ఆంధ్రప్రదేశ్-భీమవరం: నలుగురు విద్యార్థులు కలిసి మరో విద్యార్థిని కర్రలు, పైపులతో కొట్టిన వీడియో వైరల్... అసలేం జరిగింది?

భీమవరం విద్యార్థి

ఫొటో సోర్స్, UGC

నలుగురు విద్యార్థులు కర్రలు, పైపులతో మరో విద్యార్థిని విచక్షణా రహితంగా కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో ఉన్న విద్యార్థులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు.

హాస్టల్ రూమ్‌ లో తలుపు వేసి, గడియ పెట్టి అంకిత్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు కర్రలు, పైపులతో దాడికి పాల్పడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనపడుతున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అంకిత్ భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

భీమవరం విద్యార్థి

ఫొటో సోర్స్, UGC

వీడియోలో ఏముంది?

అంకిత్ అనే విద్యార్థిపై ప్రవీణ్ అనే యువకుడు మరో ముగ్గురితో కలిసి దాడికి పాల్పడ్డారు. దానిని వీడియో కూడా తీశారు. ఆ వీడియోలో బాధిత విద్యార్థి ప్లీజ్‌ ప్లీజ్ అంటూ వేడుకుంటున్నా కూడా మిగతా విద్యార్థులు అతడిని కొడుతూనే ఉన్నారు. అంకిత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంకిత్ నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను ఆధారం చేసుకుని భీమవరం టూ టౌన్ పోలీసులు దాడి చేసిన విద్యార్థులపై కేసు నమోదు చేశారు.

భీమవరం విద్యార్థి

ఒక అమ్మాయి విషయంలో గొడవ

ఈ సంఘటన ఈ నెల 2వ తేదీన జరిగినట్లు పోలీసులు చెప్పారు. అయితే, ఈ వీడియోలు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో హాల్ చల్ చేయడంతో విషయం బయటపడింది. ఈ వీడియోలో ఉన్న దృశ్యాలు ఆధారంగా, అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ విషయంపై బీబీసీ భీమవరం రెండో పట్టణ పోలీసులతో మాట్లాడింది.

"ఈ ఘటనలో ఉన్నవారంతా స్నేహితులే. ఐదుగురూ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఒక అమ్మాయి విషయంలో వీరు గొడవ పడుతున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం బాధితుడు అంకిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతడిని కొట్టిన ప్రవీణ్, ప్రేమ్ కుమార్, స్వరూప్, నీరజ్ లను అరెస్ట్ చేశాం" అని భీమవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ కృష్ణ కుమార్ చెప్పారు.

భీమవరం విద్యార్థి

ఫొటో సోర్స్, Sreedhar Pasunuru

అది మా కాలేజ్ హాస్టల్ కాదు...

ఈ ఘటనలో బాధితుడైన అంకిత్ తో పాటు అతడిని కర్రలతో కొట్టిన మిగతా నలుగురిని కూడా కాలేజి యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ సస్పెన్షన్ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని కళాశాల ప్రిన్సిపాల్ జగపతి రాజు చెప్పారు.

"ఈ ఘటన మా కళాశాల హాస్టల్‌లో జరగలేదు. వాళ్లంతా స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు హాస్టల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడాం. అలాగే, మిగతా విద్యార్థుల పేరెంట్స్ తో కూడా మాట్లాడాం. ప్రస్తుతం పోలీసులు విచారణ సాగుతోంది., అలాగే, కళాశాలలో అంతర్గత విచారణ కూడా చేస్తున్నాం. ఈ రెండింటి ఆధారంగా ఈ విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాం." అని జగపతి రాజు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)