భారతదేశంలో రైళ్లకు ప్రత్యేక రంగులు, చిహ్నాలు ఉంటాయి ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆలమూరు సౌమ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నవంబర్ 11న అధికారికంగా పట్టాలు ఎక్కింది. చెన్నై నుంచి మైసూర్ వెళ్లే ఈ రైలుకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో పచ్చజెండా ఊపారు.
ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవలో భాగంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. తొలి రైలు దిల్లీ, వారణాసిల మధ్య ప్రారంభమైంది.
చెన్నైలోని పెరంబూర్‌లో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో (ఐసీఎఫ్) తయారయ్యే ఈ రైళ్లు అత్యధికంగా 180 కిమీ సామర్థ్యంతో ప్రయాణించగలవు. ఇది, భారతీయ రైల్వేలు (ఇండియన్ రైల్వేస్) తీసుకొచ్చిన తొలి సెమి-బుల్లెట్ ట్రైన్. ప్రస్తుతానికి వీటిలో స్లీపర్ క్లాస్ లేదు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ తరహాలో ఎగ్జిక్యూటివ్ క్లాస్, చెయిర్ కార్ కోచ్‌లు మాత్రమే ఉన్నాయి.
ఇంతకు మునుపు రైళ్ల కంటే భిన్నంగా వందే భారత్‌ను తెల్ల రంగులో, పైన, కింద నీలం చారలతో రూపొందించారు.
ఇండియన్ రైల్వేస్ ఒక్కో రకమైన ట్రైన్‌కు ఒక్కో రంగును కేటాయిస్తాయి. అలాగే, కొన్ని ట్రైన్ కోచ్‌లపై, చివర్న ఏటవాలుగా ఉండే చారలను ఎప్పుడైనా గమనించారా? పసుపు, ఎరుపు, తెలుపు మొదలైన రంగుల్లో ఉండే ఈ చారలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇవే కాకుండా, రైళ్లకు సంబంధించిన విభిన్నమైన విషయాలను వివరించడానికి ప్రత్యేక చిహ్నాలను వాడతారు. ఉదాహరణకు, ట్రాక్ చిహ్నాలు, ప్లాట్‌ఫారమ్ చిహ్నాలు, ట్రాక్ పక్కన పోల్స్‌పై ఉండే చిహ్నాలు. రైలు సంకేతాలు, నియమాలు, నిబంధనల గురించి ప్రజలు సులువుగా తెలుసుకునేందుకు ఈ రంగులు, చిహ్నాలు ఉపయోగపడతాయి.

ఫొటో సోర్స్, @narendramodi
రైలు బోగీలు, వాటి రంగులు
భారతీయ రైల్వేలో రెండు రకాల బోగీలు ఉన్నాయి.
1. ICF - ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ బోగీలు. ఐసీఎఫ్ అనేది స్వతంత్ర భారతదేశంలోని తొలి ఉత్పత్తి యూనిట్లలో ఒకటి. దీన్ని 1955లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఇక్కడి నుంచి తయారయ్యే ప్రాథమికమైన బోగీలనే ఐఎఫ్‌సీ కోచ్‌లు అంటాం. తరువాతి దశలో ఐసీఎఫ్ కోచ్‌లను రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్) కపుర్తలాలో కూడా తయారుచేయడం ప్రారంభించారు.
ఐసీఎఫ్ బోగీలు నీలం రంగులో ఉంటాయి. మనం ఎక్కువ చూసేది ఐఎఫ్‌సీ బోగీలనే. ప్యాసింజర్, మెయిల్-ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు ఐసీఎఫ్ కోచ్‌లు ఉంటాయి.
2. LHB - లింక్ హాఫ్మన్ బుష్ కోచ్‌లు హై స్పీడ్ రైళ్ల కోసం రూపొందించినవి. ఇండియన్ రైల్వేస్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, 1995లో M/s ఆల్‌స్టోం జర్మనీతో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను రూపొందించడం ప్రారంభించింది. ఈ కోచ్‌ల భారీ ఉత్పత్తి 2002లో ప్రారంభమైంది.
