రవీంద్ర జడేజా: ‘జాతీయ ప్లేయర్ ఒక పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చా?’

రివాబా జడేజా, రవీంద్ర జడేజా

ఫొటో సోర్స్, RIVABA JADEJA/INSTA

ఫొటో క్యాప్షన్, రివాబా జడేజా, రవీంద్ర జడేజా

‘‘ఎమ్మెల్యే పదవికి ఆమె (రివాబా జడేజా) పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆమె చాలా విషయాలు నేర్చుకుంటోంది. ఈ దిశగా ఆమె మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. ఆమె సహజంగానే అందరికీ సాయం చేస్తుంటుంది. అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రజల కోసం పనిచేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడుగుజాడల్లో ఆమె నడవాలని అనుకుంటోంది.’’

ఇవి ఆల్‌రౌండర్ క్రికెటర్ రవీంద్ర జడేజా వ్యాఖ్యలు. కాషాయ కుర్తా వేసుకొని గుజరాతీలో మాట్లాడుతూ తాజాగా ఆయన ఒక వీడియో చేశారు.

సాధారణంగా క్రికెటర్లు తెలుపు, నీలం, పసుపు రంగు జెర్సీల్లో కనిపిస్తుంటారు. కానీ, దీనికి భిన్నంగా ఆయన కాషాయ వస్త్రాల్లో కనిపించడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ప్రస్తుత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా జడేజా జామ్‌నగర్‌ (ఉత్తరం) నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

వీడియో క్యాప్షన్, బిల్కిస్ బానో అత్యాచార దోషులను విడుదల చేయడంపై ఆమె భర్త ఏమన్నారు?

నామినేషన్..

తాజాగా ఆమె నామినేషన్‌ను కూడా దాఖలు చేశారు. వచ్చే నెలలో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన 160 మంది తొలి అభ్యర్థుల జాబాతిలో రివాబా జడేజాతోపాటు కాంగ్రెస్ నుంచి పార్టీలోకి వచ్చిన హార్దిక్ పటేల్ పేరు కూడా ఉంది.

డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అదే నెల ఎనిమిదో తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజున ప్రకటిస్తారు.

తన భార్యకు మద్దతుగా సోషల్ మీడియాలో రవీంద్ర జడేజా వీడియోలు చేస్తున్నారు. గుజరాతీలో ఆయన మాట్లాడుతున్నారు. ‘‘ప్రియమైన జామ్‌నగర్ ప్రజలు, క్రికెట్ అభిమానులారా..’’అంటూ ఆయన వీడియోలు మొదలుపెడుతున్నారు.

‘‘గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కూడా టీ-20 మ్యాచ్‌ల తరహాలో చాలా వేగంగా జరుగుతున్నాయి. బీజేపీ తరఫు నుంచి నా భార్య రివాబా పోటీ చేస్తున్నారు. ఆమె 14న నామినేషన్ దాఖలు చేస్తారు. ఆమెకు మీరే విజయం తెచ్చిపెట్టాలి. మళ్లీ రేపు కలుద్దాం’’అంటూ ఒక వీడియోలో ఆయన చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

వీడియో క్యాప్షన్, గుజరాత్: 141 మంది మృతికి కారణమైన వంతెన కూలిపోతున్న క్షణాలు..

ఆసక్తికర మ్యాచ్..

ఉత్తర జామ్‌నగర్ పోరు చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా రివాబా పోటీచేస్తుంటే.. రవీంద్ర సోదరి నైనా జడేజా మాత్రం ఆమెకు మద్దతు ఇవ్వడం లేదు.

2019 నుంచి రాజకీయాల్లో నైనా చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ తరఫున ప్రచారాల్లో పాల్గొంటున్నారు.

జామ్‌నగర్ (ఉత్తరం) నుంచి పోటీచేసే అవకాశాన్ని తనకు ఇవ్వాలని కాంగ్రెస్‌కు నైనా కోరారు. కానీ, పార్టీ ఆమెకు సీటు ఇవ్వలేదు.

