ట్విటర్: బ్లూ టిక్ అకౌంట్‌కు ఇకపై ఏడాదికి రూ. 8,000, ఎలాన్ మస్క్ ఇంకా ఏ మార్పులు చేయబోతున్నారు?

ట్విటర్

ఫొటో సోర్స్, Reuters

ట్విటర్‌లో వెరిఫైడ్ అకౌంట్( బ్లూ టిక్ )గా కొనసాగాలంటే భవిష్యత్తులో నెలకు 8 డాలర్లు ( సుమారు రూ.661) ఆ సంస్థకు చెల్లించాలి. అంటే సంవత్సరానికి దాదాపు రూ. 8వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇది ట్విటర్‌కు కొత్త అధినేతగా మారిన ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయం. ఇలా పేమెంట్ చేసిన ఎకౌంట్లు మాత్రమే బ్లూ టిక్ ఎకౌంట్లుగా కొనసాగుతాయి.

''స్పామ్, స్కామ్‌ల నుంచి ట్విటర్‌ను కాపాడాలంటే ఇదే సరైన మార్గం'' అని మస్క్ అన్నారు.

యూజర్ నేమ్ పక్కన బ్లూ కలర్ టిక్‌ మార్క్‌తో హైప్రొఫైల్ వ్యక్తులకు మాత్రమే ఎకౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం ఇది ఉచితం.

ఈ చర్య విశ్వసనీయ మూలాలను గుర్తించడం కష్టంగా మార్చవచ్చని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఈ విధానం ద్వారా పెయిడ్ యూజర్లకు రిప్లయ్,సెర్చ్‌లలో ప్రాధాన్యత పెరుగుతుందని, అడ్వర్టయిజ్‌మెంట్లు సగానికి తగ్గిపోతాయని మస్క్ చెబుతున్నారు.

''నెలకు 8 డాలర్లు. ఇది ప్రజలకు పవర్ లాంటిది'' అని మస్క్ ట్విటర్‌లో కామెంట్ చేశారు. ప్రస్తుతం ఉన్న బ్లూ టిక్ వెరిఫికేషన్ విధానం ధనిక-పేద భావజాలానికి సంబంధించిన విధానమని మస్క్ వ్యాఖ్యానించారు.

బ్లూ టిక్ పొందడానికి గతంలో ఒక ఆన్‌లైన్ అప్లికేషన్ నింపాల్సి ఉండేది. వీటిలో ఎక్కువగా సెలబ్రిటీలు, ప్రముఖులు పెట్టుకున్న దరఖాస్తులు మాత్రమే బ్లూ టిక్ పొందుతుండేవి.

2009లో ట్విటర్ ఈ బ్లూ టిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నమ్మకమైన ఎకౌంట్లను మెయింటెయిన్ చేయడం లేదంటూ కేసు ఎదుర్కొన్న తర్వాత అప్పట్లో ట్విటర్ ఈ నిర్ణయం తీసుకుంది.

ట్విటర్

ఫొటో సోర్స్, Getty Images

గత కొన్నేళ్లుగా పెద్దగా లాభాలలో లేని ట్విటర్ ను దారిలో పెట్టేందుకు, సమూలంగా మార్చేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇందులో ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి.

రాబోయే కాలంలో ట్విటర్‌ అడ్వర్టయిజ్‌మెంట్ల మీద ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని ఎలాన్ మస్క్ అంటున్నారు.

అయితే, ఆయన నాయకత్వంలోని ట్విటర్‌కు అడ్వర్టయిజ్‌మెంట్లు ఇచ్చే విషయంలో కొన్ని కంపెనీలకు అభ్యంతరాలున్నాయి.

కార్ల రంగంలో మస్క్ కంపెనీ టెస్లాకు ప్రత్యర్ధి అయిన జనరల్ మోటార్స్ ట్విటర్‌ అడ్వర్టయిజ్‌మెంట్లను రద్దు చేసుకుంది.

ప్రపంచంలోనే అతి పెద్ద అడ్వర్టయిజింగ్ కంపెనీలలో ఒకటైన ఐపీజీ, కొన్నాళ్ల పాటు ట్విటర్‌కు యాడ్స్ ను నిలిపేయాలని తన క్లయింట్లను కోరింది.

నమ్మకం, భద్రత అంశాల్లో ట్విటర్ తీసుకుంటున్న చర్యలను పరిశీలన కోసమే ఈ నిర్ణయమని వెల్లడించింది.

ట్విటర్

ఫొటో సోర్స్, Getty Images

ఐపీజీ కంపెనీకి పలు ప్రముఖ బ్రాండ్ కంపెనీలు అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం ఏటా వేల కోట్ల రూపాయలు చెల్లిస్తుంటాయి.

బ్లూ టిక్‌కు ఎంత చార్జి ఉంటుందనే దానిపై మొదట్లో భిన్నమైన సమాచారం ప్రచారంలోకి వచ్చింది.

నెలకు 20 డాలర్లు (సుమారు రూ.1600) ఉండొచ్చని మొదట ప్రచారం జరిగింది. కానీ, 8 డాలర్లుగా మస్క్ ప్రకటించారు.

ఇదే అంశంపై వ్యాఖ్యానిస్తూ, అమెరికన్ రచయిత స్టీఫెన్ కింగ్ ట్వీట్ చేశారు.

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ సమయంలో ఒక అడల్ట్ ఎంటర్‌టైనర్ జీవితం..

"బ్లూ టిక్ కోసం నేను ప్రతి నెలా 20 డాలర్లు వెచ్చించాలా? నిజానికి, వారే మాకు డబ్బు ఇవ్వాలి. ఇది అమలులోకి వస్తే ఎన్రాన్ లాగా నేను కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోతాను" అన్నారు.

దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ, "మేము కూడా మా బిల్లులు చెల్లించాలి. ట్విట్టర్ పూర్తిగా ప్రకటనదారులపై మాత్రమే ఆధారపడదు. 8 డాలర్లు అయితే ఓకేనా?" అని అడిగారు.

"దీన్ని అమలు చేయడానికి ముందే దీని వెనుక కారణాలను సుదీర్ఘంగా వివరిస్తాను. భాట్స్, ట్రోల్స్ నియంత్రించడానికి ఇదొక్కటే మార్గం" అని కూడా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

ట్విటర్

ఫొటో సోర్స్, Getty Images

ట్విటర్ సీఈఓగా మస్క్..

పరాగ్ అగ్రవాల్‌ను సీఈవోగా తొలగించిన తరువాత ట్విటర్ సీఈవో ఎవరనే చర్చ మొదలైంది. అయితే, ఎలాన్ మస్కే కొత్త సీఈవో, డైరెక్టర్ అని ట్విటర్ వెల్లడించింది.

బోర్డ్‌లోని డైరెక్టర్లందరినీ మస్క్ తొలగించడంతో ప్రస్తుతం ఆయనొక్కరే సంస్థకు డైరెక్టరుగా ఉన్నట్లు లెక్క.

ట్విటర్‌లో అనేక ఫీచర్లనూ మస్క్ మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీనితోపాటు, కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి డీలిస్ట్ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించింది.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ట్విటర్ ఒక ప్రైవేట్ కంపెనీగా మారుతుంది. ఆ తర్వాత నుంచి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా ఉండదు.

వీడియో క్యాప్షన్, #Sisterhood: మహిళా జర్నలిస్టులకు ఆన్‌లైన్‌లో భరోసా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)