ఇవి ఐసీఎఫ్ కోచ్‌ల కన్నా భిన్నమైనవి. ఐసీఎఫ్ బోగీల కన్నా 2 మీటర్లు పొడవైనవి. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారయ్యే ఈ బోగీలు ఐసీఎఫ్ బోగీల కన్నా తక్కువ బరువు ఉంటాయి.
ఎల్‌హెచ్‌బీ బోగీల రంగు ఎరుపు. మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ ట్రైన్లకు ఎల్‌హెచ్‌బీ బోగీలు ఉంటాయి. ఉదాహరణకు రాజధాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్.

ఫొటో సోర్స్, Getty Images
రైలు బోగీలపై ఉండే చారలు - వాటి రంగులు
రైళ్లలో కొన్ని బోగీల చివరి కిటికీ పైన ఒక దీర్ఘచతురస్రంలో ఏటవాలుగా ఉండే చారలు కనిపిస్తాయి. ఇవి వివిధ రంగుల్లో ఉంటాయి.
మనం సాధారణంగా చూసే నీలం రంగు రైలు ఐసీఎఫ్ బోగీలపై పసుపు రంగు లేదా తెలుపు రంగు చారలు ఉంటాయి. దీనర్థం అది జనరల్ కంపార్ట్మెంట్ అని. దీనికి రిజర్వేషన్ ఉండదు.
సాధారణంగా రైలు స్టేషన్‌లోకి ప్రవేశించగానే, జనరల్ బోగీ ఎక్కడ ఉందో తెలియక తికమకపడుతుంటారు. ఈ పసుపు లేదా తెలుపు రంగు చారల ద్వారా వాటిని సులువుగా గుర్తించవచ్చు.
మెయిన్‌లైన్ ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) ట్రైన్లలో ఆకుపచ్చ చారలు ఉంటే మహిళల కోచ్ అని, ఎర్ర చారలు ఉంటే ఫస్ట్ క్లాస్ కోచ్ అని అర్థం. సాధారణంగా లోకల్ రైళ్ల బోగీలపై ఈ చిహ్నాలు వాడతారు.

ఫొటో సోర్స్, POONAM KAUSHAL/BBC
ప్రత్యేకమైన ట్రైన్స్
గరీబ్‌రథ్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మధ్య, దిగువ తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో ఏసీ సౌకర్యాలను కల్పించే ట్రైన్ ఇది.
హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ఆకాశం రంగులో, పూవుల డిజైన్‌తో ఉంటుంది. కోచ్ కింది భాగంలో ఆరెంజ్, పసుపు చారలు ఉంటాయి.
మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా తీసుకొచ్చిన మరొక అధునాతన రైలు మహామన ఎక్స్‌ప్రెస్. ఇది సాంకేతికంగా, సౌకర్యాల పరంగా అధునాతమైన ట్రైన్ అని చెబుతున్నారు. ఇది ఊదా రంగులో ఉంటుంది.
2019లో ప్రారంభమైన తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను భారత రైల్వేకే చెందిన ప్రైవేటు కంపెనీ ఐఆర్‌సీటీసీ నడుపుతోంది. దీని కోచ్‌లు ముదురు పసుపు, ఆరెంజ్ రంగుల్లో ఉంటుంది. బోగీల నిండా డిజైన్ ఉంటుంది.
ఈ రైలు సేవలను భారత్‌లో మొదటి ప్రైవేట్ లేదా కార్పొరేట్ సేవలు అని కూడా చెప్పుకుంటున్నారు. ఐఆర్‌సీటీసీ తేజస్‌ను రైల్వే నుంచి లీజుకు తీసుకుంది. దీనిని కమర్షియల్‌గా నడుపుతోంది. ఐఆర్‌సీటీసీ అధికారులు దీనిని ప్రైవేటుకు బదులు కార్పొరేట్ ట్రైన్ అంటారు. చాలా వేగంగా వెళ్లే ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. దేశ రాజధాని దిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మధ్య 511 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఇది ఆరున్నర గంటల్లో పూర్తి చేస్తుంది. విమానంలో ఎయిర్ హోస్టెస్ ఉన్నట్టు ఇందులో రైల్ హోస్టెస్ ఉంటారు. అదే దీని ప్రత్యేకత.
