అల్లు శిరీష్ ఊర్వశివో.. రాక్షసివో సినిమా రివ్యూ: పెళ్లి బెటరా? సహజీవనం బెటరా? ఈ డైలమా తెరపై పండిందా?

ఫొటో సోర్స్, GeethaArts
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ప్రేమకథలు అన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ... ఒకొక్కరూ ఒక్కోలా డీల్ చేస్తుంటారు.
ఇక్కడ ఏం కూర వండుతున్నామన్నది కాదు పాయింట్, ఎలా వండాం?
ఎవరికి వడ్డించాం? అనేదే ముఖ్యం.
`ఊర్వశివో.. రాక్షసివో` కూడా అచ్చంగా సగటు ప్రేమ కథే. కానీ.. ఇందులో వేసిన మసాలా దినుసులు వేరు. ఓ ప్రేమకథకు పెళ్లి - సహజీవనం అనే కోటింగు ఇచ్చి - కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు రాకేష్ శశి.
మరి... అందులో ఎంత వరకూ సఫలీకృతం అయ్యాడు.
విజయాల కోసం బాక్సాఫీసు దగ్గర విశ్వ ప్రయత్నం చేస్తున్న అల్లు శిరీష్ కృషి ఫలించిందా, లేదా?

ఫొటో సోర్స్, Geetha Arts
మిడిల్ క్లాస్ అబ్బాయి.. హై క్లాస్ అమ్మాయి
ముందు కథలోకి వెళ్దాం. ఇదో మిడిల్ క్లాస్ అబ్బాయి - హై క్లాస్ అమ్మాయి మధ్య జరిగిన ప్రయాణం. ఇద్దరి అంతుస్తులే కాదు, అంతరంగాలూ వేరు.
శ్రీ (అల్లు శిరీష్) పక్కా పద్ధతైన అబ్బాయి. చెడు అలవాట్లేం లేవు. మధ్య తరగతి జీవితం. తన పక్క ఆఫీసులో పని చేస్తున్న సింధు (అను ఇమ్మానియేల్)ని ఆరు నెలలుగా దూరం నుంచే చూస్తూ ప్రేమించేస్తుంటాడు.
సింధు కలలు, కోరికలు వేరు. తనది ఉన్నత కుటుంబం.
ఫారెన్‌లో రెస్టారెంట్ బిజినెన్ ప్లాన్ చేస్తుంటుంది.
సడన్‌గా సింధు... శ్రీ పనిచేసే ఆఫీసుకి షిఫ్ట్ అవుతుంది.
కాస్త ధైర్యం చేసి తనని తాను పరిచయం చేసుకొంటాడు శ్రీ.
సింధుకి కూడా శ్రీ మంచితనం, అమాయకత్వం నచ్చుతాయి.
ఫ్రెండ్‌షిప్ చేస్తుంది. ఒకానొక సందర్భంలో... ఇద్దరూ శారీరకంగానూ కలుస్తారు.
ఇక పెళ్లే తరువాయి అనుకొంటున్న తరుణంలో.. సింధు బాంబు పేలుస్తుంది. పెళ్లిపై తనకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో శ్రీకి చెబుతుంది. అప్పుడు శ్రీ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు.
ఈ తరహా కథలు గతంలో చాలానే చూసేశాం. అయినా మళ్లీ చూడాలంటే కనీసం సన్నివేశాల్లో అయినా కొత్తదనం కనిపించాలి. ఆ ప్రయత్నం కొంత మేర చేశాడు రాకేష్ శశి.
శ్రీ, సింధుల పాత్రల పరిచయం, శ్రీ మధ్యతరగతి అలవాటు, ఆఫీసు వ్యవహారాలూ.. ఇలా కథ సరదాగా ప్రారంభం అవుతుంది.
శ్రీ, సింధుల పరిచయం తరవాత... లవ్ ట్రాక్ మొదలవుతుంది. ఆ సన్నివేశాలన్నీ కాస్త ఫ్రెష్‌గానే రాసుకొన్నాడు దర్శకుడు.
