‘నా ఉద్యోగం పోయింది, ఇప్పుడు నేనేం చేయాలి’-అమెరికాలో జాబ్ కోల్పోయిన భారతీయ టెక్కీల ఆవేదన

సురభి గుప్తా

ఫొటో సోర్స్, SURBHI GUPTA

ఫొటో క్యాప్షన్, సురభి గుప్తా

ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న వేలాది మంది 'కొత్త ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు'. 

ఉద్యోగాలను ట్రాక్ చేసే Layoffs.fyi వెబ్‌సైట్ ప్రకారం, 2022లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,20,000 ఉద్యోగాలు పోయాయి.

హెచ్‌1బీ, ఇతర వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా అక్కడే కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాలి. లేదా భారతదేశానికి తిరిగిరావాలి. అలాంటి కొంతమందితో అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్న జర్నలిస్ట్ సవితా పటేల్ మాట్లాడారు. 

సౌమ్య అయ్యర్ అమెరికాలోని ఓ పెద్ద టెక్ కంపెనీలో పనిచేసేవారు. ఆమె తన ఉద్యోగం కోల్పోయారు.

"నేను దీనిని టెక్ మహమ్మారి అంటాను. అమెజాన్ నుంచి పది వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ట్విట్టర్‌లో పనిచేస్తున్న సగం మందికి ఉద్యోగాలు పోయాయి" అని ఆమె అన్నారు. 

సౌమ్య 'లిఫ్ట్' అనే క్యాబ్ కంపెనీలో నాలుగేళ్లు పనిచేశారు. ఇప్పుడు ఆ ఉద్యోగం పోయింది. 

“నా స్నేహితుడు, అతడి భార్య ఇద్దరూ ఉద్యోగాలు కోల్పోయారు. టెక్ రంగానికి మహమ్మారి దాపురించింది" అని సౌమ్య అన్నారు.

సౌమ్య అయ్యర్

ఫొటో సోర్స్, LINKEDIN

ఫొటో క్యాప్షన్, సౌమ్య అయ్యర్

'అమ్మ, నాన్నలకు చెప్పలేదు'

సౌమ్య అయ్యర్ లిఫ్ట్ కంపెనీలో లీడ్ ప్రాజెక్ట్ డిజైనర్‌గా ఉండేవారు. నవంబర్ నెలలో అమెరికా టెక్ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగాలను తొలగించాయి. ఎంతోమంది విద్యావంతులు, నైపుణ్యం కలవారు ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో సౌమ్య ఒకరు.

సౌమ్య ఇంకా ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పలేదు. తప్పకుండా మరో ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే, ఆమె తీసుకున్న స్టూడెంట్ లోన్ ఇంకా పూర్తవలేదు. దాని గురించి ఆమె ఆందోళన పడుతున్నారు. సౌమ్య భారత్‌లో, అమెరికాలో ప్రతిష్టాత్మక కాలేజీల్లో చదువుకున్నారు.

ఆమె O-1 వీసాపై అమెరికా వచ్చారు. ఇది "అధిక నైపుణ్యం, సామర్థ్యం" ఉన్న వ్యక్తులకు ఇస్తారు. అయితే, ఈ వీసా నిబంధనల ప్రకారం ఉద్యోగం మానేసిన తరువాత 60 రోజులు మాత్రమే అమెరికాలో ఉండగలరు. 

“కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి నాకు అదనంగా మరో నెల అనుమతి ఇచ్చారు. అంటే, ఇప్పుడు నాకు మూడు నెలల సమయం ఉంది" అని సౌమ్య చెప్పారు. 

అమెరికాలోని వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ ప్రకారం, ఏ కంపెనీ అయినా భారీ స్థాయిలో ఉద్యోగాలు తొలగిస్తున్నప్పుడు ఉద్యోగులకు 60 రోజుల నోటీసు వ్యవధిని ఇవ్వాలి. 

