ఆయన్ను చూశాకే కృష్ణ హీరో కావాలనుకున్నారు.. అనుకున్నట్లే అయ్యారు

ఫొటో సోర్స్, Superstar Krishna Library/Facebook
- రచయిత, హరికృష్ణ పులుగు
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘సూపర్‌స్టార్’ అంటూ అటు సినిమా పరిశ్రమ నుంచి , ఇటు అభిమానుల నుంచి పిలిపించుకున్న ఘట్టమనేని శివరామకృష్ణ అలియాస్ కృష్ణకు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది.
సుమారు 80 సంవత్సరాల జీవితాన్ని గడిపిన కృష్ణ అందులో 60 ఏళ్లకు పైగా సినిమా పరిశ్రమలోనే ఉన్నారు.
1943లో ప్రస్తుత గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామంలో ఆయన జన్మించారు.
ఘట్టమనేని నాగరత్నమ్మ, రాఘవయ్య చౌదరి ఆయన తల్లిదండ్రులు.
రమేశ్ బాబు, పద్మావతి, మంజుల, మహేశ్ బాబు, ప్రియదర్శిలు కృష్ణ సంతానం.

ఫొటో సోర్స్, Manjula Ghattamaneni/Facebook
తొలి సినిమా ‘తేనె మనసులు’
1960లలో చిన్నచిన్న పాత్రల ద్వారా సినిమాలలో నటించడం మొదలుపెట్టిన కృష్ణ, ఆ తర్వాత తెలుగు సినిమా అగ్రనటులలో ఒకరిగా ఎదిగారు.
ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల సరసన అప్పట్లో కృష్ణ పేరు వినిపించేది.
1965లో ‘తేనె మనసులు’ సినిమాతో హీరోగా కృష్ణ నట జీవితం ప్రారంభమైంది.
అంతకు ముందు ఆయన కులగోత్రాలు (అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి ప్రధాన పాత్రలుగా -1961), పదండి ముందుకు ( జగ్గయ్య, గుమ్మడి, కాంతారావు ప్రధాన నటులుగా-1962), పరువు ప్రతిష్ట (ఎన్.టి. రామారావు, అంజలీ దేవి ప్రధాన నటులుగా 1963)లాంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు.

ఫొటో సోర్స్, AdityaMusic/YouTube
2016లో చివరి సినిమా
కృష్ణ హీరోగా తొలి సినిమా విడుదలై 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏడాది, ఆయన కీలక పాత్రధారిగా ‘శ్రీశ్రీ’ పేరుతో 2016లో సినిమా విడుదలైంది.
అదే ఆయన ఆఖరి సినిమా.
తెలుగు సినిమాలలో జేమ్స్‌బాండ్, కౌబాయ్ పాత్రలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్నారు కృష్ణ.
వీటితోపాటు పరిశ్రమలో సాంకేతికంగా అనేక కొత్త ఒరవడులకు కూడా ఆద్యుడిగా చెబుతారు.
ఆంధ్రా జేమ్స్ బాండ్ అని అభిమానులు ఆయన్ను పిలుచుకుంటారు.
‘‘కృష్ణను కొంతమంది తెలుగు సినిమా తొలి కౌబాయ్‌గా చెబుతుంటారు. కానీ, అది నిజం కాదు. దేశంలోనే తొలి కౌబాయ్ పాత్ర కృష్ణగారిదే’ అని జర్నలిస్టు, ప్రముఖ సినీ విశ్లేషకుడు రంగావజ్జల భరద్వాజ అన్నారు.
మొట్టమొదటి సాంఘిక కలర్ సినిమా (తేనె మనసులు), మొదటి సినిమా స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎం.ఎం చిత్రం (సింహాసనం), మొదటి డిజిటల్ థియేటర్ సౌండ్ (డీటీఎస్) మూవీ (తెలుగు వీర లేవరా)లాంటి కొత్త టెక్నాలజీలను ఆయనే తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, నటశేఖర కృష్ణ గారి అభిమానులం/Facebook
విశాలాంధ్రతో డిమాండ్
ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతం కలిసి ఆంధ్రప్రదేశ్‌గా మారిన తొలినాళ్లలో, నైజాం మార్కెట్ కూడా జత కావడంతో తెలుగు మార్కెట్ పెరిగిందని.. ఈ దశలో ఇద్దరు(ఎన్టీయార్, అక్కినేని) అగ్రహీరోలతోనే సినిమా పరిశ్రమ మరిన్ని చిత్రాలు నిర్మించడం కష్టమైన పరిస్థితుల్లో కృష్ణ, శోభన్‌బాబు లాంటి హీరోలకు అవకాశాలు ఏర్పడ్డాయని బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషించారు.
ఎన్టీయార్ అభిమాని అయిన కృష్ణ, ‘దేవదాసు’ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు పాపులారిటీని గమనించి, సినిమాల్లో హీరోగా నటించాలన్న పట్టుదల పెంచుకున్నారని భరద్వాజ చెప్పారు.
తెలుగు సినిమాల్లో అత్యధిక మల్టీ స్టారర్ చిత్రాలలో నటించిన చరిత్ర హీరోగా కృష్ణకు ఉందన్నారు భరద్వాజ.
‘తొలి సినిమాకు ఆదుర్తి సుబ్బారావు అవకాశం కల్పించగా, గూఢచారి పాత్రలతో ఆయనకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి డూండి’ అని ఆయన వెల్లడించారు.
పోతిన డూండేశ్వర రావును డూండి అని పిలుస్తారు. విజయవాడ మారుతీ టాకీస్ యజమాని ఆయన.