బినేంద్ర సింగ్‌ను తమ తరఫు నుంచి పోటీ చేస్తున్నట్లు తాజాగా కాంగ్రెస్ ప్రకటించింది. ప్రస్తుతం ఆయనకు మద్దతుగా నైనా జడేజా ప్రచారం చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, పండ్లు అమ్ముకునే వికలాంగ యువకుడిపై దాడి చేసిన బీజేపీ మాజీ కార్పొరేటర్ సోదరుడు

ప్రజలు ఏం అంటున్నారు?

తన భార్యకు మద్దతుగా ప్రచారంలో రవీంద్ర జడేజా పాల్గొనడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

కొందరు భార్యకు మద్దతుగా ప్రచారం చేయడంపై రవీంద్ర జడేజాను ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం జాతీయ క్రికెటర్ అయ్యుండి, ఒక పార్టీ కోసం ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ట్విటర్‌లో @cricket_point1 అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘‘నేడు మీపై ఉన్న గౌరవం తగ్గిపోతూ వస్తోంది. క్రికెట్‌లో విఫలం అవుతున్నప్పుడు కూడా మీరంటే నాకు అభిమానం ఉండేది. కానీ, ఇక్కడ శోచనీయమైన అంశం ఏమిటంటే.. మీరు ఒక జాతీయ క్రికెటర్. కానీ, ఒక పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు’’అని వ్యాఖ్యానించారు.

మరో ట్విటర్ యూజర్ @Sachin_anshu06 స్పందిస్తూ.. ‘‘కాషాయ దుస్తుల్లో రవీంద్ర జడేజా, రివాబా జడేజా కనిపించడం చాలా బావుంది. రివాబా జామ్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నారు’’అని రాసుకొచ్చారు.

రివాబా జడేజా, రవీంద్ర జడేజా

ఫొటో సోర్స్, RIVABA JADEJA/INSTA

ఫొటో క్యాప్షన్, రివాబా జడేజా, రవీంద్ర జడేజా

ఇంతకీ రివాబా ఎవరు?

రివాబా రాజకీయాల్లోకి వస్తూనే చర్చకు తెరతీశారు.

పద్మావత్ సినిమాపై నిరసనలతో వార్తల్లో నిలిచిన కర్ణి సేన 2018లో గుజరాత్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రివాబాను ప్రకటించింది.

మెకానికల్ ఇంజినీర్ అయిన రివాబా రాజ్‌కోట్‌లో చదువుకున్నారు. ఆమె తండ్రి హర్‌దేవ్ సింగ్ సోలంకి ఒక వ్యాపారవేత్త.

2015లో ఒక పార్టీలో జడేజాను రివాబా కలిశారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

2016, ఫిబ్రవరి 5న వీరిద్దరికీ నిశ్చితార్థమైంది. ఆ తర్వాత రెండు నెలలకే వీరు పెళ్లి చేసుకున్నారు.

మూడు రోజులపాటు జరిగిన వీరి పెళ్లి వేడుకలపై అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.

రివాబా జడేజా

ఫొటో సోర్స్, RAVINDRA JADEJA/INSTA

రివాబా వివాదం

2018 మేలో రివాబా బీఎండబ్ల్యూ కారు.. ఒక కానిస్టేబుల్ బైక్‌ను ఢీకొట్టింది.

ఆ తర్వాత తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఆ కానిస్టేబుల్‌పై ఆమె ఫిర్యాదుచేశారు.

రివాబా చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని అప్పట్లో జామ్‌నగర్ ఎస్పీ ప్రదీప్ సెజుల్ వ్యాఖ్యానించారు.

రివాబా ఫిర్యాదుపై సదరు కానిస్టేబుల్‌పై కేసు మోపామని, చర్యలు కూడా తీసుకుంటామని ఆయన అన్నారు.

2018 నవంబరులో రవీంద్ర జడేజా, రివాబా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందుగా రివాబా బీజేపీలో చేరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)