నమన్ కపూర్

ఫొటో సోర్స్, NAMAN KAPOOR

ఫొటో క్యాప్షన్, నమన్ కపూర్

లోను కట్టాలనే టెన్షన్

అమెరికాలో ఉద్యోగాలు పోగొట్టుకున్న భారతీయులు చాలా ఆందోళనలో ఉన్నారు. వారి ప్లానులన్నీ తలకిందులైపోయాయని, చేతిలో సమయం తక్కువగా ఉందని వాపోతున్నారు.

కొంతమందికి కుటుంబ మద్దతు ఉంది. కానీ, చాలామంది లోను మీద వచ్చినవారు ఉన్నారు. వాళ్లకు ఎన్నో డాలర్ల రుణాలు బాకీ ఉన్నాయి. 

నమన్ కపూర్‌కు F-1 (OPT) వీసా ఉంది. నమన్ మెటాలో ప్రొడక్షన్ ఇంజనీర్‌గా పని చేసేవారు. ఇప్పుడు ఆ ఉద్యోగం కోల్పోయారు. న్యూయార్క్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి నమన్ లోన్ తీసుకున్నారు. 

“అమెరికాలో చదువుతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుంది. ఇక్కడకు వచ్చి చదువుకోవడానికి ఇదే కారణం. నా ఖర్చుల కోసం నేను పనిచేశాను" అని నమన్ నిరాశతో చెప్పారు. 

అనేక రౌండ్ల ఇంటర్వ్యూల తరువాత నమన్‌కు మెటాలో ఉద్యోగం దొరికింది. కానీ, కేవలం ఏడు వారాల్లో ఆ ఉద్యోగం పోయింది. 

“నవంబర్ 9 ఉదయం ఎనిమిది గంటలకు నాకు ఉద్యోగ నుంచి తొలగిస్తున్నట్టు ఈమెయిల్ వచ్చింది. మెటా నాకు నాలుగు నెలల జీతం ఇచ్చింది. కానీ, కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా భారత్ తిరిగి వెళ్లడానికి నాకు మూడు నెలల సమయం మాత్రమే ఉంది" అని నమన్ చెప్పారు. 

మెటా ప్రపంచవ్యాప్తంగా 11 వేల మందిని తొలగించింది. ఏ దేశం నుంచి ఎంతమందిని తొలగించిందన్న వివరాలను ఆ కంపెనీ వెల్లడించలేదు.

ఉద్యోగాలు కోల్పోయినవారికి 16 వారాల బేసిక్ జీతం, ప్రతి ఒక్క ఏడాదికి రెండు వారాల జీతం ఇవ్వనున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. 

టెక్ కంపెనీ

ఫొటో సోర్స్, Getty Images

ఇలా ఉద్యోగాలు కోల్పోయినవారిలో కొద్ది సంవత్సరాల క్రితమే అమెరికా వెళ్లినవారు ఉన్నారు. కానీ, కొంతమందికి అమెరికా రెండో ఇల్లు అయిపోయింది. వారు చాలాకాలం నుంచి అక్కడే నివసిస్తున్నారు. 

మిస్ ఇండియా కాలిఫోర్నియా పోటీ విజేత, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఇండియన్ మ్యాచ్ మేకింగ్‌లో నటించిన సురభి గుప్తా 2009 నుంచి అమెరికాలో నివసిస్తున్నారు. ఆమె మెటాలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసేవారు. నవంబర్‌లో ఆమెను కూడా తొలగించారు. 

“ఇప్పుడు నా జీవితం వీసాపై ఆధారపడి ఉంది. నేను 15 సంవత్సరాలు చాలా కష్టపడి పనిచేశాను. ఎవరిపైనా ఆధారపడలేదు. ఇప్పుడు నేను కొత్త ఉద్యోగం వెతకాలి. డిసెంబర్ నెలలో సెలవులు ఎక్కువ ఉంటాయి. అందుచేత నియామకాలు తక్కువగా ఉంటాయి. ఇప్పటికే జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కోన్నాను. నాకు మాత్రం ఓపిక నశించదా?" అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

ఉద్యోగాలు కోల్పోయినవారు కొత్త ఉద్యోగం మాత్రమే కాకుండా తమ వీసా పనిచేసి పెట్టే కంపెనీలలో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. తద్వారా వీసా బదిలీ ప్రక్రియను పూర్తి చేయడానికి వారికి తగినంత సమయం దొరుకుతుంది. 

