విక్రమ్ ఎస్: భారత్‌లో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధం

స్కైరూట్

ఫొటో సోర్స్, Skyroot

    • రచయిత, వెంకట కిషన్ ప్రసాద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో మొట్టమొదటిసారి ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ - విక్రమ్ ఎస్ (Vikram S)ను నవంబర్ 18 ఉదయం 11.30 గంటలకు ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైంది.

దీన్ని హైదరాబాద్ కేంద్రంగా పని చేసే స్కైరూట్ ఎరోస్పేస్ అనే సంస్థ తయారు చేసింది.

ఈ రాకెట్‌ను ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తారు.

ఈ రాకెట్ ప్రయోగంతో భారత అంతరిక్షయాన (aerospace) రంగంలో ప్రైవేటు కంపెనీలు లాంఛనంగా పాదం మోపినట్టు అవుతుంది.

స్కైరూట్

ఫొటో సోర్స్, Skyroot

విక్రమ్ ఎస్ ఏంటి?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వ్యవస్థాపకుడు డాక్టర్ విక్రమ్ సారాభాయికు నివాళిగా, తమ ప్రయోగ వాహనాలకు (launch vehicles) విక్రమ్ అని పేరు పెట్టింది స్కైరూట్ ఎరోస్పేస్.

విక్రమ్ సిరీస్‌లో మొత్తం మూడు రాకెట్లున్నాయి. ఇవన్నీ కూడా చిన్న శాటిలైట్లను ప్రయోగించడం కోసం అభివృద్ధి చేసినవే. వీటిలో విక్రమ్ I మొదటిది. ఇది 480 కిలోల లోపు బరువున్న చిన్న శాటిలైట్లను భూకక్ష్యకు దిగువ వరకూ మోసుకెళ్తుంది. తర్వాత వచ్చే విక్రమ్ II, విక్రమ్ III రాకెట్లు భారీ పేలోడ్స్‌ను తీసుకెళ్లగలుగుతాయని భావిస్తున్నారు.

విక్రమ్ ఎస్ రాకెట్‌ మొత్తం మూడు పేలోడ్స్‌ను, అంటే మూడు చిన్న శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. వీటిలో రెండు భారతీయ కస్టమర్లవి కాగా, మరొకటి ఓ విదేశీ వినియోగదారు సంస్థది.

ఈ రాకెట్‌కు సంబంధించిన ఫుల్ డ్యూరేషన్ టెస్ట్‌ (full-duration test)ను గత మేలో విజయవంతంగా పూర్తి చేశామని స్కైరూట్ ఇదివరకే ప్రకటించింది. ఈ మొట్టమొదటి మిషన్‌కు ‘ప్రారంభ్ అని పేరు పెట్టింది స్కైరూట్ ఎరోస్పేస్.

నిజానికి ఈ విక్రమ్ ఎస్ ప్రయోగం నవంబర్ 12-16 మధ్య జరగాల్సింది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో నవంబర్ 18కి వాయిదా వేసినట్టు స్కైరూట్ ఎరోస్పేస్ ఒక ప్రకటనలో తెలిపింది.

స్కైరూట్

ఫొటో సోర్స్, Skyroot

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం

భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యానికి 2020లో నాంది పడిందని చెప్పొచ్చు. దీనికి వీలు కల్పించే సంస్కరణలకు శ్రీకారం చుడుతూ, 2020 జూన్‌లో మోదీ ప్రభుత్వం IN-SPACe (ఇన్-స్పేస్‌ఈ) అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. ప్రస్తుతం ఇస్రోకు, ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలకు మధ్య అనుసంధానకర్తగా పని చేస్తోంది IN-SPACe.

2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశ్రమ విలువ 1 ట్రిలియన్ డాలర్లు, అంటే దాదాపు 80 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. ఈ ఆకర్షణీయమైన మార్కెట్‌ నుంచి లబ్ధి పొందాలని భారత్ ఆశిస్తోంది. కానీ, ప్రస్తుతం ప్రపంచ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా దాదాపు 2 శాతం మాత్రమే. దీన్ని అధిగమించడం కోసమే ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ రంగంలో ప్రైవేట్ భాగస్వాములను ప్రోత్సహించాలని భారత్ ప్రయత్నిస్తోంది.

