కోడింగ్ అంటే ఏంటి? స్కూల్ దశలోనే చిన్నారులు దీన్ని నేర్చుకోవాలా?

విద్యార్థి, కోడింగ్, స్కూల్, బడి, ఆన్‌లైన్ కోర్సులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హర్షల్ అక్రుడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

స్కూల్ పిల్లలకు కోడింగ్ కోర్సులు అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వైట్ హాట్ జూనియర్ అనే యాప్ గురించి ప్రకటనలు కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి.

ఆరు నుంచి పద్నాలుగేళ్ల మధ్య వయసులో ఉన్న పిల్లలు కోడింగ్ నేర్చుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని... ప్రభుత్వం ఆరు, ఆ తర్వాతి తరగతులవారికి కోడింగ్ నేర్చుకోవడాన్ని తప్పనిసరి చేసిందని కూడా ఈ ప్రకటనల్లో చెబుతున్నారు. పిల్లల తల్లిదండ్రులను ఇవి అయోమయానికి గురి చేస్తున్నాయి.

మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ ఈ విషయంపై స్పందించారు. కోడింగ్ తప్పనసరి కాదని, పిల్లల తల్లిదండ్రులు ఇలాంటి ప్రకటనలకు మోసపోవద్దని సూచించారు.

మంత్రి ప్రకటన తర్వాత ప్రభుత్వం కోడింగ్‌ను తప్పనిసరి చేసిందంటూ వచ్చిన ప్రకటనలు ఆగిపోయాయి. అయితే, ఈ వ్యవహారం చాలా సందేహాలను లేవనెత్తింది.

అసలు కోడింగ్ అంటే ఏంటి? ఆరేళ్ల పిల్లలకు కోడింగ్ నేర్పించడం సరైన పనేనా? అంత చిన్న వయసులో కోడింగ్ లాంటి సంక్లిష్టమైన అంశాలు వారిపై ఒత్తిడిని మరింత పెంచుతాయా? పిల్లల తల్లిదండ్రుల మదిలో ఇప్పుడు ఆ సందేహాలన్నీ మెదులుతున్నాయి.

విద్యార్థి, కోడింగ్, స్కూల్, బడి, ఆన్‌లైన్ కోర్సులు

ఫొటో సోర్స్, Getty Images

కోడింగ్ అంటే...

కంప్యూటర్ గానీ, స్మార్ట్ ఫోన్ గానీ వాడుతున్నప్పుడు మనకు తెరపై కనిపించే అప్లికేషన్లు నడిచేందుకు వెనుక చాలా ప్రొగ్రామ్‌లు పనిచేస్తుంటాయి.

ఈ ప్రొగ్రామ్‌లను కంప్యూటర్ ప్రొగ్రామింగ్ భాషలో రాస్తారు. ఇలా రాయడాన్ని కొడింగ్ అని అంటారు.

కోడింగ్ ద్వారా అప్లికేషన్లు, వెబ్‌సైట్లు, సాఫ్ట్‌వేర్లు రూపొందించవచ్చు. సీ, సీ++, జావా, హెచ్‌టీఎంఎల్, పైథాన్... ఇలా చాలా కంప్యూటర్ ప్రొగ్రామింగ్ భాషలు ఉన్నాయి.

ప్రకటనల్లో ఏం చెబుతున్నారు

పిల్లలకు చిన్న వయసు నుంచే కోడింగ్ నేర్పిస్తే వారి మేధస్సు మరింత పెరుగుతుందని, భవిష్యత్తులో గొప్ప అవకాశాలు ఉంటాయని ప్రకటనల్లో చూపిస్తున్నారు. పిల్లలు వ్యాపారవేత్తలుగానూ ఎదిగే అవకాశం ఉంటుందని అందులో చూపిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 60 నుంచి 80 శాతం భవిష్యతులో ఉండవని, అందుకే పిల్లలు ఇప్పుడే కోడింగ్ నేర్చుకోవడం అవసరం అని ఆ ప్రకటనల్లో చెబుతున్నారు. కొత్త విద్యా విధానంలో ప్రభుత్వం ఆరో తరగతి నుంచి పిల్లలకు కోడింగ్‌ను తప్పనిసరి చేసిందని చూపిస్తున్నారు.

మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, క్రికెటర్ శిఖర్ ధావన్, సినీ నటులు మాధురీ దీక్షిత్, సోనూ సూద్ లాంటి ప్రముఖులు వారి పిల్లలతో కలిసి ఇలాంటి ప్రకటనల్లో కనిపించారు.

అయితే, ఈ ప్రకటనల్లో చెబుతున్న విషయాల గురించి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జనాలను ఆ యాప్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపణలు వచ్చాయి.

