Sajid Mir: ముంబయి పేలుళ్ల నిందితుడిని ఐరాస బ్లాక్ లిస్ట్‌లో పెట్టకుండా చైనా ఎందుకు అడ్డుకుంటోంది

సాజిద్ మీర్

ఫొటో సోర్స్, FBI

ఫొటో క్యాప్షన్, సాజిద్ మీర్

ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రదారుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కర్-ఇ-తైబా మిలిటెంట్ సాజిద్ మీర్‌ను ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్టులో పెట్టకుండా చైనా మళ్లీ అడ్డుకుంది.

సాజిద్ మీర్, 2008 ముంబయి పేలుళ్లలో ప్రధాన నిందితునిగా ఉన్నాడు. ఆయనను 'అంతర్జాతీయ టెర్రరిస్ట్'గా ప్రకటించి బ్లాక్ లిస్టులో పెట్టాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించింది.

దీనికి భారత్ మద్దతు తెలుపగా చైనా మాత్రం తన వీటో పవర్‌తో ఆ తీర్మానాన్ని అడ్డుకుంది. చైనా ఇలా చేయడం తొలిసారి కాదు. గత నాలుగు నెలల్లో ఇది నాలుగోసారి.

పాకిస్తాన్‌లోని వివాదాస్పద మతనాయకుడు మౌలానా మసూద్ అజహర్‌ సోదరుడు అబుల్ రవుఫ్ అస్ఘర్‌ను ఈ జాబితాలో చేర్చాలన్న భారత్, అమెరికా తీర్మానాన్ని కూడా గత నెలలో చైనా వీటో చేసింది.

భారత్ 'మోస్ట్ వాంటెడ్' జాబితాలో ఉన్న సాజిద్ మీర్ మీద సుమారు రూ.35 కోట్ల రివార్డ్‌ను అమెరికా ప్రకటించింది.

ఈ ఏడాది జూన్‌లో పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు సాజిద్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

వాస్తవానికి సాజిద్ మీర్ చనిపోయాడంటూ 2021 డిసెంబరులో పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. కానీ అమెరికాతో పాటు ఇతర పశ్చిమ దేశాలు ఆ మాటలను నమ్మలేదు. సాజిద్ మీర్ చనిపోయినట్లు రుజువు చేసే బలమైన సాక్ష్యాలను ఇవ్వాలని అమెరికా కోరింది.

ఆ తరువాత పాకిస్తాన్ మాట మార్చింది. సాజిద్ మీర్‌ను అరెస్టు చేసినట్లు ఈ ఏడాది ఏప్రిల్ 21న తెలిపింది. మే 16న జైలు శిక్ష విధించారు.

ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో ఉన్న పాకిస్తాన్, పశ్చిమ దేశాల సానుభూతి పొందేందుకే సాజిద్ మీర్‌కు జైలు శిక్ష విధించినట్లు నాడు భారత్ విమర్శించింది.

జకీ ఉర్ రెహ్మాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లష్కర్-ఇ-తైబా చీఫ్ జకీ ఉర్ రెహ్మాన్

సాజిద్ మీర్ ఎవరు?

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ప్రకారం ఎఫ్‌బీఐ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ 'టెర్రరిస్టు'ల్లో సాజిద్ మీర్ ఒకరు. ఆయన పాకిస్తాన్ జాతీయుడని భావిస్తున్నారు.

'లష్కర్-ఇ-తైబాలో 2001 నుంచి ఉన్నత స్థానంలో సాజిద్ మీర్ కొనసాగుతున్నారు. 2006 నుంచి 2011 మధ్య సాజిద్ నాయకత్వంలోనే విదేశాల్లో లష్కర్-ఇ-తైబా దాడులకు తెగబడింది' అని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో రాశారు.

2008, 2009 మధ్య డానిష్ పత్రిక సిబ్బంది మీద దాడికి సాజిద్ కుట్ర పన్నినట్లు అమెరికా ఆరోపిస్తోంది.

2008లో ముంబయి దాడుల తరువాత 2011లో సాజిద్ మీర్ పేరును 'మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల' జాబితాలో అమెరికా చేర్చింది.

