జూనియర్ ఎన్టీఆర్: ‘చాలా పెద్ద తప్పు, అరాచక పరిపాలనకు నాంది.. ఇక్కడితో ఆపేయండి’ - ఏపీ అసెంబ్లీ, చంద్రబాబు ఎపిసోడ్‌పై స్పందన

జూనియర్ ఎన్టీఆర్ - నందమూరి భువనేశ్వరి వివాదంపై రియాక్షన్

ఏపీ అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎమ్మెల్యేల వివాదంపై సినీ నటుడు నందమూరి తారకరామారావు జూనియర్ స్పందించారు.

ఈ మేరకు ఆయన ఒక వీడియో ట్వీట్ చేశారు. ఆ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారంటే..

‘‘మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం. అవి ప్రజా సమస్యలపై జరగాలే కానీ, వ్యక్తిగత విమర్శలు, దూషణలు ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన నా మనసును కలచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో.. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో.. అదొక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. స్త్రీ జాతిని గౌరవించడం, ఆడవాళ్లను, ఆడపడచులను గౌరవించడం మన సంస్కృతి. మన నవ నాడుల్లో, మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం. మన సంప్రదాయాలను రాబోయే తరాలకు జాగ్రత్తగా, భద్రంగా అప్పజెప్పాలి కానీ.. మన సంస్కృతిని కలచివేసి, కాల్చేసి, రాబోయే తరానికి బంగారుబాట వేస్తున్నాం అనుకుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలాపెద్ద తప్పు.

వీడియో క్యాప్షన్, జూనియర్ ఎన్టీఆర్: ‘చాలా పెద్ద తప్పు, అరాచక పరిపాలనకు నాంది.. ఇక్కడితో ఆపేయండి’

ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దూషణకు గురైన ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడటం లేదు. ఈ మాటలను నేను ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశ పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరికీ ఒక విన్నపం.. దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా, మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా’’ అన్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ అంశంపై స్పందించారు. ‘‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి, వాటి పరిష్కారం కోసం పాటుపడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం ఎంతో బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు.

బాలకృష్ణ

ఫొటో సోర్స్, fb/tdp

బాలకృష్ణ: 'మా ఇంట్లో ఆడవాళ్ల జోలికొస్తే చేతులు కట్టుకొని కూర్చోను.. ఇదే నా హెచ్చరిక'

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిమాణాలు, మాజీ సీఎం చంద్రబాబు కంటతడి పెట్టుకోవడంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.

ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..

"ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు బాధాకరం. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ దూషణలకు వేదికైంది. అసెంబ్లీలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం, అది కూడా రాజకీయాలతో సంబంధం లేని వారిపై ఆరోపణలు చేయడం సరికాదు. మా సోదరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాలేదు.

ఇక్కడ ఊరికే చేతులు కట్టుకుని కూర్చోలేదు. మీదికొస్తే, మా ఆడవాళ్ల జోలికొస్తే, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, అక్కడున్న ఇష్యూని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు.

వీడియో క్యాప్షన్, చంద్రబాబు నాయుడు: ‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’

ఆ సమస్య నుంచి దృష్టిమరల్చేందుకే-బాలకృష్ణ

ఒక అంశంలో తమ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తమకు అనుమానంగా ఉందంటూ స్వయంగా వాళ్ల కుటుంబ సభ్యులే చెప్పారు. అది సమస్య.

దాన్నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇంత నీచంగా నోరు పారేసుకోవడం, వాళ్ల ఆహార్యం, వాచకం చూస్తుంటే అసహ్యం వేస్తోంది.

అసెంబ్లీ హూందాగా జరగాలి. సమస్యలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేసుకోవడం తప్పు కాదు. కానీ రాజకీయాలతో సంబంధం లేని ఇంటి ఆడవాళ్లపై వ్యక్తిగత దూషణలకు దిగడం మంచిది కాదు.

బాలకృష్ణ

ఫొటో సోర్స్, fb/tdp

మెడలు వంచి మారుస్తాం-బాలకృష్ణ

మంచి సలహాలు ఇస్తే తీసుకోరు. ప్రతి దానికి ఏదో ఒక వంక పెడతారు. దానికొక సందర్భంగా తీసుకురావడం, దాన్ని డైవర్ట్ చేయడం... ఇది మంచి సంస్కృతి కాదు.