ఇక అసలు చిన్న వయసులో పిల్లలకు కోడింగ్ నేర్పడం ఎంతవరకూ సబబు? ఇది తప్పనిసరి ఎలా అవుతుంది? అన్న విషయాలపై జనంలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించారు.

విద్యార్థి, కోడింగ్, స్కూల్, బడి, ఆన్‌లైన్ కోర్సులు

ఫొటో సోర్స్, WhiteHat Jr/facebook

ఫొటో క్యాప్షన్, వైట్ హాట్ జూనియర్ మరాఠీలో ఇచ్చిన ప్రకటన

కోడింగ్ తప్పనిసరి కాదు

కరోనా సంక్షోభం కారణంగా దాదాపు ఆరు నెలలుగా స్కూళ్లు మూతపడే ఉన్నాయి. చాలా స్కూళ్లు ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నాయి. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు ఆన్‌లైన్ విద్య అంటే కోడింగ్ కూడా ఉంటుందేమోనని అయోమయానికి గురవుతున్నారు. కోడింగ్ చెప్పమని ఉపాధ్యాయులను కోరుతున్నారు.

రిమా కథాలె అనే ఆవిడ వైట్ హాట్ జూనియర్ యాప్ ప్రకటన గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

''రోజూ ఫేస్‌బుక్‌లో ఈ ప్రకటనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆరు, ఆ పైతరగతులవారికి ప్రభుత్వం కోడింగ్ తప్పనిసరి చేసిందంటూ ఈ రోజు వాళ్లు హద్దులు దాటేశారు? అసలు ఇదెప్పుడు జరిగింది? ఎవరు తప్పనిసరి చేశారు? చదువు గురించి నాకేమీ తెలియదా? లేక ఆ ప్రకటన తప్పా? తల్లిదండ్రులను వాళ్లు ఎందుకు తప్పదోవ పట్టిస్తున్నారు?'' అంటూ రిమా ట్వీట్ చేశారు.

రిమా ట్వీట్‌ను మహారాష్ట్ర ఐటీ శాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్ రీట్వీట్ చేస్తూ... ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ను కోరారు.

''కొత్త విద్యా విధానానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర సిలబస్ ప్రణాళికలు ఇంకా సిద్ధం కాలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి గానీ ఇంకా ఇలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు'' అని వర్షా గైక్వాడ్ స్పష్టం చేశారు.

తప్పుదోవ పట్టించే ప్రకటనలు చూసి మోసపోవద్దని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆమె సూచించారు.

విద్యార్థి, కోడింగ్, స్కూల్, బడి, ఆన్‌లైన్ కోర్సులు

ఫొటో సోర్స్, Getty Images

విద్యా విధానంలో ప్రస్తావన మాత్రమే ఉంది

ఈ ఏడాది వెల్లడించిన కొత్త విద్యా విధానంలో స్కూల్ స్థాయిలోనే కోడింగ్‌ను సబ్జెక్ట్‌గా చేర్చడం గురించి ప్రస్తావించారు.

ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా ఆరో తరగతి నుంచి కోడింగ్‌ను ఓ సబ్జెక్ట్‌గా పెట్టే అంశం పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి అనితా కర్వాల్ చెప్పారు.

అయితే, విద్యా విధానంలో కోడింగ్ తప్పనిసరి అని ఎక్కడా చెప్పలేదు.

ఈ కోడింగ్ కోర్సుల గురించి ప్రకటనలో కోసం యూట్యూబ్, ఫేస్‌బుక్ లాంటి వేదికలను విపరీతంగా వాడుకుంటున్నారు.

''ఆకర్షించే మాటలు చెప్పి మార్కెటింగ్ నిపుణులు ఏ చెత్తైనా జనాలకు అమ్మగలరన్నదానికి ఈ ఉదంతం ఓ ఉదాహరణ'' అని పిల్లల మానసిక వైద్యుడు డాక్టర్ భూషణ్ శుక్ల్ అన్నారు.

''పిల్లలు చిన్నప్పుడే కోడింగ్ నేర్చుసుకుంటే, పెద్ద ప్రొగ్రామర్ అయిపోతారని, పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తారని ఓ తప్పుడు భావన ఉంది. కోడింగ్ కోర్సులు ఇచ్చేవారు కావాలనే ఈ భావనను పెంచారు'' అని పుణెకు చెందిన క్రియేటివ్ పేరెంట్స్ సంఘం నిర్వాహకుడు ఛేతన్ ఎర్నాడే అభిప్రాయపడ్డారు.