ఫొటో సోర్స్, Facebook/Naresh
ఒకే హీరోయిన్‌తో అత్యధిక సినిమాలు
తెలుగులో ఒకే హీరోయిన్(విజయనిర్మల)తో అత్యధిక సినిమాలు నటించిన హీరోగా కృష్ణ పేరు తెచ్చుకున్నారు. జయప్రదతోనూ ఆయన 40కి పైగా సినిమాల్లో నటించారు.
పద్మాలయా స్టూడియోస్ పేరుతో సినిమా నిర్మాణ రంగంలో కూడా ప్రవేశించిన కృష్ణ, అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
కేవలం నటుడిగానే కాక, నిర్మాతగా, దర్శకుడిగా కూడా అనేక సినిమాలకు పని చేశారు.
‘అల్లూరి సీతారామరాజు సినిమా మధ్యలో దర్శకుడు మరణించడంతో మిగిలిన టాకీపార్ట్ మొత్తం కృష్ణ దర్శకత్వంలోనే సాగింది’ అని భరద్వాజ వెల్లడించారు.
ఎన్టీయార్ పౌరాణిక సినిమాలతో పేరు తెచ్చుకుంటున్న సమయంలో, క్రైమ్ కథల సినిమాలతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారని భరద్వాజ చెప్పారు.

ఫొటో సోర్స్, Superstar Krishna Library/Facebook
ఒక్క ఏడాదిలో 17 సినిమాలు
అనేక పాత్రలలో దాదాపు 350 సినిమాలలో నటించిన కృష్ణ, కెరియర్‌లో ఒక దశలో ఒక ఏడాది ఆయన నటించిన 17 సినిమాలు విడుదలైన సందర్భం కూడా ఉంది.
కృష్ణ హీరోగా నటించిన చిత్రాలలో తేనెమనసులు తొలి సినిమా కాగా, ఈనాడు (100వ), అల్లూరి సీతారామరాజు (200వ ), తెలుగు వీర లేవరా (300వ) చిత్రాలుగా నిలిచిపోయాయి.
ఎన్టీయార్ తెలుగు దేశం పార్టీతో సంచలనాలు సృష్టిస్తున్న సమయంలో, దాదాపు అంత ప్రజాదరణ ఉన్న కృష్ణకు కాంగ్రెస్ పార్టీ అవకాశమిచ్చిందని భరద్వాజ వెల్లడించారు.
‘ఏలూరు నుంచి ఆయన ఒకసారి ఎంపీగా గెలిచారు. బై ఎలక్షన్లలో ఓడిపోయారు’ అని భరద్వాజ తెలిపారు.

ఫొటో సోర్స్, maheshbabu/twitter
సినిమా రంగానికి ఆయన చేసిన కృషికిగాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది.
ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన చిత్రంగా పేరు తెచ్చుకున్న ‘అల్లూరి సీతారామ రాజు’ సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు దక్కింది. ఈ సినిమాకు కృష్ణ నిర్మాత.
‘అడవి సింహాలు’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘అగ్నిపర్వతం’ సినిమాల్లో ఆయన నటనకు గాను ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నారు.
తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను ఎన్టీయార్ నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు.
2019లో కృష్ణ సహచరి విజయనిర్మల మృతి చెందారు. ఆయన పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్ బాబు ఈ ఏడాది జనవరిలో అనారోగ్యంతో మరణించారు. కృష్ణ భార్య ఇందిరా దేవి ఈ ఏడాది సెప్టెంబర్‌లో అనారోగ్యంతో చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
- 15 ఏళ్ల క్రితం తన కుమార్తెను చంపి, ముక్కలుగా కోసిన హంతకుడిని ఈ తల్లి ఎలా కనిపెట్టారు?
- మళ్లీ వరదలు వస్తే ఈ నగరం తట్టుకోగలదా?
- ‘సారీ బ్రదర్.. దీన్నే కర్మ అంటారు’ – పాకిస్తాన్ ఓటమిపై మొహమ్మద్ షమీ ట్వీట్ వైరల్
- ఐటీ రంగం సంక్షోభంలో ఉందా, ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు
- జీ20 లోగోలో ‘కమలం’ ఏమిటి.. అసలు మోదీ, బీజేపీలకు సిగ్గులేదా అంటూ కాంగ్రెస్ ప్రశ్నలు














