెరువు తెగితే సుమారు వంద గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు.

దీంతో చెరువు దిగువన పల్లెలను అధికారులు అప్రమత్తం చేశారు. అంతేగాక రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు.

సంతబైలు, ప్రసన్న వెంకేటశ్వరపురం, నెన్నూరు, గంగిరెడ్డిగారిపల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లి, గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడవలూరు,వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరులో ప్రజలను అప్రమత్తం చేశారు.

పల్లెలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అక్కడే పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నార’’ని సాక్షి వివరించింది.

ఏపీ బీజేపీ

ఫొటో సోర్స్, FB/BJP Andhra Pradesh

ఏపీ రాజధానిని మూడు ముక్కలు కానివ్వం: బీజేపీ

ఏపీ రాజధానిగా అమరావతికి బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఈనాడు వార్తా కథనం ప్రచురించింది.

‘‘అమరావతే రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు ముక్కలు కానీయబోమని బీజేపీ నేతలు పునరుద్ఘాటించారు.

మహాపాదయాత్ర 21వ రోజు నెల్లూరు జిల్లా కావలిలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పురందేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

తొలుత విజయవాడ నుంచి గుంటూరు జిల్లా కాజ టోల్‌గేటు మీదుగా నాయకులంతా కలిసి నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఇక్కడ రైతులకు సంఘీభావం తెలిపి వారితోపాటు నడిచార’’ని ఈనాడు రాసింది.

‘‘పురందేశ్వరి మాట్లాడుతూ అమరావతిలో రాజధాని కొనసాగాలని రెండేళ్ల కిందటే నిర్ణయం తీసుకున్నామని, తాజాగా తిరుపతిలో ఇదే విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించామన్నారు. రైతులపై లాఠీఛార్జీ దుర్మార్గమన్నారు.

రాయలసీమలోకి రైతులను రానీయబోమంటున్నట్లు తెలిసిందని, రైతులకు అండగా బీజేపీ శ్రేణులు వస్తారని భరోసా ఇచ్చార’’ ఆ కథంలో పేర్కొన్నారు.

సోము వీర్రాజు మాట్లాడుతూ అమరావతికి బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలోనూ పాదయాత్రకు మద్దతు అందిస్తామన్నారని ఈనాడు వివరించింది.

హుస్సేన్ సాగర్

ఫొటో సోర్స్, Getty Images

హుస్సేన్‌ సాగర్‌ వద్ద 5 నిమిషాలు నిల్చోలేకపోయా-హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

హుస్సేన్ సాగర్ దగ్గర 5 నిమిషాలు నిల్చుకోలేకపోయానని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర అన్నారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్త ప్రచురించింది.

''హైదరాబాద్‌కు వచ్చే ముందు హుస్సేన్‌సాగర్‌ గురించి విన్నాను. నగరంలో ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో ఒకటి అని తెలుసుకొని అక్కడికి వెళ్లాను.

ఆ చెరువులోని నీరు కలుషితమై దుర్వాసన వస్తోంది. ఆ కారణంగా 5 నిమిషాలకు మించి అక్కడ ఉండలేక వచ్చేశాను.

హైకోర్టు పక్కన చెత్తా చెదారం నిండి ఉన్న మూసీని చూసి తొలుత మురుగు నీటి నాలానేమో అని అనుకున్నాను. తర్వాత అది గతంలో నగరానికి మంచినీటిని అందించిన నది అని తెలిసింది.

ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మలమూత్ర విసర్జనలు, మురుగు నీరంతా మూసీలో కలవడంతో నది రూపురేఖలు మారిపోయాయి. ఇది మనం చేతులారా చేస్తున్న తప్పిదం'' అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ పేర్కొన్నారు.

హైదరాబాద్‌ నాంపల్లి గగన్‌విహార్‌లో తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అప్పీలేట్‌ అథారిటీ కార్యాలయాన్ని (పీసీబీ) ఆదివారం ఆయన ప్రారంభించారు.

పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా అప్పీలేట్‌ అథారిటీలను నియమించడం, వాటికి ప్రత్యేక అధికారాలను అప్పగించడం మంచి విషయమని పేర్కొన్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

సామూహిక అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం, ఆలస్యంగా వెలుగులోకి..

తెలంగాణలో ఒక గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

గిరిజన మహిళపై ఇటీవల పలువురు సామూహిక లైంగికదాడికి పాల్పడగా.. బాధితురాలు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పత్రిక రాసింది.

‘పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ (36) భర్త నుంచి వేరుగా ఉంటూ కుమార్తె, కుమారుడితో కలిసి జీవిస్తున్నది.

గ్రామంలోనే కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నది. ఈ నెల 17న రాత్రి అదే గ్రామానికి చెందిన గుగులోతు సోమ్లానాయక్‌.. ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్లాడు.

ఆ రాత్రి అతనితోపాటు మరో ఇద్దరు బాధితురాలిపై లైంగిక దాడిచేశారు. అనంతరం తీవ్ర కడుపునొప్పి, వాంతులతో ఈ నెల 19న ఉదయం బాధితురాలు తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు వెళ్లి చికిత్స పొందిందని కథనంలో రాశారు.

అయినా పరిస్థితి మారకపోవడంతో ఆమెను సూర్యాపేట జనరల్‌ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది.

బాధితురాలి కుమార్తె, కొడుకు ఫిర్యాదు మేరకు తుంగతుర్తి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను విచారిస్తున్నారు.

మహిళ మృతితో కోపోద్రిక్తులైన గ్రామస్థులు.. నిందితుడు సోమ్లానాయక్‌ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేశార’ని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)