కేరళలో 32,000 మంది మహిళలు మతం మారి, ఇస్లామిక్ టెర్రరిస్టులు అయ్యారా? అదా శర్మ సినిమాపై వివాదం ఎందుకు?

అదా శర్మ

ఫొటో సోర్స్, SUNSHINE PICTURES / YOUTUBE

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

కేరళలో వివాదానికి తెరతీసిన ఒక సినిమా టీజర్‌పై నమోదైన ఫిర్యాదు విషయంలో న్యాయపరమైన సలహాను కేరళ పోలీసులు తీసుకుంటున్నారు.

‘‘ద కేరళ స్టోరీ’’ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది.

చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అదాశర్మ టీజర్‌లో... ‘‘ఇస్లామిక్ టెర్రరిస్టుగా మారిన కేరళకు చెందిన 32,000 మహిళల్లో నేనూ ఒకరిని’ అని చెప్తారు.

అసలు ఈ సినిమాపై పూర్తిగా నిషేధం విధించాలని కొందరు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ టీజర్ విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేరళ ముఖ్యమంత్రికి ఓ జర్నలిస్టు కూడా లేఖ రాశారు.

ముస్లింలు

టీజర్‌లో బురఖా ధరించిన అదా శర్మ మాట్లాడుతూ.. ‘‘నా పేరు శాలినీ ఉన్నికృష్ణణ్. నేను నర్సు కావాలని అనుకున్నాను’’అని చెప్పడం కనిపిస్తుంది.

‘‘ఇప్పుడు నా పేరు ఫాతిమా బా. నేను ఐఎస్ టెర్రరిస్టును. అఫ్గానిస్తాన్ జైలులో ఉన్నాను’’అని ఆమె టీజర్‌లో చెప్తారు. ‘‘నాలానే 32,000 మంది మతం మారారు. వారు సిరియా, యెమెన్‌లలోని ఎడారుల్లో ఉన్నారు’’అని ఆమె ఆ టీజర్‌లో చెప్తారు.

‘‘సాధారణ అమ్మాయిలను భయానక ఉగ్రవాదులుగా మారుస్తూ విధ్వంసకర గేమ్‌లు కేరళలో ఆడుతున్నారు. అంతా బహిరంగంగానే జరుగుతోంది’’అని ఆమె చెబుతున్నట్లు టీజర్‌లో కనిపిస్తుంది.

ఈ టీజర్‌కు యూట్యూబ్‌లో ఆరు రోజుల్లో 4,40,000కుపైగా వ్యూస్ వచ్చాయి. కొందరు దీన్ని విమర్శిస్తుంటే, మరికొందరు ప్రశంసిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, ఇరాన్ నిరసనలు, హిజాబ్ చరిత్రపై బీబీసీ ఎక్స్‌ప్లైనర్

అసలు ఆ సంఖ్య నమ్మేలా ఉందా?

సినిమాలో నటించిన అదా శర్మ #TrueStory హ్యాష్‌ట్యాగ్‌తో ఈ టీజర్‌ను షేర్ చేశారు. ఈమె తెలుగు సినిమా S/O సత్యమూర్తిలోనూ నటించారు.

బీబీసీ పంపిన మెసేజ్‌లకు ఈ సినిమా ప్రొడ్యూసర్ విపుల్ షా సమాధానం ఇవ్వలేదు.

ఈ విషయంపై విచారణ చేపట్టాలని కోరినట్లు జర్నలిస్టు అరవిందకృష్ణన్ బీబీసీతో చెప్పారు.

టీజర్‌లో చేస్తున్న ఆరోపణలపై సినిమా నిర్మాతలు ఆధారాలు చూపించాలని ఆయన కోరుతున్నారు.

