తెలంగాణ: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ను గెలిపించిన 5 అంశాలేంటి... మిగతా పార్టీలు సాధించిందేంటి?

ఫొటో సోర్స్, TRSParty/Facebook
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏరి కోరి తెచ్చుకున్న ఎన్నికలో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ కోట బీటలు వారింది. సర్వశక్తులూ ఒడ్డి టీఆర్ఎస్ గెలిచింది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఇంకా ఏం తేల్చింది? టీఆర్ఎస్ విజయానికి పనిచేసిన అంశాలేంటి?
మునుగోడు ఉప ఎన్నికల్లో సిట్టింగ్ కాంగ్రెస్ స్థానాన్ని చేజిక్కించుకోవాలనుకున్న బీజేపీ వ్యూహం తిరగబడి, టీఆర్ఎస్ ఆ స్థానాన్ని ఎగరవేసుకుపోయింది.
మిగిలిన ఉప ఎన్నికల్లా కాకుండా మునుగోడు ఎన్నిక అనివార్య పరిస్థితుల్లో వచ్చింది కాదు. సెంటిమెంట్లు బలంగా రగలడం వల్లనో, మనోభావాలు దెబ్బతినడం వల్లనో వచ్చింది కూడా కాదు. పక్కా రాజకీయ వ్యూహాల్లో భాగంగా వచ్చిన ఉప ఎన్నిక. అందుకే అక్కడ ఓటర్లను ప్రభావితం చేసిన అంశం ఫలానా సమస్యో, ఫలానా సెంటిమెంటో అని చెప్పడానికి లేదు. కేవలం పోల్ మేనేజ్మెంట్ తెచ్చిన ఫలితం అని కచ్చితంగా చెప్పవచ్చు.

ఫొటో సోర్స్, TRSParty/Facebook
1.సర్వశక్తులూ ఒడ్డిన టీఆర్ఎస్: టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు సులువుగా దక్కలేదు. అందుకోసం ఆ పార్టీ రాత్రింబవళ్లూ శక్తి వంచన లేకుండా పనిచేసింది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ఉప ఎన్నికల్లో పడే కష్టం కంటే ఎక్కువే కష్టపడాల్సి వచ్చింది టీఆర్ఎస్‌కి.
దాదాపు పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు అంతా మునుగోడులో మకాం వేసి ఎలక్షనీరింగ్ చేశారు. ఆ ఎలక్షనీరింగ్ అనే పదంలో అన్నీ ఇముడతాయి. చిన్న చిన్న పంచాయితీ స్థాయి నాయకులతో స్వయంగా కేటీఆర్ ఫోనులో మాట్లాడారు మునుగోడులో.
2.వామపక్షాల బలం: దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు బలం ఉన్న నియోజకవర్గం ఇది. కాంగ్రెస్ తరువాత ఎక్కువసార్లు సీపీఐ ఇక్కడ గెలిచింది. అందుకే అందరి కంటే ముందు కమ్యూనిస్టు ఓట్లపై కర్చీఫ్ వేశారు కేసీఆర్. తమ పార్టీ చెప్పిన వ్యక్తికి ఓట్లు వేయడంలోనూ, వేయించడంలోనూ తు.చ తప్పకుండా క్రమశిక్షణ పాటించారు లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు.
3.కాంగ్రెస్ బలం: కాంగ్రెస్ బలంగా ఉండడం కూడా ఇక్కడ టీఆర్ఎస్ కి కలసి వచ్చింది. కాంగ్రెస్‌కి పడ్డ ఓట్లలో సగం బీజేపీ వైపు వెళ్లినా ఫలితం మరోలా ఉండేది. 2018లో కాంగ్రెస్ నుంచి రాజగోపాల రెడ్డికి సీపీఐ, టీడీపీ పొత్తుతో 99 వేల ఓట్లు వచ్చాయి.
2014లో పాల్వాయి స్రవంతి స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడినప్పుడు 27వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఆవిడ దాదాపు అన్ని ఓట్లూ నిలబెట్టుకున్నారు. 23 వేల ఓట్లు తెచ్చుకున్నారు. రాహుల్ యాత్రతో కాంగ్రెస్ పెద్ద నాయకులు టీఆర్ఎస్, బీజేపీలతో సమానంగా ఇక్కడ తిరగలేదు. బీజేపీ, టీఆర్ఎస్‌లతో సమానంగా డబ్బూ ఖర్చు చేయలేదు.
కానీ, స్రవంతి ఎలాగోలా కష్టపడి 23 వేల ఓట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ మొత్తంగా దెబ్బతిని ఆ ఓట్లలో సగం బీజేపీ వైపు వెళ్లి ఉన్నా, అది టీఆర్ఎస్‌కి ఇబ్బంది కలిగించేది. కాంగ్రెస్ నష్టపోయిన ఓట్లలో టీఆర్ఎస్, బీజేపీ రెండూ పంచుకున్నాయి. కానీ ప్రతిపక్షంగా ఉంటూ టీఆర్ఎస్ వైపు వెళ్లని ఓట్లు బీజేపీకి కూడా వెళ్లకుండా కాంగ్రెస్ దగ్గర ఆగడం టీఆర్ఎస్‌కి కలసి వచ్చింది.

