కొమెర జాజి: నల్లమల అడవిలో పార్టీలు చేసుకునే కుర్రాళ్లకు ఆయన ఎందుకు క్లాసు తీసుకుంటారు?

ఫొటో సోర్స్, Komera jaji
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పల్నాటి సీమలో నల్లమల అడవి మొదలయ్యే చోటు.. ఊరికి దూరంగా నల్లటి ఎత్తైన కొండలు కనిపిస్తుంటాయి. ఊరి నుంచి బండి మీద ఐదు నిమిషాలు వెళ్తే అడవి వస్తుంది. అడవి మొదట్లో ఒక ఐదారు కిలోమీటర్ల దూరం అడవి చూడటానికి సాధారణ చెట్లలా కనిపిస్తుంది. లోపలికి వెళ్లే కొద్దీ కొండల ఎత్తు, చెట్ల సంఖ్య పెరుగుతూ దట్టంగా మారుతుంది.
ఆ అడవి మొదట్లో.. కాస్త నలిగిన చొక్కా, షార్ట్ వేసుకుని భుజాన ప్లాస్టిక్ గోనె సంచి వేసుకుని తాగి పారేసిన మందు సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, కూల్ డ్రింక్, వాటర్ బాటిళ్లు ఏరుకుంటూ వెళ్తున్నాడు ఒక వ్యక్తి.
అప్పుడే అడవిలో మందు సిట్టింగ్ ముగించుకుని, చెత్త అక్కడ వేసి, బయటకు వస్తున్న కుర్రాళ్లు కొందరు ఆయన్ను చూశారు. ‘‘బాబూ.. లోపల తిన్నగా వెళ్లు. ఆ చెట్టు కింద చాలా బాటిళ్ళున్నాయి. వంద రూపాయలు అయినా వస్తాయి’’ అంటూ ఆ చెత్త ఏరుతున్న వ్యక్తికి చెప్పారు. విన్న ఆ వ్యక్తి వెంటనే అటు వెళ్లి చకచకా ఆ బాటిళ్లు సంచిలో వేసుకుని వచ్చారు.
తిరిగి వచ్చి అక్కడే ఉన్న ఆ కుర్రాళ్లకు ఆ బాటిళ్ళు చూపించి, వారికి క్లాసు తీసుకోవడం మొదలుపెట్టారు. తాను చెత్త ఏరుకునే వ్యక్తిని కాదనీ, అడవిలో ఇలా బాటిల్స్, ప్లాస్టిక్ పారేయడం వల్ల వచ్చే నష్టం ఎలాంటిదో వివరించారు. మద్యం మత్తులో ఉన్న ఆ కుర్రాళ్లు దాడి చేస్తారేమో అన్న భయం ఆయనలో ఉంది .కానీ, ఆ కుర్రాళ్లు సారీ చెప్పి వెళ్లిపోయారు. ఇంకెప్పుడూ అడవిలో చెత్త వేయం అన్నారు.

ఫొటో సోర్స్, Komera Jaji
నల్లమల అడవిలో చెత్త శుభ్రం చేస్తూ, అరుదైన మొక్కలను కాపాడుతూ, కొత్త మొక్కలు నాటుతోన్న పర్యావరణ కార్యకర్త కొమెర జాజికి ఎదురైన అనుభవం ఇది. ఇలాంటివెన్నో అనుభవాలున్నాయి జాజి దగ్గర.
పల్నాడు జిల్లా కారెంపూడి గ్రామానికి చెందిన కొమెర అంకా రావు ముద్దుపేరు జాజి. ఈయన అడవిని కాపాడటమే పనిగా పెట్టుకుని ఇప్పటికి వేల కిలోల చెత్తను నల్లమల నుంచి బయటకు తీసుకువచ్చారు. అడవిలోని అరుదైన మొక్కలను కాపాడుతుంటారాయన.
జంతువులకు ఆహారాన్నిచ్చే అనేక పండ్ల మొక్కలను అడవిలో పెంచి, జంతువులు ఊళ్లోకి రాకుండా తన ప్రయత్నం చేస్తున్నారు. తనకున్న చిన్న పొలాన్ని కూడా పక్షులకు మేత కోసమే వదిలేశారు. స్కూళ్లకు వెళ్లి అక్కడి పిల్లలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తుంటారు. అందరూ ప్రకృతిని కాపాడాలంటూ హితబోధ చేస్తుంటారు.

