విమానాశ్రయంలోనే 18 ఏళ్లు జీవించిన వ్యక్తి మృతి.. స్టీఫెన్ స్పీల్‌బర్గ్ ‘ది టెర్మినల్’ సినిమాకు అతడే స్ఫూర్తి

మెహ్రాన్ కరీమీ నస్సీరి

ఫొటో సోర్స్, Getty Images

పారిస్ విమానాశ్రయంలో 18 ఏళ్ల పాటు నివసించిన ఇరాన్ పౌరుడు మెహ్రాన్ కరీమీ నస్సీరి చనిపోయారు. ఒక దౌత్యపరమైన గొడవలో చిక్కుకున్న నస్సీరి 1988లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని రోయిస్సీ చార్లెస్ డి గాల్లి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఎయిర్‌పోర్టులో ఒక చిన్న ప్రాంతాన్నే ఆవాసంగా చేసుకుని అక్కడే జీవించారు. ఆయన అనుభవం ఆధారంగా హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బర్గ్ 2004లో ‘ది టెర్మినల్’ అనే సినిమా తీశారు. అందులో ప్రఖ్యాత నటుడు టామ్ హ్యాంక్స్ నటించారు. ఆ తర్వాతి కాలంలో నస్సీరికి ఫ్రాన్స్‌లో నివసించే హక్కు ఇచ్చారు. కానీ ఆయన కొన్ని వారాల కిందట తిరిగి విమానాశ్రయానికి వచ్చి అక్కడే నివ‌సించాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్టులో ఆయన సహజ కారణాలతో చనిపోయినట్లు విమానాశ్రయ అధికారి ఒకరు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

మెహ్రాన్ కరీమీ నస్సీరి

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్‌లోని ఖుజెస్తాన్ రాష్ట్రంలో 1945లో జన్మించిన నస్సీరి.. తొలుత తన తల్లిని వెదుకుతూ యూరప్‌ వెళ్లారు. కొన్ని సంవత్సరాలు బెల్జియంలో నివసించారు. అయితే ఆయనకు సరైన ఇమిగ్రేషన్ పత్రాలు లేవంటూ బ్రిటన్, నెదర్లాండ్స్, జర్మనీ సహా పలు దేశాలు బహిష్కరించాయి. ఈ పరిస్థితుల్లో ఫ్రాన్స్ వెళ్లిన నస్సీరి.. పారిస్ విమానాశ్రయంలోని 2ఎఫ్ టెర్మినల్‌ను తన నివాసంగా మార్చుకున్నారు. ఒక బెంచ్ మీద పడక ఏర్పాటు చేసుకుని, తను సేకరించుకున్న వస్తువులను ట్రాలీల మీద తన చుట్టూ పెట్టుకుని అక్కడే నివసించేవారు. పుస్తకాలు, పత్రికలు చదువుతూ, తన జీవితం గురించి నోట్స్ రాస్తూ గడిపేవారు.

మెహ్రాన్ కరీమీ నస్సీరి

ఫొటో సోర్స్, Getty Images

ఆయన కథ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బర్గ్ ఆయన కథను స్ఫూర్తిగా తీసుకుని ‘ది టెర్మినల్’ అనే సినిమా తీశారు. అందులో టామ్ హ్యాంక్స్, కేథరీన్ జెటా-జోన్స్ ప్రధాన పాత్రల్లో నటించారు.

‘ది టెర్మినల్’ సినిమాలో టామ్ హాంక్స్ విక్టర్ నవోర్స్కీ పాత్రను పోషించారు. ఇందులో కథానాయకుడు ఒక కల్పిత తూర్పు యూరోపియన్ దేశం క్రాకోజియా నుండి న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయానికి చేరుకుంటాడు.

అయితే, అతని దేశంలో రాజకీయ విప్లవం రావడంతో అతని ప్రయాణ పత్రాలన్నింటినీ చెల్లకుండా పోయినట్లు అధికారులు అతనికి చెబుతారు. అతనిని ఆ విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ లాంజ్‌లో వదిలేస్తారు.

తన దేశంలో పరిస్థితులు మారే వరకు అక్కడే ఉండాలనుకుంటాడు.అయితే, క్రాకోజియాలో అశాంతి కొనసాగుతూనే ఉండటంతో నవోర్స్కీ అక్కడే చాలాకాలం ఉండాల్సి వస్తుంది.

ఆ సినిమా విడుదలైన తర్వాత ప్రపంచ దేశాల జర్నలిస్టులు.. ఆ మూవీకి స్ఫూర్తినిచ్చిన నస్సీరితో మాట్లాడటానికి పారిస్ విమానాశ్రయానికి వరుస కట్టారు. ఒక సమయంలో నస్సీరి రోజుకు ఆరు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉండేవారని లె పర్సియెన్ ఒక కథనంలో తెలిపింది.

‘ది టెర్మినల్’ సినిమాకు ముందు ఫ్రెంచ్ భాషలో ‘టాంబోస్ డు సియెల్’ అనే సినిమా కూడా ఆయన కథ ఆధారంగానే నిర్మించారు.

అనేకమంది జర్నలిస్టులు, నిర్మాతలు ఆయన మీద పలు డాక్యమెంటరీలు నిర్మించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

‘ది టెర్మినల్ మ్యాన్’ పేరుతో 2004లో విడుదలైన ఆయన ఆటోబయోగ్రఫీలో ఇరాన్‌లోని మాస్జెద్ సోలిమాన అనే పట్టణంలో 1945 పుట్టినట్లు చెప్పుకున్నారు. నస్సీరి తనను తాను ‘సర్ ఆల్ఫ్రెడ్’ అని చెప్పుకునేవారు.

మెహ్రాన్ కరీమీ నస్సీరి

ఫొటో సోర్స్, Getty Images

1999లో ఆయనకు శరణార్థి హోదా ఇచ్చి, ఫ్రాన్స్‌లో నివసించే హక్కు ఇచ్చినా కూడా ఆయన 2006 వరకూ విమానాశ్రయంలోనే ఉండిపోయారు. ఆ ఏడాది అనారోగ్యం పాలైన ఆయనను చికిత్స చేయటానికి పారిస్‌ నగరంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఆయన పారిస్‌లోని ఒక హాస్టల్‌లో నివసించటం మొదలుపెట్టారు. ‘ది టెర్మినల్’ సినిమా కోసం తనకు ఇచ్చిన డబ్బును వాడుకుంటూ అక్కడ జీవించేవారని ఫ్రాన్స్‌కు చెందిన ‘లిబరేషన్’ పత్రిక చెప్పింది.

ది టెర్మినల్ మ్యాన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ‘ది టెర్మినల్’ సినిమాలో ఓ దృశ్యం

అయితే నస్సీరి కొన్ని వారాల కిందట విమానాశ్రయానికి తిరిగి వచ్చి, టెర్మినల్‌లో నివసించటం మొదలు పెట్టారని, శనివారం చనిపోయారని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. ఆయన దగ్గర కొన్నివేల యూరోలు ఉన్నాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి: