మునుగోడులో టీఆర్ఎస్ విజయం, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమి, డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. గతంలో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలుపొంది, రాజీనామా చేసి బీజేపీ తరపున బరిలో దిరిగిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి డిపాజిట్ కోల్పోయారు.
‘డబ్బు, అధికారం అడ్డం పెట్టుకుని గెలిచారు’ - రాజగోపాల్ రెడ్డి
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు.
‘‘నా పదవిని మునుగోడు ప్రజల కోసం త్యాగం చేశాను. ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతుంది. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నన్ను ఒడించేందుకు అసెంబ్లీ మొత్తం మునుగోడుకు వచ్చింది. ముఖ్యమంత్రి తో సహా టీఆర్ఎస్ నేతలందరినీ మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను. మునుగోడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ దుర్వినియోగం చేసింది. పోలీస్ వ్యవస్థను వాడి విచ్చలవిడిగా బెదిరింపులకు పాల్పడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మూడో తేది వరకు ఇక్కడే ఉండి డబ్బులు పంచారు. డబ్బు, అధికారం అడ్డం పెట్టుకుని గెలిచారు. నైతికంగా నేను గెలిచినట్టే. ప్రజలు నా వెంటే ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో పది వేల ఓట్లు ఉన్న బీజేపీ 90వేల ఓట్లు సాధించింది’’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి స్వగ్రామంలో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం..
మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో వెలువడిన ఆరో రౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. ఈ రౌండు ముగిసే సమయానికి టీఆర్ఎస్ అబ్యర్థి ప్రభాకర్ రెడ్డి 2 వేల పైచిలుకు ఆధిక్యంతో ఉన్నారు. మొత్తంగా ఆరు రౌండ్ల తరువాత టీఆర్ఎస్ అభ్యర్థికి 38,521 ఓట్లు వస్తే, బీజేపీ అభ్యర్థికి 36,352 ఓట్లు వచ్చాయి. 12,025 ఓట్లతో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది.
అంతకు ముందు, 11.52 గంటలకు అయిదో రౌండ్ ఫలితాలు వచ్చాయి. ఈ రౌండ్ పూర్తయ్యేప్పటికి మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రభాకర్ రెడ్డికి 32,405 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 30,975 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పాల్వాయి స్రవంతి రెడ్డికి 10,055 ఓట్లు పోలయ్యాయి.
నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 4,854, బీజేపీకి 4,555 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో టీఆర్ఎస్‌కు 299 ఓట్ల లీడ్ లభించింది. నాలుగు రౌండ్ల తరువాత మొత్తంగా టీఆర్ఎస్ 714 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వగ్రామంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ ఆధిక్యంలో ఉన్నారు.
కాగా, అయిదో రౌండ్ ఫలితం ఆలస్యం కావడంపై మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. సమాచారం సరిగా ఇవ్వడం లేదంటూ వారు ఆందోళన చేశారు.
ఫలితాల జాప్యంపై ఆగ్రహం
ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. నాలుగో రౌండ్ ఫలితాన్ని అప్డేట్ చేయడానికి ఎందుకు జాప్యం జరిగిందని ఆయన ప్రశ్నించారు. "ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం" అని సంజయ్ అన్నారు.
మరోవైపు, టీఆర్ఎస్ కూడా ఫలితాల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకు లీకులు అందుతున్నాయన్న ఆరోపణలపై ఎన్నికలకమిషన్ స్పందించాలి. ప్రతి రౌండ్ పూర్తి కాగానే వెంటనే అధికారులు మీడియాకు స్వయంగా వివరాలు తెలపాలి" అని టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
అయితే, అంతా సవ్యంగానే జరుగుతోందని, పరిశీలకులు సంతృప్తి చెందాకే ఫలితాలు ప్రకటిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్పారు. "నాలుగో రౌండుకు, అయిదో రౌండుకు 20 నిమిషాలు ఆలస్యమైంది. మన దగ్గర అభ్యర్థులు ఎక్కువగా ఉండడం వల్లనే ఆలస్యమవుతోంది. ఆర్వో సంతకం చేశాకే రౌండ్ల వారీ రిజల్ట్స్ వస్తాయి" అని ఆయన అన్నారు.

ఈ ట్రెండ్స్ మీద స్పందిస్తూ రాజగోపాల్ రెడ్డి, "చౌటుప్పల్ మండలంలో మేం అనుకున్న మెజారిటీ రాలేదు. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయి. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. చివరి వరకు హోరాహోరీ తప్పకపోవచ్చు. బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం మాకుంది" అని అన్నారు.
ఈ ఉదయం లెక్కించిన 686 పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్‌కు 228, బీజేపీకి 224, బీఎస్పీకి 10 ఓట్లు వచ్చాయి.
తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్‌కు 6,478, బీజేపీకి 5,126, కాంగ్రెస్‌కు 2,100 ఓట్లు వచ్చాయి.
రెండో రౌండ్‌లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో టీఆర్ఎస్‌కు 7,781 ఓట్లు, బీజేపీకి 8,622 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,532 ఓట్లు వచ్చాయి.