4. అధికార పార్టీ: ఇప్పటి వరకూ మునుగోడు ప్రతిపక్ష స్థానంగా ఉంటూ వచ్చింది. చుట్టుపక్కల నియోజకవర్గాలతో పోలిస్తే రోడ్ల వంటి అంశాలలో కాస్త వెనుకబడి ఉంది. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయి అనే భావన కూడా కొందరు ఓటర్లలో కనిపించింది.
5.ప్రత్యర్థికి బలమైన పాయింట్ లేదు: ఏదైనా ప్రత్యేకమైన సమస్య, డిమాండ్, సెంటిమెంట్, కారణం. ఇలా కీలకమైన, జనాల్ని ప్రత్యక్షంగా ప్రభావం చేసే అంశమూ ఈ ఎన్నికల్లో లేదు. కేవలం ఎన్నిక జరపాలనే వ్యూహం వల్ల, రాజకీయ ప్రణాళికలో భాగంగా వచ్చిన ఎన్నిక ఇది. తాను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోలేకపోతున్నానంటూ రాజగోపాల్ చెప్పిన మాటలు అంతగా తాకలేదు.
అదే సందర్భంలో ఆయన 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు తీసుకున్నారు, అందుకే పార్టీ మారి ఎన్నిక తెచ్చారు అన్న అధికార పార్టీ వాదన ఆయనకు వ్యతిరేకంగా వెళ్లింది. అందుకే ఇక్కడ సెంటిమెంటు, కమిట్మెంటు లాంటివి కాకుండా పోల్ మేనేజ్మెంట్ ఎక్కువగా పనిచేసింది.
టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవడానికి చాలా ప్రయత్నం చేసింది. మధ్యలో వచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల ఎపిసోడ్ మునుగోడుపై పెద్దగా ప్రభావం చూపించినట్టు కనిపించలేదు. కానీ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ బీజేపీ శ్రేణులు కూడా ఒక అంచనాకు వచ్చాయని చెబుతున్నారు. ముఖ్యంగా జేపీ నడ్డా సమావేశం రద్దు చేసుకోవడాన్ని ఒక ఉదాహరణగా చూపుతున్నారు.

ఫొటో సోర్స్, @krg_reddy
బీజేపీ పరిస్థితి ఏంటి?
అయినప్పటికీ, బీజేపీకి ఇది ఒక రకంగా ఇది బలం ఇచ్చిన ఎన్నికే. 2014 లో 27వేలు, 2018లో 12వేలు ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ ఇప్పడు గెలిచే స్థాయి ఉన్న పార్టీ అనిపించుకోగలిగింది. కాంగ్రెస్ - సీపీఐల స్థానాన్ని టీఆర్ఎస్ - బీజేపీ స్థానంగా మార్చగలిగింది.
క్షేత్ర స్థాయిలో బలం లేదు, గ్రామీణ ప్రాంతాల్లో బలం లేదు, కొత్తగా నాయకుల్ని చేర్చుకోవడం వల్లే బలం రాదు - ఇలాంటి వ్యాఖ్యలన్నీ పటాపంచలు చేస్తూ, ఫక్తు ఎలక్షనీరింగ్ ద్వారా బరిలో బరాబర్ పోటీ ఇవ్వవచ్చు అని బీజేపీ ఈ ఎన్నికతో నిరూపించుకుంది.
బీజేపీ నల్లగొండ ప్రాంతంలో తమ బలాన్ని అధికంగా ఊహించుకుని ఉండవచ్చు. ఉప ఎన్నికలను తక్కువ అంచనా వేసి ఉండవచ్చు. కానీ ఆ పార్టీ ఎదుగుదల మాత్రం పెరుగుతున్న బలం, మారుతున్న సమీకరణలకు సూచనలే.