చివరి నిమిషంలో ఉద్యోగం దొరకడం చాలా కష్టమని శాన్ జోస్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ స్వాతి ఖండేల్వాల్ అంటున్నారు.

వీడియో క్యాప్షన్, NATS స్కీమ్: ఉద్యోగం చేయకుండానే జాబ్ ఎక్స్‌పీరియన్స్ అందించే ప్రభుత్వ పథకం

చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారు

60 రోజుల్లోపు వీసా బదిలీ కాకపోతే అమెరికా విడిచి వెళ్లాల్సి వస్తుందని, మళ్లి వీసా రెన్యువల్ అయ్యాక తిరిగి రావచ్చని సురభి చెప్పారు. కానీ, భారత కాన్సులేట్‌లలో అపాయింట్మెంట్లు చాలా తక్కువగా ఇస్తున్నారు. కాబట్టి అక్కడే చిక్కుకుపోయే అవకాశం ఉందని చెప్పారు. 

"ఈ ఉద్యోగాల కోత భారతీయులను బాగా భయపెడుతోంది. ఉద్యోగం ఉన్నవారు కూడా తరువాత తమ వంతేనేమోనని భయపడుతున్నారు" అని చెప్పారు. 

అయితే, కొన్ని సంఘాలు మద్దతు అందిస్తున్నాయని, స్నేహితులు, సహోద్యోగులు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారని సురభి చెప్పారు. 

అభిషేక్ గుట్గుటియా వంటి వారు వెంటనే సహాయం చేయడానికి ముందుకు వచ్చారని చెప్పారు. 

“నేను జీనో అనే వెబ్‌సైట్ ఏర్పాటుచేశాను. ఉద్యోగాలు కోల్పోయినవారికి వీలైనంత త్వరగా ఉద్యోగాలు చూసిపెట్టే సైట్ ఇది. దీనిని ఇప్పటివరకు 15,000 మంది సందర్శించారు. నా లింక్డ్‌ఇన్ పోస్ట్‌లకు ఆరు లక్షలకు పైగా వ్యూస్ ఉన్నాయి. దాదాపు 100 మంది అభ్యర్థులు, 25 కంపెనీలు, 30 మంది మెంటార్లు సైన్ అప్ చేశారు. చాలా మంది ఇమ్మిగ్రేషన్ అటార్నీలు కూడా సహాయం చేయడానికి ముందుకొచ్చారు" అని అభిషేక్ చెప్పారు. 

సురభి మట్లాడుతూ, "నా ఉద్యోగం హాయిగా సాగిపోతూ ఉంది. కంపెనీ ఉద్యోగాలు తీసేస్తున్నదని తెలియడంతో కంగారుపడ్డాను. ఆ రాత్రి నిద్రపోలేదు. మర్నాడు ఉదయం ఆరు గంటలకు నాకు మెయిల్ వచ్చింది. నా ఆఫీస్ కంప్యూటర్‌లో లాగ్ ఇన్ కాలేకపోయాను. ఆఫీస్ జిమ్ వాడడానికి అనుమతి లేదు. ఒక బ్రేకప్ లాగ అనిపించింది" అని సురభి చెప్పారు. 

సౌమ్య అయ్యర్ మాట్లాడుతూ, “కంపెనీని మంచి స్థితిలో ఉంచడానికి మేం చర్యలు తీసుకున్నాం. కానీ, దాని ప్రభావం మాపై పడుతుందని అనుకోలేదు. ఆ ప్రభావం మనపై పడితే తప్ప వాస్తవ పరిస్థితి అర్థం కాదు" అన్నారు. 

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)