దివ్య అయ్యర్: ఈ కేరళ కలెక్టర్ తన కొడుకును ఎత్తుకుని ప్రసంగించడంపై ఎందుకీ చర్చ?

ఫొటో సోర్స్, Courtesy: Divya S Iyer
కేరళలో ఒక సివిల్ సర్వీస్ అధికారి ఒక కార్యక్రమంలో తన మూడేళ్ల కొడుకును ఎత్తుకుని ప్రసంగిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దిల్లీ నుంచి బీబీసీ ప్రతినిధి గీతా పాండే అందిస్తున్న కథనం.
ఏళ్ల కిందట నా కొడుకు పిల్లవాడుగా ఉన్నపుడు నేను పనికి వెళ్లేటపుడు కొన్నిసార్లు అతడ్ని నా వెంట తీసుకుని వెళ్లేదాన్ని. ముఖ్యంగా వారాంతంలోనో, సెలవు రోజునో ఇలా జరిగేది. ఓసారి ఒక మంత్రిని ఇంటర్వ్యూ చేయటానికి వెళ్లినపుడు నా కొడుకును వెంట తీసుకెళ్లాను. ఓ చిన్న బాలుడు తన ఆఫీసులో కనిపించటం ఆ మంత్రికి ఆనందాన్నిచ్చింది. ఆ బాలుడితో మంత్రి పలకరించి మాట్లాడాడు. అతడి కోసం తన సిబ్బందితో చాక్లెట్లు, డ్రింక్ తెప్పించాడు.
నేను పనికి వెళ్లేటపుడు నా కొడుకుని తీసుకువెళ్లటం అదే మొదటిసారి కాదు. ఇన్నేళ్లలో బీబీసీలో నా సహోద్యోగులు చాలా మంది కూడా వారి పిల్లలను ఆఫీసుకు తీసుకురావటం చూశాను. ఎవరూ ఎప్పుడూ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఇండియాలో పిల్లల సంరక్షణ దాదాపుగా తల్లుల బాధ్యత. పనిచేసే తల్లుల్లో అత్యధికులు పనితో, ఇంటి పనితో తంటాలు పడుతుండటం వాస్తవం.
కార్మిక శక్తిలో ఎక్కువ మంది మహిళలు ఉండేలా చూసుకోవటానికి చాలా భారతీయ కంపెనీలు పిల్లలకు అనుకూలంగా ఉండే విధానాలను ప్రవేశపెడుతున్నాయి. అమెరికా, కెనడా వంటి దేశాల్లో అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను పని దగ్గరకు తీసుకు రావటాన్ని ప్రోత్సహిస్తూ జాతీయ దినోత్సవాలు కూడా ఉన్నాయి.
పతనమ్‌తిట్ట జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న దివ్య అయ్యర్.. అక్టోబర్ 30వ తేదీన ఒక ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు ఉత్సవానికి తన చిన్నారి కొడుకును తీసుకెళ్లటంతో రాజుకున్న చర్చ చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఉద్యోగానికి సంబంధించిన కార్యక్రమం దగ్గరికి తన కొడుకును తీసుకెళ్లటం ఇదే తొలిసారి కాదని దివ్య అయ్యర్ నాతో చెప్పారు. ‘‘కానీ ఎలాగో ఇది వైరల్ అయింది. అనూహ్య మలుపు తిరిగి అన్ని రకాల అభిప్రాయాలనూ కూడగట్టుకుంది’’ అని ఆమె పేర్కొన్నారు.
‘‘సాధారణంగా ఆదివారాలు నేను నా కొడుకు మల్హర్‌తో గడుపుతాను. ఆ రోజు ఆదివారం కావడంతో అతడిని నా వెంట తీసుకెళ్లాను. అప్పటికి అరగంటకు పైగా బయట ఆడుకుంటున్నాడు. స్టేజి మీద నన్ను చూసి నా దగ్గరకు పరుగున వచ్చాడు. ఆ తర్వాత జరిగిందంతా తల్లీబిడ్డల మధ్య ఉండే సహజ ప్రతిస్పందనే’’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, ANANTHAKRISHNAN
వైరల్ అయిన వీడియోలో.. దివ్య తన కొడుకును చేతులతో ఎత్తుకోవటం, అతడు ఆమె బుగ్గలు లాగి, ఆమె మెడ చుట్టూ చేతులు వేయటం కనిపిస్తుంది. ఆ తల్లీకొడుకులు అలా కొన్ని క్షణాలు ప్రేమను పంచుకున్న తర్వాత ఆమె 10 నిమిషాల పాటు ప్రసంగించారు.
రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఈ కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడు చిట్టాయమ్ గోపకుమార్ మొదట ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ‘‘మల్హర్ ఈ కార్యక్రమానికి ఆనందాన్ని, ఉత్సాహాన్ని జోడించాడు’’ అని ఆ పోస్టులో రాశారు.
