Seoul : దక్షిణ కొరియా హాలోవీన్ వేడుకల తొక్కిసలాటలో 154 మంది మృతి... 133 మందికి గాయాలు

ఫొటో సోర్స్, Reuters
దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 154 మంది మరణించారు. మరో 133 మంది గాయపడ్డారు.
చనిపోయిన వారిలో 98 మంది మహిళలు 56 మంది పురుషులున్నారు.
మృతుల్లో 20 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
హాలోవీన్ వేడుకలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావడంతో రద్దీ ఏర్పడి తొక్కిసలాట జరిగింది.
చాలామంది ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కాగా మరికొందరు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా జరిగింది?
కోవిడ్ అనంతరం మాస్కులు ధరించకుండా తొలిసారి నిర్వహిస్తున్న హాలోవీన్ వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి ఇటైవాన్ ప్రాంతానికి జనం వెల్లువెత్తారు.
ఈ ప్రాంతం నైట్‌లైఫ్‌కి ప్రసిద్ధి. బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి ఒక ఇరుకు వీధిలోకి జనం పోటెత్తటంతో.. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట చోటుచేసుకుందని, జనం ఒకరిపై ఒకరు పడిపోయారని చెప్తున్నారు.
తొక్కిసలాట కారణంగా చాలామంది కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. వెంటనే అధికారులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రంగంలోకి దించినప్పటికీ పెద్దసంఖ్యలో ప్రాణ నష్టం తప్పలేదు.
ఊపిరాడకపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతూ రోడ్లపై పడి ఉన్నవారికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.
వీధుల్లో బ్యాగుల్లో చుట్టిపెట్టిన శవాలు, అత్యవసర సహాయకులు కొందరికి సీపీఆర్ చేస్తున్న దృశ్యాలు, జనం కింద చిక్కుకుపోయిన వారిని బయటకు లాగటానికి సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
మృతుల్లో అత్యధికులు టీనేజర్లే...
మృతుల్లో అత్యధికులు టీనేజర్లు, 25 ఏళ్ల లోపు వారేనని అధికారులు చెప్తున్నారు.
మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించటం వంటి కోవిడ్ నిబంధనలను తొలగించిన తర్వాత సోల్‌లో జరిగిన తొలి హాలోవీన్ ఉత్సవం ఇది.
ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన వారిని నియంత్రించటానికి పోలీసులు విఫలప్రయత్నం చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దక్షిణ కొరియాలో హాలోవీన్ అనేది పెద్ద ఉత్సవం కాదు. అయితే ఇటైవాన్ ప్రాంతంలో అంతర్జాతీయ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి శనివారం నాడు హాలోవీన్ ఉత్సవం సందర్భంగా జనం పార్టీ చేసుకోవటానికి పెద్ద ఎత్తున వస్తారు.
పార్టీ చేసుకోవటానికి, క్లబ్బులకు వెళ్లటానికి చాలా మంది యువత అక్కడికి వచ్చారు. కొందరు హాలోవీన్ దుస్తులు ధరించారు.

ఫొటో సోర్స్, Getty Images
లక్ష మంది ఒకే చోట చేరడంతో...
ఇటైవాన్ ప్రాంతానికి శనివారం సాయంత్రం దాదాపు లక్ష మంది జనం వచ్చినట్లు చెప్తున్నారు. ఇంత జనాన్ని చూస్తే ఈ ప్రాంతం క్షేమంగా కనిపించలేదని తొక్కిసలాటకు ముందు కొందరు సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేశారు.
ఈ జనాన్ని నియంత్రించటానికి పోలీసులు విఫలప్రయత్నం చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఆ జనంలో చాలా మంది ఒకేసారి ఇరుకు సందులోకి రావటంతో అక్కడ ఖాళీ లేకుండా పోయిందని, పెరిగిపోతున్న గుంపు నుంచి బయటపడటానికి జనం ప్రయత్నించారని, దీంతో తొక్కిసలాట తలెత్తిందని, జనం ఒకరిపై ఒకరు ఎక్కిపోయారని వివరిస్తున్నారు.
ఒక ఇరుకైన, పల్లంగా ఉన్న వీధిలో వందలాది మంది జనం ఇరుకుగా ఉండటం ఒక వీడియోలో కనిపిస్తోంది. మరో వీడియోలో అత్యవసర సహాయకులు.. శరీరాల గుట్ట నుంచి జనాన్ని బయటకు లాగటానికి ప్రయత్నిస్తున్న దృశ్యం ఉంది.