అడవిలో బీరు సీసాలో దాహం తీర్చుకున్న పక్షి
‘‘ఒకరోజు అడవిలో వెళుతుంటే పగిలిపోయిన బాటిల్స్‌లో కొంచెం బీరు మిగిలి ఉంది. అదే సీసాలో కొన్ని వాన నీళ్లు పడ్డాయి. ఆ బీరు, వాన నీరు కలిసిన దాన్ని పిట్ట తాగడం చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. నేనే సీసాలు తొలగించాలని నిర్ణయం తీసుకుని చెత్త ఏరడం ప్రారంభించాను’’ అని చెప్పారు జాజి.
మొదట్లో విత్తనాలు జల్లడం కోసం మాత్రమే అడవికి వెళ్లేవారు జాజి. అప్పట్లో చెత్త ఏరే కార్యక్రమం లేదు. ‘‘నేను అప్పట్లో అడవిలోకి వెళ్లేప్పుడు చెత్తను చూసి ఆశ్చర్యపోయేవాణ్ణి. అడవిలోకి సీసాలు ఎలా వచ్చేవో అర్థం అయ్యేది కాదు. తరువాత తరువాత తాగుతూ జనాలు కనిపించాక తెలిసింది’’ అన్నారాయన.
‘‘టౌన్లలో ఆవులకు ఆపరేషన్ చేస్తే కేజీల కొద్దీ ప్లాస్టిక్ వస్తుంది కదా. అలాగే అడవిలో కూడా అడవి పందులు ఈ ప్లాస్టిక్ సీసాలను కొరికి తిని చనిపోతున్నాయి. అదొక్కటే కాదు అన్ని రకాలుగా ఇది అడవికి అనర్థం. ఒక జంతువు చనిపోతే వేల మొక్కల పుట్టుక ఆగిపోతుంది. ఎందుకంటే జంతువులు కాయలు తిని వాటి గింజలు విసర్జిస్తే అవి వేరే చోట మొలుస్తాయి’’అంటూ అడవిని చెత్తబుట్ట చేయడంలో సమస్యలు వివరించారాయన. ఆ చెత్తను అడవి నుంచి బయటకు తీసుకువచ్చి రోడ్డు పక్కన పెట్టి చెత్త ఏరుకునే వారికి ఇస్తారు జాజి.

ఫొటో సోర్స్, Komera jaji
ఆయన స్కూటర్ డిక్కీలో ఎప్పుడూ సంచి ఉంటుంది. ఆయన ఈ పనిచేస్తున్నప్పడు చూసి, ఆయనతో మాట్లాడి, చెత్త ఏరుకునే వ్యక్తి కాదు అని గ్రహించి చాలా మంది తనను అభినందిస్తారని చెప్పుకొచ్చారు. తాము ఈ పనిచేయలేం కానీ ఇకపై అడవిలో చెత్త వేయబోమంటూ తనకు హామీ ఇస్తారని చెప్పారు జాజి.
‘‘నేను చెప్పేది విని కాదు, నేను చేసేది చూసి చాలా మంది మారారు’’అని ఆయన వివరించారు.
సరాదాగా పార్టీ కోసం అడవికి వచ్చేవారు, వాళ్ల పని అయ్యాక ఆ చెత్త తిరిగి తీసుకుపోతే అడవి స్వచ్ఛంగా ఉంటుంది అంటారాయన.