ముంబయి దాడులకు వ్యతిరేకంగా నిరసనలు

ఫొటో సోర్స్, AFP

సాజిద్ మీర్ అలియాస్ సాజిద్ మజీద్

'2008 నవంబరు 26 రాత్రి ముంబయికి వచ్చిన 10 మంది సాయుధులను ఫోనులో ఎప్పటికప్పుడు గైడ్ చేసిన ముగ్గురిలో సాజిద్ ఒకరు. కరాచీలోని లష్కర్-ఇ-తైబా స్థావరం నుంచి వారు ముంబయిలో దాడులకు పాల్పడిన సాయుధులకు సూచనలు ఇచ్చారు. సాయుధులతో నిరంతరం టచ్‌లో ఉండాలనేది సాజిద్ ఆలోచన' అని ముంబయి దాడుల్లో నిందితునిగా ఉన్న పాకిస్తాన్-అమెరికన్ డేవిడ్ కోలమన్ హెడ్లీ, 2011లో అమెరికాలోని షికాగో కోర్టుకు తెలిపారు.

ముంబయి దాడుల వెనుక లష్కర్-ఇ-తైబాతోపాటు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కూడా ఉన్నట్లు హెడ్లీ ఆరోపించారు.

అంతకు ముందు అంటే 2010లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు హెడ్లీ వాంగ్మూలం ఇచ్చారు. ఆ ఏడాది జూన్ 3 నుంచి 9 వరకు హెడ్లీని అధికారులు ప్రశ్నించారు.

'ఆడవారిని చంపండి' అంటూ ముంబయిలోని యూదుల చబాడ్ హౌస్ దగ్గర ఉన్న సాయుధులకు పదేపదే ఫోనులో సాజిద్ చెప్పాడు. అజ్మల్ కసబ్‌ను పోలీసులు పట్టుకున్నాక, కసబ్‌కు బదులు చబాడ్ హౌస్‌లోని యూదులను వదలి పెట్టేందుకు కూడా సాజిద్ సిద్ధమయ్యాడు' అని హెడ్లీ నాడు విచారణలో చెప్పాడు.

ముంబయి దాడులకు ముందే సాజిద్, హెడ్లీ ఒకరికొకరు తెలుసు. లష్కర్-ఇ-తైబా టాప్ కమాండర్లలో సాజిద్ ఒకరు. థాయిలాండ్‌లో కూడా లష్కర్-ఇ-తైబా కేంద్రాన్ని ఆయన తెరిచారు.

'సాజిద్ చాలా తెలివైన వాడు. లష్కర్-ఇ-తైబాలో తనే నాకు తొలి శిక్షకుడు' అని హెడ్లీ తెలిపాడు.

ముంబయి దాడుల తరువాత 2009లో పాకిస్తాన్‌కు హెడ్లీ వెళ్లాడు. ముంబయిలో దాడులు చేసిన సాయుధులతో మాట్లాడిన ఆడియో టేపులను నాడు హెడ్లీకి సాజిద్ వినిపించాడు.

ముంబయి దాడులకు వ్యతిరేకంగా నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

తీవ్రవాదులకు శిక్షణ

అనేక మంది తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చిన సాజిద్ మీర్, లష్కర్-ఇ-తైబాను దాదాపు మూడు ఖండాలకు విస్తరించినట్లు నిఘా అధికారులు చెప్పారంటూ హిందుస్తాన్ టైమ్స్ గతంలో రిపోర్ట్ చేసింది. అలాగే ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్‌లలో 'ఉగ్రదాడు'లకు ప్రణాళికలు రచించడంలో కీలక పాత్ర పోషించాడు.

హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం... లష్కర్-ఇ-తైబాలో చేరిన ఫ్రెంచ్ మాజీ నేవీ అధికారి విల్లీ బ్రిగిట్టీని నిఘా అధికారులు విచారించారు. అఫ్గానిస్తాన్‌లోని అల్‌ఖైదాతో కూడా సాజిద్ మీర్‌కు సంబంధాలు ఉన్నట్లు విచారణలో విల్లీ చెప్పాడు. అలాగే లష్కర్-ఇ-తైబా చీఫ్ జకీ-ఉర్-రెహ్మాన్‌తో కూడా సాజిద్ నేరుగా మాట్లాడేవాడు.

'క్రికెట్ అభిమానిగా 2005 ఏప్రిల్‌లో సాజిద్ మీర్ భారత్‌కు వచ్చాడు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ, దిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీల వద్ద కూడా రెక్కి నిర్వహించాడు' అని ఆ వార్తా కథనం పేర్కొంది.

వీడియో క్యాప్షన్, ‘నాకు లొంగిపోవటం మినహా దారి లేదు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)