డబుల్‌డెకర్ ట్రైన్స్ పసుపు రంగులో, పైన, కింద ఎరుపు చారలతో ఉంటాయి.
నారో గేజ్‌కు బ్రౌన్ కలర్ బోగీలు ఉంటాయి. కిలోమీటర్లను అనుసరించి భారతీయ రైల్వేలో బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నారో గేజ్ రైళ్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, INDIAN RAILWAYS
భారతీయ రైల్వే చరిత్ర
భారత ఉపఖండంలో తొలి రైలు బొంబాయి (ఇప్పటి ముంబై) నుంచి థానే వరకు 21 మైళ్ల పొడవున నడిచింది.
ఇండియన్ రైల్వేస్ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం, ముంబై నగరాన్ని థానే, కల్యాణ్, థాల్, భోరే ఘాట్‌లతో అనుసంధానిస్తూ రైలు నడపాలన్న ఆలోచన 1843లో భాండూప్‌ను సందర్శించిన బొంబాయి ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ మిస్టర్ జార్జ్ క్లార్క్‌కు వచ్చింది.
1853 ఏప్రిల్ 16న ఈ రైలును అధికారికంగా ప్రారంభించారు. సుమారు 400 మంది అతిథులతో 14 రైల్వే క్యారేజీలు ఉన్న ట్రైన్ మధ్యాహ్నం 3.30 గంటలకు బోరి బందర్ నుంచి బయలుదేరింది.
1854 ఆగస్టు 15న మొదటి ప్యాసింజర్ రైలు హౌరా స్టేషన్ నుంచి 24 మైళ్ల దూరంలో ఉన్న హుగ్లీకి బయలుదేరింది. అలా తూర్పు భారతీయ రైల్వే ప్రారంభమైంది.
దక్షిణాన, 1856 జూలైలో మద్రాసు రైల్వే కంపెనీ తొలి రైల్వే మార్గాన్ని ప్రారంభించింది. ఈ రైలు వ్యాసర్పాడి జీవ నిలయం (వేయసర్పాండి), వాలాజా రోడ్ (ఆర్కాట్) మధ్య 63 మైళ్ల దూరం ప్రయాణించింది.
ఉత్తరాన, 1859 మార్చి 3న 119 మైళ్ల పొడవున అలహాబాద్ నుంచి కాన్పూర్‌కు తొలి రైలు ప్రయాణించింది.
ప్రస్తుతం భారతీయ రైల్వే రోజుకు సుమారు 11,000 ట్రైన్స్ నడుపుతోంది. వీటిలో 7,000 ప్యాసింజరు రైళ్లే.
ఇవి కూడా చదవండి:
- ట్రోలింగ్‌పై రష్మిక మందన్న: ‘నన్ను అందరూ ఇష్టపడరని తెలుసు... ప్రతి ఒక్కరూ ప్రేమించాలని అనుకోను...’
- కెంపెగౌడ: 4,000 కేజీల కత్తి సహా 220 టన్నులున్న ఈ విగ్రహం ఎవరిది
- ఆంధ్రా యూనివర్సిటీలో చెట్లు ఎందుకు నరికేశారు, ఏమిటీ వివాదం?
- జీ20 లోగోలో ‘కమలం’ ఏమిటి.. అసలు మోదీ, బీజేపీలకు సిగ్గులేదా అంటూ కాంగ్రెస్ ప్రశ్నలు
- అమెరికా: ర్యాన్ డిశాంటిస్ మరొక డోనల్డ్ ట్రంపా?