ఫొటో సోర్స్, Komera Jaji
కోతుల సమస్యకు అదే పరిష్కారం
‘‘మా చిన్నప్పుడు పల్లెల్లో ఇలా తోపుడు బండ్లపై పండ్లు అమ్మే వారు కాదు. సరదాగా అడవికి వెళ్తే బోలెడన్న పండ్లు దొరికేవి. తునిక, బలిజ, నేరేడు.. సీజన్ల వారీగా రకరకాల పండ్లు తిని కుంటల్లో నీరు తాగి ఇంటికి వచ్చేవాళ్లం. ఇప్పుడు అడవిలో పండ్లే దొరకడం లేదు. చాలా అరుదైన చెట్లతో పాటూ, సాధారణ పండ్ల చెట్లు కూడా అంతరించి పోయాయి. అడవిలో తిండి దొరక్క కోతులు ఊళ్లలోకి వస్తున్నాయి. అటు పంటలకీ, ఇటు ఇళ్లకీ కోతులు చేసే నష్టం తెలిసిందే. వాటి భయానికి పారిపోతూ చనిపోయిన వారు ఎందరో ఉన్నారు. అందుకే కోతులు తినే చింత, సీతాఫలం, నేరేడు వంటి మొక్కలు అడవిలో నాటి పెంచుతున్నాను. అప్పుడే కోతులు, ఇతర జంతువులు బయటకు రాకుండా ఉంటాయి’’ అన్నారు జాజి.
అడవిలో మొక్కలు నాటి వదిలేయవచ్చు కదా? అక్కడ ప్రత్యేకంగా మొక్కల్ని కాపాడడం ఎందుకు అని ఆయనను ప్రశ్నించింది బీబీసీ.
‘‘మేకలు పెంచుకునే వారితో అడవి చాలా ధ్వంసం అవుతుంది. ఈ మొక్కలను మేకలు తినకుండా కాపాడితేనే అవి పెరిగి పండ్లు ఇచ్చేది. దాంతో పాటూ అడవిలో గతంలోలా నీరు ఉండడం లేదు. అందుకే కనీసం ఏడాది అయినా అడివిలో నాటిన మొక్కలకు నీరు ఇవ్వాలి’’ అని సమాధానం చెప్పారాయన. ప్రతీ ఏటా జూన్, జూలై, ఆగస్టుల్లో ఎక్కువగా మొక్కలు నాటుతుంటారు.
40 ఏళ్ల జాజి దాదాపు పాతికేళ్లుగా ఈ పని చేస్తున్నట్టు చెప్పారు. తాను పదో తరగతి వేసవి సెలవుల సమయంలో విత్తనాలు జల్లడం మొదలుపెట్టానని ఆయన బీబీసీకి వివరించారు.
‘‘కానీ విత్తనాల కంటే మొక్కలు నాటితే ఎక్కువ లాభం అని తరువాత అర్థం అయింది. కొంత వయసు వచ్చి చేతుల్లో డబ్బులు ఉండడం మొదలయ్యాక మొక్కలు నాటే వాణ్ణి. విత్తనాలు అంటే అడవిలోనే ఏరవచ్చు. మొక్కలు అంటే కొనాలి కదా’’ అంటూ వివరించారు జాజి.
చిన్నప్పుడు పుస్తకాలు, పేపర్లలో పర్యావరణ ప్రేమికుల గురించి చదివి, తన తండ్రి చెప్పే కథలు విని తనకు ఈ ఆసక్తి కలిగిందని ఆయన వివరించారు.

పక్షుల కోసం పొలం
తనకున్న ఎకరం పొలంలో జొన్న, సజ్జ కలపి వేశారు జాజి. సేంద్రీయ పద్ధతిలో ఆ పొలంలో పండిస్తున్నారు. అయితే పంట పండాక పొలం కోయకుండా అలా వదిలేస్తారు. వాటిని పక్షులు తింటాయి.
‘‘కరోనా సమయంలో ఈ ఆలోచన వచ్చింది. కరోనాలో మనుషులు చాలా మందికి తిండి అందక ఇబ్బందులు పడ్డారు. అప్పుడు నాకు పక్షుల సంగతి స్ఫురించింది. జంతువుల కోసం పండ్ల మొక్కలు వేసినట్టు పక్షులకు కోసం పొలాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు జాజి.

