అంతరిక్షంలో సోలార్ ప్యానెల్స్ భూమికి విద్యుత్తును అందించగలవా?

ఫొటో సోర్స్, NASA
- రచయిత, ఎమ్మా వూలాకాట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అంతరిక్షంలోనే సౌర శక్తిని సమీకరించి సూక్ష్మ తరంగాల ద్వారా భూమికి పంపించడం సాధ్యమేనా?
సాధ్యామే అంటున్నారు శాస్త్రవేత్తలు. 2035 నాటికి ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందంటున్నారు స్పేస్ ఎనర్జీ ఇనిషియేటివ్ (ఎస్‌ఈఐ) కో-చైర్మన్ మార్టిన్ సోల్టౌ.
ఎస్‌ఈఐ.. కాసియోపియా అనే ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. చాలా పెద్ద ఉపగ్రహాల కూటమిని భూ కక్ష్యలో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
ఈ ఉపగ్రహాల కూటమి సౌర శక్తిని సేకరించి భూమి పైకి పంపుతుంది. ఈ వ్యవస్థ సామర్థ్యం అపరిమితమని మార్టిన్ సోల్టౌ అంటున్నారు.
"సిద్ధాంతపరంగా, ఇది 2050 నాటికి ప్రపంచానికి కావలసిన మొత్తం శక్తిని సరఫరా చేయగలదు. సోలార్ పవర్ శాటిలైట్లకు కావలసినంత జాగా కక్ష్యలో ఉంది. ఒక ఏడాదిలో మానవాళి మొత్తం ఉపయోగించే శక్తి కన్నా 100 రెట్లు ఎక్కువ శక్తి భూ స్థిర కక్ష్యకు చుట్టూ ఉండే సన్నటి మార్గానికి 2050 నాటికి అందుతుంది" అని ఆయన వివరించారు.
కన్సల్టెన్సీ ఫ్రేజర్-నాష్ ఈ సాంకేతికపై అధ్యయనం చేసి, ఇది సాధ్యమేనని నిర్థరించింది. ఆ తరువాత, ఈ సంవత్సరం ప్రారంభంలో, బ్రిటన్ ప్రభుత్వం అంతరిక్ష ఆధారిత సోలార్ పవర్ (ఎస్‌బీఎస్‌పీ) ప్రాజెక్ట్‌ల కోసం 3 మిలియన్ పౌండ్ల నిధులను ప్రకటించింది.
అందులో పెద్ద వాటా తమకు దక్కుతుందని ఎస్‌ఈఐ ఆశిస్తోంది.

ఫొటో సోర్స్, SEI
శాటిలైట్లు సౌర శక్తిని భూమికి ఎలా పంపుతాయి?
ఈ ప్రణాళికలో భాగంగా, శాటిలైట్ల భాగాలను భూమిపైనే తయారుచేసి అంతరిక్షంలోకి పంపిస్తారు. అక్కడ అటానమస్ రోబోలు వాటిని అసెంబుల్ చేసి శాటిలైట్లుగా తయారుచేస్తాయి.
ఈ రోబోలే వాటి సర్వీసింగ్, నిర్వహణ కూడా చూస్తాయి.
ఉపగ్రహాలు సేకరించిన సౌర శక్తిని హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలుగా మార్చి భూమి పైన అమర్చిన యాంటెనాకు పంపిస్తాయి. ఈ యాంటెనా రేడియో తరంగాలను విద్యుత్తుగా మారుస్తుంది.
కూటమిలోని ప్రతి ఉపగ్రహం సుమారు 2 గిగావాట్ల శక్తిని గ్రిడ్‌కు అందించగలదని అంచనా. ఇది న్యూక్లియర్ పవర్ స్టేషన్‌లో ఉత్పత్తి అయిన శక్తికి సమానం.
భూమిపై సూర్యకాంతి వాతావరణం ద్వారా ప్రసరిస్తుంది. కానీ, అంతరిక్షంలో అది నేరుగా సూర్యుడి నుంచి వస్తుంది. ఎలాంటి జోక్యం ఉండదు.
కాబట్టి అంతరిక్షంలో సోలార్ ప్యానెల్స్, భూమిపై సోలార్ ప్యానెల్స్ కన్నా చాలా ఎక్కువ సౌర శక్తిని సేకరించగలవు.
బ్రిటన్‌లోనే కాకుండా ప్రపంచంలో పలుచోట్ల ఇలాంటి ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతోంది.
ఉదాహరణకు అమెరికాలో ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ లాబొరేటరీ (ఏఎఫ్ఈఆర్ఎల్).. స్పేస్ సోలార్ పవర్ ఇంక్రిమెంటల్ డిమాన్‌స్ట్రేషన్స్ అండ్ రీసెర్చ్ (ఎస్ఎస్‌పీఐడీఆర్) కింద పైన చెప్పుకున్న ఉపగ్రహ వ్యవస్థకు అవసరమైన కొన్ని క్లిష్టమైన సాంకేతికతలపై పని చేస్తోంది.
సోలార్ సెల్ సామర్థ్యాలను మెరుగుపరచడం, సోలార్-టు-రేడియో ఫ్రీక్వెన్సీ మార్పిడి, కాంతి పుంజం ఏర్పడడం, స్పేస్‌క్రాఫ్ట్ భాగాల ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను నియంత్రించడం, మోహరించడానికి వీలైన నిర్మాణాల డిజైన్‌లను రూపొందించడం వంటి వాటిపై పనిచేస్తోంది.
ఈ బృందం గత ఏడాది, సోలార్ ఎనర్జీని రేడియో తరంగాలుగా మార్చడానికి ఉపయోగించే శాండ్‌విచ్ టైల్ అనే కొత్త భాగాలను విజయవంతంగా ప్రదర్శించింది.
ఈ సూక్ష్మతరంగాలు ప్రభావవంతమైనవని, మానవులకు, జంతువులకు హాని కలిగించవని ఇప్పటికే నిరూపణ అయింది.
"వై-ఫై తరంగాల్లా ఈ కాంతి పుంజం కూడా సూక్ష్మతరంగాలతో కూడుకున్నది. మధ్యాహ్న సూర్యుడి తీవ్రతలో నాలుగో వంతు తీవ్రతతో ఉంటుంది" అని సోల్టౌ వివరించారు.