స్కైరూట్

ఫొటో సోర్స్, Skyroot

భారత అంతరిక్ష రంగం ప్రస్థానం

భారత్‌లో అంతరిక్ష రంగం ప్రయాణం 1960 దశకంలో మొదలైంది. డాక్టర్ విక్రమ్ సారాభాయి ఆధ్వర్యంలో భారత జాతీయ అంతరిక్ష పరిశోధనా కమిటీ (INCOSPAR) ఏర్పాటు ఓ కీలక ముందడుగు. మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం ఆర్యభట్టను ఆనాటి సోవియట్ యూనియన్ సహకారంతో Astrakhan Oblast నుంచి ప్రయోగించారు. అది భారత అంతరిక్షరంగ చరిత్రలో ఓ ముఖ్యమైన ఘట్టం.

ఇక భారత గడ్డ నుంచి మొట్టమొదటి రాకెట్ ప్రయోగం 1963 నవంబర్ 21న జరిగింది. తిరువనంతపురానికి సమీపంలోని తుంబా నుంచి యూఎస్ నైకే అపాచే అనే రాకెట్‌ను ప్రయోగించారు. ఆ రాకెట్ బరువు కేవలం 715 కిలోలు మాత్రమే. 30 కిలోల పేలోడ్‌ను 207 కిలోమీటర్ల ఎత్తుకు మోసుకెళ్లింది. కానీ అప్పటితో పోలిస్తే, 2022లో భారత్ ప్రయోగించిన అధునాతన రాకెట్ ఎస్ఎస్ఎల్‌వీ బరువు 120 టన్నులు. దీని పొడవు 34 మీటర్లు కాగా, ఇది 500 కిలోల బరువున్న శాటిలైట్లను భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో ప్రవేశపెట్టగలిగింది.

స్కైరూట్

ఫొటో సోర్స్, Skyroot

ఇస్రో చైర్మన్‌తో స్కైరూట్ ప్రతినిధులు

ఫొటో సోర్స్, Skyroot

ఫొటో క్యాప్షన్, ఇస్రో చైర్మన్‌తో స్కైరూట్ ప్రతినిధులు

సబ్‌ఆర్బిటల్ రాకెట్ అంటే...

విక్రమ్ ఎస్ రాకెట్ ఒక సింగిల్-స్టేజ్ సబ్-ఆర్బిటల్ ప్రయోగ వాహనం (single-stage sub-orbital launch vehicle). ఇది మూడు కస్టమర్ పేలోడ్స్ మోసుకెళ్తుంది. విక్రమ్ సిరీస్ అంతరిక్ష ప్రయోగ వాహనాల్లో తాము ఉపయోగిస్తున్న సాంకేతికతను పరీక్షించడంలో ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది అని స్కైరూట్ సీఓఓ నాగ భారత్ డాకా ఒక ప్రకటనలో వెల్లడించారు.

గతంలో ఇస్రోలో పని చేసిన ఓ సీనియర్ శాస్త్రవేత్తతో బీబీసీ మాట్లాడింది. తన పేరు వెల్లడి చేయొద్దని కోరుతూ, ఆయన సబ్‌ఆర్బిటల్ రాకెట్ల గురించి వివరించారు.

‘అంతరిక్షంలోకి దూసుకెళ్లి మళ్లీ భూమి మీద పడిపోయే రాకెట్లను సబ్ఆర్బిటల్ రాకెట్లు అంటారు. అంటే ఒక రాయిని బలంగా పైకి విసిరితే అది ఎలా ఒక వంపుతో కింద పడుతుందో అలా కిందికి వస్తుందన్న మాట. ఇవి 10 నుంచి 30 నిమిషాల లోపు భూమిపైన పడిపోతాయి.’

‘వీటిని సౌండింగ్ రాకెట్స్ అని కూడా అంటారు. నాటికల్ పరిభాషలో సౌండింగ్ అంటే కొలతలు తీసుకోవడం. భూవాతావరణానికి పైన ఉండే వాతావరణాన్ని కొలిచేందుకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు’ అని ఆయనన్నారు.

ఆర్బిటల్, సబ్‌ఆర్బిటల్ రాకెట్లలో ప్రధానమైన తేడా వాహనం వేగమే. ఆర్బిటల్ అంతరిక్షనౌక భూకక్ష్య వేగాన్ని సాధించి తీరాలి. అంటే గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. లేదంటే అది భూమిపైన పడిపోతుంది. ఒక అంతరిక్ష నౌక ఈ స్థాయి వేగాన్ని సాధించడం అనేది సాంకేతికంగా చాలా సంక్లిష్టమైంది కాబట్టే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా.

