అర్మేనియాకు భారత్ ఆయుధాలు ఎందుకు అమ్ముతోంది?

పినాకా

ఫొటో సోర్స్, @DRDO_INDIA

    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అర్మేనియాకు రూ. 2000 కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు భారత్ 2022లో ఒక కీలక ఒప్పందం చేసుకుంది.

అర్మేనియాకు దాని పొరుగు దేశమైన అజర్‌బైజాన్‌తో నిరంతరం ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. 2020లో ఇరు దేశాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఇటీవలే మరొకసారి ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో, అర్మేనియాకు భారత్‌తో చేసుకున్న ఒప్పందం చాలా ముఖ్యమైనది.

రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, రూ. 2000 కోట్ల ఒప్పందం ద్వారా భారత్ మొదట 'పినాకా' మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్‌ను సరఫరా చేస్తుంది. ఈ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌ను డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. భారతదేశం దీనిని ఇప్పటికే చైనా, పాకిస్తాన్ సరిహద్దులో మోహరించింది. ఇప్పుడు దీన్ని అర్మేనియాకు విక్రయిస్తోంది. పినాకాను అంతర్జాతీయంగా విక్రయించడం ఇదే తొలిసారి.

తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్

ఫొటో సోర్స్, ADEM ALTAN

ఫొటో క్యాప్షన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్

అజర్‌బైజాన్‌, తుర్కియే, పాకిస్తాన్ మైత్రి

అజర్‌బైజాన్, పాకిస్తాన్, తుర్కియేల మధ్య మైత్రి వృద్ధి చెందుతోందని భావిస్తున్నారు. అర్మేనియాపై యుద్ధంలో అజర్‌బైజాన్, తుర్కియే డ్రోన్‌లను ఉపయోగించి ఆ దేశానికి భారీ నష్టంచేకూర్చింది. ఇప్పుడు అజర్‌బైజాన్ చైనాలో తయారైన జేఎఫ్-1 యుద్ధ విమానాలను పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేసే యోచనలో ఉంది.

అర్మేనియా, అజర్‌బైజాన్‌ల మధ్య ఘర్షణ భారతదేశం, పాకిస్తాన్ మధ్య పోటీగా మారుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

2017లో తుర్కియే, అజర్‌బైజాన్, పాకిస్తాన్‌ల మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఇది ఈ మూడు దేశాల మధ్య రక్షణ సహకారానికి పునాది వేసింది. ఇప్పటికే వీటి మధ్య ఉన్న రక్షణ ఒప్పందాలను ఈ ఒప్పందం ముందుకు తీసుకెళ్లింది.

అజర్‌బైజాన్‌ 2020లో 44 రోజుల పాటు సాగిన యుద్ధంలో అర్మేనియాను ఓడించిన తరువాత, గత ఏడాది తుర్కియే, పాకిస్తాన్‌లతో కలిసి 'త్రీ బ్రదర్స్' సైనిక విన్యాసాలు నిర్వహించింది.

తుర్కియే, పాకిస్తాన్, అజర్‌బైజాన్ త్రయం రాను రాను భారతదేశ వ్యతిరేక వైఖరిని అవలింబిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కశ్మీర్‌పై పాకిస్తాన్ వైఖరి అందరికీ తెలిసిందే. జతగా తుర్కియే కూడా భారత్‌లో ఆర్టికల్ 370ని తొలగించడాన్ని వ్యతిరేకించింది. కశ్మీర్ విషయంలో అజర్‌బైజాన్, తుర్కియే రెండూ పాకిస్తాన్ పక్షమే.

ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, అజర్‌బైజాన్ ప్రస్తుతం అలీన దేశాల మండలికి అధ్యక్షత వహిస్తోంది. ఇందులో భాగంగా, అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడంలో పాకిస్తాన్ పాత్రను ప్రశంసిస్తూ ఒక ప్రకటన విడుదల చేయాలనుకుంది కూడా.

అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్

ఫొటో సోర్స్, TWITTER @AZPRESIDENT

ఫొటో క్యాప్షన్, అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్

అజర్‌బైజాన్ భారతదేశ వ్యతిరేక వైఖరి

అర్మేనియాకు అతిపెద్ద మద్దతుదారు రష్యా ప్రస్తుతం యుక్రెయిన్ యుద్ధంలో తలమునకలై ఉంది. మరోవైపు తుర్కియే యుక్రెయిన్‌కు టీబీ2 డ్రోన్‌లను అందించింది. అవి పలు రష్యన్ ట్యాంకులను నాశనం చేసాయని ప్రశంసలు అందుకున్నాయి.

తుర్కియే నాటోలో సభ్య దేశం. అజర్‌బైజాన్ గ్యాస్ సరఫరా చేసే పెద్ద దేశం. రష్యా గ్యాస్‌కు ఒక ప్రత్యామ్నాయం అజర్‌బైజాన్ గ్యాస్ సరఫరా కాగలదని తుర్కియే భావిస్తోంది.

