తెనాలి: బ్యూటీ పార్లర్‌లోనే భార్యని హత్య చేసిన భర్త.. పూలదండలు వేసి నివాళి, పోలీసులకు లొంగుబాటు

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో ఓ భర్త తన భార్యను హత్య చేశాడు. ఆమె నిర్వహిస్తున్న బ్యూటీపార్లర్ లోనే చంపేశాడు. ఆమెను హత్య చేసిన తర్వాత తన వెంట తెచ్చుకున్న పూలదండలు ఆమె మృతదేహంపై వేసి నివాళి అర్పించాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయిన ఈ ఘటన సంచలనంగా మారింది.
తెనాలి గాంధీ నగర్ లో కాకర్ల స్వాతి అనే మహిళ తన పేరుతోనే స్వాతి బ్యూటీపార్లర్ నడుపుతోంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు ఇంటర్ , మరొకరు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కొంతకాలంగా ఆమె భర్త కోటేశ్వరరావుతో ఆమెకు విబేధాలున్నాయి.
తెనాలి పోలీసులు మీడియాకు తెలిపిన సమాచారం ప్రకారం... స్వాతి, కోటేశ్వరరావు తగాదా చాలాకాలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలతో పాటుగా ఆమె ప్రవర్తన మీద కూడా కోటేశ్వరరావుకి అనుమానాలుండేవి. దాంతో గొడవలు జరుగుతూ ఉంటాయి. రెండు రోజుల క్రితం తీవ్రంగా గొడవపడ్డారు. ఆవేశంలో ఆమెను కొట్టడానికి కూడా ప్రయత్నించాడు. కానీ స్వాతి ఎదురించడంతో కోటేశ్వర రావు వెళ్లిపోయాడు. కానీ గురువారం మధ్యాహ్నం సమయంలో కత్తి తీసుకుని ఆమె షాపులో పనిచేసుకుంటుండగా వచ్చి దాడి చేశాడు. కత్తితో ఆమెపై దాడికి పాల్పడడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే ఆమె శవం మీద తన వెంట తెచ్చుకున్న పూలదండలను వేశారు.
హత్య చేసిన తర్వాత కోటేశ్వర రావు నేరుగా తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు మీడియాకు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మద్యం మత్తలో..
నాజర్ పేటలో నివాసముండే స్వాతి మీద భర్త వెంకట కోటయ్య కి అనుమానం బలపడి విచక్షణారహితంగా హత్య చేశాడని తెనాలి సీఐ వెంకట్రావు తెలిపారు.
"స్వాతికి వేరే వ్యక్తితో సంబంధం ఉందని కోటయ్యకు అనుమానం ఉంది. గతంలోనూ గొడవలు పడ్డారు. ఈరోజు మాత్రం మద్యం మత్తులో పార్లర్ కి వెళ్లాడు. అక్కడే ఘర్షణ జరిగింది. వాదోపవాదనలు జరిగిన తర్వాత తన దగ్గర ఉన్న కత్తితో దాడి చేసి ప్రాణం తీశాడు. ముద్దాయిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశాము. ఆధారాలు సేకరించాము. కఠిన శిక్ష పడేలా చూస్తాం" అంటూ సీఐ వెంకట్రావు తెలిపారు.
స్థలం అమ్మకానికి నిరాకరించిందని...
"మా అమ్మాయి స్వాతికి మేమిచ్చిన ఇంటి స్థలం ఉంది. అది అమ్మేయాలని అల్లుడు పట్టుబట్టాడు. నాలుగు నెలల క్రితం వాళ్లింట్లో గొడవ జరిగితే మా ఇంటికి వచ్చేసింది. వారం రోజులు తర్వాత తిరిగి తీసుకెళ్లాడు. రోజూ పార్లర్ కి వెళుతోంది. బాగానే ఉందని అనుకున్నాం. కోటయ్యకి పేకాట పిచ్చి ఉంది. అప్పులున్నాయి. ఇంటి స్థలం అమ్మేయమని రోజూ తగాదా పడేవాడు. కుదరదని చెప్పడంతో ఇంతకి తెగించాడు. ఈరోజు వాడు చంపేయడానికి వాళ్లన్నయ్య కూడా సహకరించాడు. అతన్ని కూడా కేసులో పెట్టాలి. చంపేసిన తర్వాత ఇంటికి వచ్చి మా మనవడితో చెప్పాడు. వాడు ఫోన్ చేయడంతో మేము వచ్చాము" అంటూ స్వాతి తండ్రి వెంకటేశ్వర రావు తెలిపారు.
తమ కూతురిని చంపిన వాడికి కఠిన శిక్ష పడాలని ఆయన కోరారు.

‘మహిళలకు రక్షణ కరువయ్యింది..’
తెనాలి పట్టణంలో పట్టపగలు షాపులో పనిచేస్తున్న భార్యను భర్త హత్య చేసిన ఘటన రాష్ట్రంలో మహిళల పరిస్థితిని చెబుతోందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి అన్నారు.
"పట్టపగలు అంత బరి తెగించి వ్యాపార కూడలిలో ఉన్న షాపులోకి వెళ్లి దాడి చేసి ప్రాణం తీయడం చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. రాష్ట్రంలో మహిళలకు తగిన రక్షణ లేకుండా పోయింది. వరుసగా అనేక చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయినా తగిన రీతిలో యంత్రాంగం స్పందించడం లేదు. అందుకే తీవ్రమైన పరిణామాలు చూస్తున్నాం. ప్రభుత్వం స్పందించాలి. స్వాతి హత్య ఘటనను సీరియస్ గా తీసుకోవాలి. కోటేశ్వరరావుని కఠినంగా శిక్షించాలి. వారి బిడ్డలకు భరోసా కల్పించాలి" అని కోరారు.
దిశ చట్టం చేశామని ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం ఆచరణలో మహిళా రక్షణ పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అని చంద్రబాబు ఎందుకు అన్నారు? ఏడాది కిందట అసెంబ్లీలో ఏమైంది
- ఆన్లైన్ పార్ట్‌టైమ్ జాబ్స్ చేయాలనుకుంటున్నారా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవీ..
- కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...
- లైవ్ ‘అఫ్తాబ్ జిత్తులమారి, ఆయనకు మరణశిక్ష పడాలి’: శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్
- విక్రమ్ ఎస్: భారత్‌లో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














