మెదక్ రియల్ ఎస్టేట్ వ్యాపారిని చంపి కారులో ఎందుకు కాల్చేశారు? నిందితుల మాటలను పోలీసులు ఎందుకు నమ్మడం లేదు?

రియల్టర్ శ్రీనివాస్‌ను ఈ కారులో పెట్టి నిందితులు నిప్పంటించారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రియల్టర్ శ్రీనివాస్‌ శవాన్ని ఈ కారు డిక్కీలో పెట్టి కారుకు నిప్పు పెట్టారు
    • రచయిత, ప్రవీణ్ కుమార్
    • హోదా, బీబీసీ కోసం

హెచ్చరిక: ఓ వ్యాపారి హత్యకు సంబంధించిన ఈ కథనంలో కొన్ని విషయాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.

మెదక్ జిల్లా యశ్వంతరావ్‌ పేట సమీపంలో రెండు రోజుల కిందట రోడ్డు పక్కన ఓ కారు దగ్ధం అవుతూ కనిపించింది.

కొంతమంది దీన్ని మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు కారు డిక్కీలో ఓ వ్యక్తి శరీరం పూర్తిగా కాలిపోయి కనిపించింది.

డిక్కీలోని మృతదేహం గుర్తు పట్టలేని స్థితిలో, కేవలం ఓ ఎముకల గూడు మాత్రమే మిగిలింది.

అక్కడున్న ఆధారాలనుబట్టి ఆ వ్యక్తి ఎవరన్నది గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది.

శ్రీనివాస్‌కు వ్యాపారంలో వివాదాలుండేవని, వివాహేతర సంబంధాల కారణంగా ఇంట్లో గొడవలు అవుతుండేవని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హత్యకు గురైన శ్రీనివాస్

ఎలా గుర్తించారు?

శవం నోటిలో కనిపించిన కృత్రిమ దంతాల ఆధారంగా ఈ మృతదేహం మెదక్ పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకర్ శ్రీనివాస్‌‌దిగా గుర్తించారు.

శవాన్ని గుర్తించడంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పోలీసులకు సహకరించారు.

శ్రీనివాస్‌కు వ్యాపారంలో గొడవలు, వివాహేతర సంబంధాలు ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా ఇవే ఈ హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

ధర్మాకర్ శ్రీనివాస్ హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సంఘటనా స్థలంలో పోలీసులు

24 గంటల్లో అరెస్ట్

లభించిన ఆధారాలతో మర్డర్ జరిగిన 24 గంటల్లో శివ అనే 29 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మెదక్ పోలీసులు వెల్లడించారు.

వ్యాపార లావాదేవీల్లో గొడవలే ధర్మకర్ శ్రీనివాస్ హత్యకు కారణమని అతన్ని విచారించిన తర్వాత ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు వారు వెల్లడించారు.

''ఈ మర్డర్ కేసు‌ను ఛాలెంజ్‌‌గా తీసుకున్నాం. మా శాస్త్రీయ పరిశోధనలో ఈ హత్యకు పాల్పడింది శివ అనే వ్యక్తిగా నిర్ధారించాం. శివ రియల్ ఎస్టేట్‌తో పాటు బార్‌ నడిపిస్తున్నాడు. ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన గొడవల కారణంగా హత్య చేసినట్టు నిందితుడు చెప్పాడు. అతనికి పవన్, నిఖిల్ అనే మరో ఇద్దరు ఈ హత్యలో సహకరించారు" అని మెదక్ ఎస్పీ చందన దీప్తి మీడియాకు వెల్లడించారు.

మృతుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్ బంధువులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మృతుడి బంధువులు

సుపారీ హత్య కోణం

నిందితుడు చెప్పిన దాని ప్రకారం ధర్మకర్ శ్రీనివాస్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఈ మర్డర్ ప్లాన్ వెనుక ఇతర వ్యక్తులు కూడా ఉన్నారా అన్న కోణంలోనూ విచారణ చేపట్టారు.

నిందితులకు ఎవరైనా సుపారీ ఇచ్చారా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.

వీడియో క్యాప్షన్, మదనపల్లె హత్యలు: ఈ నేరం ఎవరిది?

‘‘అరెస్టయిన A-1 నిందితుడు చెబుతున్నట్టుగా ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా భావించడం లేదు. అతను చెబుతున్న కారణాలు మా విచారణలో శాస్త్రీయంగా నిర్దారణ జరగడం లేదు. వివాహేతర సంబంధాల కోణంలోనూ విచారిస్తున్నాం. ఈ హత్య వెనుక ఇంకా ఇతర వ్యక్తులు ఉన్నట్టుగా అనుమానిస్తున్నాం. త్వరలోనే వారిని ఆధారాలతో సహా పట్టుకుంటాం" అని ఎస్పీ చందన దీప్తి తెలిపారు.

కేసు వివరాలను వెల్లడిస్తున్న మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కేసు వివరాలను వెల్లడిస్తున్న మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి

ఆ రోజు ఏం జరిగింది?

హత్య జరిగిన రోజు మెదక్‌లో తన ఇంటి నుంచి కారులో బయల్దేరిన శ్రీనివాస్ హైదరాబాద్‌కు బిజినెస్ పని మీద వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత 'పిల్లికొట్యాల' గ్రామం సమీపంలో నిందితులు ముగ్గురు ఆయనను కలుసుకున్నారు. వారంతా ఒకే కారులో ప్రయాణించారు.

ఆర్థిక లావాదేవీల విషయంలో వారి మధ్య జరిగిన వాగ్వాదం హత్యకు దారితీసిందని పోలీసుల విచారణలో నిందితుడు శివ తెలిపాడు. ఆ తర్వాత ఆధారాలు దొరక్కుండా ఉండాలని యశ్వంతరావ్‌ పేట్ సమీపంలో రోడ్డు పక్కన కారు ఆపి, శవాన్ని డిక్కీలో పెట్టి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఇలా చేస్తే ఆధారాలు లభించవని నిందితులు కారును దహనం చేశారని పోలీసులు వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

పరారీలో ఉన్న మిగతా ఇద్దరు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మెదక్ పోలీసులు తెలిపారు. ఈ కేసు ప్రాథమిక విచారణ స్థాయిలో, కేవలం 24 గంటల్లో నిందితులను గుర్తించామని తెలిపారు.

ఈ మర్డర్‌పై ప్రజల్లో మరింత ఆసక్తి , భయం పెరగకూడదన్న ఉద్దేశ్యంతోనే కేసు వివరాలను వెల్లడిస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

వీడియో క్యాప్షన్, 3 రోజుల్లో 3 వేల మంది హత్య 33 సంవత్సరాల క్రితం ఘటన

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)