హిమాచల్ ప్రదేశ్: ఈ రాష్ట్రంలో రాజ్‌పుత్‌లు తప్ప మరొకరు ముఖ్యమంత్రి అయ్యే చాన్సేలేదా?

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రజినీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హిమాచల్ ప్రదేశ్ ఇప్పటి వరకు ఆరుగురు ముఖ్యమంత్రులను చూసింది. వీరిలో అయిదుగురు రాజ్‌పుత్ కాగా ఒకరు మాత్రం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు.

డాక్టర్ యశ్వంత్ సింగ్ పార్మర్, ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. ఆయన నాలుగు సార్లు వరుసగా ఆ పదవి చేపట్టారు.

వీరభద్ర సింగ్ ఆరు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 22 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగారు. హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జై రామ్ ఠాకుర్‌తోపాటు గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన డాక్టర్ యశ్వంత్ సింగ్ పార్మర్‌, వీరభద్ర సింగ్, ఠాకుర్ రామ్‌లాల్, ప్రేమ్ కుమార్ దహాల్ అందరూ రాజ్‌పుత్ వర్గానికి చెందిన వారు.

ఒక్క శాంత కుమార్ మాత్రమే బ్రాహ్మణుడు. ఆయన 1977 నుంచి 1980, ఆ తరువాత 1990 నుంచి 1992 వరకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి చెందని తొలి ముఖ్యమంత్రి కూడా ఆయనే.

ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఉన్న జేపీ నడ్డా కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారే. ఆయనది హిమాచల్ ప్రదేశ్. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఈ రాష్ట్రానికి చెందిన వారు. ఆయన కూడా బ్రాహ్మణుడు. రాజ్‌పుత్ అయిన కాంగ్రెస్ నేత వీరభద్ర సింగ్ వలన ఆయనకు అవకాశాలు లభించలేదు.

హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వతాలు

ఫొటో సోర్స్, Facebook/Himachal Tourism

చిన్న రాష్ట్రం

విస్తీర్ణం పరంగా చూసిన జనాభా పరంగా చూసినా హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్ర జనాభా సుమారు 70 లక్షలు. భారతదేశ జనాభాలో ఈ రాష్ట్రం వాటా 0.57శాతం. అక్షరాస్యత ఇక్కడ 80శాతం కంటే ఎక్కువగా ఉంది.

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అగ్రవర్ణాలుగా భావించే వారి జనాభా 50.72శాతం. వీరిలో రాజ్‌పుత్‌లు 32.72శాతం కాగా బ్రాహ్మణులు 18శాతం. ఇక ఎస్సీలు 25.22శాతం, ఎస్టీలు 5.71శాతం చొప్పున ఉన్నారు. 13.52శాతం ఓబీసీలు కాగా 4.83శాతం ఇతర సామాజిక వర్గాల వారు ఉన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో ముస్లింల జనాభా చాలా చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ హిందుత్వ రాజకీయాలు ఉండవు.

గత 45 ఏళ్లుగా ఇక్కడి రాజకీయాలు కాంగ్రెస్, బీజేపీ చుట్టూనే తిరుగుతున్నాయి. 2017 ఎన్నికల్లో 68 సీట్లకు గాను 44 సీట్లను బీజేపీ గెలుచుకుంది. నాడు జై రాం ఠాకుర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.

సుమారు మూడు దశాబ్దాలుగా వీరభద్ర సింగ్, ప్రేమ్ కుమార్ ధుమాల్ హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. వీరిని ఎదుర్కొనేందుకు జై రాం ఠాకుర్‌ను బీజేపీ ముఖ్యమంత్రిని చేసింది.

కొన్ని రకాల విమర్శలను దూరం చేయడంలో భాగంగా బీజేపీ సాధారణంగా మెజారిటీ, ఆధిపత్య కులాలకు చెందిన వారిని ముఖ్యమంత్రులుగా నియమించదు. ఉదాహరణకు మహారాష్ట్రలో మరాఠాలు, హరియాణాలో జాట్‌లను బీజేపీ ముఖ్యమంత్రులను చేయలేదు. కానీ హిమాచల్ ప్రదేశ్ విషయంలో ఆ విధానాన్ని బీజేపీ పక్కన పెట్టింది. రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిని చేసింది.

హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జై రాం ఠాకుర్ రాజ్‌‌పుత్ వర్గానికి చెందినవారు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జై రాం ఠాకుర్ రాజ్‌‌పుత్ వర్గానికి చెందినవారు

ఇతరులకు అవకాశం ఎందుకు రావడం లేదు

అందుకు చాలా కారణాలున్నాయని పంజాబ్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అశుతోష్ కుమార్ అన్నారు.

'ఇందుకు ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి.

ఒకటి... ఇక్కడ ఠాకుర్, బ్రాహ్మణుల జానాభా 50శాతం కంటే ఎక్కువ.

రెండు.. మధ్యతరగతి కులాలు లేక పోవడం. యాదవ, కుర్మీ, జాట్, గుజ్జర్ వంటి మధ్యతరగతి కులాలు ఇక్కడ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

ఇక్కడ దళితుల వాటా 25 శాతం. కానీ మెజారిటీ మధ్యతరగతి జనాభా రాజ్‌పుత్, బ్రాహ్మణ వర్గాలకు చెందినవారే.

మూడు... సామాజిక ఉద్యమాలు లేకపోవడం. బిహార్, ఉత్తరప్రదేశ్ మాదిరిగా ఇక్కడ సమాజంలో మార్పును తీసుకొచ్చే ఉద్యమాలు జరగలేదు.

నాలుగు... హిమాచల్ ప్రదేశ్‌లో దళితులకు భూములు లేవు' అని కుమార్ వివరించారు.

'ఇతర మధ్యతరగతి కులాలు ఉండి ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉండేది అనడం వాస్తవమే. ఓబీసీలు తక్కువగా ఉండటం వల్ల ఆ విభాగంలో పెద్దగా పోటీ ఉండదు. 25శాతం ఉన్నప్పటికీ దళితుల్లో మళ్లీ ఉపకులాలు ఉన్నాయి.

బీజేపీకి ఠాకూర్లు అండగా ఉంటే కాంగ్రెస్‌కు బ్రాహ్మణులు మద్దతు ఇస్తూ వస్తున్నారు. దళితుల్లో కొందరు అటు కొందరు ఇటు ఉంటున్నారు.

ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఉన్నంత వరకు దళితులు ముఖ్యమంత్రి కాలేరు. మూడో పార్టీ వస్తే అవకాశం రావొచ్చు.

ముందు దళితుల నుంచి నాయకులు రావాల్సి ఉంది. ఇంత వరకు ఇక్కడ దళిత నాయకులు లేరు.' అని హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ జగ్మీత్ బవా అన్నారు.

కాంగ్రెస్ నేత వీరభద్ర సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్

మూడో పార్టీ ప్రయత్నాలు విఫలం

హిమాచల్ ప్రదేశ్‌లో మూడో పార్టీ కోసం జరిగిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

1967లో ఠాకుర్ సేన్ నేగి, జేఎబీఎల్ ఖాచీ కలిసి లోగ్ రాజ్ ‌పార్టీని స్థాపించారు. 1990లో విజయ్ మన్కోటియా జనతా దళ్‌కు నేతృత్వం వహించారు. 1997లో హిమాచల్ వికాస్ కాంగ్రెస్‌ను పండిట్ సుఖ్ రామ్ స్థాపించారు. 2012లో మహేశ్వర్ సింగ్ లోక్ హిత్ పార్టీని పెట్టారు.

అవే కాకుండా బీఎస్‌పీ, ఎస్‌పీ, సీపీఐ, సీపీఐ(ఎం), టీఎంసీ వంటి పార్టీలు కూడా ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. కానీ ఎవరూ విజయవంతం కాలేదు. అయితే 2017 ఎన్నికల్లో సీపీఐ మూడు సీట్లు గెలుచుకుంది. వారికి 2.09శాతం ఓట్లు వచ్చాయి.