ముఖ్యంగా బార్ సీన్ బాగా నవ్విస్తుంది. సునీల్, వెన్నెల కిషోర్ పాత్రల్ని సపోర్ట్ గా తీసుకొని వినోదం పండించడానికి శక్తివంతన లేకుండా కృషి చేశాడు దర్శకుడు. సన్నివేశాలన్నీ పాత వాసనే కొడుతున్నా - సునీల్, వెన్నెల కిషోర్‌ల పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో కాలక్షేపం అయిపోతుంది. మోడ్రన్ అమ్మాయిలా సింధు పాత్ర తీరు తెన్నులు యువతరానికి నచ్చేలా డిజైన్ చేసుకొన్నాడు.
ఇంటర్వెల్ బ్యాంగ్ పెద్ద ఊహించనిది, ఊహకు అతీతంగా సాగేదేం కాదు.

ఫొటో సోర్స్, Geetha arts
కామెడీ ట్రాకులే శ్రీరామ రక్ష
ప్రేమకథకు సంఘర్షణ చాలా అవసరం. ఆ సంఘర్షణ విశ్రాంతి సన్నివేశం నుంచి మొదలవుతుందని అంతా ఆశిస్తారు.
అలాంటి సీన్ వచ్చినా.. ఆ కాన్లిఫ్ట్ ఎక్కువ సేపు కొనసాగదు. సెకండాఫ్‌లో సహజీవనం అనే కాన్సెప్ట్ మొదలవుతుంది. ఇదీ మన తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. కాకపోతే... ఆ సహజీవనం వల్ల.. జరిగే దాగుడు మూతల డ్రామా మాత్రం బాగా పండింది.
ఇక్కడ కూడా సునీల్, వెన్నెల కిషోర్ లే అప్పర్ హ్యాండ్ తీసుకొనే ప్రయత్నం చేశారు.
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ తరహాలో... ఇద్దరూ కొన్ని సన్నివేశాలకు రన్నింగ్ కామెంట్రీ ఇచ్చే సీన్.. మనసారా నవ్విస్తాయి.
సింధు ఇంట్లో కరెంట్ పోయినప్పుడు... జరిగే కన్‌ఫ్యూజన్ డ్రామా కూడా బాగా పండింది.
ఆ తరవాత రెస్టారెంట్లో పెళ్లి చూపుల సీన్. ఇలా కథ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నా.. కామెడీ ట్రాకులు మాత్రం ప్రేక్షకులు సెల్‌ఫోన్లలో తలలు దూర్చకుండా, ఎగ్జిట్ గేట్ వైపు నడవకుండా.. శ్రీరామ రక్షలా నిలిచాయి.

కలిసి ఉండడానికి పెళ్లి చేస్తారు.. కానీ పెళ్లయిపోయింది కదా అని ఇష్టం లేకపోయినా కలిసి ఉండమంటే ఎలా? అనే డైలాగ్ ఈ సినిమాలో ఉంది. బహుశా... దర్శకుడు నమ్మిన పాయింట్ ఇదే కావొచ్చు.
కలిసి ఉండడానికి పెళ్లి అవసరం లేదు, ప్రేమ ఉంటే చాలు.. అనేది చెప్పడం చాలా ఈజీనే.
కానీ.. తెరపై, సన్నివేశాల రూపంలో చూపించడం చాలా కష్టం. ఆ విషయంలో దర్శకుడు కొన్నిచోట్ల మంచి మార్కులే అందుకొన్నాడు. ఇలాంటి సింపుల్ లైన్లతో సినిమా మొత్తాన్ని నడిపించలేమని దర్శకుడికీ తెలుసు.
అందుకే మెయిన్ పిల్లర్లుగా సునీల్, వెన్నెల కిషోర్‌లను తీసుకొన్నాడు.