ఫొటో సోర్స్, @revanth_anumula
ఇతర పార్టీలు ఎక్కడున్నాయి?
ఇక ఈ ఎన్నికల్లో ఎక్కువగా నష్టపోయింది కాంగ్రెస్సే. ఎందుకంటే శాసన సభలో కాంగ్రెస్ మరో ఎమ్మెల్యేను పోగొట్టుకుంది. రాహుల్ యాత్ర ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి చెప్పుకోదగ్గ స్థాయిలో నియోజకవర్గంలో పర్యటించారు. ఉత్తమ్, విక్రమార్కలతో పాటూ ఇతర నాయకులూ తమ వంతు పనిచేశారు. కానీ రెండు అధికార పార్టీలతో పోటీ పడలేకపోయారు.
స్రవంతి సొంత బలం, కుటుంబ బలం, తన శక్తికి తగ్గట్టు పెట్టిన ఖర్చు అన్నీ కలిపినా గతంలో ఆవిడ ఇండిపెండెంటుంగా సంపాదించినన్ని ఓట్లు కూడా సాధింలేకపోయారు. టికెట్ కృష్ణా రెడ్డికి ఇస్తే బావుండు అనే వర్గం ఉన్నప్పటికీ, అప్పుడు కూడా ఫలితంలో తేడా ఉంటుందని కచ్చితంగా చెప్పగలిగే వారు లేరు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే బలమైన కార్యకర్తలు, ఓటు బ్యాంకు ఉన్న మరో కోటకు బీటలు పడ్డాయి. రెండు వారాల పాటూ తెలంగాణలో సందడి చేసిన రాహుల్‌ను సోమవారం కాస్త నీరసంగా పక్క రాష్ట్రానికి సాగనంపబోతోంది ఆ పార్టీ.

ఫొటో సోర్స్, @RSPraveenSwaero
ఈ ఎన్నికల్లో మరో కీలక అంశం బీఎస్పీ. వచ్చే శాసన సభలో బీఎస్పీ పాత్ర శాంపిల్ ఇక్కడ కనిపించింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పగ్గాలు తీసుకున్న తరువాత, విస్తృతంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు.
మునుగోడులో కూడా ఆయన భారీగా ప్రచారం చేశారు. బీసీ అభ్యర్థిని నిలిపారు. 2018లో ఆ పార్టీకి ఇక్కడ 738 ఓట్లు రాగా ఇప్పుడు 4145 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ఓట్లు. అతి తక్కువ మార్జిన్, టఫ్ ఫైట్ ఉండే స్థానాల్లో బీఎస్పీ ఓట్లు కీలకం కాబోతున్నాయి అనడానికి ఇది సంకేతం.
చపాతి గుర్తు కలిగిన శ్రీశైలం యాదవ్ కి 2,400 ఓట్లు, రోడ్డు రోలర్ గుర్తు కలిగిన శివ కుమార్ కి 1,800 ఓట్లు వచ్చాయి. ఈ అంశంపై టీఆర్ఎస్ ఎప్పటి నుంచో ఫిర్యాదు చేస్తోంది. ఇక కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జన సమితి అభ్యర్థి వినయ్ కుమార్ కి 169 ఓట్లు రాగా, కేఏ పాల్ కి 800 ఓట్లు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- 140 ఏళ్ల కిందట అదృశ్యమైన బ్రిటిష్ నౌక.. ఇంగ్లిష్ చానల్ సముద్రంలో దొరికింది
- భూమిలో 650 అడుగుల లోతున 9 రోజులు కాఫీ పొడి తిని బతికారు - ప్రాణలతో ఎలా బయటకు వచ్చారంటే..
- COP27: వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఏం చెప్పింది, ఏం చేసింది?
- రష్యా సైన్యాన్ని నిత్యం విమర్శిస్తున్న ఈ పుతిన్ 'ఇద్దరు మిత్రులు' ఎవరు?
- ట్విటర్‌లో సగం ఉద్యోగాల కోత - 'మరో దారి లేదు'.. ఎలాన్ మస్క్ సమర్థన
- డ్రోన్లు: భారతదేశం 2030 నాటికి ప్రపంచ డ్రోన్ హబ్‌గా అవతరిస్తుందా... అవకాశాలు, అవరోధాలు ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