‘‘ఏవో కొన్ని కేసుల్లో ఇలా జరిగి ఉండొచ్చు. కానీ, మరీ 32 వేలా? అసలు ఆ సంఖ్య నమ్మేలా ఉందా?’’అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

2021లో కుట్టీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ.. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అసెంబ్లీలో చెప్పిన వివరాల ఆధారంగా ఆ సంఖ్య విషయంలో ఒక అగాహనకు వచ్చినట్లు చెప్పారు.

‘‘ఏటా 2,800 నుంచి 3,200 మంది అమ్మాయిలు ఇస్లాంలోకి మతం మారుతున్నారు. పదేళ్లలో ఈ సంఖ్యను చూస్తే దాదాపు 32,000 అవుతుంది’’అని ఆయన చెప్పారు.

అయితే, ఇంత పెద్దమొత్తంలో మతమార్పిడులు జరగలేదని ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ చెబుతోంది.

2006 నుంచి మొత్తంగా 2667 మంది అమ్మాయిలు ఇస్లాంలోకి మతం మారినట్లు 2012లో చాందీ చెప్పారని, అవి వార్షిక గణాంకాలు కావని ఆల్ట్‌న్యూస్ చెబుతోంది.

వీడియో క్యాప్షన్, గతేడాది జరిగిన దారుణాలను మళ్లీ జరగనివ్వబోమంటున్న స్థానికులు

2016లో 21 మంది...

కేరళకు చెందిన 21 మంది 2016లో దేశాన్ని విడిచిపెట్టి మిలిటెంట్ సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరేందుకు వెళ్లారు.

వీరిలో ఒక విద్యార్థిని కూడా ఉన్నారు. ఆమె పెళ్లికి ముందు ఇస్లాంలోకి మతం మారారు. దేశం విడిచివెళ్లేటప్పుడు ఆమె ఎనిమిది నెలల గర్భిణి.

2021లో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన కేరళకు చెందిన నలుగురు మహిళలు ప్రస్తుతం అక్కడి జైళ్లలో గడుపుతున్నట్లు భారత అధికారులు గుర్తించారు.

‘‘ఈ విషయంలో మనం రికార్డులను పరిశీలించాలి. కానీ, అంచనాల ప్రకారం చూస్తే.. 2016 నుంచి కేరళకు చెందిన 10 నుంచి 15 మంది అమ్మాయిలు ఇస్లాంలోకి మారి ఐఎస్‌లో చేరివుంటారు’’అని ఒక సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు.

ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, స్టేట్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డులు, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్‌లకు కూడా లేఖలు రాసినట్లు అరవిందకృష్ణన్ చెప్పారు. అయితే, ఇప్పటివరకు ఆయన ఎలాంటి సమాధానం లభించలేదు.

‘‘దేశ సమైక్యత, సార్వభౌమత్వాలకు వ్యతిరేకంగా ఈ సినిమా ఉంది. భారత నిఘా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా దీనిలో ఆరోపణలు చేశారు’’అని ఆయన చెప్పారు.

మరోవైపు ఈ సినిమా టీజర్ కేరళలో రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఒది ఒక ‘‘మిస్‌ఇన్ఫర్మేషన్’’ క్యాంపెయిన్‌లో భాగమని కాంగ్రెస్ నాయకుడు వీడీ సతీశన్ వ్యాఖ్యానించారు. ‘‘కేరళ ప్రతిష్ఠను మసకబార్చేందుకు, విద్వేషాలను రెచ్చగొట్టేందుకు దీన్ని తీశారు’’అని ఆయన అన్నారు.

కేరళలోని సీపీఎంకు చెందిన చట్టసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ.. సినిమా నిర్మాతలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు చెప్పారు.

అయితే, సినిమా నిర్మాతలపై కేరళ ప్రభుత్వం కేసు నమోదు చేయడాన్ని బీజేపీ నాయకుడు కే సురేంద్రన్ విమర్శిస్తున్నారు. అసలు ఐఎస్ కోసం నియామకాలు చేపట్టేవారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకొనేందుకు ముఖ్యమంత్రికి ధైర్యముందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)