ఈ తొక్కిసలాటలో చిక్కుకున్న వారి ఆర్తనాదాలు కూడా వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దర్యాప్తునకు ఆదేశించిన అధ్యక్షుడు..
గాయపడిన వారికి చికిత్స అందించేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ అత్యవసర సమావేశం నిర్వహించి ఆదేశించారు.
ఈ ఘోర విపత్తుకు కారణాలపై దర్యాప్తు చేయాలని కూడా ఆదేశించారు.
మృతుల్లో చాలా మంది 20ల వయసులో ఉన్నవాళ్లేనని సియోల్ యాంగ్సాన్ అగ్నిమాపక శాఖ చీఫ్ చోయి సోంగ్-బోమ్ చెప్పారు.
మృతుల్లో 19 మంది విదేశీయులు ఉన్నారని, గాయపడిన వారిలో కూడా 15 మంది విదేశీయులని ఆయన తెలిపారు.
చాలా మంది తొక్కిసలాటకు గురికావటం వల్లే మరణాల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు.
మొత్తంగా గాయపడిన వారిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది. 57 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
మృతుల శరీరాలను వారి బంధువులు గుర్తించటం కోసం సమీపంలోని ఆస్పత్రులు, జిమ్‌లకు తరలిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అక్కడే ఉన్నాను కానీ, నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే కానీ తెలియలేదు’
ఈ తొక్కిసలాట మొదలైనపుడు జీన్ గాయెల్ (30) ఒక బార్‌లో ఉన్నారు.
''బయట పరిస్థితి భయంకరంగా ఉంది' అని నా ఫ్రెండ్ చెప్పాడు. 'దేనిగురించి మాట్లాడుతున్నావు?' అని నేను అడిగాను. నేను బయటకు వచ్చి చూస్తే వీధిలో జనానికి సీపీఆర్ చేస్తూ కనిపించారు'' అని ఆమె ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.
క్రిస్టమస్‌కు, టపాసుల ఉత్సవాలకు జనం పెద్ద సంఖ్యలో హాజరవటం సాధారణమేనని.. కానీ ఇప్పుడు కనిపిస్తున్న జనం.. పది రెట్లు ఎక్కువగా ఉన్నారని మరో ప్రత్యక్ష సాక్షి పార్క్ జుంగ్-హూన్ రాయిటర్స్ వార్తా సంస్థతో తెలిపారు.
ఇటైవాన్ ప్రాంతంలో అత్యవసర ప్రమాదం కారణంగా జనమంతా సాధ్యమైనంత త్వరగా ఇళ్లకు తిరిగి వెళ్లాలంటూ యాంగ్సాన్ జిల్లాలోని ప్రతి మొబైల్ ఫోన్‌కూ అత్యవసర సందేశం పంపించినట్లు స్థానిక జర్నలిస్టు ఒకరు తెలిపారు.
ఘటనా స్థలంలో ప్రధమ చికిత్స అందిస్తున్న ఒక వైద్యుడు.. తాను తొలుత సీపీఆర్ చేయటం మొదలుపెట్టినపుడు అక్కడ కేవలం ఇద్దరు బాధితులు మాత్రమే ఉన్నారని, కానీ అంతలోనే బాధితుల సంఖ్య అమాంతం పెరిగిపోయిందని, సహాయ సిబ్బంది కన్నా పెరిగిపోయిందని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ట్రాన్స్ జెండర్ పాత్రలను కూడా మామూలు నటులతోనే చేయించాలా ? ఈ అభ్యంతరాలు ఎందుకు వినిపిస్తున్నాయి
- ఇక్కడ 60 వేల మంది కోటీశ్వరులున్నారు
- పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక విమానాశ్రయం నిర్మిస్తున్న భారత్...దీని లక్ష్యాలేంటి?
- అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, ధన్నీపూర్‌లో మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చాయంటే... గ్రౌండ్ రిపోర్ట్
- మహిళను ‘ఐటెం’ అని పిలవడం నేరమేనా, కోర్టులు ఏం చెప్పాయి, నటి ఖుష్బూ వివాదమేంటి ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