వాళ్ల ట్రాకులు బాగా రాసుకోవడం వల్ల పాత కథని చూస్తున్నా...టైమ్ పాస్ అయిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది.
చివరికి హీరో - హీరోయిన్లు కలిసిపోతారన్న విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ప్రీ క్లైమాక్స్ విషాద గీతం వస్తున్నప్పుడే కథ శుభం కార్డుకి దగ్గర పడిందన్న విషయం అర్థం అవుతుంది. కానీ... అక్కడ కూడా సినిమాని ఆపి, రెండేళ్ల వరకూ లాగి, మరో రెండు సీన్లు పొడిగించాడు దర్శకుడు.
అదెందుకో అర్థం కాదు. బహుశా.. పెళ్లికీ, సహజీవనానికి మధ్య ఉండే ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ప్రేక్షకులకు అర్థమవ్వాలని ఆ టైమ్ తీసుకొన్నాడేమో..? దాని కంటే ముందే కథ ముగిసిపోయినా.. వచ్చే నష్టమేం లేదనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Geetha arts
ఎక్కువ మార్కులు హీరోయిన్‌కే
చాలా కాలంగా ఓ మంచి హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు అల్లు శిరీష్. చేతిలో గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ ఉన్నప్పుడు దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ఎంచుకోవడానికి శిరీష్ పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కాకపోతే... తనకు మంచి కథ కుదరాలంతే.
ఈ సినిమాలో గొప్ప కథేం లేకపోయినా... తనకు సూటయ్యే పాత్ర దొరికింది. మరీ హీరోయిజం చూపించాల్సిన అవసరం లేదు. సగటు అబ్బాయిగా కనిపిస్తే చాలు. అందుకే ఈ పాత్రలో సరదాగా అల్లుకుపోయాడు.
ఎక్కువ మార్కులు అను ఇమ్మానియేల్ కి పడతాయి.
స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా తన పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది.
ఓ ప్రేమ కథలో హీరోయిన్ పాత్ర ఎంత ఎలివేట్ అయితే ఆ సినిమా అంత బాగుంటుంది.
ఈ సూత్రం ఈ సినిమాకీ అన్వయించుకోవొచ్చు. వెన్నెల కిషోర్, సునీల్ ఈ సినిమాకి మూల స్తంభాలు. వాళ్ల కామెడీనే ప్రేక్షకులకు బోల్డంత కాలక్షేపం. అమ్మ పాత్రలో ఆమని నటన.. మరోసారి ఆకట్టుకొంటుంది.
సాంకేతికంగానూ ఈ సినిమా రిచ్‌గా ఉంది. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ నేర్పు... ఇవన్నీ ఆకట్టుకొంటాయి. ముఖ్యంగా వినోదం పండించడంలో రాకేష్ శశి పట్టు సాధించాడు.
ఈ సినిమాకి తాను రాసిన కామెడీ సీన్లే... బలం. మిడిల్ క్లాస్ జీవితాలు, అందులో ఉన్న ఇబ్బందులు, పెళ్లి - సహజీవనం.. ఇలాంటి రకరకాల అంశాలు ఈ కథలో అక్కడక్కడ కనిపిస్తున్నా.. దర్శకుడు టార్గెట్ చేసింది మాత్రం యూత్‌నే.
ఇవి కూడా చదవండి:
- ఎస్.ఎస్.రాజమౌళి: యాడ్ ఫిల్మ్ మేకర్ నుంచి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ దాకా...
- ఆదిపురుష్ రామాయణాన్ని వక్రీకరిస్తోందా? బాలీవుడ్ ‘రావణ బ్రహ్మను రావణ్ ఖిల్జీ’గా మార్చేసిందా? - సోషల్ మీడియాలో ట్రోలింగ్
- టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?
- హీరోలకు దీటుగా నటించడం... ప్రభుదేవాతో కలసి స్టెప్పులేయడం ఆయనకే చెల్లింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