మూడో రౌండ్‌లో కూడా బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది.
రెండు రౌండ్లు ముగిసే సరికి 515 ఓట్లుగా ఉన్న టీఆర్ఎస్ ఆధిక్యం.. మూడు రౌండ్లు ముగిసేసరికి 36 ఓట్లకు తగ్గిపోయింది.
మరోవైపు కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి వెళ్లిపోయారు.
మొత్తం 15 రౌండ్లతో లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. కౌంటింగ్ కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు.

కౌంటింగ్‌కు పటిష్ట భద్రత
ఓట్ల లెక్కింపు కోసం నల్లగొండ పట్టణంలో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. శనివారం మాక్ కౌంటింగ్ కూడా నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఏడు మండలాలకు చెందిన ఓట్లను 15 రౌండ్లలో 21 టేబుళ్లలో లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ లెక్కించటానికి 20 నిమిషాల నుంచి అర గంట వరకూ సమయం పడుతుంది.
మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి కచ్చితమైన ఫలితం వస్తుంది.
ఉదయం 8 గంటలకు ప్రభుత్వ సర్వీస్ ఓట్లు, ముసలి వారు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. తరువాత 8.30 నుంచి సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.
ప్రధాన లెక్కింపు తరువాత కొన్ని ఎంపిక చేసిన వీవీ పాట్ స్లిప్పులు కూడా లెక్కిస్తారు.
నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 41 వేల 805 మంది ఓటర్లు ఉండగా, 2 లక్షల 25 వేల 192 మంది ఓటు వేశారు. అంటే 93 శాతం. వీటిలో 686 పోస్టల్ బ్యాలెట్లు, 50 సర్వీసు ఓట్లు కూడా ఉన్నాయి.
మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో ప్రధాన అభ్యర్థులు:
- బీజేపీ - కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి (2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి రాజీనామా చేశారు)
- టీఆర్ఎస్ - కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి (2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచారు)
- కాంగ్రెస్ - పాల్వాయి స్రవంతి (ఇక్కడ ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన రెడ్డి కూతురు, గతంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు.)
- బీఎస్‌పీ - శంకరాచారి (ఆర్ఎస్ ప్రవీణ్ విస్తృతంగా పర్యటించారు)
- టీజేఎస్ - వినయ్
- ప్రజా శాంతి పార్టీ - కె.ఎ.పాల్ (గద్దర్ మద్దతు ఇచ్చారు)
మండలాల వారీగా ఓట్లు లెక్కించే వరుస క్రమం:
- చౌటుప్పల్
- సంస్థాన్ నారాయణపురం
- మునుగోడు
- మర్రిగూడ
- నాంపల్లి
- గట్టుప్పల్

ఫొటో సోర్స్, ANI
దేశంలో మరో 6 అసెంబ్లీ స్థానాల్లో కౌంటింగ్
దేశవ్యాప్తంగా మరో ఐదు రాష్ట్రాల్లో ఇంకో ఆరు శాసనసభ నియోజవర్గాలకు కూడా నేడే ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
బీహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్ అసెంబ్లీ స్థానాలు, మహారాష్ట్రలో అంధేరి (ఈస్ట్), హరియాణాలో ఆదంపూర్, ఉత్తరప్రదేశ్‌లో గోలా గోకరన్నాథ్, ఒడిశాలో ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానాలకు కూడా ఈ నెల 3వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించారు.
తెలంగాణలోని మునుగోడు స్థానంతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
వీటిలో ఎన్నికలక ముందు మూడు సీట్లు బీజేపీవి కాగా, రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీవి. శివసేనది ఒకటి, ఆర్‌జేడీది ఒకటి సీట్లు ఉన్నాయి.
మొత్తం ఏడు స్థానాల్లోకీ తెలంగాణలోని మునుగోడు నియోజవర్గంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది.
ఇవి కూడా చదవండి:
- టీ20 ప్రపంచ కప్ 2022: భారత్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడాలంటే ఏం జరగాలి?
- టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?
- ‘జూ’లో మనుషులను ఉంచి ప్రదర్శించేవారు.. ఐరోపా దేశాల ‘అమానుషం’
- కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలు
- వంటగది అపరిశుభ్రత వల్లే అనేక జబ్బులు... సాధారణంగా చేసే 9 తప్పులు, సరిదిద్దుకునే మార్గాలు
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