ఓ చిన్నారి స్టేజి మీద సంబరంగా పరుగులు తీస్తుండటాన్ని సోషల్ మీడియాలో చాలా మంది అభినందించారు. కానీ, కొందరు భిన్నమైన అభిప్రాయం వ్యక్తంచేశారు. దివ్య ప్రవర్తన సరిగా లేదని, ఆమె తన బిడ్డను తీసుకురావటం ద్వారా ఆ కార్యక్రమాన్ని కించపరిచారని వ్యాఖ్యానించారు.
‘‘ఆ ప్రతిస్పందనలు ఉరుముల్లేని పిడుగుల్లా అనిపించాయి. అది అధికారిక కార్యక్రమం కాదు. ఈ విషయాన్ని రెండు రకాలుగా చూసే అవకాశం ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు’’ అని దివ్య నాతో చెప్పారు.
‘‘పిల్లలు మామూలుగా వెళ్లని ప్రదేశాలకు వారిని తీసుకు వెళ్లటం వల్ల వారి ఆలోచనా పరిధిని విస్తరించటానికి దోహదపడుతుందని, వారు సంపూర్ణంగా ఎదగటానికి వీలుకల్పిస్తుందని నేను నమ్ముతాను’’ అని ఆమె తెలిపారు.
‘‘పసితనం అంటే గాలివూదిన బూరలు, టెడ్డీ బేర్లు మాత్రమే కాదు. నిజజీవిత అనుభవాలు కూడా ఉండాలి. నా కొడుకు నన్ను మరింతగా చూడాలని నేను కోరుకుంటాను. నేను కేవలం తన తల్లిని మాత్రమే కాదని, ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయని, నేను ఒక మహిళనని, ఒక అధికారిని కూడా అని అతడు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటాను’’ అని చెప్పారామె.
ఆ వీడియో మీద వచ్చిన చాలా స్పందనలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, అందుకు కారణం బహుశా ‘‘ప్రతి కుటుంబానికీ ఈ అనుభవం ఉండడం’’ కావచ్చునని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Courtesy: Divya S Iyer
‘‘వారంలో ఏడు రోజులూ 24 గంటలూ నేను తల్లిని. అలాగే 24 గంటలూ అధికారిని కూడా. మనకు బహుళ పాత్రలు ఉంటాయి. వాటిలో దేనినీ వదులుకోలేను. రెండినీ సమన్వయం చేసుకుంటూ పని, జీవితం మధ్య సంతులనం సాధించాల్సి ఉంటుంది. కానీ దీనిని అంగీకరించటం కొందరికి ఎందుకు కష్టమవుతుందో అనేది అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను’’ అని దివ్య చెప్పారు.
అది అధికారిక కార్యక్రమం అని పొరపాటుగా భావించటం వల్ల.. అధికారిక పదవుల్లో ఉన్న మహిళలు ఇలాగే నడుచుకోవాలి అనే లింగపరమైన మూస ఆలోచనల వల్ల ఆ విమర్శలు వచ్చి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ విమర్శల్లో కొంత రాజకీయ ప్రేరేపితం కూడా కావచ్చునని భావిస్తున్నారు. దివ్యా అయ్యర్ భర్త కె.ఎస్.శబరినాథన్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌లో రాజకీయ నాయకుడిగా ఉన్నారు. దివ్యా అయ్యర్‌కు మద్దతుగా ఆయన మాట్లాడారు.
‘‘విమర్శలు పక్కనపెడితే.. మన సమాజంలో పనిచేసే తల్లుల దుస్థితి మీద ఈ వివాదం బహిరంగ చర్చకు దారితీయటం, తద్వారా ఈ అంశంపై ప్రజల్లో మరింత ఎక్కువ అవగాహనకు వీలు కల్పించటం సంతోషాన్నిస్తోంది’’ అని ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో రాశారు.
న్యూజీలాండ్ ప్రధానమంత్రి జసిందా ఆర్డెన్ తన శిశువును ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తీసుకువెళ్లారని, ఆస్ట్రేలియా సెనెటర్ లారిస్సా వాటర్స్ తన శిశువుకు పార్లమెంటులో చనుబాలు ఇచ్చారని ఉటంకిస్తూ.. ‘‘పని ప్రదేశాలు మారాల్సిన అవసరముంది. మరింత ఎక్కువగా వెసులుబాటు కల్పించాల్సిన అవసరముంది’’ అని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Courtesy: Divya S Iyer
దివ్య అయ్యర్ తన కొడుకును తన వెంట తీసుకెళ్లటం.. పనిచేసే మహిళల సమస్యల మీద, ముఖ్యంగా తమ పిల్లలను ప్రతి రోజూ తమ వెంట తీసుకువెళ్లక తప్పని పరిస్థితుల్లో ఉండే రోజు కూలీలు, ఇంటి పని మనుషులు వంటి పేద మహిళల సమస్యల గురించి కూడా చర్చించేలా చేసింది.
