INDONESIA: ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట, 125 మందికి పైగా మృతి

ఇండోనేసియా ఫుట్‌బాల్ మైదానంలో తొక్కిసలాట

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జార్జ్ రైట్
    • హోదా, బీబీసీ న్యూస్

ఇండోనేసియాలోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 125 మంది మరణించారు. తూర్పు జావాలో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్ బాల్ మ్యాచ్ తర్వాత ఈ విషాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

మ్యాచ్‌లో పెర్సెబాయా సురాబాయా జట్టు చేతిలో అరేమా ఎఫ్‌సీ జట్టు ఓడిపోయింది.

దీంతో రెండు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ మొదలయింది. వందలాది మంది గాయపడ్డారు.

"జట్ల మద్దతుదారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో తొక్కిసలాట మొదలైంది" అని తూర్పు జావా పోలీసు అధికారి నికో అఫింటా చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా మరణించారు.

పోలీసులు

ఫొటో సోర్స్, EPA

మ్యాచ్ ఫైనల్ విజిల్ తర్వాత అభిమానులు పిచ్ దగ్గరకు పరుగు పెడుతున్నట్లు వీడియోలలో కనిపించింది.

"స్టేడియం లోపల 34 మంది మరణించగా, మిగిలిన వారు ఆస్పత్రిలో మరణించారు" అని అఫింటా చెప్పారు. "తొక్కిసలాట నెమ్మదిగా అరాచకంగా మారింది. అభిమానులు అధికారుల పై దాడి చేయడం మొదలుపెట్టి కార్లను ధ్వంసం చేశారు" అని పోలీస్ అధికారి అఫింటా చెప్పారు.

స్టేడియం సామర్ధ్యానికి మించి మ్యాచ్ చూసేందుకు సందర్శకులు వచ్చినట్లు ఇండోనేసియా రక్షణ మంత్రి తెలిపారు.

తూర్పు జావాలోని మాలాంగ్ కంజురుహాన్ స్టేడియం వెలుపల కార్లను దగ్ధం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

"తొక్కిసలాటలో అందరూ ఎగ్జిట్ పాయింట్ దగ్గరకు వెళ్లారు. అక్కడ ఒకేసారి అందరూ గుమిగూడడంతో ఊపిరి అందక కొంత మంది చనిపోయారు" అని చెప్పారు.

సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన అనేక వీడియోలు షేర్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి బయటపడేందుకు అభిమానులు కంచె దాటేందుకు ప్రయత్నించడం కూడా వీడియోల్లో కనిపించింది.

నేలపై పడి ఉన్న మృతదేహాలు ఆ వీడియోలలో కనిపిస్తున్నాయి.

ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టినట్లు ఇండోనేసియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ తెలిపింది.

ఈ ఘటన ఇండోనేసియా ఫుట్ బాల్ ప్రతిష్టకు భంగం కలిగించిందని అసోసియేషన్ పేర్కొంది.

ఘటన తరువాత టాప్ లీగ్ బీఆర్‌ఐ లిగా 1ను ఒక వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.

ఈ ఘటన పై విచారణ పూర్తయ్యేవరకు ఇండోనేసియా టాప్ లీగ్ లో మ్యాచ్ లన్నిటినీ తక్షణమే రద్దు చేయమని అధ్యక్షుడు జోకో విడోడో ఆదేశించారు.

"దేశంలో ఇదే ఆఖరి ఫుట్ బాల్ విషాదం" అని విడోడో అన్నారు.

దగ్ధమైన పోలీసు వాహనాలు

ఫొటో సోర్స్, EPA

మ్యాచ్ లు జరిగే ప్రదేశాల్లో గుంపులను అదుపు చేసేందుకు గ్యాస్ ఉపయోగించకూడదని ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ వ్యవహారాలను చూసే ఫిఫా చెప్పింది.

ఇండోనేసియాలో ఫుట్ బాల్ మ్యాచ్‌ల సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం కొత్త కాదు. ఈ ఘర్షణలకు భయపడి పెర్సెబాయ అభిమానుల టికెట్లు కొనుగోలును కూడా నిషేధించారు.

కానీ, స్టేడియం సామర్ధ్యం 38,000 కాగా, ఈ మ్యాచ్ కోసం 42,000 టికెట్లను విక్రయించినట్లు రక్షణ మంత్రి ఇన్స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు.

1964లో పెరులోని లీమాలో పెరు అర్జెంటీనా ఒలింపిక్ క్వాలిఫయర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 320 మంది మరణించారు.

యూకేలో షెఫీల్డ్ లో 1989లో 97 మంది లివర్‌పూల్ అభిమానులు మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)