అది మంచిది కాదని మేము మీకు హితోపదేశం చేయడం కాదు, మీరు మనుషులు కాదు. మీరు మారరు. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం.

టీడీపీ కార్యాలయంపై దాడి చేసినప్పుడే మాట్లాడుదామనుకున్నాం. కానీ చంద్రబాబు వద్దన్నారు. కానీ దానికీ ఒక హద్దు ఉంటుంది.

ఇక జరిగిందానికి ఉపేక్షించేది లేదు. ఇక ఎవరు నోరు తెరిచినా సరే.. ఏదైనా ఉంటే ఇష్యూ మీద మాట్లాడండి. అంతేగానీ ఇంట్లోని ఆడవాళ్లపై, రాజకీయాలతో సంబంధం లేని వారిపై విమర్శలు చేయడం సరికాదు.

ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. జాగ్రత్తగా ఉండండి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇక చంద్రబాబు నాయుడి అనుమతి మాకు అవసరం లేదు. ఇంతకుముందు మేము సహనం పాటించామంటే అది ఆయన వల్లే. ఆయన మీకిచ్చే గౌరవం వల్ల. ఇదే నా హెచ్చరిక.

ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి, నా అభిమానుల నుంచి, మా కుటుంబం నుంచి ఇది నా హెచ్చరిక. మళ్లీ ఇటువంటి నీచమైన పదాలు వాడితే సహించేది లేదు. ఒక్కొక్కరి భరతం పడతాను. దేనికైనా ఒక హద్దు ఉంటుంది" అని బాలకృష్ణ అన్నారు.

వీడియో క్యాప్షన్, ‘చంద్రబాబుది ఓ డ్రామా.. ఆయన చెబుతున్న మాటలు అసెంబ్లీలో ఎవ్వరూ అనలేదు’

చంద్రబాబు చెప్పింది నమ్మి మాట్లాడుతున్నారు- పేర్ని నాని

బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు.

అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి భువనేశ్వరి ప్రస్తావనే రాలేదని ఆయన స్పష్టం చేశారు.

"ఎవరూ కూడా.. వారి పేరుగానీ, విషయ ప్రస్తావనగానీ, పల్లెత్తు మాట కూడా అనలేదని నమ్మండి. చంద్రబాబు చెప్పేవి అసత్యాలు. జరగని విషయాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరం.

అనని మాటలను అన్నట్లుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను నమ్మించారు. చంద్రబాబు మాటలను బలంగా నమ్మే వాళ్లు మాట్లాడారని నేను విశ్వసిస్తున్నాను. ఇది బాధాకరం" అని మంత్రి పేర్ని నాని చెప్పారు.

"అనని మాటలను ఇద్దరు నేతలకు ఆపాదించి వైసీపీపై రాజకీయంగా పైచేయి సాధించాలని, జగన్ ప్రభుత్వాన్ని ప్రజల్లో పలచన చేయడానికి చంద్రబాబు చేస్తున్న దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఇది" అని ఆయన అభివర్ణించారు.

‘‘చంద్రబాబు భార్యను ఎవరు అన్నారు? ఏమన్నారు? ఇటువైపు ఉన్న (వైపీసీ పార్టీ)వారు ఏమైనా సంస్కారం లేనివాళ్లు అనుకున్నారా? వ్యవస్థలను, రాజకీయాలనూ ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.

వాస్తవానికి అసెంబ్లీలో ఫోన్లలో రికార్డింగ్ చేయకూడదని, అయినా టీడీపీ వాళ్లు షూటింగ్ చేశారని.. అలాంటిది చంద్రబాబు భార్య గురించి ఎవరు ఏమన్నారు? ఏమైనా ఆధారం ఉందా? అని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం వ్యక్తులను, వ్యక్తిత్వాలను కించపర్చే సంస్కృతికి తెరతీసింది చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు.

ఒకవేళ నిజంగానే తమ పార్టీ వాళ్లు అలాంటి మాటలు మాట్లాడితే, వీడియోలు, ఆధారాలు ఉంటే తమ బతుకులు ఇలా ఉండేవా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి పల్లెత్తు మాట అసెంబ్లీలో ఎవ్వరూ అనలేదని, ఆమె పేరు కూడా ఎత్తలేదని పునరుద్ఘాటించారు.

చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలనే బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యులంతా నిజం అని నమ్ముతున్నారని, ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన సందర్భంగా కూడా చంద్రబాబు మాటలనే వాళ్లు నమ్మారని పేర్ని నాని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)