ఈ విషయంలో వివరణ కోసం వైట్ హాట్ జూనియర్‌ సంస్థను కూడా బీబీసీ స్పందించింది.

''ఆ ప్రకటనను మేం వెనక్కితీసుకున్నాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం భావ్యం కాదు'' అని ఆ సంస్థ ప్రతినిధి సురేశ్ థాపా అన్నారు.

కోడింగ్ తప్పనిసరి సబ్జెక్ట్ కాకపోయినా, రాబోయే రోజుల్లో పాఠ్యాంశంగా ఉంటుందని ఆయన అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు చిన్నతనం నుంచే కోడింగ్ నేర్పిస్తున్నారని, దీని వల్ల కలిగే సత్ఫలితాలు, భవిష్యతు పరిణామాల గురించి తాము ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామని సురేశ్ చెప్పారు.

విద్యార్థి, కోడింగ్, స్కూల్, బడి, ఆన్‌లైన్ కోర్సులు

ఫొటో సోర్స్, Thinkstock

‘పిల్లలపై ఒత్తిడి’

''వ్యక్తిగత పరిశుభ్రత కోసం కూడా తల్లి అవసరమయ్యే చిన్నారులు కోడింగ్‌ను ఎలా నేర్చుకుంటారు. దీని వల్ల దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. కోడింగ్ వల్ల మెదడు వికసిస్తుందని ఆ సంస్థ అంటోంది. కోడింగ్‌ ఈ మధ్యే వచ్చిన ఆవిష్కరణ. మేధో వికాసానికి, దానికి సంబంధం ఉందని నేను అనుకోను'' అని భూషణ్ శుక్ల్ అన్నారు.

రకరకాల టెక్నాజీల వల్ల పిల్లలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారని, కోడింగ్ కోర్సులు వారిపై అదనపు భారం మోపడమేనని పిల్లల వైద్యుడు సమీర్ దాల్వాయ్ అన్నారు.

''ప్రకటనల్లో చూపిస్తున్నట్లుగా మీ ఏడేళ్ల పిల్లాడు కోర్సులు చేసి, ఏదో యాప్ చేసేశాడని ఏ ఇన్వెస్టర్లూ మీ ఇంటి గడప తొక్కరు. కోడింగ్ లాంటివి కాకుండా, వారిని నిజమైన క్రీడల వైపు ప్రోత్సహించండి'' అని ఆయన తల్లిదండ్రులకు సూచించారు.

మరోవైపు కోడింగ్ నేర్చుకోవడం వల్ల పిల్లలపై ఒత్తిడి ఏమీ ఉండదని వైట్ హాట్ జూనియర్ ప్రతినిధి సురేశ్ థాపా అంటున్నారు.

''వయసును బట్టి నేర్పించే విధానం మారుతుంది. తరగతి గంటకు మించి ఉండదు. వాళ్ల మీద ఒత్తిడి పెట్టం. పిల్లలు ఆడుతూపాడుతూ నేర్చుకుంటారు'' అని ఆయన చెప్పారు.

విద్యార్థి, కోడింగ్, స్కూల్, బడి, ఆన్‌లైన్ కోర్సులు

ఫొటో సోర్స్, ANI

కోడింగ్ నేర్చుకోవాలా? వద్దా?

''నేర్చుకోవచ్చు. కానీ, వారికి నేర్పే పద్ధతి భిన్నంగా ఉండాలి. ప్రొగ్రామింగ్ భాషలు వేగంగా మారిపోతుంటాయి. చిన్నతనంలోనే పిల్లలు ఏదైనా నేర్చుకుంటే, భవిష్యత్‌లో అది వినియోగంలో ఉంటుందో, లేదో తెలియదు. అందుకే, ఒక ప్రొగ్రామింగ్ భాష కంటే కోడింగ్ ప్రక్రియ గురించి నేర్చుకోవడం మంచిది. ఆసలు పిల్లలకు నిజంగా దానిపై ఆసక్తి ఉందో, లేదో తెలుసుకోవాలి'' అని ఛేతన్ ఎర్నాండే అంటున్నారు.

''ప్రకటనలు చూసి, ఖరీదైన కోర్సుల వైపు వెళ్లొద్దు. అమెరికాలోని ఎమ్‌ఐటీ, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎడెక్స్, కోర్సెరా వంటివి ఉచితంగా ఆన్‌లైన్‌లో కోడింగ్ ప్రాథమిక కోర్సులను అందిస్తుంటాయి. పిల్లలను వాటిని ప్రయత్నించనివ్వలి. వారి ఆసక్తిని బట్టి ముందుకువెళ్లాలి'' అని పీఎన్‌హెచ్ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ ప్రదీప్ నారాయణ్‌కర్ సలహా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)