ఫొటో సోర్స్, Komera jaji
పర్యావరణ అవగాహన
పల్నాడు పరిసర ప్రాంతాల్లోనూ పాఠశాలలకు తరచూ వెళ్తుంటారు జాజి. అక్కడ పిల్లలకు ప్రకృతిని కాపాడటం గురించి అవగాహన కల్పిస్తుంటారు.
‘‘చాలా మంది మాటలు చెబుతారు. కానీ పనిచేయరు. పనిచేసే వారు చెప్పుకోరు. కానీ పనిచేసే వారు చెప్పుకుంటూనే అందరికీ తెలుస్తుంది. అప్పుడు నలుగురూ ఆ పని చేస్తారనేది నా ఉద్దేశం. పెద్దవాళ్లకు చెబితే వినరు. పిల్లలకు చెబితే వారు ప్రకృతి మీద ప్రేమతో ఉంటారు. అందుకే పిల్లలకు అడవి వాతావరణం, పక్షులు, అరుదైన జంతువులు, చెట్ల గురించి చెబుతాను’’అని చెప్పారు జాజి.
‘‘నా చిన్నప్పుడు మా నాన్న గారు చెప్పిన కాకమ్మ, పిచ్చుకమ్మ కథలే నాకు ప్రకృతి మీద ప్రేమ పెంచేలా చేశారు. అందుకే నేను పిల్లలకు పర్యావరణ అవగాహనకు ఎక్కువ శ్రద్ధ చూపిస్తాను’’ అన్నారాయన.
గతంలో స్కూళ్లలో పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి టీచర్లు అంతగా ఒప్పుకునే వారు కాదనీ, మీడియాలో కాస్త పేరు వచ్చాక పర్మిషన్లు సులువు అయ్యాయని అంటున్నారు జాజి.
అడవిలో పాములు ప్రమాదం.. అడవి పందులు భయపెడతాయి
‘‘అడవి నాకు బాగా అలవాటే కానీ ఎప్పుడైన అడవి పందులో, కుందేళ్లో ఒక్కసారిగా ఎగిరి దూకినప్పుడు ఒక్క క్షణం ఉలిక్కిపడి భయం వేస్తుంది. అలాగే పాములు ప్రమాదం. అకస్మాత్తుగా మన కాళ్ల పక్క నుంచే పాక్కుంటూ వెళతాయి’’అని ఆయన చెప్పారు.
‘‘ప్రపంచానికి ఆక్సిజన్ ఇచ్చేవి అమెజాన్ అడవులు అయితే, తెలుగు రాష్ట్రాలకు నల్లమల అడవులు ప్రాణాధారం. ఈ అడవికి ప్రమాదం ఏర్పడితే వేల కోట్లు పోసినా పునరుద్ధరించలేం. నల్లమల ప్రమాదంలో పండితే రెండు రాష్ట్రాలకూ ప్రమాదమే, ఇక్కడ చెట్లు తగ్గితే నాగార్జున సాగర్‌కు కూడా ఇబ్బందే. నల్లమలను కాపాడుకోవాలి. అడవిలో ప్లాస్టిక్, బీరు సీసా లేకుండా చేయాలనేదే నా లక్ష్యం’’ అన్నారు జాజి.
తన జీవితంలో ఎక్కువ భాగం ఈ అడవులపై పనిచేయడానికే జాజి కేటాయించారు. ఆయన తల్లితండ్రులు కూలి పని చేస్తుంటారని చెప్పారు. కుటుంబ పోషణ నిమిత్తం మాత్రమే అప్పుడప్పుడూ తన ఉపాధి కోసం ఇతర పనులు చేస్తన్నట్టు జాజి చెప్పారు.
కొందరు ఆయనకు సహాయం అందిస్తున్నారు. తాను సొంతంగా కూడా ఒక యూట్యూబ్ చానెల్ నడుపుతున్నారు. అలాగే నాటు వైద్యం గురించి సలహాలు ఇచ్చే వారికి ఆ మొక్కల వీడియోలు అందిస్తుంటారు.
ఇవి కూడా చదవండి:
- దివ్య ఎస్ అయ్యర్: ఈ కేరళ కలెక్టర్ తన కొడుకును ఎత్తుకుని ప్రసంగించటం మీద ఎందుకీ చర్చ?
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పుతో కొత్త సమస్యలు వచ్చి పడతాయా?
- బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడితో అదే ఇంట్లో జీవించడం ఎలా?
- ఆంధ్రప్రదేశ్ - మోదీ విశాఖ పర్యటన: విభజన హామీలు ఎంత వరకు వచ్చాయి, స్థానికంగా వినిపిస్తున్న డిమాండ్లు ఏంటి?
- అదా శర్మ బురఖాతో నటించిన సినిమాపై కేరళలో వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