కానీ సబ్‌ఆర్బిటల్ రాకెట్లలో అలా కాదు. వాటికి అంత వేగం అవసరం లేదు. ఇవి తమ వేగానికి తగినట్టుగా ఒక స్థాయి ఎత్తు వరకూ వెళ్లి, ఇంజిన్లు ఆఫ్ అయ్యాక కిందకు పడిపోతాయి. ఉదాహరణకు గంటకు 6 వేల కిలోమీటర్ల వేగం కూడా వీటికి సరిపోతుంది.

చరిత్రలో మొట్టమొదటిసారి 1942లో నాజీ ఎరోస్పేస్ ఇంజినీర్లు వీ-2 అనే సబ్‌ఆర్బిటల్ రాకెట్‌ను ప్రయోగించారు. దాని ద్వారా వారు తమ మిత్ర దేశాలకు ఆయుధాలు చేరవేశారు. వేగం కారణంగా శత్రువర్గాలు దాన్ని అడ్డుకోలేకపోయాయి.

వీడియో క్యాప్షన్, శాస్త్ర పరిశోధన రంగంలో ఇదో పెద్ద విజయం అంటున్న శాస్త్రజ్ఞులు

స్కైరూట్ ఎరోస్పేస్

అంతర్జాతీయంగా, ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని స్పేస్‌ఎక్స్ పేరు ఈ మధ్య చాలా తరచుగా వినిపిస్తోంది. అమెరికాలో అది వరుసగా ఎన్నో రాకెట్లు ప్రయోగించడం ద్వారా వార్తల్లో నిలిచింది. అయితే, ఇప్పుడు భారత్‌లో కూడా ప్రైవేట్ రాకెట్ తయారీ కంపెనీల పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో స్కైరూట్ ఎరోస్పేస్‌తో పాటు, చెన్నై కేంద్రంగా పని చేసే అగ్నికుల్ కాస్మోస్, స్పేస్‌కిడ్జ్, కోయంబత్తూర్ కేంద్రంగా పని చేసే బెలాట్రిక్స్ ఎరోస్పేస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దక్షిణాదిలోనే పని చేస్తూ ఉండటం ఓ విశేషం.

ఇస్రో మాజీ సైంటిస్టులు పవన్ కుమార్ చందన, నాగ భారత్ డాకా మరి కొందరి సహకారంతో 2018లో స్కైరూట్ ఎరోస్పేస్ అనే ప్రైవేట్ స్టార్టప్‌ను ప్రారంభించారు. రాకెట్ ప్రయోగానికి ముందు, ప్రయోగం జరిగేటప్పుడు తమకు అవసరమైన ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ, లాంఛ్‌ప్యాడ్, రేంజ్ కమ్యూనికేషన్స్, ట్రాకింగ్ సపోర్ట్ వంటివి ఇస్రోనే అందిస్తోందని స్కైరూట్ సీఈవో పవన్ కుమార్ చందన అన్నారు. ‘ఇందు కోసం ఇస్రో మా దగ్గర వసూలు చేస్తున్న రుసుము కూడా తక్కువే’ అని ఆయన తెలిపారు.

వీడియో క్యాప్షన్, 50 ఏళ్ల నాటి అపోలో మిషన్ చిత్రాలకు స్పష్టమైన ఆకృతి.

‘క్యాబ్ బుక్ చేసుకున్నంత సులువుగా, శాటిలైట్లు పంపిస్తాం..’

విక్రమ్ అంతరిక్ష వాహనాల తయారీలో ఉపయోగిస్తున్న అధునాతన సాంకేతికతతో వీటిని తాము భారీ సంఖ్యలో, చౌకగా రూపొందించగలమని స్కైరూట్ అంటోంది. వచ్చే దశాబ్ద కాలంలో తాము దాదాపు 20 వేల చిన్న శాటిలైట్లను తమ రాకెట్ల ద్వారా ప్రయోగించగలమని ఈ సంస్థ భావిస్తోంది. అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపించడం అనేది రానున్న రోజుల్లో క్యాబ్ బుక్ చేసుకున్నంత సులువుగా, త్వరగా, చౌకగా అవ్వాలని ఈ సంస్థ ఆశిస్తోంది.

అలాగే, తమ రాకెట్లను 24 గంటల లోపు ఏ లాంచ్ సైట్ నుంచైనా అసెంబుల్ చేసి ప్రయోగించగలిగేలా డిజైన్ చేశామని అది తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)