అయితే, భారత్‌కు అర్మేనియా కంటే అజర్‌బైజాన్‌తోనే బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. అక్కడి గ్యాస్ ఫీల్డులలో ఓఎన్‌జీసీ పెట్టుబడులు పెట్టింది. కానీ, అజర్‌బైజాన్‌.. తుర్కియే, పాకిస్తాన్‌ల పక్షం చేరడంతో, భారత్‌కు అర్మేనియాతో వ్యూహాత్మక సంబంధాలు నెరపవలసిన అవసరం వచ్చిపడింది.

ప్రస్తుతానికి అజర్‌బైజాన్, అర్మేనియా మధ్య వివాదం వలన భారతదేశానికి ప్రత్యక్షంగా ముప్పు లేదు. కానీ, ఇది తుర్కియే, పాకిస్తాన్ మధ్య మైత్రిని బలపరుస్తోంది. తుర్కియే-అజర్‌బైజాన్-పాకిస్తాన్ కూటమికి ఇస్లామిక్ ప్రాతిపదిక ఉంది. ముస్లిం దేశాల సముదాయం ఓఐసీలో ఈ కూటమి భారతదేశానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవచ్చు.

భారత్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ అర్మేనియాకు ఎందుకు ఆయుధాలు అమ్ముతోంది?

అర్మేనియా మిత్రదేశం రష్యా, యుక్రెయిన్‌తో యుద్ధంలో చురుకుగా ఉంది కాబట్టి, ఆ ప్రాంతంలో వ్యూహాత్మక సమతుల్యం సాధించడానికి భారత్, అర్మేనియాకు ఆయుధాలను విక్రయించాలనుకుంటోంది.

భారత్ నిర్ణయాన్ని అర్థం చేసుకోవడానికి, వ్యూహాత్మక, భద్రతా అంశాల నిపుణుడు మేజర్ జనరల్ ఎస్‌బీ అస్థానాతో బీబీసీ మాట్లాడింది.

"ఆర్థిక, వ్యూహాత్మక కోణంలో భారత్ నిర్ణయం చాలా ముఖ్యమైనది. ఇంతకు ముందు భారత్ ఆయుధాలను తయారుచేసేది కాదు. ఆయుధాల తయారీలో సున్నా నుంచి ప్రారంభించి భారత్ ఇప్పుడు దానిని ఎగుమతి చేసే స్థితికి చేరుకుంది. సహజంగానే, ఆయుధాల ఎగుమతి వలన దేశ రక్షణ పరిశ్రమ బలపడుతుంది. విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడంతోపాటు ఆధిపత్యం కూడా పెరుగుతుంది.

ఆయుధ పరిశ్రమ చాలా లాభదాయకమైన పరిశ్రమ. ఇందులో చాలా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే అమెరికన్ ఆయుధాలు చాలా ఖరీదైనవి. రష్యా ఆయుధ ఉత్పత్తి ప్రస్తుతం బలహీనంగా ఉంది. చైనా ఆయుధాలతో విశ్వసనీయత సమస్య ఉంది. ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యం ద్వారా భారతదేశం ఆయుధ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తే, ఈ పరిశ్రమకి చాలా సామర్థ్యం ఉంది.

పాకిస్తాన్, తుర్కియే కలిసి అజర్‌బైజాన్‌కు చాలా సహాయం చేశాయి. ఈ దేశాలు ఎప్పటికప్పుడు భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాయి. మరోవైపు, అర్మేనియాకు సహాయం చేస్తున్న దేశాలు చాలా తక్కువ. ప్రస్తుతం ఈ దేశం ఒత్తిడిలో ఉంది. అర్మేనియాకు భారత్ సహాయం చేస్తే, ఆ ప్రాంతంలో భారత్ ఆధిపత్యం పెరుగుతుంది. వ్యూహాత్మకంగా ఇది భారత్‌కు మేలు చేస్తుంది. అర్మేనియాకు ఆయుధాలు విక్రయించాలనే నిర్ణయం ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారతదేశానికి ముఖ్యమైనది" అని మేజర్ జనరల్ ఎస్‌బీ అస్థానా వివరించారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పొంచి ఉన్న మరో సంక్షోభం

అయిదేళ్లలో రూ. 35 వేల కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించాలని లక్ష్యం

పినాకాను మొదటిసారి అంతర్జాతీయంగా విక్రయిస్తున్నారు. అర్మేనియా గతంలో కూడా భారత్ నుంచి సైనిక పరికరాలను కొనుగోలు చేసింది. 2020లో అజర్‌బైజాన్‌తో యుద్ధం సందర్భంగా అర్మేనియా భారతదేశం నుంచి ఆయుధాలను గుర్తించే రాడార్ 'స్వాతి'ని కొనుగోలు చేసింది.

గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత ఆయుధాలు, సైనిక పరికరాల ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 13,000 కోట్లకు పెరిగాయి.

2020లో మోదీ ప్రభుత్వం, అయిదేళ్లలో రూ. 35,000 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాలను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025 నాటికి రక్షణ పరిశ్రమను రూ. 1.75 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ఏడాది జనవరిలో ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణిని విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం భారత్ ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలకు సైనిక పరికరాలను విక్రయిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)