'ఉత్తరప్రదేశ్, బిహార్‌ల కంటే హిమాచల్ ప్రదేశ్ భిన్నమైనది. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ అంటరానితనం లేదు. ఆ రాష్ట్రాల్లో ప్రజలను అణచివేశారు కాబట్టి ఉద్యమాలు చెలరేగాయి. కానీ ఇక్కడి పరిస్థితి వేరు. ఇక్కడ ప్రజలు సామరస్యంగా నివసిస్తుంటారు' అని ప్రొఫెసర్ నారాయణ్ సింగ్ అన్నారు.

బీజేపీ కార్యకర్తలు

ఫొటో సోర్స్, ANI

దళితులకు అవకాశం వస్తుందా?

హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సురేశ్ కుమార్ కశ్యప్ దళిత నేత. రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణులు కాకుండా ఇతరుల వైపు బీజేపీ ఎందుకు చూడటం లేదని ఆయనను ప్రశ్నించగా ఇలా సమాధానం ఇచ్చారు.

'నేను దళితున్ని. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా. మా పార్టీ ఎవరికి ఎప్పుడు ఎలాంటి బాధ్యతలు ఇస్తుందో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణులు మాత్రమే ముఖ్యమంత్రులు అవుతున్నారు. రానున్న రోజుల్లో దళితులు కూడా ముఖ్యమంత్రులు అవుతారని ఆశిస్తున్నా' అని సురేశ్ కుమార్ అన్నారు.

నిష్పత్తి ప్రకారం చూస్తే పంజాబ్ తరువాత దళితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ దళితులు 56 ఉపకులాలుగా విడిపోయి ఉన్నారు.

కుల వివక్ష లేదా?

హిమాచల్ ప్రదేశ్‌లో కుల వ్యవస్థ మీద సురీందర్ ఎస్ జోద్కా పరిశోధనలు చేశారు. ఆయన ఒక బ్రాహ్మణ మహిళను కుల వ్యవస్థ గురించి అడిగారు.

'ఇక్కడ ఠాకుర్లు, బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని అందరూ ఆమోదిస్తారు. కుల వ్యవస్థ బలంగా ఉన్పప్పటికీ కులం పేరుతో హింస అయితే ఇక్కడ జరగదు. ఎందుకంటే కుల ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నారు కాబట్టి.

దళిత ఎమ్మెల్యే ఉంటే మా ఇంట్లోకి రారు. బయటనే ఉంటారు. ఒకవేళ లోపలకు పిలిచినా వారికి ప్రత్యేకంగా కుర్చీలు వేస్తారు.

కుల విభజన అనేది అందరిలో సహజంగానే నాటుకొని పోయి ఉంటుంది. మా కాలేజీలోనూ విద్యార్థులు కులాల ప్రకారం విడిపోయి ఉంటారు' అని ఆ మహిళ అన్నారు.

'కాంగ్రాలో దళితులు 30శాతం ఉన్నప్పటికీ ఇక్కడి రాజకీయాల మీద రాజ్‌పుత్‌లదే ఆధిపత్యం. దళితు ఎమ్మెల్యేకు విలువ ఉండదు. పోలీసుల నుంచి స్థానిక సంస్థల వరకు అంతా రాజ్‌పుత్‌లే. వారు వివక్ష చూపుతారు' అని కాంగ్రాకు చెందిన ఒక విద్యార్థి సురీందర్‌కు తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని దళితులు కలిసి కట్టుగా లేరని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ అన్నారు. 'చాలా మంది ఇక్కడ దళితులకు అన్యాయం జరగడం లేదని, వివక్ష లేదని చెబుతున్నారు. కానీ అది అబద్ధం.

సిర్‌మౌర్ వంటి ప్రాంతాలకు వచ్చి చూడండి. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుస్తుంది' అని వినయ్ కుమార్ అన్నారు.

ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ చేతిలో ఉన్నాయి. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమె చూపించుకుంటున్నారు. జై రామ్ ఠాకుర్ నాయకత్వంలో బీజేపీ ఎన్నికల్లో పోటీ పడుతోంది. అంటే ఈ సారి కూడా రాజ్‌పుత్ వర్గానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారు.

వీడియో క్యాప్షన్, కాకినాడ సమీపంలో లారీ డ్రైవర్ల గ్రామం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)