‘‘ఇది చాలా అన్యాయం. ఆమెపై ఎందుకంత విమర్శలు వచ్చాయో నాకు అర్థంకాలేదు. ఎవరైనా ఎందుకు అభ్యంతరం చెప్పాలి? అది అధికారిక కార్యక్రమం కూడా కాదు కదా. మరి ఎందుకీ నసుగుడు?’’ అంటారు చరిత్రకారిణి, స్త్రీవాద పరిశోధకురాలు జె. దేవిక.
దేవిక తన కూతుర్లు చిన్నపిల్లలుగా ఉన్నపుడు.. ఇంటి దగ్గర పిల్లలను చూసుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేసుకునే స్తోమత తనకు లేదని, అప్పుడు పిల్లల సంరక్షణ కోసం విడిగా క్రెచ్‌లు కూడా లేవని.. అందువల్ల తన కూతుర్లను తన పని కార్యక్రమాల దగ్గరకు తీసుకెళ్లేదానినని వివరించారు.
‘‘మహిళలకు పిల్లల సంరక్షణ బాధ్యత నుంచి ఎప్పుడూ మినహాయింపు ఉండదని మనందరికీ తెలుసు’’ అన్నారామె.
మహిళలు ఏం చేసినా దానిని పట్టుకుని తీర్పు చెప్తారనే విషయాన్ని ఈ వివాదం చూపుతోందని పేర్కొన్నారు.
‘‘మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన పిల్లలను సరిగా పట్టించుకోలేదని విమర్శించిన కాలం ఒకటుంది గుర్తుందా? ఇప్పుడు దివ్య తన పిల్లలకు తల్లిగా ఉన్నందుకు ఆమెను ట్రోల్ చేస్తున్నారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
‘‘మహిళా భవన నిర్మాణ కార్మికులు తమ పిల్లలను పని దగ్గరకు తీసుకెళ్లటం చూసినపుడు ఈ విమర్శకులందరికీ ఎంత కోపం వస్తుందో చూడాలి. వీళ్లు తమ ఆగ్రహాన్ని అటువంటి అత్యాచారాల మీదకు మళ్లించాలి’’ అని దేవిక పేర్కొన్నారు.
అయితే.. ‘‘ఆ కలెక్టర్ స్టేజి మీద తను ప్రవర్తించాల్సిన విధంగా ప్రవర్తించలేదు’’ అని ప్రముఖ గేయరచయిత రాజీవ్ అలుంకల్ వంటి వారు అంటున్నారు.
ఆయన ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను నా కొడుకుని అతడికి నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచీ బహిరంగ కార్యక్రమాలకు తీసుకెళుతున్నా. కానీ అతడిని ముందు వరుసలో కూర్చోబెట్టి, కదలకుండా కూర్చోవాలని చెప్తాను’’ అని చెప్పారు.
ఈ వివాదంలో అతి పెద్ద సానుకూల అంశం.. ఇది ఒక చర్చను రేకెత్తించటమేనని దివ్యా అయ్యర్ అంటారు.
‘‘నాకు చాలా మెసేజ్‌లు వచ్చాయి. ముఖ్యంగా.. నేను నా కొడుకును పక్కకి తరిమివేయకుండా ఎత్తుకోవటం తమ మనసుకు హత్తుకుందని, తమ ఆలోచనలు కూడా విస్తరించాయని చెప్తూ కొందరు యువ తల్లులు నాకు మెసేజ్ చేశారు’’ అని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కెంపెగౌడ: 4,000 కేజీల కత్తి సహా 220 టన్నులున్న ఈ విగ్రహం ఎవరిది - బెంగళూరులో మోదీ ఆవిష్కరిస్తున్న దీని వెనుక కుల రాజకీయాలున్నాయా
- మెన్స్ట్రువల్ కప్: నెలసరి సమయంలో దీనిని ఎలా వాడాలి? ఇక శానిటరీ ప్యాడ్ల అవసరం ఉండదా? 5 ప్రశ్నలు, సమాధానాలు..
- బాత్రూమ్లో రూ. 27 వేల కోట్ల విలువైన బిట్కాయిన్లు.. డార్క్‌నెట్ వెబ్సైట్ నుంచి దొంగిలించి దాచేశారు..
- వంటగది అపరిశుభ్రత వల్లే అనేక జబ్బులు... సాధారణంగా చేసే 9 తప్పులు, సరిదిద్దుకునే మార్గాలు
- కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలు
సంబంధిత కథనాలు