ఫొటో సోర్స్, SEI
అధిక వ్యయం
ఈ ఉపగ్రహ వ్యవస్థకు అడ్డంకులను చాలావరకు పరిష్కరించినప్పటికీ కొన్ని సమస్యలు ఇంకా మిగిలే ఉన్నాయి.
"మనకు కావలసిన సాంకేతికత ఉందని విశ్వసించడం మనకు ఇష్టం. కానీ, అటువంటి సంక్లిష్టతతో కూడిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి మనం ఇంకా సిద్ధంగా లేమన్నది నా అభిప్రాయం" అన్నారు పోర్ట్స్‌మౌత్ విశ్వవిద్యాలయంలో థెర్మోడైనమిక్స్ లెక్చరర్ డాక్టర్ జోవానా రాడులోవిక్.
పెద్ద సంఖ్యలో సోలార్ ప్ల్యానెల్స్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం చాలా ఖర్చుతో కూడుకున్నదని ఆమె అన్నారు. అలాగే, పలుమార్లు ట్రయిల్ లాంచ్ చేస్తారు కాబట్టి అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందనే సందేహం వ్యక్తం చేశారామె.
అయితే, కార్బన్ ఫుట్‌ప్రింట్ టెరెస్టియల్ సోలార్‌లో సగం కంటే తక్కువగా ఉంటుందని, కిలోవాట్-గంటకు 24గ్రాముల CO2 ఉంటుందని స్ట్రాత్‌క్లైడ్ విశ్వవిద్యాలయంలో కాసియోపియా ప్రాజెక్ట్ పర్యావరణ విశ్లేషకుడు ఒకరు చెప్పారు.
ఈ ప్రాజెక్ట్‌కు వచ్చే ఆర్థిక సమస్యలను కూడా మెల్లమెల్లగా అధిగమిస్తున్నామని సోల్టౌ చెప్పారు.
"లాచ్ ఖర్చు 90 శాతం తగ్గింది. ఇంకా తగ్గుతుంది కూడా. ఆర్థికంగా ఇది పెద్ద ఉపశమనం" అని ఆయన అన్నారు.
"అలాగే, సౌర శక్తి శాటిలైట్ల డిజైన్లలో అభివృద్ధి జరుగుతోంది. ఇది కూడా ఖర్చు తగ్గడానికి దోహదపడుతుంది. రోబోటిక్స్, అటానమస్ సిస్టమ్స్‌లో కూడా నిజమైన అభివృద్ధి కనిపిస్తోంది" అని సోల్టౌ వివరించారు.
బ్రిటన్ ప్రభుత్వం నుంచి పరిమితంగా నిధులు అందుతున్నాయి కాబట్టి ప్రయివేటు పెట్టుబడిని ఆకర్షించేందుకు ఎస్ఈఐ ప్రయత్నిస్తోంది.
అయితే, ఈ ఉపగ్రహాల కూటమిని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ప్రతిపాదించిన కాల వ్యవధి అత్యాశతో కూడుకున్నదని డాక్టర్ రాడులోవిక్ హెచ్చరిస్తున్నారు.
"తగినంత పెట్టుబడి, టెక్నాలజీ ఉంటే పైలట్ ప్రాజెక్ట్స్‌లో భాగంగా చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించడం అసాధ్యం కాకపోవచ్చు. కానీ, ఇదే భారీ స్థాయిలో చేయాలంటే చాలా కాలం పడుతుంది" అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘జూ’లో మనుషులను ఉంచి ప్రదర్శించేవారు.. ఐరోపా దేశాల ‘అమానుషం’
- పాయింట్ల పట్టికలో టీం ఇండియా టాప్, సెమీ ఫైనల్ చేరడానికి ఒక్క విజయం చాలు
- హిమాచల్ ప్రదేశ్: ఈ రాష్ట్రంలో రాజ్‌పుత్‌లు తప్ప మరొకరు ముఖ్యమంత్రి అయ్యే చాన్సేలేదా?
- COP 27: గ్రీన్ వాషింగ్ అంటే ఏమిటి? ఎలా గుర్తించాలి
- ట్విటర్: బ్లూ టిక్ అకౌంట్‌కు ఇకపై ఏడాదికి రూ. 8,000, ఎలాన్ మస్క్ ఇంకా ఏ మార్పులు చేయబోతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














